మీ పిల్లలు మీ పిల్లలు కారు. వాళ్ళు జీవితేచ్చకు జన్మించిన వాళ్ళు . వాళ్ళు మీ ద్వారా వచ్చారు తప్ప మీ నుండి కాదు . వాళ్ళు మీతో ఉన్నా మీకు చెందరు .మీరు వాళ్ళతో ఉండాలని ప్రయత్నిస్తే ప్రయత్నించారు గాక, వాళ్ళు మీలా ఉండాలని మాత్రం అనుకోకండి. ఎందుకంటే జీవితం వెనక్కు మళ్ళదు గనకా, నిన్నటితో మళ్ళీ అతుక్కుపోదు గనకా ..ఖలీల్ జిబ్రాన్

11, జులై 2011, సోమవారం

గోసానిమారి .


మేముంటున్న కూచ్ బీహార్ కి దాదాపు నలభై నిమిషాల దూరంలో ఉంది ఈ గోసాని మారి .భూస్థాపితం ఐన ఒక రాజ కోట ఉంది ఇక్కడ .అది భూస్థాపితం ఎందుకయిందంటే ...అంటూ ఇక్కడి వాళ్ళు ఒక కథ చెప్పారు .

కామతేస్వర్ అనే రాజు ఈ రాజ్యాన్ని పాలించాట్ట . .రాజు గారు మొదట పశువుల కాపరి అట .ఊరందరి పశువుల్ని పచ్చిక బీళ్లలోకి తోలుకెళ్ళి, వాటి పలుపులన్ని ఊడ దీసి ,, పలుపులన్నిటినీ కలిపి తల కింద పెట్టుకుని నిద్ర పొయ్యే వాడట .ఆ పశువులు ఊరందరి పొలాలలో పడి మేసేవట.ప్రజలందరూ రాజు గారికి ఫిర్యాదు చేసారట .అప్పుడు రాజు గారికి కోపమొచ్చి స్వయంగా విచారించేందుకు వచ్చాట్ట ,రాజు గారు వచ్చేటప్పటికి నిద్ర పోతున్న ఈ కామతేస్వరునికి ఒక పాము పడగ విప్పి నీడ పట్టి ఉందట .అది చూసి రాజు వెనుదిరిగి వెళ్లి పోయాడట .

ఇలా జరుగుతూ ఉండగా ఈ కామతేస్వరునకి ఒక కల వచ్చిందట .కలలో దేవత చెప్పిందటా .......నేను నీ దగ్గరికి మూడు జంతువులను పంపుతాను వాటిలో నువ్వు దేనిని పట్టుకుంటావో దానిని బట్టి నీ అదృష్టం ఉంటుంది అని .మొదట పులి వచ్చిందట ,ఆ పై ఏనుగు వచ్చిందట ,రెంటినీ కామతేస్వరుడు పట్టుకోలేక పోయాడట చివరిలో పాము వచ్చిందట .పాముని కూడా వెళ్లి పోతూ ఉండగా తోక పట్టుకున్నాట్ట .అప్పుడు దేవత అన్నదట ,నువ్వు రాజువవుతావ్ ,కానీ నీ తర్వాత నీ రాజ్యం అంతరించి పోతుంది అని .

అట్లా కామతేస్వరుడు రాజయ్యాడు .చాలా యుద్దాలలో గెలిచాడు .అతనికి ఓ వరముండేదట ,ఏమనీ ....అతని ఎదుట నిలబడి ఎవరూ అతన్ని జయించలేరు .వెనక నుండి దాడి చేస్తేనే ఓడించ గలరు .అతనికి ఏడుగురు భార్యలు .ఏడో భార్యకి ఈ రహస్యాన్ని చెప్పాట్ట .ఆవిడ ఏం చేసిందీ ఒక యుద్ద సందర్భంలో ఈ రహస్యాన్ని శత్రువులకి చెప్పేసిందట .మరి చెప్పరేమిటి,,, అన్నేసి భార్యలుంటే .. ఎవరికేవరేంటి ...ఎవరికీ ఇతను నా సొంతం అనే ఫీలింగ్ ఉండదు కదా .

అట్లా శత్రువు వెనక మల్లుగా వచ్చి రాజా వార్ని పొడిసేసాడు.అప్పుదేమయ్యిండీ రాజా వారు శత్రువులతో అన్నారూ ,,నేను నా మందిరంలోని ఇష్ట దేవత కి నమస్కారం చేసుకుని వస్తాను అప్పుడు మీరు నన్నేమైనా చెయ్యొచ్చూ అని .శత్రువులు ఒప్పుకున్నారు .రాజా వారు వెళ్లి నమస్కరించారా ...ఇంకేముందీ రాజ మహల్ మొత్తం దానంతటదే తిరగబడి ఏడవ రాణితో సహా భూ స్థాపితం అయిపోయిందట .

అర్ఖియాలజీ వాళ్ళు తవ్వుతుంటేనట బోలెడు అపశకునాలు జరిగాయట అంచేత అసంపూర్ణంగా వదిలేశారట .ఇదీ కథ
ఇక్కడో మందిరం ఉండి .కామతేస్వరుడే నిర్మించాడనీ,ఒకటే రోజులో నిర్మాణం పూర్తయిందనీ వీళ్ళు చెప్పారు .


బయల్పడ్డ గోడ .
రాజుల్ పోయే... రాజ్యాల్ పోయే ...
తిరగబడ్డ కోట శిఖరం

మ్యూసియం
ఇది సగం తవ్వి అపశకునాలకి భయపడి దిలేసిన ప్రాంతం
అచట పూసిన పూలు

మందిరం అరుగు మీద ఉన్న వృద్దుడు .దేవుడు ఈ రూపం లో కూడా చరించ వచ్చేమో కదా

విష్ణు మూర్తి ..ఎంత బాగుంది కదా ..అలంకరణ

కామినీ పూలు ...ఎటులైనా ఇచటనే ఆగిపోనా ....అనిపించేసింది ఆ పరిమళానికి


మందిర ముఖ ద్వారం



లోపలికి అడుగు వేయగానే కనిపించారు వీరు ...

నాలుగు మూలలా ఇలా నాలుగు మందిరాలుంటాయి

10, జులై 2011, ఆదివారం

అర్థ మోహనరాగం


కవిత్వం అది పనిగా చదివిన అనుభవం ఎప్పుడూ లేదు నాకు ,ఆసక్తీ లేదు. అయినా సాహిత్య విద్యార్ధినిగా అనేకం చదవాల్సి వచ్చింది .చదివిన అంతలోనూ ఇస్మాయిల్ నాకెప్పుడూ తటస్థ పడలేదు .ఇస్మాయిల్ అద్భుత కవి . నేను కలవరించి chadivina కవిత్వం ఇస్మాయిల్ దే

'అర్థ మోహనరాగం' అనే
కవిత, ఇస్మాయిల్ ''కవిత '' అనే కవిత చదివిన తర్వాత రాసుకున్నది.

అనార్కిస్ట్ కవిలా
అతను
మహా దౌర్జన్యంగా
మానసోపరితలంపై
ఓ విత్తనాన్ని విసిరాడు

అనుమతి లేకనే
కాలాన్ని కత్తిరిస్తున్న
గడియారం ముళ్ళు
విత్తనాన్ని కాస్తా
గుచ్చి వెళ్ళింది

సందేహ స్వరాల మెట్లు
దాటుకుని
చిరు మొలక ముందు
మోకరిల్లి
గాఢ మోహన రాగాన్ని
మ్రోగించేలోగా,
అతను
కుదురు లేని
వలస పక్షిలా
వాలిన వయోలిన్ తీగలు
తెంచుకుని
యెగిరి పోయాడు

అఖండమై విస్తరించిన
ఆ విత్తనపు
వట వ్రుక్షంపై తిరుగుతూ
మెదడు నరాల నేతని
విప్పుకుంటూ ,నేను
అతని అడుగుజాడలకై
అన్వేషిస్తుంటాను .

నా చెట్టు
కొన్ని సార్లు
తేనె పూలు పూస్తుంది
అపుడపుడు
రాత్రి పక్షుల అరుపులకి
ఉలికి పడుతుంది
కురిసే మంచు
కాసే ఎండ
నా ముందు నుండే
నడిచి పొతాయ్.

చూసి చూసి
దారిన పోయే ఒకడు
ఇదంతా వ్యర్థమని
కలలనైనా అల్లాల్సిందేనని
మూర్తిమత్వం గురించి
వుపన్యసిస్తాడు

నేను ,ఇక ఇదే
చివరి కొమ్మనుకుంటూ
ఆ చెట్టులోని
మరో కొత్త కొమ్మ పైకి
నా అనవరత ప్రయాణాన్ని
ప్రారంభిస్తాను

9, జులై 2011, శనివారం

నత్త ప్రణయయాత్ర

ఇస్మాయిల్ గారిది నత్త ప్రణయయాత్ర అనే పేరుతో హైకూలు పుస్తకమోటి ఉంది .ఇస్మాయిల్ కవిత్వమంటే ఎల్లపుడూ మురిసి పోతూ ఉంటాను గనక, ఇవాళ ప్రత్యేకంగా బలే ఉన్నాయని అనను .ఏమైందంటే ఇవాళ పెద్ద వర్షం మెరుములు, ఉరుముల్ని వెంటేసుకుని మా ఇంటికి వచ్చింది .నల్దిక్కులా పచ్చటి పచ్చదనం [అంటే మరీ పచ్చదనం అని అనమాట ]ఆహ్లాదాన్నవుతూ ,పరవశిస్తూ ...ఉండగా నా కుర్చీకి అటువైపున ఒక నత్త గారు ఎక్కడికో వెళ్తూ ఉన్నారు .మరేమీ ఆలోచించక మనసు ఇస్మాయిల్ గారి చివరి చిట్టి హైకూని గుర్తుకు తెచ్చేసుకుంది .బోల్డు నవ్వొచ్చింది .



సముద్ర ఘోషని
నిత్యం మోస్తుంది
నత్త




నత్త
నత్త గుల్లలో దూరి
ఏమి తల పోస్తుంది చెప్మా !


నత్త
ప్రియురాలి ఇంటికి

మెరిసే రోడ్డు వేసింది


<div
నత్త
ప్రియురాలి ఇల్లు చేరేటప్పటికి
ఆమె ముసలిదైపోతుంది

8, జులై 2011, శుక్రవారం

వినవు కదా ..

అనాలోచితం
అర్థ రహితం
ప్రయాణం
తెగదు ,విడదు

దారి తీపిది
చెట్ల నిండా పాములు
ముళ్ళ గోరింటలు

బ్రతుకుని పట్టి లాగేసిన
సూర్యుడు
ఇది తూర్పే కాదంటున్నాడు
ఔనని ఏంచేసి చెప్పడం

7, జులై 2011, గురువారం

మళ్ళీ బడికి !


రెండు నెలల చుట్టీ తర్వాత,మరో వారం పర్సనల్ సెలవు తీసుకొని , పాపాయి ఇవాళ బడికి వెళ్ళింది .రాత్రంతా కలలు ,పాపాయిని ఎందుకో హాస్టల్ లో వేసినట్టు . హాస్టల్ బాగుంది పరిశుబ్రంగా , ,తెల్లటి పరుపులు ఉన్నాయ్ .పాపాయి ఇంకా చిన్న పిల్లగా ఉంది .ఏవేవో నిబంధనలు .అటెన్డెన్ట్ట్స్ ఎవెరెవరో వున్నారు .తండ్రులు మాత్రమే వచ్చి ఉన్నారు చూట్టానికి ,ఎందుకనో ...బడికి పంపడమనే రేపటి దిగుల్ని ఈ రాత్రి హాస్టల్ లో వేసినట్టుగా నా మైండ్ అన్వయించుకో వుంటుంది .

పాపాయి ని బడికి పంపించాలంటే పాపాయి కంటే నాకే ఎక్కువ దిగులు తోస్తుంది .ఇవాళ టంగుటూరి సూర్య కుమారి గుర్తొచ్చింది .ఆవిడ ఇంట్లోనే ఉండి ఇంగ్లీషు అవీ నేర్చుకుని ఆక్స్ఫర్డ్ ఎక్జాం ఏదో ప్రైవేటుగా ఇచ్చారట .ఎంత గొప్ప డాన్సర్ అయ్యారు ,దేశ దేశాలు తిరిగారు .వెధవ స్కూళ్ళు. జీవితమంతా స్కూళ్లలోనే సరిపోతుంది .హాయిగా ఆడుకునే బిడ్డ స్కూలుకి వెళ్ళాల్సి వచ్చిందే అని దిగులు వేసేస్తుంది .పీ హెచ్ డీ చేశా నేను .ఇవాళ ఎవర్ని ఉద్దరిస్తుంది నా చదువు .వేస్ట్.
ఎందుకనో చాలా రోజుల నుండి ఆకాశమంత సినిమా చూడాలని అనుకునే దాన్ని. కుదరలేదు ,మొన్న మా ఇంట్లో చూసా .కొంత చూడగానే ఆల్రెడీ ఇంగ్లీష్ లో చూశానని జ్ఞాపకం వచ్చేసి విడిచేసా.కానీ ఒక సీన్ బాగా అనిపించింది .కూతుర్ని స్కూల్ లో చేర్చేప్పుడు ప్రకాష్ రాజ్ బోరుమని ఏడుస్తాడు .ఓకే పర్లేదు, సినిమా అయితే మాత్రం జీవితం కాదా ఏంటి ,అంత అద్భుతమైన సీన్స్ ఎంత తక్కువగా చూడ గలుగుతాం అసలు .

2, జులై 2011, శనివారం

రాలి పోయిన చందమామ !


ఇవాళ ఇక్కడ జోరు వర్షం .చిన్నప్పటి నుండి కోరిక ఎడ తెరిపి లేని వర్షాన్ని వింటూ ఉండగలగాలని.తీరి పోతూ ఉంది .స్నేహితురాలు అన్నది ఇద్దరం ఒకటే సారి ''విమెన్ ఇన్ లవ్'' స్టార్ట్ చేద్దామని .ఎందుకో ఆ పుస్తకమంటేనే భయం .అట్లాటిదే హిమజ్వాల .ఎందుకొచ్చిన కష్టం, సుఖంగా ఉన్న ప్రాణాన్ని చల్లగా ఉండనీయక .రాత్రి పది పేజీలైనా చదివి పడుకోమంది .మొరాయించేసి నిద్ర పోయాను .ఆక్క చెల్లెళ్ళ లోతైన తొలి తొలి మాటలే భయ పెట్టేస్తాయ్.మొదటి పేజీలోనే అక్క, చెల్లి అన్న ఏదో మాటకి అంటుంది ,''ఇన్ ది అబ్ స్ట్రాక్ట్ బట్ నాట్ ఇన్ ది కాంక్రీట్ ''అని ఆ మాట శీర్షిక చేసి కవిత ఒకటి రాసుకున్నా2005 లో .

ఇవాళ ఒరియా రచయిత ఉపేంద్ర కిషోర్ దాస్ రాసిన చిన్ని నవల ''రాలిపోయిన చందమామ '' తీసుకున్నా, విమెన్ ఇన్ లవ్ ని అవతల పారేసి .అమ్మాయి సత్తి మధ్య తరగతి బ్రాహ్మణ పిల్ల .ఆ పిల్ల కంటే చాలా పెద్ద వాడైన ఒక జమీందారుకి ఇచ్చి పెళ్ళి చేస్తారు తల్లి దండ్రులు .నాథం ఆ పిల్ల అత్త కొడుకు .వాళ్ళిద్దరి మధ్య ఏదో ఆకర్షణ ఉంటుంది .పెళ్లై భర్త ఇంటికి వెళ్ళినా అతనికి భార్య కాలేక పోతుంది .అతని ఉంపుడు గత్తె [ఈ మాట అసహ్యంగా ఉంది .పుస్తకంలో అదే వాడారు .ఇంకో మాట యోచించాలి ]దాష్టీకం భరించరానిదిగా ఉంటుంది .

ఒక సారి భర్త కొడుకు పుట్టు వెండ్రుకలు తీయించేందుకు ,పక్క ఊరి మందిరానికి వెళ్లి ,వారి నుండి తప్పి పోతుంది .అక్కడ నాధం తతస్తపడుతాడు .తుఫాను చేత రాత్రి అక్కడే తలదాచుకుని పక్క రోజు ఇంటికి వస్తారు .భర్త వెళ్ళ గొట్టేస్తాడు .నాధం కటక్ తీసికేల్తాడు. కొన్ని రోజులు అలా గడుస్తుంది .చివరికి ఒక రోజిక ఊరికి వెళ్లాల్సిందేనని పట్టు పడ్తుంది .అప్పుడు నాధం చెప్తాడు ఆపిల్ల తల్లి దండ్రులు కలరా తో చని పోయారని .చివరికి ఊరికి వెళ్తారు .

ఆ ఊరి వాడే అయిన స్కూల్ టీచర్ వీళ్ళని అనుకోని పరిస్థితుల్లో చూస్తాడు .అమ్మాయిని బెదిరిస్తాడు .ఆస్తినంతా తన పేర రాసియ్యమని లేదంటే ఊరంతా వీరి విషయం చాటింపు వేసేస్తానని .అది తెలిసి నాధం వాడిని బెదిరిస్తాడు .అనుకున్న విధంగానే గ్రామం నాథాన్ని బెదిరిస్తుంది ,ఏ సేవలూ అందనీయకుండా చేస్తుంది .ఇదంతా చూసి తన వల్ల అతనికి ఏ కష్టం కలగ కూడదని భావించి సత్తి, నాథానికి ఒక ఉత్తరం రాసి పెట్టి అర్థ రాత్రి ఇళ్ళు విడిచి పెట్టేస్తుంది .ఆమె ప్రయాణం లో నది ఎదురొస్తుంది ...సత్తి ముగింపుని సూచిస్తూ,,అంతటితో నవల అంతమై పోతుంది .

ఆ మధ్య గుర్రం కథ ఒకటి చదివాను, బ్లాక్ బ్యూటీ అనుకుంటా గుర్తు రాటం లేదు .ఎందుకో అందులో గుర్రం నిస్సహాయత అప్పుడు నాకో అమ్మాయి జీవితాన్ని గుర్తుకు తెచ్చింది .ఈ నవలలో సత్తి మళ్ళి ఆ నవలను జ్ఞాపకం చేసింది .చాలా సమర్దవంతంగా నా మనసు రెండిటినీ కలిపింది .రెండు అసహాయతల రూపం ఒకటే .

వాన బాగుంటుంది .పుస్తకం బాగుంటుంది .ముసురుపట్టిన ఆకాశమూ,దిగులు పెట్టించే పుస్తకమూ కలిస్తే ఆ పుస్తకం చదివిన జ్ఞాపకం జీవితంలో మళ్ళీ మళ్ళీ చాలా వానల్లో మనసులోకి తోసుకొస్తుంది .

నీతి ఏమిటంటే జీవితం ఎంతో చిన్నది కనుక బెంతాం చెప్పినట్టు, సంతోషమనే సుఖాన్ని ఇచ్చే మంచి పుస్తకాలే చదువుకోవలెను.ఇలాటి కష్టాల పుస్తకాలు చదివేసి మనసుని కష్ట పెట్టుకోరాదు .