మీ పిల్లలు మీ పిల్లలు కారు. వాళ్ళు జీవితేచ్చకు జన్మించిన వాళ్ళు . వాళ్ళు మీ ద్వారా వచ్చారు తప్ప మీ నుండి కాదు . వాళ్ళు మీతో ఉన్నా మీకు చెందరు .మీరు వాళ్ళతో ఉండాలని ప్రయత్నిస్తే ప్రయత్నించారు గాక, వాళ్ళు మీలా ఉండాలని మాత్రం అనుకోకండి. ఎందుకంటే జీవితం వెనక్కు మళ్ళదు గనకా, నిన్నటితో మళ్ళీ అతుక్కుపోదు గనకా ..ఖలీల్ జిబ్రాన్

28, ఫిబ్రవరి 2011, సోమవారం

దిగులు పూలు !


ప్రతి రాత్రి 9-9.30 పాపాయి కథల సమయం .కానీ ఎందుకో చాలా సార్లు స్నేహితులు ఆ సమయంలోనే ఫోన్లు చేస్తారు .చెయ్యొద్దని యెట్లా చెప్తాం .ఇటు ఫోన్ రాటం అటు పాపాయి అలిగెయ్యటం ఒకే సారి జరిగి పోతాయ్.నిన్న రాత్రి అట్లాగే జరిగింది. పాపాయి ఎంత అలిగేసిందో .అంతకు అరగంట ముందు నుండి ఏం కథ వినాలో దానికున్న కథల పుస్తకాలు అన్నీ చిలక జోశ్యం వాళ్ళ లాగ పరచి కళ్ళు మూసుకుని ఎంపిక చేసుకున్నది .ఉత్సాహంగా వినటానికి సిద్ద పడింది .ఇటువైపు స్నేహితురాలు మాట్లాడేస్తూ ఉంది .తనకొచ్చిన పెద్ద దుఃఖాన్ని చెప్తూ ఉంది .నిజంగానే పెద్ద దుక్కం .ఊ కొడుతూ ఉన్నాను ...ఆ ఫోన్ అలా ముగిసిందో లేదో మరో ఫోన్ .ఈ సారి కన్నీటి ప్రవాహం అటు వైపునుండి ఇటు వైపుకు ప్రశ్నలు ,విరక్తులు ...ఏం బదులిస్తాం.రాత్రి పదకొండయింది .పాపాయి పడుకోలేదు .బుసలు కొడుతుంది .ఓదార్చబోతే దాడికొచ్చింది .యేడ్చి,కొట్టి ,అలిగి రాత్రి పన్నెండు వరకు బుస కొట్టి పన్నెండుకి బకాసురిడి కథ విని బజ్జుంది .పాపాయి బజ్జున్న ఏకాంత క్షణాల స్నేహితుల దిగులు పూల పరిమళాల తడిసి ఉన్న అమ్మ.. గది వెలుపటి చంద్రుడ్ని ధ్యానిస్తూ కవిత ఒకటి అల్లుకుంది .
"నిన్నటి చంద్రుడు "

వెన్నెల సెలయేటి పక్కన

సంపెంగల పూల తోట

ఇంద్ర ధనస్సును పూసింది

అహంకరించిన

సూర్యుని రేఖ ఒకటి

కలని గదిని కలిపి

గోడపై నిశ్చల చిత్తరువైంది

జ్ఞాపకమంటిన నయనాన్ని

పలుకరించబోతుంటే

గుప్పెట కాసిని

రంగుల సంపెంగలు



20, ఫిబ్రవరి 2011, ఆదివారం

ప్లేటో కవిత ఒకటి .....





















ఏదో వెదుకుతుంటే ఇస్మాయిల్ రెండో ప్రతిపాదన చేతిలోకోచ్చింది .
తిప్పుతుంటే ప్లేటో తగిలాడు
ఆదర్శ రాజ్యంలో కవులకు స్థానం లేదు ,కవుల్ని దేశ బహిష్కారం చేయడం ప్రజా క్షేమం కోసం మంచిదంటాడు ప్లేటో. ఆహా !ఎంత సత్యం చెప్పాడు అనుకుంటామా ..తనే చూడండి ఎంత అద్భుతమైన కవిత రాసి పడేశాడో ......

నేనే ఆకాశాన్నైతే

నీ పైన పరచుకుని

లక్ష నక్షత్ర

నేత్రాలతో నిన్ను

వీక్షిద్దును కదా


18, ఫిబ్రవరి 2011, శుక్రవారం

ఒక్కటిస్తే.... అప్పుడు అర్థమౌతుంది !


ఇవాళ బడి నుండి రాగానే పాపాయి అన్నదీ అమ్మా నేనీ రోజు ఒక పిల్లని తిట్టేసా అని .నేను నిజంగా ఆశ్చర్య పడ్డా ..నా బిడ్డ మీద స్కూల్ నుండి ఒకటే కంప్లైంట్ ఉంటుంది ,అదేంటంటే మీ అమ్మాయి చాలా మంచిగా ప్రవర్తిస్తుంది ,కానీ ఎవరితోను ఏమీ మాట్లాడదు ,ఎప్పుడూ కాం గా కూర్చుంటుంది అని . ఎందుకు మాట్లాడవు రా అమ్మలు అంటే మాట్లాడటానికి ఏముంటాయ్ అమ్మా అంటుంది. సేం ప్రాబ్లం వాళ్ళ నాన్నకి కూడా ఉంటం చేత ,నాకు మేథావి పుట్టిందని నిర్ణయించుకుని మరేం పర్లేదు, నా బిడ్డ ఇట్లా ఉంటూనే ,ఎప్పుడో లోకమంతా చదువుకునే పుస్తకమొకటి రాసేస్తుంది ,దార్శనికురాలౌతుంది అని అందరికి ప్రకటించేశాను

అట్లాంటిది ఒక్క సారిగా ఎవరినో తిట్టేశానంటే నమ్మలేక అడిగా ...నిజమేనా బిడ్డా...అని .అది అంది నిజమే అమ్మా లైన్ దాటేసి నన్ను తోసెయ్ బోయిందమ్మ అందుకని "ఒక్కటిస్తే ..అప్పుడు అర్థమౌతుంది "[మారూన్గీనా తబ్ సమజ్మె ఆయేగా ..} అన్నానమ్మ అంది .

నాబిడ్డ అలా అన్నందుకు నాకు బోలెడు ఆశ్చర్యానందాలు కలిగాయి .రేపెళ్ళి నా బిడ్డ చేత అలా అనిపించగలిగిన ఆ పిల్లతో కర చాలనం చేయాలనిపించింది .అవంతా దాచేసుకుని అంత ఘోరం ఆ పిల్ల ఏం చేసింది బిడ్డా పోన్లే అనుకోకూడదా అన్నాను .పాపాయి అన్నదీ ఎన్ని రోజులమ్మా, రోజూ ఏదో ఒకటి చేస్తుంది .విసుగు పుట్టదా అమ్మా అని !

నిన్న జయప్రకాశ్ నారాయణ్ ఇష్యు కి దీనికి ఏదో సంబంధం ఉన్నట్లు తోచటంలా! నాకెందుకో అలా తోచింది మరి .

12, ఫిబ్రవరి 2011, శనివారం

అనుకోకుండా ఒక జగడం ....


కొద్ది రోజులుగా పతంజలి స్కూల్ కి చెందిన వ్యక్తులు ప్రాణాయామం నేర్పించడానికి మా ఇంటికి వస్తున్నారు .అబ్బాయి 30-35 ఏళ్ళ బెంగాలి కుర్ర వాడు ,చక్కగా అచ్చు వివేకా నందుడిలా ముచ్చటగా ఉన్నాడు ,స్త్రీ కి దాదాపు 45 ఏళ్ళ వయస్సు .ఇవాళ ఆవిడకి ఎందుకు తోచిందో మరి' 'ఏక్టు కుకూర్ దేకిబే అంది'..అంటే కొంచం కుక్కల్ని చూస్తాం అనన్న మాట ,అందుకు నా భర్త "అవస్యో "అన్నాడు ..అంటే తప్పకుండా అని అర్థం .అలా అని ,కుక్కల్ని వదలమన్నాడా ,మళ్లీ అంతలోనే ఎందుకో

సందేహమేసి ,రాజ మల్లికని గొలుసు వేసి తీసుకు రమ్మన్నాడు .కొన్ని సార్లు జరిగే మిస్టేక్స్ చాలా కాస్ట్లీ గా ఉంటాయ్ .అలా కళ్ళు మూసి తెరిచే లోపు ఒక కాస్ట్లీ మిస్టేక్ జరిగి పోయింది .మా రాజ మల్లికకి గొలుసంటే చాలా ఇష్టం .గొలుసు వేస్తే వాకింగ్ కి వెళ్ళ బోతున్నామని అది భావిస్తుంది ,కాంచనకి ముందు గొలుసు వేస్తే అది ఎంత మాత్రం ఒప్పుకోదు.ఇవాళ అట్లానే గొలుసు తెచ్చి వేయబోయే లోపే ,దానికి మస్తు కోపమొచ్చింది ...కాంచన కి మొదట వేసేస్తున్నారని .వచ్చిన వాళ్ళ ముందు కాంచనతో పెద్ద జగడం పెట్టుకుంది .ఇలా ఇక్కడ గొడవ జరుగుతుందా ..నా భర్త లాటీ ..లాటీ అంటున్నాడా, అటిటు చూసే లోపు ప్రాణాయామపు వివేకా నందుడు సోఫా ఎక్కి ,సోఫా తల ఎక్కి ,కిటికీ పట్టుకు వెళ్ళాడుతున్నాడు. పక్కన కుర్చీ ఎక్కిన ఆవిడని కుర్చీ తల ఎక్కమని ప్రోత్సహిస్తున్నాడు .కానీ ఆవిడ ఎక్కలేక పోయింది, ఎందుకంటె వేళ్ళాడటానికి ఆవిడ పక్కన కిటికీ లేదు మరి .అసలు జగడం వాట్లి రెంటి మధ్య కదా ,వీళ్ళనసలు అవి పట్టించుకోనైనా లేదు కదా, వీళ్ళు భయ పడటం ఎందుకు... అనుకుంటూ ఉన్నానా ,నీ బిడ్డలకి నువ్వు క్రమ శిక్షణే నేర్పలేదని నా భర్త బాధపడేయటం మొదలు పెట్టాడు .ఇదేమంత నవ్వాల్సిన విషయం కాకున్నా నవ్వు ఆగలేదు మరి .ఇంకా ..మరేమో ప్రాణాయామం మీద ఘోరమైన నమ్మకం కుదిరింది. మరి శరీరం ఎంత తేలిగ్గా లేక పోతే జాకీ చాన్ లాగా అలా కిటికీ పట్టుకు వెళ్లాడ గలరు ఎవరైనా!

6, ఫిబ్రవరి 2011, ఆదివారం

ఇద్దరమ్మాయిల కథ ... , సిండ్రెల్లా , బ్యూటీ అండ్ ది బీస్ట్ !



పాపాయిలు పుడితే అమ్మాయిల జీవితాలు ఎంతలా మారి పోతాయోజీవితం టాం అండ్ జెర్రీ మయమౌతుంది.చూడని యానిమేషన్ సినిమాలుమరేం మిగలక పోగా ,ఒక్కోటి చాలా సార్లు కూడా చూడాల్సి వస్తుంది .మాఅమ్మాయికి అమ్మ కంపెనీ ఉంటె సినిమా మజాగా ఉంటుంది ,అంచేత మాఅమ్మాయి వాళ్ళ అమ్మ ,సదరు సినిమాలను అనివార్యంగా అనేక సార్లుచూడాల్సి వస్తుంది ..అట్లా అనేక సార్లు చూసినవే సిండ్రెల్లా, బ్యూటీ అండ్ ది బీస్ట్ ... ..

రెండూ వాల్ట్ డిస్నీ వారి చిత్రాలే .ఈ రెండు సినిమాలలో అమ్మాయిల పాత్రలు విభిన్నంగా ఉండి నన్ను బాగాఆకర్షించాయి .నేను మా అమ్మాయిని అడిగాను వాల్లిద్దర్లో నీకెవరు బాగా నచ్చారు ..ఎందుకు? అని మా అమ్మాయిచెప్పిన సమాధానం మళ్ళీ చెప్తాను మొదట వాళ్ళిద్దరి కథ చూద్దాం ..

పిచుకలు సిండ్రెల్లా ని తెల్లారింది నిద్ర లెమ్మనడంతో కథ మొదలవుతుంది .ఆ పిల్ల ఆ పిచుకలతో అంటుంది ..అవునుఇది మంచి ఉదయమే కానీ నాకొచ్చి న కల ఇంకా అందమయినదని "a dream is a wish your heart makes when you are fast asleep,in dreams you lose your heartaches.whatever you wish for ,you keep have faith in your dreams and some day your rainbow will come smiling thru ,no matter how your heart is grieving, if you keep on believing the dream that you wish will come true....అంటూకల గురించి అందమైన పాట పాడుతుంది .

ఆ రాజ్యపు రాజుకి ఓకొడుకు. అతనికి ఎవరు నచ్చరు,తండ్రికేమో కొడుకుపిల్లల్ని ఆడించాలని కలలు ,ఒక పార్టీకి సమ వయస్కులయిన ఆడ పిల్లలందరికీ ఆహ్వానంప్రకటించ బడుతుంది . తనని తీసికెళ్ళ మంటుంది సిండ్రెల్ల .మంచి గౌను ఉంటే రమ్మంటుంది సవతి తల్లి .కథ అలా మలుపులు తిరిగి ఒకఫెయిరీ మహిమతో బాల్ కి వెళ్తుంది .రాకుమారుడికి ఆ పిల్ల నచ్చుతుంది .కానీ అర్థ రాత్రి దాటాక మహిమలన్నీ వెళ్లిపోతాయి .అంచేత రాకుమారుడిని వదిలి వెళ్లి పోతుంది .ఆ పిల్ల కోసం అన్వేషణ ..సవతి తల్లి అడ్డు పుల్లలు ,చివరికివివాహం ..ఇది కథ .

బ్యూటీ అండ్ ది బీస్ట్ నాయిక బెల్ .ఆ పిల్ల కి చదవడమంటే చాలా ఇష్టం. మరే ద్యాస ఉండదు ,దాన్ని చక్కగాచిత్రించారు సినిమాలో .ఆ ఊరి అమ్మాయిల కలల వీరుడు గేస్టాన్ ,బెల్ ని ఇష్ట పడతాడు its not right for women to read అనేది అతని అభిప్రాయం . అతను ఆ పిల్లకి ఎలా ప్రపోస్ చేస్తాడంటే this is the day your dreams comes true అంటాడు .ఆ పిల్ల ఆశ్చర్య పడ్తుంది what do you know about my dreams అని అడుగుతుంది ఛిఛి me the wife of that boorish ,brainless ...అనుకుంటుంది i want much more than provincial ...to have some one understand అనుకుంటుంది .

ఇంతలో పరిసోధకుడయిన వాళ్ళ నాన్న అనుకోని పరిస్థితుల్లోశాప వశాత్తు మృగం గా మారిన వ్యక్తికి బందీ అవుతాడు .తండ్రిని వెతుకుతూ వెళ్లి , తండ్రిని విడుదల చేసే షరతు మీద బెల్ తను బందీ అవుతుంది .కథ కొన్ని మలుపులు తిరిగి అతను మృగం అయినా ఆ పిల్ల అతన్ని ,అతని మంచితనాన్ని ఇష్ట పడ్తుంది .true that he is no prince charming ,but there's some thing in him that i simply didn't see ..అనుకుంటుంది ఆ అమ్మాయి ప్రేమతో ఆ మృగం శాపం తొలగి మనిషి అవుతాడు .కథసుఖాంతమవుతుంది .

సిండ్రెల్ల ఎవరో తెలియని రాకుమారుడ్ని ,రాకుమారుడు కావడం చేతఅనివార్యంగా ఇష్టపడి పాకు లాడుతుంది .అంతకు మునుపు సవతి తల్లి పెట్టె హింసను ఎదుర్కునే మార్గాల గురించి కొంచమన్న ఆలోచించదు.సిండ్రెల్ల1950నాటి మూవికి ఇప్పుడొచ్చిన cinderella a twist in time 3 వబాగానికి ఈ పాకులాటల్లో పెద్ద తేడా లేక పోగా కొంచం పెరిగింది కూడా .బెల్అలా కాదు ఆ పిల్లకి ఏ పాకులాటలు ఉండవు .క్రూర జంతువయినా ఆమృగం లోని మంచి తనాన్ని ఇష్ట పడ్డ అరుదైన వ్యక్తిత్వం ఆ పిల్లది .

నేను మా అమ్మాయిని నీకు ఇద్దర్లో ఎవరు నచ్చారు అని అడిగినప్పుడు నా బిడ్డ సిండ్రెల్ల నచ్చింది అన్నది .నేనుకొంచం ఆశ్చర్య పడి ఎందుకట్లా అంటే సిండ్రెల్ల ఎప్పుడు ఏదో ఒక పని చేస్తూ ఉంటుందమ్మా ఖాళీగానే ఉండదు అన్నది .దాని వయసుకు ఆ విశ్లేషణ బాగానే ఉందనిపించినా అడిగాను, బెల్ ఎంత మంచిది కదా ,నాన్న కోసం తను ఖయిదీఅయ్యింది ,బాగా పుస్తకాలు చదువుతుంది , జంతువు అయినా కూడా మంచిగా ప్రవర్తించింది అని వివరించడానికిప్రయత్నించాను .అయినా మా అమ్మాయి ఖచ్చితత్వాన్ని ప్రదర్శిస్తూ అన్నది... బెల్ కూడా మంచిదే అమ్మ ,కానీసిండ్రెల్ల ఎప్పుడూ ఖాళీగా ఉండదు కదా అమ్మ.. అని పాత పాటే పాడింది .

''బెల్ చైతన్య భరితము,ఆదర్శ పూరితమైనవ్యక్తిత్వాలకు ప్రతినిధి కాగా ,వ్యామోహాలు, విన్యాసాలు ,సంగీతాలు నిండిన సర్వ సాధారణ ప్రధాన స్రవంతికి సిండ్రెల్లప్రతినిధి'' ..ఇప్పుడు నా బిడ్డ చాలా చిన్నది .మరి పదిహేనేళ్ళు వచ్చాక ఏ మూవీ నచ్చుతుందని చెప్తుందో చూడాలనినాకు చాలా ఆసక్తిగా ఉంది.

3, ఫిబ్రవరి 2011, గురువారం

ఒక పాట -- ఒక కథ !





ఒక కథ ....
చైనా తత్వ వేత్త చువాంగ్ త్సు ఒక రోజు నదిలో చేపలు కోసం గాలం వేసి నిర్విచారంగా కూర్చుని ఉన్నాడు .అంతలో చు రాకుమారుడు పంపిన ఇద్దరు ఉప శాకామత్యులు అక్కడికి వచ్చారు .వారు రాజు గారు పంపిన ఉత్తర్వు చువాంగ్ త్సు కి చదివి వినిపించారు .చువాంగ్ త్సు ని ప్రధాన మంత్రిగా నియమిస్తూ చేసిన
ఉత్తర్వు అది .


వారు చదివి వినిపించిన దాన్ని శ్రద్దగా విని చువాంగ్ త్సు ఇలా అన్నాడు .. , ''మూడు వేల ఏళ్ళ క్రితం ఒక పవిత్రమైన తాబేలు ఉండేదట .ఒక రాకుమారుడు అత్యంత భక్తి శ్రద్దలతో దాన్ని బలి ఇచ్చి ,పెద్ద ఆలయం నిర్మించి ఆ తాబేటి చిప్పని ప్రతిష్టించి పట్టుబట్టలు కట్ట బెట్టి ధూప దీపాలు ఆరంబించాట్ట '' ,,,............మీరు చెప్పండి ..ఒక తాబేలుకి ,తాబేటి చిప్పగా మారి ఓ ఆలయంలో ప్రతిష్టించబడి ,మూడువేల ఏళ్ళ పర్యంతము పూజించబడటం మంచిదా? లేక ఒక మామూలు తాబేలుగా బురదలో తోక ఈడ్చుకుంటూ బ్రతకడం మంచిదా ?అని .

అందుకు ఆ వచ్చిన వారు ఒక తాబేలుకు బురదలో తోక ఈడ్చుకుంటూ బ్రతకడమే మంచిది ఆని బదులిచ్చారు . అప్పుడు చువాంగ్ త్సు , ఇకనేం వెళ్ళండి వెనక్కి ,నన్ను బురదలో తోక ఈడ్చుకుంటూ బ్రతకనీయండి అని మళ్ళీ అంతే నిర్విచారంగా చేపలు పట్టుకోసాగాడట.

అందమైన కథ నాకు గోరటి పాట వింటూ ఉంటె జ్ఞాపకం వచ్చింది .కిరిటమేమో భారమై ఉన్నది ..కిందేసితే నడక బలె ఉన్నది ,స్వారికేమో పడవ సై అన్నది ,పరువున్న వారైతే బరువన్నది ..మనందరం కిరీటాల వాళ్ళమే పరువుల బరువుల వాళ్ళమే కొందరం ప్రయత్నిస్తూ , కొందరం మోస్తూ .. అందుకేనేమో మనకు ఈ తొవ్వ ఎంతకు వొడవనట్టు తోస్తుంది ,మనల్ని మనమే మోసి బరువై పోతాం, మూల పడి మురిగి పోతాం ...

యెంత బాగుంది ఈ పాట... ఇళ్ళు పొల్లు లేని, ముల్లె మూట లేని వెంబడించే వెర్రి జ్ఞాపకాలు లేని సంచారం..... .బురదలో తోక ఈడ్చుకుంటూ బ్రతకడంలోని సౌఖ్యాన్ని జ్ఞప్తికి తెస్తూ ....ఊగి తూగి పాడిన పాటగాడిని యెట్లా సన్మానించడం ......


సంచారం ..

సంచారమే ఎంతో బాగున్నది
దీనంత ఆనందమేదున్నది ...సంచారమే

సేద తీర సెరువు కట్టున్నది
నీడకోసం సింత సెట్టున్నది
జోలలూపే గాలి పిట్టున్నది
గుర్తు లేని గుడ్డి నిదురున్నది
బరువు దిగిన గుండె బలె ఉన్నది ..సంచారమే


సిప్పోలె మోదుగ దొప్పున్నది
సిట్టి కొమ్మన తేన పట్టున్నది
జోపితే జోరయిన తీపున్నది
రూపులేనాకలి చూపున్నది
ఆకలంత అదృష్టమేదున్నది
జ్ఞాన ఆకలంత అదృష్టమేదున్నది.. సంచారమే


పండువండిన జాన పండ్లున్నవి
తెమ్పుకుంటే నోటికింపున్నవి
సేదు గింజల్లేవో దాగున్నవి
నమిలె కొద్దీ తీపినిస్తున్నవి
దారి బత్తెం కరువు లేకున్నది
రాలి పడ్డవి రాసులుగ నున్నవి ..సంచారమే


కిరిటమేమో భారమై వున్నది
కిందేసితే నడక భలే ఉన్నది
చెప్పులు లేకున్న మేలున్నయి
ముండ్ల తుప్పలేవో తెలిసి పోతున్నవి
కాలి మట్టికేదో మహిమున్నది
తేళ్ళు పురుగులు తొలగి పోతున్నవి ..సంచారమే


ఊరి ఊరికి దారులేరున్నవి
ఊటలోలె బాట లోస్తున్నయి
బాట పక్కన పూలు వింతున్నయి
తోవ ఎంత నడిసిన వొడవకుంటున్నది
గాలి గంధమెంత బాగున్నది
ఖాళిగుంటే కడుపు నింతున్నది
ఇళ్ళు పొల్లు లేని ముల్లె మూట లేని
వెంబడించే వెర్రి జ్ఞాపకాలు లేని
శూన్య సంచారమే ..సంచారమే ..


మంచుతో మెరిసేటి కొండున్నది
మహిమలున్నవి చూసి పొమ్మన్నది
అంచుకోతే సలి తంతున్నది
కొంచె ఎడం బోతే ఏదో మేలున్నది
మురిపాల మెరుపులు అడ్డున్నవి
దాటిపోతే నడక తీరే వేరున్నది ........ సంచారమే


పారేటి వెన్నెల ఏరున్నది
స్వారికేమో పడవ సైగున్నది
పరువున్నవారైతే బరువన్నది
లేకుంటేనే లేడి పరుగన్నది
పైనవన్నీ వదులుకోమ్మన్నది
పైర గాలి తడిపి పోతన్నది ..సంచారమే ..


గాలిలో తేలాడే పక్షున్నది
గగనమంచుల దాక పోతున్నది
ఏటిల గాలాడే చేపున్నది
నీటిపాతి దాక ఈతున్నది
సంచరించేవి శక్తితో వున్నవి
మూలకున్నవి మురిగిపోతున్నవి
ఇళ్ళు పొల్లు లేని ముల్లె మూటలేని
వెంబడించే వెర్రి జ్ఞాపకాలు లేని సంచారమే .......