మీ పిల్లలు మీ పిల్లలు కారు. వాళ్ళు జీవితేచ్చకు జన్మించిన వాళ్ళు . వాళ్ళు మీ ద్వారా వచ్చారు తప్ప మీ నుండి కాదు . వాళ్ళు మీతో ఉన్నా మీకు చెందరు .మీరు వాళ్ళతో ఉండాలని ప్రయత్నిస్తే ప్రయత్నించారు గాక, వాళ్ళు మీలా ఉండాలని మాత్రం అనుకోకండి. ఎందుకంటే జీవితం వెనక్కు మళ్ళదు గనకా, నిన్నటితో మళ్ళీ అతుక్కుపోదు గనకా ..ఖలీల్ జిబ్రాన్

4, ఫిబ్రవరి 2013, సోమవారం

మా నేతాజీ !!!

మా హేమ కి బాబు పుట్టాడు .నేనేమో అమ్మాయి పుట్టాలని అనుకున్నాను .మా హేమ ,హేమాంగిని ఎవరంటే మా ఆవు.మేం కూచ్  బీహార్ లో వున్నపుడు మాకో ఆవుండేది ,దాని కూతురు హేమ .హేమ పుట్టినప్పటి నుండీ కొంచెం నేను కూడా పెంచా .నేను బయట  కనిపించకపోతే  నాకోసం ఇంట్లో అన్ని గదులూ వెతుకుతూ వచ్చేది హేమ అప్పుడు .ఏమంటే నేను దానికి రోజూ దోశెలు ,ఇడ్లీలు, అప్పచ్చులూ ,తియ్యగా బెల్లం పెట్టేదాన్ని. అందుకని నేను హేమా అంటే ఎక్కడున్నా వచ్చేసేది .

ఆ తరువాత మేం వేరే ఊరికి వచ్చేసాం .కానీ హేమాని వదిలి రావాలంటే చాలా బెంగ వేశి దాన్ని కూడా తెచ్చుకున్నాను .అట్లా అది ఎక్కువగా నా పెంపకం లోనే పెరిగింది .అట్లా అది ఫెమినిస్టు అయింది .మాట్లాడితే  అందర్నీ పొడవటానికి వెళ్తుంది .వుట్టి పుణ్యానికి కయ్యానికి కాలు దువ్వుతుంది.

ఇక్కడకోచ్చాక అది కట్టుకోచ్చిందా ...ఇప్పుడు మంచి పాడి కోసమని డాక్టర్ లు ఇంజక్షన్ ఇస్తున్నారట కదా ..అట్లా డాక్టర్ వచ్చాడు .ముందే చెప్పా కదా హేమా ఫెమినిస్ట్ అని అప్పుడేం చేసింది ఆ డాక్టర్ మోకాటి చిప్పని మా అందరి కళ్ళ  ముందే ఎడమ కాలితో పటిక్కిమని పగల కొట్టింది .ఐదారుగురు పట్టుకున్నా అలివి కాలేదు .డాక్టర్  కి బాగా అవమానం వేశేసి ''దీనికి బాగా పొగరు .మా వల్ల కాదు గోశాలకి తీసుకు వెళ్ళండి'' అనేశాడు .బంధువులందరూ ''తల్లి సాలు బొల్లి పిల్ల ''అని నా పెంపకాన్ని నిందించారు .

హేమా ఎప్పుడూ బయటకి వెళ్లి ఎరగదు .అందుకని గోశాలకి తీసుకెళ్ళడానికి రోడ్డు మీదకి తీసుకురాగానే గుర్రం లా పరుగులు తీసింది.ఆ గంతుల్ని రోడ్డు రోడ్డంతా విరగబడి చూసింది .మేము మాత్రం రోడ్డు దాటించలేక పోయాం .అప్పుడేమయిందీ మేమందరం సమాలోచన చేసాం .నిత్యో ఏం చెప్పాడంటే అచ్చోసిన ఆంబోతు ని తెద్దాం అని.భోగీందర్ వీధుల్లో పడి  నాలుగైదు డజన్ల అరటి పళ్ళు ఖర్చు పెట్టగా ఒక ఆంబోతు వచ్చింది .అచ్చు శివుడి నందీస్వరుడే .అప్పుటి ఆ దృశ్యమే నా ''మహిత'' కథలోకి ఎక్కింది .

హేమ నిండు నెలలో నేను ఊరికి వెళ్ళాల్సి వచ్చింది .నేను లేకుండా బిడ్డని కంటే అన్నీ సరిగా జరుగుతాయో లేదో అని ,అప్పుడు నా ఇంట్లో వున్నా మా తమ్ముడికి ఫోన్లో ''ఒరేయ్ చిన్నా ,హేమ దగ్గరికెళ్ళి అమ్మ వచ్చే వరకూ బిడ్డని కనోద్దన్నదీ.. అని చెప్పురా ''అన్నాను.వాడెల్లి అట్లాగే చెప్పాట్ట .అప్పుడు హేమ కిందకీ పైకీ తల ఊపిందట .అక్కడే వున్న బెంగాల్ కుర్రాడు అది చూసి ఆశ్చర్య పది ''సార్  ఏం చెప్పారు ,హేమ తల ఊపిందే ''అన్నాట్ట .ఆ తరువాత నేను ఇంటికి వచ్చా .హేమ అప్పటికి ఈన లేదు .




ఆ తరువాత నేను మళ్ళీ ఊరికేల్లాల్సి వచ్చింది .మనసులోనేమో బెంగ ,నేను లేకుంటే యెట్లా ,హేమని బాగా చూస్తారో లేదో నని .అప్పుడు సరిగా వెళ్ళే రోజు  అనిత వచ్చి చెప్పింది .మేడం హేమ కి ఇవాళ బిడ్డ పుడుతుంది సాయంత్రం లోపు అని .నాకేమో రెంటికి ఫ్లైటు .ఇక కుర్చీ ఎక్కి మా హేమ వద్దే కూర్చున్నాను .పాపాయినీ స్కూల్ నుండి రప్పించేసాం  [మా పాపాయి  క్రిస్టియన్ కాబట్టి సూసన్ అనే పేరు ఆల్రెడీ పెట్టేసింది. నేను తెలివిగా సరేలే నేను సుశీల అనుకుంటానని   చెప్పేసా .ఆ గొడవలు అట్లా పక్కన పెడితే ]అమ్మాయే పుట్టాలని అనుకుంటున్నానా ,పాపాయి వాళ్ళ నాన ఆఫీస్కి వెళుతూ వెళుతూ ఈ రోజు నేతాజీ జయంతి కదా నేతాజీ పుడతాడేమో అనేసి వెళ్ళాడు .అప్పుడింక అమ్మని గౌరవించీ, నానని గౌరవించి అమ్మ ఫ్లైటుకి ముందే నేతాజీని కన్నది హేమ .అమ్మ నేతాజీని ముద్దులాడి ,ఫోటో దిగి  వెళ్ళే దారంతా ''నేను సరేలే ఇంత వయసొచ్చి ఫోటోకి పోసు  పెట్టాననుకో .నేతాజీ పుట్టి అరగంటయినా కాలేదూ ఎంత బాగా పోసు పెట్టేడు ''అని ఫోటోని చూసుకుంటూ ,మురుసుకుంటూ సంతోషంగా ఊరికెళ్ళి ,తిరిగొచ్చి ,ఇది రాస్తుంది .


మేడ పైని నా కిటికీ ఎదురుగా కట్టేసి ఉంటుందా ...హేమ .కొడుకు కూడా పక్కనే బజ్జుని ఉంటాడు.తల్లీ కొడుకులది అదొక సుందర దృశ్యం .హేమ కొడుకు అచ్చు హేమ పోలికే.రంగూ రూపు .రేప్లికా .మా పెదమ్మ చెప్పిందీ ''మనుషులైనా పశువులైనా మనం ఎవర్ని ప్రేమిస్తున్నామో వాళ్ళ పోలికలతో పిల్లలు పుడతారు ''అని .