మీ పిల్లలు మీ పిల్లలు కారు. వాళ్ళు జీవితేచ్చకు జన్మించిన వాళ్ళు . వాళ్ళు మీ ద్వారా వచ్చారు తప్ప మీ నుండి కాదు . వాళ్ళు మీతో ఉన్నా మీకు చెందరు .మీరు వాళ్ళతో ఉండాలని ప్రయత్నిస్తే ప్రయత్నించారు గాక, వాళ్ళు మీలా ఉండాలని మాత్రం అనుకోకండి. ఎందుకంటే జీవితం వెనక్కు మళ్ళదు గనకా, నిన్నటితో మళ్ళీ అతుక్కుపోదు గనకా ..ఖలీల్ జిబ్రాన్

28, మే 2012, సోమవారం

ఆకుపచ్చటి జ్ఞాపకాల ఇంద్ర ధనుస్సు ...!




సరి కొత్త కాపురం
హాల్లో చాప
చాప నిండుగా పుస్తకాలూ
గాలి కెగిరే కాయితాలూ
కావాలని కూరుకుపోయే మనసూ ,బుద్దీ
మగ కాఫీ
అప్పుడప్పుడూ గైడ్ వేసే నాలుగు అక్షింతలూ
అందమైన యూనివర్సిటీ
తెలుగు డిపార్ట్మెంట్ ఫస్టూ ,హ్యుమానిటీస్ సెకండూ
వెరసి ఆకుపచ్చటి జ్ఞాపకాల ఇంద్ర ధనుస్సు నా ఈ పుస్తకం

[నా పీ హెచ్ డీ పరిశోధన
''తెలుగు ముస్లిం రచయితలు -సమాజం-సంస్కృతి''
.దానికి మంచి కాలం ఎప్పుడొస్తుందో మరి :))]



పి .ఎస్ : హైదరాబాద్ లో చదువుకున్నన్ని రోజులూ మా నాన నేనెప్పుడు ఇంటికి వెళ్లాలనుకున్నా రాత్రంతా నెల్లూరు నుండి ప్రయాణం చేసి హైదరాబాద్ కి వచ్చి మళ్ళీ నన్ను తీసుకుని రాత్రంతా ప్రయాణం చేసి నెల్లూరికి తీసికేల్లెవాడు. అమ్మాయినని కాదు .అబ్బాయిలకంటే అపురూపమని.ఎం ఫిల్ డీటీపీ నెల్లూరులో చేయించాం
మా నాన అంతా పూర్తయ్యాక నన్ను షాప్ కి తీసికెళ్ళాడు.అయినా తిరిగొచ్చేసరికి రాత్రి పన్నెండయింది .మరుసటి రోజు కొత్త ఏడాది .నేనూ మా నాన ఆ చీకట్లో వాహనాలు లేని రోడ్ల పై కబుర్లు చెప్పుకుంటూ నడవడం ఓ జ్ఞాపకం .


ఎం.ఫిల్ మీ గైడెన్స్ లోనే చెయ్యాలనుంది అంటే నను మన్నించి కాలేజ్ కమిటీ ని ఒప్పించారు కే కే ఆర్ సర్.వారు నాకంటే
నాలుగాకుల ఎక్కువ మొహమాటస్తులు .మొత్తం పరిశోధనలో నేను గైడ్ ని కలిసిన రోజులు వేళ్ళకి కూడా సరిపోనన్ని రోజులు.అయినా ఈ పరిశోధన వారి
మార్కు పరిశోధన.అదో జ్ఞాపకం

కొత్త కాపురపు తొలి రోజులు .అప్పుడే మా మావ గారు రిటైరై కొడుకు కి ఒక స్కూటర్ కొని పెట్టారు.
ఆ కొడుకు ఆ స్కూటర్ పై నన్ను రత్న మాల,వేణు గోపాల్,సీఫెల్ సభలూ ,లైబ్రరీలూ ఒకటేమిటి తెగ తిప్పాడు ఈ పరిశోధన కోసమని .విసుగనేదే వుండదు బంగారానికి అప్పటికీ ఇప్పటికీ ...అదో జ్ఞాపకం .

అప్పటి వరకు నాకు స్కూటర్ ఎక్కడం అనుభవమే లేదు .మొదటి సారి బోల్డు సిగ్గు పడుకుంటూ
ఆ నీలం రంగు స్కూటర్ ని ,నీలం రంగు చుడీదార్లో వున్నా నేను యెట్లా కూర్చోవాలో తను చెప్తే సిగ్గు పడుకుంటూ
కూర్చున్నాను .ఆ తరువాత అది నాకు బోలెడు లోకాలని చూపించింది .అదంటే నాకు అలవిమాలిన ప్రేమ.అందుకని దాన్ని బద్రంగా దాచుకున్నాను మా ఇంట్లో .అదో జ్ఞాపకం .

ఏదైనా రాసిన తరువాత దాని మొహం చూడాలంటే ఎందుకో చిరాకు నాకు .అందుకే ఇది మార్పూ చేర్పులూ చేయని అప్పటి పరిశోదనే . పబ్లిషర్ అచ్చు తప్పులు చూడమంటే నా వల్ల కాదంటే కాదనేసాను. వారే ఆ పని చూశారు.అదొక మంచి స్నేహపు జ్ఞాపకం .

ఈ ఇంద్ర ధనస్సుకి రంగులనిచ్చిన జ్ఞాపకాలివి ! అందుకే ఈ పలవరింత !

27, మే 2012, ఆదివారం

నీ పేరే ఎంతందం ...!

డుం ..డుం ..డుం  మూవీ నేనూ పాపాయి వా ళ్ళ నాన హైదరాబాద్లో చూశాం .ఎంఫిల్ లో ఉన్నాననుకుంటా అప్పుడు .జ్ఞాపకం లేదు. 

 ఈ పాట చాలా గుర్తొస్తూ వుండేది.ఒక సారి ఎక్కడ నుండో వచ్చి హాస్టల్ లో రూం తాళాలు తీస్తూ వుండినాను .వింగ్ కి  అటు చివరి నుండి ఎవరో తమిళ్  లో హం చేస్తూ వుండినారు .వెళ్లి  ఆ అమ్మాయిని పరిచయం చేసుకుని పాడించి విన్నాను.చాలా సార్లే ఆ పిల్లని పాడమని పీడించే దాన్ని .

ఆ తర్వాత చాలా సార్లు జ్ఞాపకం వచ్చేది .గత ఏడాది నా తమ్ముడు డౌన్ లోడ్ చేసిచ్చాడు.రాత్రి ఎవరో ఏదో పాట  పంపించ మని అడుగుతే వెదుకుతుంటే ఇది దొరికింది .

కొన్నింటిని ఎందుకు అంత ఘనం నచ్చాయని అడుగుతే చెప్పలేం .ఈ పాట  కూడా అంతే విపరీత ఇష్టం నాకు.పాట
మొదట్లో వినిపించే ఇన్స్ట్రుమెంట్ బిట్ ఎన్ని సార్లు విన్నా పిచ్చెక్కిస్తుంది .

 ఇట్లా బ్లాగ్ లో దాచుకుంటే  కావల్సినప్పుడంతా వినడానికి అందుబాటులో వుంటుంది కదా !

సంగీతం  కార్తీక్ రాజా 





                       

21, మే 2012, సోమవారం

పాపాయి సేద్యం !!!



జల్దాపారా వైల్డ్ లైఫ్ సాన్క్చురీని డిస్కవర్   చేస్తూ మా అమ్మాయి చేసిన కామెంటరీ .డిస్కవరీ చానల్ లో లాగా అనమాట.

తొలి కన్ను తెరవగానే ఇవాళ మా అమ్మాయి''అమ్మా!చెట్లుకి నీళ్ళు పోసేసి వస్తానమ్మా అన్నది.అందుకని
సెలవు పూట అయినా ఆరు గంటలకి అలారం పెట్టుకుంది.ఆహా ...తెల్లారిందిక  అనుకున్నా నేను .

మా అమ్మాయి నేను బుర్ర కథ టీం అంటాడు పాపాయి వాళ్ళ నాన.అమ్మ 'తా...'అని ,'నా..'దగ్గరికి చేరుకోక ముందే పాపాయి ''తందానా...'' అంటుంది .

ఈ మధ్య యేమయిందీ ...పాపాయి అనేకంగా కార్టూన్ చానల్ చూడబట్టింది .నేనింక ''ఈ పద్దతేం  బాలేదు పాపాయి ''అని వక్కాణించా .పాపాయి స్పందించి ''అమ్మా నువ్వేం చూసేదానివీ'' అన్నది .నేను ''నేషనల్ జియగ్రాఫిక్ చూసేదాన్ని'' అన్నాను. .ఇక ఇప్పటి సంగతేంటంటే పాపాయి డిస్కవరీ  జ్వరంలో వుంది .మొన్న మద్యాహ్నం ఒక బేగ్ తగిలించుకుని ,షీలాని తోడుబెట్టుకుని మా ఇంటి పిచ్చి దుబ్బల్లో తిరిగి పక్షులు తెచ్చి పడేసిన కొన్ని చందనం విత్తనాలు డిస్కవర్  చేసి తీసుకొచ్చింది .అచ్చు డిస్కవరీలో చూపించినట్టనమాట .

మొన్న రాత్రి ఇద్దరం కుదురుకుని,బజ్జున్నాక''అమ్మా నాకు గార్డెనింగ్ చెయ్యాలని వుందమ్మా కానీ ఎట్లాగా హేమామేసేస్తది కదా''అన్నది.హేమ మా ఆవు.అప్పుడు నేను ...''చిన్నప్పుడు మేం చిత్తూర్లో ఉండంగా ఆ ఇంట్లో చేట్లేసుకోడానికే వీలుండేది కాదుబిడ్డా .అప్పుడేమయిందంటే మా అమ్మ ఒక రోజు ఒక నల్లటి దబరని ,చిల్లు పడిందీ అని పారేసింది నేనేం చేసాను, దాన్ని పట్టికెళ్ళి వీధిలో బోరింగ్ దగ్గర గుట్టగా వున్న దువ్వ మట్టిని జవిరీ... నింపీ ,ప్రైవేటు నుండి వస్తా వస్తా దారిలో ఒకళ్ళని అడిగి టేబుల్ రోస్ కొమ్మతెచ్చుకుని దాంట్లో వేసా,ఎన్ని పూలు పూసిన్దనుకున్నావ్''అని చెప్పి !
మనసుంటే మార్గముంటది అని,ముక్తాయించా ..

మా అమ్మాయి నా మాటలు పొల్లు పోనిస్తదా?రేప్పోద్దన్నే లేసి,ఖాళీ తోట్టులన్నీ మట్టి, ఎరువుతో నింపి నానని,నన్ను నర్సరీకి పటికేల్లి చెట్లు కొనిపిచ్చింది..అప్పుడేమయిందీ...నర్సరీలో ఆ మూల అమ్మకి బోన్సాయ్ లు కనిపిచ్చాయ్ .అమ్మ ఉత్సాహం తో ఊగి [అమ్మకీ కూతురికీ తేడా ఏం లేదు అంటాడు నాన] నాకవి కావాలి అంది .ఒకటి మర్రి చెట్టు,ఒకటి రాగి చెట్టు.నర్సరీ అతను అంతకంటే ఉత్సాహంగా ఊగి డబ్బు మాట అసలు ఎత్తకుండాతీసుకు పొండి..తీసుకుపోండి అని ఆవేశ పడ్డాడు.

 అప్పుడిక పాపాయి వాళ్ళ నాన..సెక్యురిటీ గార్డు ,పాపం వీళ్ళ మంచీ చెడ్డాచూడటం  నా బాధ్యత కదా..అని భావించి...
''మేడం అవి తీసుకోవద్దు ,తీసుకుంటే ఆ రెంటికీ పెళ్లి చెయ్యాలి ''అన్నాడు .అమ్మ  ,'లైట్ లే' వీళ్ళ మాటలు గానీ...అవంతా ఎవరు పట్టించుకుంటారు అని  ఆ రెంటినీ పటుకోచ్చేసింది..
ఇంటికొచ్చాక ఇంట్లో వుండే పది నోళ్ళవారూ ఆశ్చర్యపడి మర్రి కీ,రాగికీ పెళ్లి చెయ్యాల్సిందే అని బెంగాల్ జానపదాలని 
వినిపించారు. పాపాయి బహు ముచ్చట పడి ''అమ్మా ! రాళ్ళని పూజిస్తే తప్పమ్మా !చెట్టును పూజించొచ్చు .చెట్టు  ఆక్సిజన్ ఇస్తది కదమ్మా !!!''అని దాని బహు తెలివి వాదాన్ని ప్రదర్శించింది..
  .
..నేను కూడా మా అమ్మాయి తెలివికి ఇక చాలా ముచ్చటపడి,సరేలే ఇట్లాగన్నా  అందరం కలిసి వండుకుని,కలిసితినోచ్చుకదా అని ఆలోచించి'' నేను అబ్బాయికి అమ్మని... ''అని ప్రకటించా .ఎందుకంటె మర్రి చెట్టు లాటి పెద్ద... అన్నయ్య మా అమ్మాయికి వుంటం,బాగానే వుంటుంది కద!,అట్లాగే నిత్యం తళ..తళా...మెరిసిపోతూ,గల గలా 
కబురులు చెప్పే రావి చెట్టు లాటి కలుపుగోలు కోడలుంటే ఎవరికి బాగుండదూ... అందుకని!!

అమ్మాయికి అమ్మ ఎవరో ఇంకా తెలీదు .మర్రి చెట్టు అబ్బాయి పేరు' కృష్ణా 'అని ప్రకటించా నేను .నాన కుదరదు  ఎప్పుడూ హిందూ పేర్లేనా ''బుద్ధ ''అన్నాడు.నేనూ ,పాపాయీ  సరేలే మేమేం చేసినా నాన మమ్మల్నితిట్టడం లేదు కదా  అని, నానని క్షమించేసి ఆ పేరుకే ఒప్పుకున్నాం .పాపాయి లేటెస్టుగా 'ఆంగ్లో ఇండియన్'అయింది వాళ్ళ స్కూల్  ప్రినిపాల్ లాగా.అందుకని క్రిస్టియన్ మేరేజ్ చెయ్యాలి కంపల్సరీగా అని ప్రకటన చేసింది.  ,ఇంకానేమో ,రావి చెట్టు  వాళ్ళ నాన మా   'ఎడ్వర్డ్ సారే' అని డిమాండ్ పెట్టింది.

కోడలి  పేరు'ఆమోదిత'.అంటే హపీనెస్ అంట .మనిషికి,యేవున్నా...లేకున్నా కడుపునిండా సంతోషం వుంటే చాలుకదా అందుకని ఆ పేరు పెట్టా .కోడలు రావటం అంటే సంతోషం రావటం లాగన మాట .కానీ మా అమ్మాయి కస్తూరి అన్నది.

అంతా అయ్యాక నా ఫ్రెండుకి ఫోన్ చేసి నా కొడుకు పెళ్ళి, వచ్చేయ్యవా  మీ ఆయన్ని తీసుకుని అంటే ''...సరిపోయినారు అమ్మా కూతురు'' అని కాసేపు విసుక్కొని , ఏ ఫ్లైటు కి  రావాల ,మా మావయ్య[వాళ్ళాయన]ఎందుకులే ...నేనొస్తా అన్నది .అదన మాట విషయం .

పాపాయి సేద్యం ఆ గతులలో నడుస్తుంది ఇప్పుడు.

పాపాయి జీవితంలో ఒంద  రంగులు వుండాలి  అని అమ్మ కోరిక .పెద్దయ్యాక అందులో ...చెట్లనీ ,పిచుకల్నీ విచిత్ర కథల్నీ,జంతువుల్నీ, మంచి బుద్ది  మనుషుల నీ  ,నదుల నీ  ,కొండలనీ , చిత్రించిన కుంచె మా అమ్మ అని అది మురుసుకోవాలి .

11, మే 2012, శుక్రవారం

హృదయం ఉప్పొంగిన క్షణాలు ...


 నిన్న మా ఇంట్లో కీర్తోన్ జరిగింది .మా నిభా పోరు భరించలేక  ఒక వైపు ,సరే బెంగాలుల కీర్తనలు యెట్లా ఉంటాయని ఆసక్తితో ఒక వైపు సరే అన్నాను.
తబలా ,హార్మోనియం పట్టుకుని ట్రూప్ దిగి పోయింది.నిభా హడావిడి చిన్నది కాదు .డబ్బు పుచ్చుకుని వెళ్లి ఏవేవో కొన్నది .అవీ ఇవీ వండింది.షీలా,అనిత ,భోగీందర్ కీర్తోన్ కోసం రాత్రి ఉండి  పోయారు.నేను ,పాపాయి వాళ్ళ నాన్న మధ్యలో జండా ఎత్తేసాం .పాపాయే అన్నీ తానై చూస్తుండింది .
సగంలో ఒక సారి వచ్చి అమ్మా షీలా..అనిత వాళ్లకి వండినవి పెట్టదంటమ్మా నిభ ,ఇంత రాత్రి ఇంటికి పొయ్యి ఏం తింటారమ్మా ?నేను పెడతా !వాళ్ళు తిన్నాకే కీర్తన్ వాళ్ళు !అన్నది .పనిలో వున్న నాకు రాజకీయం అర్థం కాలేదు .నీ ఇష్టం వచ్చినట్టు  చెయ్ బిడ్డ అన్నాను .
పొద్దుటే అనిత ,షీలా ,భోగీందర్ కలిసి కట్టుగా వచ్చి పాపాయిని కీర్తించడం మొదలెట్టారు .వాళ్ళని పక్క రూం లోకి తీసికెళ్ళి కూర్చో పెట్టి కడుపు నిండా తిన పెట్టిందట .లేకుంటే నిభా వల్ల  వాళ్లకి ఆ రాత్రి ఇంట్లో తిండి లేక పొయ్యేదట .మీ అమ్మాయి పెద్ద పెరిగితే ఎంత మంచి అమ్మాయి అవుతుందో ...అంత చిన్న బిడ్డకి అంత మంచి బుద్ది అని కీర్తించారు 
వాళ్ళ మాటలు వింటుంటే ఎంత సంతోషం వేసిందో .గర్వం కలిగింది .ఇంత చిన్నప్పుడే మనిషి పై దానికున్న అక్కర మంచి  కలలు కనమని  ధైర్యాన్ని ఇచ్చింది .వాళ్ళ మాటలు వింటున్నప్పుడు అప్పటికప్పుడే స్కూల్ కి వెళ్లి వున్న మా అమ్మాయిని పిలిపించి  హత్తుకోవాలనిపించింది.ఆనందపు  దుక్ఖం గొంతులో కోటుకలాడింది .
ఈ రోజు ఇది రాసుకుంటూ అమ్మ ఇష్టంగా చెప్తుంది .డైరీ లో రాసి పెట్టినట్టు రికార్డ్ చేస్తుంది. ఏమంటే ఆందుకని లవ్ యు రా పాపాయి .

5, మే 2012, శనివారం

మా అమ్మాయికి నోబెల్ ప్రైజ్ వస్తే...




బైసాఖి మేలా కి వెళ్లి వస్తున్నాం నేను మా అమ్మాయి .మా అమ్మాయి బోలెడంత సేపు జైంట్ వీళ్ళు ...అవీ ఇవీ తిరిగింది.ఇంటికి  వస్తున్న దారిలో కబుర్లు మొదలెట్టింది 

పాపాయి: అమ్మా గార్డ్ రూం నాకు ఇచ్చేయ్యమ్మా నాకు ల్యాబ్ గా బాగా పనికి వస్తుంది.
అమ్మ:గార్డ్ రూం కాదు రా కింద బెడ్ రూం తీసుకో కావాలంటే 
పాపాయి:సరే అయితే పైన బెడ్ రూం లో వుండే బల్లని ఆ రూం లో వేసుకుంటా ...
అమ్మ:సరే అట్లాగే 
పాపాయి:అమ్మా నాకు నోబెల్ ప్రైజ్ వస్తే ,ప్రైజ్ మనీ వస్తుంది కదా దాన్నేం చేసేదమ్మా ?
అమ్మ:పేద స్టూడెంట్స్ కి చదువుకునేందుకు పంచిపెట్టు 
పాపాయి :ఆహా !కాదమ్మా దాంతో నేను పెద్ద రంగుల  రాట్నం కొనుక్కుంటా !!!
అమ్మ: :))...:))...:))


2, మే 2012, బుధవారం

అల

 

నిర్విచారపు నిర్మల మధ్యాహ్నం 
పంజరంలో బాల్యపు మైనా 
కొన్ని జ్ఞాపకాలు వత్తిగిలి పడుకున్నవి 
ప్చ్ ! వద్దన్నా వదలకున్నవి 
అలమార లోపల ,ఆ లోపల ఇంకో రహస్యపు అర 
అరలో అలా ? అల ల ల లాలా?
అందులో వెదురు పెట్టె ఒకటి 
చిగురులతో  పచ్చటిది 
అవునూ  
అందులో ఏముందో ఎవరికైనా ఎందుకు పంచాలి ?
ఆ నది పక్కన పిల్లల్లా రాళ్ళు కొట్టాలి  
కలలా  చిరునవ్వులా 
వేలు చితికితేనో 
ప్చ్ అసలట్లా  కాదు !
తనన్నదీ పోమ్మన్నారూ  అని 
తనకైనా ఎవరికైనా 
చిన్నప్పుడు ,గెలిచేందుకే  ఎగుర వేసిన  
పల్లంచి రాళ్ళలా 
నాలుగు రాళ్ళు కావాలి 
అప్పుడిక   
పో!పో! నువ్వే పో !
పది సార్లు  పో!
ఒంద   సార్లు పో !
నువ్వే పో !
లెక్క వేస్తే గుప్పెడైనా లేవు రోజులు 
పాపం అంతలోనే  ద్వేషిస్తారు 
అయ్యో ఆమె అసూయా దేవి  
పోన్లే  ,పోన్లే ,పోన్లేమ్మని 
దయాకరులమై హసించి ,ఉదయించి,దయుంచి 
కానీ 
ఎన్ని సార్లున్చుతాం 
ఒక వీరుడు మరణించిన 
వేల వీరులుదయింతురు  
వీరుడులు , డులు..లు 
అని కదా !!!కదా ఆ ..ఆ.. ??
నిర్మల మద్యాహ్నం 
బాగుంది సంపెంగ పూలలా 
జల జల రాలిపోయినా ...
చెదరని సువాసనలా