మీ పిల్లలు మీ పిల్లలు కారు. వాళ్ళు జీవితేచ్చకు జన్మించిన వాళ్ళు . వాళ్ళు మీ ద్వారా వచ్చారు తప్ప మీ నుండి కాదు . వాళ్ళు మీతో ఉన్నా మీకు చెందరు .మీరు వాళ్ళతో ఉండాలని ప్రయత్నిస్తే ప్రయత్నించారు గాక, వాళ్ళు మీలా ఉండాలని మాత్రం అనుకోకండి. ఎందుకంటే జీవితం వెనక్కు మళ్ళదు గనకా, నిన్నటితో మళ్ళీ అతుక్కుపోదు గనకా ..ఖలీల్ జిబ్రాన్

ఆకాశంలో సగం లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
ఆకాశంలో సగం లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

18, జూన్ 2011, శనివారం

మా ఊరి ఆడోళ్ళ లోక జ్ఞానం !


ఈ రోజు మా సుబ్బమ్మ వచ్చింది, నన్ను చూసి పోవడానికి .
బుజ్జమ్మా నువ్వుండే ఊరి పేరేన్దే..ఎన్ని సార్లు చెప్పినా గవనమే ఉండదూ.......
బెంగాల్ సుబ్బమ్మ, పశ్చిమ బెంగాల్ .
ఆ అదేలే దగ్గిర దగ్గిర అమిరిక కాడ అంతే కదా?
ఆ ..అంతే !అంతే !
*****
నేను హైదరాబాద్ లో చదువుకునేప్పుడు నా దగ్గరికి మా రవణమ్మ వొచ్చింది .
హై కోర్టు భవనాన్ని చూసి ,అందరూ తాజ్ మహల్ ,తాజ్ మహల్ అనుకుంటా ఉంటే ఏందో అనుకున్నా గానీ బలే ఉంది బుజ్జమ్మా .ఇదే గదా తాజ్ మహల ...?
ఆ ..ఇదే !ఇదే !
*****
మా తెల్ల నవ్వుల నల్ల ఎంకటేసిరమ్మ,ఎండ పడి నిగ నిగ మెరస్తా ఉంటే ......
ఎంకటేసిరా.... నీ వొయిసెంత ఇప్పుడూ అన్నా....
ఉండదా ఇరవయ్యారో ..ఇరవై ఏడో..
కాన్పుకొచ్చిన నీ కూతురి వొయిసెంతా ?
పంతొమ్మిది కదా ..గండారపోళ్ళ పట్టన్న కూతురితోపాటిది .......
అయితే నీకు ఎనిమిదేళ్ళకే కూతురు పుట్టేసిందా ?
నువ్వుండు బుజ్జమ్మా ...!ఎనిమిదేళ్ళకి పిలకాయలెట్ట పుడతారూ ...నేనప్పటికి సంసారానికి గూడా రాలా ..!
ఔనౌను... పుట్టరు! పుట్టరు !

24, మే 2011, మంగళవారం

మమత బెనర్జీ ప్రతిజ్ఞ !


బెంగాల్ ప్రజలు చాలా సున్నిత మనస్కులు .సంస్కారులు.త్వరగా స్పందిస్తారు.వారి ఈ స్పందించే స్వభావమే చరిత్ర పొడుగూత, మిగిలిన భారతీయులం , మనం వారిని స్మరించుకునేలా చేసింది .బెంగాల్ లో ఉంటూ ఆ ప్రజల ఆకాంక్షలను దగ్గరగా చూడగల అవకాశం ఉన్న వ్యక్తిగా ,నేను ఇవాళ ఊహించగలను. ఈ మార్పు తీసుక రావడం పై వారెంత యోచించారో ,కిందా పైన అయ్యారో ,దిగులు చెందారో .ఎంతగా రోసి పోయారో .బహుశా సమీప భవిష్యత్ లో వారి దుష్ట తరమైన కలల్లోకి కూడా బెంగాలులు CPM ని అనుమతించ లేరేమో .

నిజమే ...తల పగల కొట్టుకోడానికి ఏ రాయయినా ఒకటే అని మేథావులు చెప్తే చెప్పారుగాక ...తల పగల కొట్టుకునే రాయిని ఎంపిక చేసుకునే కనీస అవకాశం కలిగి ఉండటం కూడా గొప్ప విషయమే కదా. ఆ రాయి స్త్రీ కావడం ఆశా భరితమైన మార్పులకు నాంది కావొచ్చేమో కదా !

పాపాయి వాళ్ళ నాన్నచాలా సంతోష పడ్తూ ,మురిసి పోతూ బెంగాల్ పత్రికలలో పడ్డ ఒక వార్తా కధనాన్ని నాకు వినిపించాడు .సంభదిత ఫోటోలు మెయిల్ చేసాడు .1993 లో మమత అప్పటికింకా కాంగ్రెస్లోనే ఉన్న కాలంలో, పీవీ ప్రభుత్వంలో క్రీడా శాఖా సహాయ మంత్రిగా ఉన్నప్పటి సంగతి .నదియ జిల్లాలో ఒక మూగ చెవిటి అమ్మాయిని రేప్ చేసారట .బాధితురాలికి న్యాయం జరగలేదు .నిందితుడికి సిపిఎం పార్టీ సప్పోర్ట్ ఉండటమే అందుకు కారణం .[బెంగాల్ లో సిపిఎం కి ఇది నిత్య కృత్యం ].అదే ఆరోపిస్తూ మమత బాధితురాలిని తీసుకుని అప్పటి ముఖ్య మంత్రి జ్యోతి బసు ని కలవడానికి రైటర్స్ బిల్డింగ్ కి[సెక్రటేరిఎట్] వెళ్లారు .జ్యోతి బసు ,అప్పాయింట్ మెంట్ లేదన్న నెపంతో ఆమెను చూడటానికి నిరాకరించారట .అందుకు నిరసన వ్యక్తం చేస్తూ మమత ముఖ్య మంత్రి చాంబర్ ముందే బైటా యించారు .

ఆదేశించే వెళ్ళారో ఆదేసించకుండానే వెళ్ళారో కానీ జ్యోతి బసు మరో తోవ గుండా బయటకి వెళ్లి పోయారట .ఆయన వెళ్లి పోయిన తరువాత లోకల్ పోలీసులు మమతను జుట్టు పట్టుకుని బయటకు నెట్టారు .ఆ సందర్భంలో మమత ప్రతిజ్ఞ చేసారు ....ఇవాళ మీరు నన్ను అవమానించి బయటకు గెంటు తున్నారు... ఒక రోజు నేను తలెత్తుకుని ఇక్కడికొస్తాను అప్పటి వరకూ రైటర్స్ బిల్డింగ్ లో అడుగే పెట్టను అని .అంతే ఈ పద్దెనిమిదేళ్ళు , రాజకీయంగా ఎంత క్రియా శీలంగా ఉన్నప్పటికీ ,ఆవిడ రైటర్స్ బిల్డింగ్లో అడుగు పెట్టనేలేదుట .పద్దెనిమిదేళ్ళ తర్వాత విజయ శంఖాల్ని పూరిస్తున్న అశేష ప్రజానీకపు ఆశల తోవల వెంట నడుచుకుంటూ వచ్చి రైటర్స్ బిల్డింగ్లో కాలు మోపారు .

ఇదంతా వింటుంటే నాకు భారతం గుర్తొచ్చింది .అభిమాన ధనురాలైన ద్రౌపది గుర్తొచ్చింది.రెండు పద్యాలు గుర్తొచ్చాయి .

ద్రోపది బంధురంబైన క్రొమ్ముడి గ్రమ్మున విడ్చి వెండ్రుకల్
దావలచేత బూని ;యసితచ్చవి బొల్చు మహా భుజంగమో
నా విలసిల్ల వ్రేలగా ;మనంబున బొంగు విషాద రోషముల్
గావగ లేక భాష్పములు గ్రమ్మగా ;దిగ్గున లేచి యార్తయై

[ద్రౌపది చిక్కటి తన తల ముడిని విప్పి తాచు పాము వలె వేలాడుతున్న వెంట్రుకల్ని కుడి చేత్తో పట్టుకుని .మనసులో పొంగే విషాద రోషాల్నిఆపుకోలేక ,కంటి నీరు కళ్ళని కమ్మేస్తూ ఉండగా దిగ్గున లేచి ఆర్తయై ..]

నెట్టెన యిట్టి యల్క మది నిల్పితి రక్కెస తాల్మి జిచ్చొడిన్
గట్టినయట్లు పెద్దయును గాలము ;దీనికి నారుటెన్నడున్
బుట్టదు దుష్ట నిగ్రహము పూని జగంబు గాచునట్టి తో
బుట్టువు నీవు ,తేజము న బొల్చిన భర్తలు గల్గ నచ్యుత

[అచ్యుతా గతి లేక ఇంతటి కోపాన్ని రాక్షసమైన ఓర్పుతో నిప్పు ఒడిన కట్టుకున్నట్లు చాలా కాలం నుండి మోస్తున్నాను .దుష్ట శిక్షణ కోసం పుట్టిన నీవు ,పరాక్రమవంతులైన భర్తలు ఉండి కూడా ఇది చల్లారటం లేదే ...]

ఒందల ఏళ్ళు గడిచినా స్త్రీల పట్ల పురుషుల దృక్పధంలో మార్పులేమీ ఉండటం లేదు కదా .ఇదంతా నీచమూ ,అత్యంత హేయమూనూ ...ఆత్మాభిమానం లేకుండా ,స్త్రీ మగ వాడి వెనుక ఉన్నంత కాలమూ అంతా పదిలమే .కాదని నాకు నా స్వంత మెదడుంది, దానికి దాని ఆలోచనలున్నాయంటూ సమత్వాన్ని, దృడ వ్యక్తిత్వాన్ని ప్రదర్శించామా ఇక అంతే, జుట్టే పట్టుకుంటారో వలువలె ఊడ పీకుతారో ఈ దుశ్శాసనుని అన్నదమ్ములు ...నిరంతరమూ భయమే .
అంత టి ఆత్మాభిమానం కల ద్రౌపది ,అంత కంటే ఎక్కువ ఆత్మాభిమానం కల మమతా బెనర్జీ ఒడిలో కట్టుకున్న నిప్పు లాటి ,ఒక చోట నిలువనీయక నిరంతరం దహించి వేసే అవమానాన్ని ,మృగ క్రౌర్యాన్ని యెట్లా భరించారో. అంతటి రాక్షస ఓర్పు యెట్లా సంపాదించారో కదా ...

ఆనాటి ద్రౌపది అసహాయురాలు. ఆత్మాభిమానిని అయినా ..భర్తల చాటు భార్య ,అచ్యుతుని చాటు చెల్లెలు .అందుకే వారిని వేడుకుంది .విసిగించింది .ఏమయితేనేం పగ సాధించింది .

మమత వెనుక ఏ అండ దండా లేదు ఏక వ్యక్తి సైన్యం .ఆమె నిర్మించుకున్న సామ్రాజ్యం ఆమెదే .పునాది ఆమె దే , పునాది పైని కోటా ఆమెదే ..గెలుపోటముల లెక్క ఆమెదే .మరొకరి ప్రసక్తీ లేదు ప్రమేయమూ లేదు .ఆమె శిరసున అలంకృతమైన విజయ కిరీటం రాయి రాయీ పొదిగి ఆమె స్వయంగా చెక్కుకున్నది .

ఆడ వారు హృదయ వాదులు ., ఉద్రిక్త హృదయులు, ఉద్విగ్నులు.కోపించినా ,దూషించినా ,శపదం చేసినా,ఎ- దు - రు చూసినా నిబద్దతతోనూ హృదయ పూర్వకంగానూ అందంగా చేస్తారు . కదా !

సంతోషం వేస్తుంది .గర్వం వేస్తుంది .ఆశ పుట్టేస్తుంది భవిష్యత్ పైన ఆవిడని చూసుకుని ......లవ్ యు మమతా దీ

Mamata Banerjee's journey from a maverick to a messiah - Assembly Elections 2011: India Today - Photo

15, మే 2011, ఆదివారం

టైలర్ పెంచలయ్య కూతురు మరియు మమత దీ!


ఇవాళ పాపాయి వాళ్ళ నాన్న నాకో అందమైన మెసేజ్ పంపించాడు .చదవగానే చాలా సంతోషం వేసింది .చెప్పాలంటే కొంత గర్వంగా కూడా అనిపించింది .ఆ మెసేజ్ ఇది .....

india now ruled by ...
amma in south ;
didi in east ;
bahenji in north;
aunty in d capital;
madam in center.
tai as president
&
wife at home
its a women's world

నాకు పై అందరిలో మమత దీ అంటే చాలా ఇష్టం .బెంగాల్ లో ఉంటున్నానని కాదు .బెంగాలీలు పూజించే కాళికాంశ ఆవిడలో ఉందనీ కాదు .ఆవిడ వ్యవహారం లో కనిపించే సిసలైన స్త్రీత్వమంటే నాకిష్టం .ఆవిడ mood swings అంటే నాకు ముచ్చట .ఆవిడ ధిక్కార శైలి అంటే నాకు ఆరాధన .ఆ తరువాత మాయావతి ,జయ లలితలంటే గౌరవం .

ఇక పోతే టైలర్ పెంచలయ్య కూతురు గురించి :ఈ అమ్మాయి పేరేమిటో నాకు తెలీదు .చూసింది కూడా లేదు .నేను బెంగాల్ లో ఉండగా బహుశా నెల క్రితం అనుకుంటా.. మా అమ్మ ఫోన్ చేసి చెప్పింది ,పెంచలయ్య కూతురు చచ్చి పోయింది అని .ఆ పిల్ల తనొక్కటే చని పోలేదు, తనకు పుట్టిన ఇద్దరు పిల్లల్ని మొదట బావిలో వేసేసి .తరువాత తను దూకింది .

ఆ పిల్ల చెల్లికి ఇటీవల పెళ్ళి జరిగింది .ఇప్పటి కట్నాల రేటు ప్రకారం అక్కకంటే చెల్లికి కట్నం ఎక్కువ ఇచ్చారట .తేడా మొతాన్ని ఇప్పుడు ఇవ్వాల్సిందే అని పేచీ పెట్టాట్ట భర్త .తల్లిదండ్రులు ఇవ్వలేక పోయారు .భరిస్తానని ప్రమాణాలు చేసిన భర్త ఆ పిల్లను యమ కూపం వైపు నడిపించాడు .

పెంచలయ్య ఇంటికి వచ్చినప్పుడు మా అమ్మ నాతో ఫోన్ లో మాట్లాడించింది .యెట్లా జరిగింది అన్న దానికి అతను పై వివరణ ఇచ్చాడు .నేను AP కి వచ్చిన తర్వాత పెంచలయ్య ఇంటికి వచ్చాడు .పిల్లల్ని కూడా చంపేయడం ఎందుకు అని మా అమ్మ బాధ పడుతుంటే .. ...ఎవరు చూస్తార్లే అమ్మ అన్నాడు నిరాసక్తంగా .

మరో సారి వచ్చినపుడు పెట్టిన నగలు ,డబ్బు ఇచ్చేసినారమ్మ అల్లుడోళ్ళు .మా వోళ్ళు డబ్బు తెచ్చుకున్నారు ,దాంట్లో నాకొక పది వేలు ఇచ్చుంటే ఏమమ్మ [పెంచలయ్య పరమ తాగుబోతు ]అని యాష్ట పడ్డాడు .

జీవితం కథలు కాకర కాయలకంటే భిన్నంగా ఉంటుంది .మమతా దీ కి అంత మొండి పట్టుదల ఎక్కడిది ?పెంచలయ్య కూతురు చావునే చివరి పరిష్కారంగా ఎందుకు ఎంచుకుంది ?పెంచలయ్యని ఏమనాలి ...కూతురు శవం మీద డబ్బులేరు కుంటున్నాడన ?ఎందుకో ఇవాళ చాలా ప్రశ్నలు, ఆలోచనలు కలిగేసాయి హటాత్ గా .

సాహిత్యంలో రచయితలు చెయ్ చేసుకుని జీవితపు ఒక డైమన్షన్ నే మనకి చూపిస్తారు .మన ముందు ,మనతో కలిసి నడుస్తున్న ఈ ప్రపంచానికి ముఖాలు అనేకం .మనం ఏ ముఖం చూస్తున్నామో ఆ ముఖం బహుశ మనదేనేమో .కాదంటారా !

8, మార్చి 2011, మంగళవారం

లక్ష్మి కోసం !


ఇవాళ బోల్డు బద్దకంగా ఉంది .సర్వకాల సర్వావస్థల్లోఅట్లాగే ఉంటుంది కానీ ఇవాళ మరీను .కానీ మా లక్ష్మి ఒక కామెంట్ పెట్టింది ఇవాళ ,మహిళా దినోత్సవం కోసం ఏమైనా రాయి అని .లక్ష్మి నా రూమ్మేటు.నేను మానవీయ శాస్త్రాన్ని ,తను భౌతిక శాస్త్రాన్ని పరిసోధించాం . లక్ష్మి నవ్వుల హరివిల్లు ,నేనేమో మూడీ మేఘ మాలికని .తను లేకుండి ఉంటె నా యూనివర్సిటి చదువు ఎంత చప్పగా తగల బడి ఉండేదో తలుచుకుంటేనే భయమనిపిస్తుంది .


మహిళా దినోత్సవపు శుభాకాంక్షలతో గరిమెళ్ళ .భాస్కర వెంకట సుబ్బ లక్ష్మి ఇది నీకు .నాకెందుకో ఇందులో పిల్ల నువ్వే అనిపించేసింది మరి .

జట్టిజాం పాట
ఖరహర ప్రియ స్వరాలు-ఆది తాళం


అతడు ---తుమ్మెదలున్నయ్ యేమిరా-
దాని కురులు
కుంచెరుగులు పైన -
సామంచాలాడేవేమీరా

ఆమె --ఏటికి పోరా -సేపల్ తేరా
బాయికి పోరా -నీళ్ళూ తేరా
బండకేసి తోమరా మగడా
సట్టీకేసి వండర మగడా
సేపల్ నాకు -శారు నీకూరా
ఒల్లోరే మగడా !బల్లారం మగడా
బంగారం మగడా ..ఆహా
శాపల్ నాకు శారు నీకూరా

కూలికి బోర -కుంచెడు తేరా
నాలికి బోరా -నల్దుం తేరా
వత్తా పోతా -కట్టెల్ తేరా
కట్టం నీకు కమ్మల్ నాకూ రా
ఒల్లోరే మగడా !బల్లారం మగడా
బంగారం మగడా ...
కట్టం నీకు -కమ్మల్ నాకురా

రోలూ తేరా -రోకలి తేరా
రోటికాడ్కి నన్నెత్తుకు పోరా
కులికి కులికి దంచరమగడా
శాటలకేసి సెరగర మగడా
శాటలకేసి సెరగర మగడా
బియ్యం నాకు -తవుడు నీకూరా
ఒల్లోరే మగడా !బల్లారం మగడా
బంగారం మగడా
బియ్యం నాకు- తవుడు నీకూరా

రెడ్డీయేమో దున్నను పాయె
రెడ్డిసాని ఇత్తను పాయె
నాల్గు కాళ్ళ కుందేల్ పిల్ల
నగతా నగతా సంగటి తెచ్చే
సంగటి నాకు- సూపుల్ నీకూరా
ఒల్లోరే మగడా !బల్లారం మగడా
బంగారం మగడా
సంగటి నాకు సూపుల్ నీకూరా

లక్ష్మి నిజానికి నీ కామెంట్ చూసాక చాలావిషయం చాలా కష్టపడి రాసా .కానీ అస్సలు నచ్చలా .అందుకే అది డిలీట్ చేసి ఇది పెట్టా .ఉత్తినే అన్నాఇందులో పిల్ల నువ్వనిపిస్తున్నావ్ అని . కానీ 100 % ఈ పాట మగ వాళ్ళు అల్లిందే .. కదా లక్ష్మి .మనం మనకు లేకున్నా ఎదుటి వారికి పెట్టాలంటాం కదా ! మళ్ళీ నీకు నీ కూతురు సూర్య సావిత్రి మానస గాయత్రికి మ.ది .సు .కాం . అన్నట్లు అమ్మి.. పోస్టును కాంక్షిస్తున్నాం అనరేమో ఆశిస్తున్నాం అంటారేమో.