మీ పిల్లలు మీ పిల్లలు కారు. వాళ్ళు జీవితేచ్చకు జన్మించిన వాళ్ళు . వాళ్ళు మీ ద్వారా వచ్చారు తప్ప మీ నుండి కాదు . వాళ్ళు మీతో ఉన్నా మీకు చెందరు .మీరు వాళ్ళతో ఉండాలని ప్రయత్నిస్తే ప్రయత్నించారు గాక, వాళ్ళు మీలా ఉండాలని మాత్రం అనుకోకండి. ఎందుకంటే జీవితం వెనక్కు మళ్ళదు గనకా, నిన్నటితో మళ్ళీ అతుక్కుపోదు గనకా ..ఖలీల్ జిబ్రాన్

26, ఏప్రిల్ 2012, గురువారం

ఇవాల్టి ముచ్చట

మొన్నేమయిందంటే పాపాయి స్కూల్ నుండి ఫోన్ చేసింది.ఆ మొన్న చుట్టీ తీసుకుంది కదా! అమ్మా ,నానలిద్దరూ ఆ విషయాన్ని డైరీలో రాయటం మరిచిపోయారు.అందుకని వాళ్ళ సారు ,పాపాయి చేత ఫోన్ చేయించాడు .పాపాయి ఫోన్ చేసింది .ఫోన్ నానెత్తాడు  ''నానా  డైరీలో సైన్ చెయ్యలేదు నువ్వు .ఎడ్వర్డ్ సారు రమ్మంటా వుండాడు దా నానా ''అన్నది .అని మళ్ళీ ఎందుకైనా మంచిదని చెప్పి ''నానా ..నానా పేంటేసుకు   రా  నానా '' ,అన్నది .నాన ఇంట్లో షార్ట్ వేసుకుని ఉంటాడు కదా ,అట్లాగే వచ్చేసే ప్రమాదముందని దాని జాగర్త .

పాపాయి వాళ్ళ స్కూలు మా ఇంటి పక్కనే .అందుకని చీటికి మాటికి ఏమి అక్కరొచ్చినా వాళ్ళ ప్రిన్సిపాల్  సారు ఫోను పుచ్చుకుని, ఫోను చేస్తుంది .సారు కూడా పక్కింటి స్నేహం తో ఫోన్ ఇస్తాడు .అట్లాగా ఈ రోజు మళ్ళీ ఫోన్ చేసింది ఫోన్ నేనెత్తాను''అమ్మా, నాన డైరీ పెట్టడం మరిచి పోయ్యాడమ్మా. ఒక రోవ్వంత పంపిచ్చమ్మా ''అన్నది .నేను సరెలేవే అని ఫోన్ పెట్టేసాను .మళ్ళీ రెండో సెకండ్ లో ఫోనొచ్చింది. ఏందా..?అని తీసాను. పాపాయే''అమ్మా !అమ్మా !నాన  పక్కనే వుండాడామ్మా ''?అన్నది .''లేడు రా  ''అన్నాను .పాపాయి వెంటనే ''అమ్మా ...అమ్మా నానని పిలిచి తిట్టు ''అని ఫోన్ పెట్టేసింది .డైరీ పెట్టనందుకు నానకి అక్కడనుండే శిక్ష వేసేసిన్దన మాట . మా అమ్మాయి .

25, ఏప్రిల్ 2012, బుధవారం

పాపాయి -బాతు

అప్పుడు  పాపాయి వయసు ఏడాదో ,యాడాదిన్నరో   వుంటుంది. సంక్రాంతి వచ్చింది .బుజ్జి బొమ్మకి బట్టలు కావద్దా ?చిలక పచ్చటి డ్రెస్ కుట్టించా .దాని మీద బాతు బొమ్మ గీశా.రేపే సంక్రాంతి .అప్పుడేం చేసాను ??సాయంత్రం మూడు గంటల వేళ మా మిద్దె పైకి వెళ్లి కూర్చుని ,ఏకాగ్రతగా ఎంబ్రాయడరీ చేయటం మొదలెట్టాను .రెండు మూడు గంటల్లో అయి పోయింది .ఎంత ముద్దుగా వచ్చిందో.ఆ చొక్కా వేసుకున్న పాపాయి నా కళ్ళ ముందు అట్లాగే వుంది ఇప్పటికీ .

ఆ తర్వాత పాపాయి పెద్దదయింది .చొక్కా చిన్నదయింది.కానీ ఆ బాతు అంటే నాకు ఎంత ఇష్టమో !!అందుకని ఏం చేసానంటే ,ఎంచక్కా దాన్ని కత్తిరించి వాల్ హంగింగ్ చేయించా .ముద్దుగా చక్కగా ఆ సాయంత్రాన్ని గుర్తు చేస్తూ నేను కుట్టిన ఆ బాతు ,నా దగ్గర శాశ్వతత్వాన్ని పొందేసింది.పాపాయి పెద్దయ్యాక కూడా చూసావా నేను నీకోసం ఎన్ని చేసానో అని చూపించేసి బెదర కొట్టెయ్యడానికి సోదాహరణంగా...అన మాట :))

21, ఏప్రిల్ 2012, శనివారం

పాతదే... ఒక పలకరింపు !

నా బెడ్ రూం కిటికీ తో బోల్డు స్నేహం చేస్తూ ఒక జామ చెట్టు,ఇంకో పూల చెట్టు వుంటాయి.ఆ చెట్టు పువ్వుల్ని నేను ఇది వరకే చూసాను మా ఊళ్ళో.నాకు అతి ప్రీతిగా అనిపించే పువ్వు మనోరంజని.మా ఊళ్ళో కాడ  బుట్ట పైన అరిటాకు పరిచి అందులో పెట్టుకుని అమ్ముతుంటారు మనోరంజని పూలు.ఆ పూలతో పాటు అప్పుడప్పుడూ ,పైన చెప్పానే ఆ పూల చెట్టు పూలూ... అమ్ముతుంటారు.

నిన్న వెళ్ళక,వెళ్ళక  మిద్ద పైకి వెళ్ళానా ,పిట్ట గోడ కి కొంత కింద నుంచుని నన్ను పలకరించింది ఆపువ్వు. లేత నారింజ వర్ణంలో .ఆ పలకరింపు వినగానే నేను బోల్డు ఆశ్చర్యపడ్డాను .క్రితం వేసవిలో మెట్లెక్కి తిరుమలకి వెళ్లాం .చివరి మెట్ల దగ్గర కనిపించిందా పువ్వు, చెట్టు పై పై  కొమ్మల్లో .నా చిన్న తమ్ముడూ ,వాడి స్నేహితుడూ ఎగిరీ దూకీ ఒక కొమ్మని పట్టుకున్నారా ...అయినా పువ్వు వాళ్లకి దొరకనే లేదు. కానీ ,కింద నిలబడి ఆ..మని నోరు తెరుచుకుని ,ఆశగా చూస్తున్న నా పై ఝల్లుమని రాలింది .నన్ను వెక్కిరించి ఘొల్లుమని  నవ్విందని నేను అభిప్రాయ పడ్డాను .

అట్లాంటి ఆ గర్వపు పువ్వు ,ఇట్లా ఇప్పుడు నన్ను పలకరించేసరికి ,చాలా  ఆశ్చర్యం వేసేసింది .పలకరించడమేనా ...ఈ మధ్యంతా సున్నితమైన ఒక మత్తు వాసన తెగ కవుర్లు చెప్తూ ఉండింది .ఏ చెట్టు పరిమళమో అది  అర్థం కాలేదు .నా తమ్ముడ్నీ,పాపాయి వాళ్ళ నాన్న ని అడిగాను ''ఏం చెట్టై ఉండొచ్చని''. పాపం వాళ్ళకీ తోచలేదు.

మా ఇంటిలోపల ఒక పెద్ద వృక్షం  వుంది .'మహోగని 'అని చెప్పారు ఇక్కడి వాళ్ళు .వేకువన వాకింగ్ కి వెళ్లి వస్తుంటే నేలంతా పరచుకుని కనిపించాయ్ ఆ చెట్టు పూలు .వేప పువ్వుల్లా,నక్షత్రాల్లా ! .ఇంక అంతే పాపాయి   వాళ్ళ నానకి ప్రకటించా ''చూసావా ఈ పువ్వల వాసనే నన్ను  వేధించుకు తింటున్నది  ''అని .పాపాయి వాళ్ళ నాన్న నా జ్ఞానం పై నమ్మకముంచి 'అవునవును' అనేసాడు.

తీరా చూద్దును కదా నిన్న ,, ఈ పూలది  ఆ మధురిమ .అప్పుడేమో అంత గర్వపళ్ళా ??? ఇప్పుడేమో నన్ను పలకరించడానికి ఎంత ప్రయత్నమో !!!.నా కిటికీ దగ్గర కూడా రేపో మాపో విచ్చుకునేందుకు సిద్దమై బోల్డుమొగ్గలు.ఆనందం వికసించింది మనసులో అనిర్వచనీయంగా.

ఇంకో పలకరింపుని  పొద్దుటే లేచి   గుర్తు తెచ్చుకున్నాను చాలా ఇష్టంగా .

ఏం ఏ చదివేప్పుడు ,మా యునివర్సిటీ లో సాహిత్య వలయంలోని వారు నన్ను ,ఈ అమ్మాయి కుప్పిలి పద్మ లా వుంటుంది అనుకునే వార్ట.ఆ వార్తలు ఎవరి ద్వారానో నాకు చేరేవి .మా అమ్మ మటుకు ''కానే కాదంటే...' అనేసేది .నాకు వారి రచనలంటే ఎంత ఇష్టమో .ప్రత్యేకమైన శైలి కదా   ...

రాత్రి ఏదో కథల సంచిక ఎందుకో గబగబా తిరగేస్తున్నానా ఒక పదమేదో పలకరించింది . అప్పటికే కొన్ని పేజీలు  పరుగులెత్తేసాయి.అయినా మనసు అనుకునేసింది ఇది పద్మ  కథలా ఉందే అని .ఇక తీరిగ్గా బాసింపట్టు వేసేసుకుని వెనక్కెళ్ళి ''వనమాల ''ని ఎప్పుడో చదివేసిందే అయినా మళ్ళీ చదివా.చదివి అనుకున్నాను ,ఏమంటే ''వీరితో  నా పరిచయం చాలా ఏళ్లది ,పలకరీంపేమో అతి కొత్తది .ఇదో గమ్మత్తు''అని .అలా అనుకుని ఇటీవలపు పరిచయ చనువుతో  వారికో మెసేజ్ పెట్టా ''మీరు నన్ను మెచ్చుకున్నారు అనే గర్వంతో శేష జీవితాన్ని సంతోషంగా గడిపెయబోతున్నా''అని .రిప్లయ్ ఏమొచ్చిందో చెప్పను .ఎందుకంటె ముగించలేని కథని మలుపుతిప్పి ఆపేయ్ మన్నాడు బహుసా ఓ .హెన్రీ!!


10, ఏప్రిల్ 2012, మంగళవారం

స్పందన

ఇవాళ నిజానికి బ్లాగింగ్ చేసే ఉద్దేశమే లేదు కానీ ఇది రాయాలనిపించింది. ఇవాళ,ఇప్పుడే  ఈ నెల ''పాల పిట్ట '' లో గంగిసెట్టి లక్ష్మీ నారాయణ గారు, ఇందిరా గోస్వామి గారి గురించి వ్రాసిన ''వర్తమాన చరిత్రకు సృజనాత్మక శిల్పి''స్మరణ చదివాను.ఎందుకనో బాగా దుక్కం వచ్చింది.ఆ దుక్కం ఎందుకనో తెలియనే   తెలియదు  .బహుసా ''విషాద కామరూప ''చదివిన నాటి దుక్కపు పునరావృతం కావచ్చును .

మన అనుభవానికి రాని విషయాలు కూడా ఒక మంచి రచయిత వాక్యాల  వెంట వెళ్ళినప్పుడు అనుభవంలోకి వచ్చే తీరుతాయి.ఇవాళ అంతకన్నా కూడా ఎక్కువగా ఈ వ్యాసకర్త స్మరణ వల్ల విషాద కామ రూప లోని స్త్రీ వైధవ్య విషాదం నా మనసులోకి చేరి దిగులు గూడుని కట్టుకుంది.

ఆత్యంత ఆశ్చర్యం కలిగించిన విషయం ఏంటంటే నవలలోని కథానాయకుడు 'ఇంద్రజిత్ 'తానేనని రచయిత్రి చెప్పడం.''నాలోని మరో భాగం.అందులో చాలా వరకు నన్ను నేను జెండర్ పరిథి దాటి చిత్రించుకున్నాను''అన్న ఆమె సమాధానం,నన్నేదో చేసింది ...ఏం చేసిందో చెప్పడానికి నాకిప్పుడు సరైన పదం  తోచటం లేదు.

వ్యాసకర్త ,తానీ నవలని కన్నీరు పెట్టుకుంటూ అనువదించానని చెప్పటం ,తెలీదు కానీ ,ఎందుకనో దుక్కాన్ని పెంచింది.రాత్రి GERHART HAUPTMANN పెద్ద కథ FLAGMAN THIEL చదివాను .ఎంత బాధ పెట్టిందంటే పాపాయి వాళ్ళ నానకి కథ చెప్పినదాకా నిదర రానేలేదు.

ప్చ్ ! ఏమిటో మనసును అల్లకల్లోల పరిచే ఈ విషాదాలన్నీ  ఒక్క సారే వచ్చిపడ్డాయి.

9, ఏప్రిల్ 2012, సోమవారం

నేను సమ్మక్క , , నువ్వు సారక్క ..!




పాపాయికి నాలుగేళ్ళప్పటి  సంగతి  .  మా ఇంట్లో అప్పుడో అమ్మాయి వుండేది 'మీరా 'అని .ఆ పిల్లతో పాపాయికి పేరు పెట్టి పిలిచేసేంత మంచి స్నేహం .ఆ పిల్లని అక్క అనాలని చెప్పేదాన్ని నేను.పాపాయికి అచ్చు నాలాగే దానికన్నా పెద్ద వాళ్ళతో స్నేహాలు.స్నేహాలే కాదు వయసుతో నిమిత్తం లేకుండా వాళ్ళతో  సమానమనే భావన కూడా బలంగా వుంటుంది.అంచేత  పాపాయికి ఆ పిల్ల అక్క అవడం అసలు ఇష్టం వుండేది కాదు .అందుకని  నేనే అక్కని ,మీరా అక్క కాదు చెల్లి అనేది .అక్క అనమని ఆ పిల్లని బలవంత పెట్టేది .

అప్పట్లో పాపాయి బాత్ రూం కి వెళ్ళే లోపలే చడ్డీలోనే ఉష్షు  పోసేసేది.ముందే ఎళ్ళాలమ్మా  అన్నా బద్దకించేసేది.

ఒక రోజు ఏమైందంటే అట్టాగే పాపాయి ,మీరా ...అక్కా చెల్లెళ్ళ వాదులాటల్లో వున్నారు ,అంతలో పాపాయికి ఉష్షు వచ్చేసాయి .వెళ్తూ... వెళ్తూ ,వెళ్ళే... లోపలే సరిగా బాత్ రూం ముందర ఉష్షు పోసేసింది .నేను అది చూసి ''ఆ...పాపాయి అక్క కాదు మీరా ...పాపాయి చెల్లి ,చూడు  చడ్డీలోనే ఉష్షు పోసేసింది  ?''అన్నాను .మీరా కూడా ''అవునవును పాపాయి చెల్లి ,అక్క కాదు కాదు ''అనేసింది  .

అప్పుడిక పాపాయి డైలమాలో పడ్డది .పాపం దానిక్కూడా చడ్డీలో ఉష్షు పోసేస్తే అక్క పదవికి పనికిరాం అని అర్థమయింది .

పాపాయికి అమ్మ పుస్తకం కథలు చెపితే నాన్న అల్లిక కథలూ ,చరిత్ర కథలూ చెప్తాడు .అట్లా  అప్పుడు  ప్రతి రాత్రి ''సమ్మక్క సారక్క కథ '' సీసన్ నడుస్తుండింది  .అందుకని పాపాయి చాలా రాజీ ధోరణిలో ''సరే మీరా నువ్వు సమ్మక్క  ,నేను సారక్క సరేనా ...!''అన్నది.

2, ఏప్రిల్ 2012, సోమవారం

ప్రేమ లేఖ !

నిన్న ఏమైందంటే తీరిగ్గా నా బొట్టు పెట్టి ముందు పెట్టుకుని సాజతా [అలంకరించుకుంటూ వున్నానని ,బెంగాలీలో] వున్నాను.పెట్టెలో ఏదో కాయితం కనిపిచ్చింది. ఏందబ్బా అని చూస్తే ,లవ్ లెటర్ ...నా కూతురు రాసింది.

నా కూతురు నాకు బోల్డు ప్రేమలేఖలు రాస్తది.ట్యూషన్ నడస్తా వుంటది కదా  వేరే రూం లో ,మధ్యలో ఎవరో ఒకరు ఒక లెటర్ పట్టుకోస్తారు .నేను తీసి చదివే లోపల నా కూతురొచ్చి గోడ చాటున నిలబడి అమ్మ సంతోష పడిందా లేదా అని చెక్ చేస్తా వుంటది .ఇంకా స్కూల్ నుండి కూడా ప్రేమలేఖలు రాసి తీసుకొస్తది,స్కూల్ లో గుర్తొస్తా  వుంటానంట

దానికి రెండేళ్ళ నుండీ అమ్మ  బొమ్మ వెయ్యడం   మొదలెట్టింది .అమ్మ ,కూతురు బొమ్మ వేసి ఐ లవ్ యు అమ్మ అని రాసి తీసుకొస్తది .

ఒక సారి ఏదో ఇరిటేషన్ ని దాని మీద చేత్తో చూపించా .ఆ రోజొక ప్రేమ లేఖ రాసింది .అప్పుడు భలే ఏడుపొచ్చేసింది.

అమ్మకి హిందీ రాదు అని గుర్తు పెట్టుకుని  ఇంగ్లీష్ లో రాస్తుంది .పాపం దాన్ని చూసి చూసి నాచు,పిచ్చి  స్కూళ్ళలో చేరుస్తాం కదా అందుకని ఇంకా బెంగాలీ వచ్చినంత బాగా ఇంగ్లీష్ రాదు.లవ్ లెటర్ లో స్పెల్లింగ్ తప్పులుంటాయి.

సరే ఈ ప్రేమ  లేఖలో ఏం రాసిందంటే ''     లవ్ యు   డియర్,
డోంట్ గో ఫార్ ఫ్రం మీ ...
లాఫింగ్ ఫేస్ 
ఫ్లవర్ ఫేస్ 
ఫ్రూట్స్ ఫేస్ 
     క్రయింగ్ ఫేస్''   అని
 కవిత అస్సలు అర్థం కాలేదు కదా .నేను కూడా ఆశ్చర్య పడి,అంటే ఏందిరా ?అని  అర్థం అడిగాను .అదన్నదీ నువ్వు ఒక్కో సారి పువ్వులాగా ముద్దుగా ఉంటావు,ఒక్కో సారి పండులాగా ఉంటావు ,ఒక్కోసారి నవ్వతా ఉంటావు,ఒక్కో సారి ఊ ...అని ఏడస్తా ఉంటావు,కేమీలియన్ లాగా [వాళ్లకి ఊసర వెల్లి మీద రెండో తరగతిలో పాటం  ఉందిలెండి] మాటి మాటికీ రంగులు మారస్తా ఉంటావు కదా అందుకని రాసా ,అని .

లెటర్ భలే నచ్చినా ... నన్ను కేమీలియన్ అంటావా నేను అలిగేస్తున్నా పో ...అన్నాను .ఈ సారి ఎప్పుడో దానికి జవాబుగా  ఇంకో లెటర్ రాస్తది .

ఈ విషయంలో [కేమీలియన్] మహా రాజ శ్రీ పాపాయి వాళ్ళ నాన్న గారి అభిప్రాయం కూడా అదే కనుక ఈ భావాన్ని అక్కడినుండే గ్రహించి వుంటుంది .కాకుంటే నా కూతురి కవిత్వం నాకు చాలా నచ్చేసింది.అందుకని ఇలా దాస్తున్నాను.పెద్దైతే ఎప్పుడైనా తేడా వస్తే చూపించ డానికన  మాట : ))