మీ పిల్లలు మీ పిల్లలు కారు. వాళ్ళు జీవితేచ్చకు జన్మించిన వాళ్ళు . వాళ్ళు మీ ద్వారా వచ్చారు తప్ప మీ నుండి కాదు . వాళ్ళు మీతో ఉన్నా మీకు చెందరు .మీరు వాళ్ళతో ఉండాలని ప్రయత్నిస్తే ప్రయత్నించారు గాక, వాళ్ళు మీలా ఉండాలని మాత్రం అనుకోకండి. ఎందుకంటే జీవితం వెనక్కు మళ్ళదు గనకా, నిన్నటితో మళ్ళీ అతుక్కుపోదు గనకా ..ఖలీల్ జిబ్రాన్

22, ఆగస్టు 2014, శుక్రవారం

మేరి చాందిని !

పొద్దుటే సూర్య కాంతి పడుతున్న సోఫాలో గులాబి రంగు నైట్ డ్రస్ లో కూర్చుని వుంది నా చాంద్ కా తుక్డా . నిన్నంతా కొత్తగా నేర్చుకుంటున్న   సైకిల్ తొక్కి ,తొక్కి వేసారిన అలసట ,స్కూల్ కి వెళ్ళాల్సిన బాధ్యత మిళితమై ముఖంలో ద్యోతకమవుతూండగా,అద్భుతమైన మెలాంఖలిక్  కాంతి తో  సోగలైన కన్నులను  సూర్య కాంతి లోనిలిపి నిరోమయంగా గొప్ప సౌందర్యంతో కూర్చుని వుంది .

అలా వుండి వుండి ,ఆలోచనా లోచనాలను మా అమ్మ పక్క తిప్పి .. "ప్రైమరీ స్కూల్ లీడర్ ని అవమానించింది మమ్మీ .... అమ్మ ఫ్రెండు "అన్నది .  చల్లారి పోయిన గ్రీన్ టీ  ని గట గటా తాగుతున్న నాకు చప్పున పొలమారింది . విషయమేమంటే మొన్న పాపాయి వాళ్ళ అమ్మ చిన్న నాటి నెచ్చలి వచ్చింది ,పాపాయికి , తాతకి జరుగుతున్న టామ్ అండ్ జెర్రీ పోరు చూసి ఆశ్చర్యపడి " అంకుల్ కి కోపమంతా తగ్గిపోయింది కదా సామాన్య ,అప్పుడంత కోపమున్డుంటే ఇది ఇలా మాట్లాడగలిగేదా అసలు " అని వక్కాణించింది . అది విని అప్పుడు ఊరుకున్నా మూడు రోజుల తర్వాత పాపాయి బుసలు కొట్టి కోపాన్ని ఇలా వ్యక్త పరిచిందనమాట . కోపం రాదా మరి ... ప్రైమరీ స్కూల్ లీడర్ అయి వుండి  అవమానింప బడటమా ......! తన ప్రవర్తన గురించిన అంత వ్యాఖ్యానం  రావడమా ...!

మొన్నో రోజు పాపాయి స్వంతంగా సానం (స్నానం )పోసుకుంటూ ఉండింది . మరి అదిప్పుడు ప్రైమరీ స్కూల్ లీడర్ కదా ,మేమందరం చీటికి మాటికి ఆ పేరు చెప్పి దాన్ని బ్లాక్ మెయిల్ చేస్తూ వుంటాం కదా అందుకన మాట  ఈ స్వంత స్నానం . పాపాయి వాళ్ళ అమ్మ బాత్రూం ముందు కుర్చీ వేసుకుని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ వుంది ... అక్కడ అలా  రుద్దూ...  ఇక్కడ ఇలా రుద్దు  అని ,చూసి చూసి పాపాయి టకీమని బాత్రూం తలుపు వేసేసుకుంది . అమ్మకి ఎంత ఆశ్చర్యమో ,ఔరా ! ఎంత తెలివీ ... మాట మంతీ లేకుండా చెప్పాల్సింది ఎంత బాగా చెప్పేసింది అని .