మీ పిల్లలు మీ పిల్లలు కారు. వాళ్ళు జీవితేచ్చకు జన్మించిన వాళ్ళు . వాళ్ళు మీ ద్వారా వచ్చారు తప్ప మీ నుండి కాదు . వాళ్ళు మీతో ఉన్నా మీకు చెందరు .మీరు వాళ్ళతో ఉండాలని ప్రయత్నిస్తే ప్రయత్నించారు గాక, వాళ్ళు మీలా ఉండాలని మాత్రం అనుకోకండి. ఎందుకంటే జీవితం వెనక్కు మళ్ళదు గనకా, నిన్నటితో మళ్ళీ అతుక్కుపోదు గనకా ..ఖలీల్ జిబ్రాన్

రంగు రంగుల పాటలు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
రంగు రంగుల పాటలు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

27, మే 2012, ఆదివారం

నీ పేరే ఎంతందం ...!

డుం ..డుం ..డుం  మూవీ నేనూ పాపాయి వా ళ్ళ నాన హైదరాబాద్లో చూశాం .ఎంఫిల్ లో ఉన్నాననుకుంటా అప్పుడు .జ్ఞాపకం లేదు. 

 ఈ పాట చాలా గుర్తొస్తూ వుండేది.ఒక సారి ఎక్కడ నుండో వచ్చి హాస్టల్ లో రూం తాళాలు తీస్తూ వుండినాను .వింగ్ కి  అటు చివరి నుండి ఎవరో తమిళ్  లో హం చేస్తూ వుండినారు .వెళ్లి  ఆ అమ్మాయిని పరిచయం చేసుకుని పాడించి విన్నాను.చాలా సార్లే ఆ పిల్లని పాడమని పీడించే దాన్ని .

ఆ తర్వాత చాలా సార్లు జ్ఞాపకం వచ్చేది .గత ఏడాది నా తమ్ముడు డౌన్ లోడ్ చేసిచ్చాడు.రాత్రి ఎవరో ఏదో పాట  పంపించ మని అడుగుతే వెదుకుతుంటే ఇది దొరికింది .

కొన్నింటిని ఎందుకు అంత ఘనం నచ్చాయని అడుగుతే చెప్పలేం .ఈ పాట  కూడా అంతే విపరీత ఇష్టం నాకు.పాట
మొదట్లో వినిపించే ఇన్స్ట్రుమెంట్ బిట్ ఎన్ని సార్లు విన్నా పిచ్చెక్కిస్తుంది .

 ఇట్లా బ్లాగ్ లో దాచుకుంటే  కావల్సినప్పుడంతా వినడానికి అందుబాటులో వుంటుంది కదా !

సంగీతం  కార్తీక్ రాజా 





                       

29, జూన్ 2011, బుధవారం

మంచి వాన పాట ఒకటి ...!







మొన్న నా పీ హెచ్ డీ వైవా కోసం హైదరాబాద్ కి ప్రయాణిస్తుంటే చివరి వరకూ నాకు తోడు వచ్చిన పాట ఇది .వింటూ వింటూ వింటూ వెళ్లాను .విమల కంటమంటే నాకు ఇష్టం .మొదట అందుకోసం పాట వింటాను .ఆ తరువాత అందులో సాహిత్యం .

ఆవిడ కంటం''ప్రజల కోసం గజ్జె కట్టి ఆడే ''ఆవిడలానే సున్నితంగా ఉంటుంది .దృడంగా ,ధైర్యంగా ,వెరపు ,బెరకు లేక అతి స్పష్టం ఉంటుంది .వింటూ ఉంటే ..వింటూ, వింటూ ఉంటే విమలక్కా అని పిలుద్దామనే ఆప్యాయత వేస్తుంది .


పొద్దున్నే ఏదో విషయమై ఫోన్ చేస్తే స్నేహితుడు,ప్రయాణం చేస్తూ చేస్తూ ఉన్న వాడు , కదిలించ గానే ''ఆడుదాం డప్పుల్ల దరు వెయ్ ర''అని మురుసుకుంటూ పాడాడు .విన గానే ఎందుకనో చప్పున పెద్ద దిగులొకటి కమ్మేసింది ..ఇప్పటికీ ఉదయం కమ్మిన ఆ దిగులు మేఘం ఉండి ఉండి కురుస్తూనే ఉంది.



వానొచ్చేనమ్మ వరదొచ్చేనమ్మ

వానతోపాటుగా వణుకొచ్చేనమ్మ

కొట్టాముపై రాలి మట్టంత కడిగింది

కోడి పుంజు జుట్టు కొంటెగా తాకింది

చెట్ల కురులపై బొట్లు బొట్లుగా రాలి

గట్ల కుండల మీద గందమై పారింది

దున్న పోతులనేమో దుంకు లాడించింది

బర్ల మందలనేమో సెర్లలోముంచింది

గద్ద గూటి లోని గడ్డీని తడిపింది

గువ్వా గూటిలోని గులక రాళ్ళని జరిపింది

తీతువు గొంతును తియ్యగ జేసింది

పరికి పిట్ట ముక్కు పాసిని కడిగింది

ఎద్దు మూపురాన్ని ముద్దాడి మురిసింది

ముళ్ళు గర్ర వళ్ళు సల్లగ జేసింది

కొత్త నీటితో వచ్చి కోనేట్లో చేరింది

పచ్చని నాసుని పలగ జేరేసింది

చేపకేమో నీటి పులుపుని దాపింది

కొంగకేమో విందు కోరికని రేపింది

కప్పల పండగ కండ్లారా జూసింది

తాబేలు పెండ్లికి తల నీరు పోసింది

యెర్ర భూముల నెర్రెలన్నీ పూడ్సినాది

రేగడి నేలను మాగాణి జేసింది

తువ్వా గడ్డలల్ల కవ్వాతు జేసింది

సౌడు భూముల జూసి దౌడు తీసినాది

పొంగేటి కల్లుల పోసింది చన్నీళ్ళు

ఈత సెట్టు లొట్టి మూతి కడిగింది

తాను రాక ముందే తూనీగల లేపి

తన పాటకే తాను దరువేసి ఆడింది

తెల్ల మల్లెనింక తేటగా జేసింది

యెర్ర మల్లెనే కడిగి ఎరుపునే పెంచింది

తులసమ్మ దీపము చిప్పలో చేరింది

నీరెండ పులుపుకు నిగ నిగ లాడింది

పారాడి పారాడి గోదారిలో కలిసి

సీతమ్మ పాదాలు శిరసొంచి తాకింది

వంకలు డొంకలు వనములన్నీ తిరిగి

కృష్ణమ్మ వడిలోన ఇష్టంగా ఆడింది

దున్దుభీ తల పోసి దుమ్మంత కడిగింది

అందమైన ఇసుకను అద్దంలా జేసింది

ఇష్టమే లేకున్నా పట్నానికోచ్చింది

ముక్కు మూసుకొని మూసీలో మునిగింది

యములాల రాజన్న వేడుక జూసింది

ముందింటి కోయ్నాక మైల కడిగేసింది

సూఫీల దర్గాల సుట్టు దిరిగీ మొక్కి

ఎగిరే దక్కిల కేమో ఎండీ మెరుపద్దింది

రావి ఆకుల నుండి రాలి పడి రాలి పడి

సాధుల సామాది సన్నిధికి చేరింది

అమరూల స్థూపానికి అభిషేకమూ జేసి

సుత్తీ కొడవలి మీద ముత్తేమై మెరిసింది .

[రెండు మూడు పదాలు అర్థం కాలేదు .తప్పులు పడి ఉండచ్చు .]

27, మే 2011, శుక్రవారం

జీవితమే సఫలమూ.....!


Get this widget | Track details | eSnips Social DNA


అప్పుడెట్టుండెనో చిత్తమయ్యో యెఱగనైతి
చెప్పుడుమాటలకే నే జేరనైతిగా

కొసరికొసరి నీపై కోపమున నుంటిగాని
అసమిచ్చి నీతో మాటలాడనైతిగా
పసలేని సిగ్గుతోడి పంతాననే వుంటిగాని
ముసిముసి నవ్వు మోవి మోపనైతిగా

విరహపు కాకల నావిసుపే చూపితిగాని
సరిబిల్చితే నూకొన జాలనైతిగా
వరుసవంతులకై నే వాదులాడితి గాని
మురిపేన మొక్కితే నే మొక్కనైతిగా

వేగమే నీవు గూడితే వెస భ్రమసితిగాని
చేగలనీమేను పచ్చిసేయనైతిగా
భోగపు శ్రీవేంకటేశ పోట్లదొరతిలోన
నీగతి చెన్నుడవైతే నెనసితిగా

రెండు వారాల క్రితం స్నేహితురాలు ఫోన్ చేసింది T T D వారి అన్నమాచార్య సంకీర్తనల సమ్మర్ కాంప్ జరుగుతుంది.రాకూడదా... మీరు ఇక్కడ ఉన్న నెలలో పాపాయికి నాలుగు పాటలన్నా వస్తాయి కదా అని .పొద్దుటే వెళ్లి ఒక గంట పాటు పాడుకుని వస్తుంటే ఎంత సంతోషంగా ఉందో.జీవితంలో ఆనందం తప్పించి మరేమీ లేని కాంతివంతమైన అనుబూతి .

వదులుగా అల్లుకున్నజడలో బొండు మల్లెలు తురుముకుని వచ్చే డాన్స్ టీచర్ ,చిన్ని కూతురికి తోడుగా వచ్చే అందమైన అమ్మ , కారణం ఏదయితేనేం బోలెడు కాలం తరువాత రోజూ ఒకరినొకరం చూసుకోగలుగుతున్న నేను నా స్నేహితురాలు ,ఇంటికొచ్చి'' జగడపు చనవుల జాజర''.. అనో ''అమ్మమ్మ ఏమమ్మ అలమేల్ మంగ నాంచారమ్మ '' అనో పాడేసుకుంటూ ఉంటే,,, దిగులూ వ్యసనమూ ఉండదమ్మ నీకు అని మురిసే మా నాన..

జీవితం ఎంత బాగుంది ....జీవితం ఎంత బాగుంది .హాయిగా తీయగా ఆలపించు పాటలా ,అనారు పూల తోటలా ...ప్రశాంత సాంధ్య వేళలా...జీవితం ఎంత బాగుందో ...ఈ ఎండల వేళల మా ఊరి వీధులను పసుపు వర్ణ భరితం చేసే తీయటి ఉలవ పాటి మామిడి పళ్ళలా ...జీవితం తీయ గా అనిపిస్తుంది.

''నీ వలన తప్పే లేదు మరి నీరు కొలది తామెరవు ;ఆవల బాగీరదీ దరి ఆ జలములే ఊరినయట్లు'' ...''ఎంత మాత్రము ఎవ్వరు తలచిన అంత మాత్రమే నీవు ''అట. ఎంత అద్భుతమైన భావన ,''అంతరాంతరములెంచీ చూడ పిండంతే నిప్పటి యన్నట్లు ..''ఎంత సరళమైన పదాలు ఎంత గాఢమైన తాత్వికతకదా .

వేంకటేశ్వరుని పైన కదా అని భక్తి భావం కాదు సంగీతానికి ఆ శక్తి ఏదో ఉంటుంది .ఆండాళ్ తిరుప్పావై వినండి అలాటిదే మరోదేదైనా వినండి .భక్తి కాదు. భాష తెలియకున్నా ఉదాత్త భావాలేవో మనలో ప్రవేసిస్తాయ్ .ప్చ్ అద్భతమైన వాటికి మనం మతాల కులాల రంగులు పులిమేస్తాం కదా ...

ఒక్కో వ్యక్తికి ఒక్కో మోహం ఉంటుంది కాబోలు నాకు అట్లా సంగీతం ఓ పిచ్చి .కానీ సంగీతానికే నా పై దయ లేదు . పాడుకుంటూ ఉంటే స్నేహితురాలు ముని పంటితో నవ్వుని అదిమేసి ఎంత ముద్దుగా పాడుతావో నీ పాటల్లో ఫీలింగ్ మాత్రమే ఉంటుంది, ఇంకేమీ ఉండదు...అని అంటుంది సరదాగా .

మనం కోరుకున్నది పొందలేక పోయినంత మాత్రాన దానిపై ఇష్టం పోదు కదా ! పోక పోగా ప్రేతంలా పట్టుకుని మనల్ని మరింత పీడిస్తుంది .దిగులు పెట్టేస్తుంది .యేడి పించేస్తుంది .ఎప్పుడో కంటమో, ఏ రాగమో, ఏ సాహిత్యమో ఎందుకో ఒక పాటై మన జీవితంలో ప్రవేసించేస్తుంది . ఇక అంతే ఇదీ అని వివరించలేని ఆరాటం .ఏం చెయ్యాలో తోచదు .ఘన సమయం అంతా ఆ ఒక్క పాట చుట్టే గిరికీలు కొడుతూ ఉంటుంది.

పాడుకుంటూ ఉంటే పాపాయో ,వాళ్ళ నానో మధ్యలో మాట్లాడిస్తారు .నేనింత తాదాత్మ్యం తో పాడుకుంటూ ఉంటే మాట్లాడిస్తారా ఎంత రస హీనులు అని గునుస్తే.. నీకు ఇరవై నాలుగు గంటలూ తాదాత్మ్యమే ...మరింక మేమెప్పుడు మాట్లాడాలి అని నసుగుతారు .కానీ ఎందుకిట్లా ఊపిరాడ నీయకుండా చేస్తుంది ఒక చిన్ని పాట అని దిగులు ...నాజీవితంపై ఇంత అదుపు ఏమిటి అని బెంగ !

ఇక్కడిచ్చిన పాట ఇంతకు మునుపు ఎప్పుడూ వినలేదు .పాడినావిడ ఎవరో తెలియదు ,పోసేసివ్ నెస్ తో కోపించి కలహించిన నాయిక పశ్చాత్తాపాన్ని హృదయంతరాలలో ని ఆర్తిని , ఎంత బాగా పలికించిందో ...

3, మే 2011, మంగళవారం

నీలోనె కొలువున్నోడూ ...!



పాపాయి
వాళ్ళ నాన దేసాటనకి వెళ్ళాడు .మధ్యలో ఫోన్ చేసి పలకరించాడు ఏం చేస్తున్నావ్ అని ....ఏం చేసాను ,పలకరించే నాధుడు లేక , రోజంతా ఒక పాట వింటూ గడిపాను .ఏం చేస్తున్నా హెడ్ ఫోన్స్ తీయకుండా గడిపాను . పాటని కూడా కేవలం రెండు వాక్యాల కోసం విన్నాను .అందులోను రెండో వాక్యం కోసం మరీ విన్నాను .... రెండో వాక్యం ''నీలోనే కొలువున్నోడు ..నిన్ను దాటి పోనే పోడూ..!మొదటి వాక్యం ''లోకాలనేలేటోడు నీకు సాయం కాక పోడు ''.పాట సదా శివ సన్యాసి తాపసి కైలాస వాసీ.. .''


శివ పార్వతులు వివాహానంతరం అస్సాం ప్రాంతం లో విహరించారట అందుకే ఆ ప్రాంతాన్ని కామ రూప దేశమని అంటారట . కామాఖ్య మందిరం నుండి వస్తున్నపుడే అనుకుంటా మొదటి సారి ఈశ్వరుడు నా ప్రశ్నల పెద్ద పెట్టెలోకి చేరాడు .ఎలాంటి వాడై ఉండొచ్చు అతను ?ఒక రాజ పుత్రిక ,స్మశాన వాసిని ,సర్ప ధరుడిని ,బిక్షుకుడిని ,కట్టు బట్ట లేని వాడిని ఏం చూసి ప్రేమించి ఉండొచ్చు ?సహచరిని పాదాల పాల చేయని అతని సంస్కారపు మూలాలేవి ?భార్యే కదా ,ప్రియురాలు కూడా కాదు కదా ,అయినా సతి మృత శరీరాన్ని చూసి అతను ఎందుకలా విలయ తాండవం చేశాడు .

[నా స్నేహితురాలి తండ్రి అరవై ఏళ్ళ వయసులో ,భార్య మరణించిన ఐదు నెలలకే ,పునర్వివాహం చేసుకున్నాడు .ఇంటికొస్తే అన్ని ఉడుకు నీళ్ళు పెట్టించే వాళ్ళుంటే బాగుంటుంది కదా అన్నది ఆయన ఆలోచన . వేడి నీళ్ళకే ఐతే గీసర్ పెట్టించుకుంటే సరి పోదా అని జోక్ చేసాడు నా తమ్ముడు . ముగ్గురూ కూతుర్లే.ముగ్గరూ మాట్లాడటం మానేశారు .మా అమ్మని అంత త్వరగా మరచి పోయాడా మా నాన అని ...జ్ఞాపకాలు బ్రతికి ఉంటే మనిషి మరణించనట్టే .అవే లేనపుడు ఐదేళ్లకి ఐదు నెలలకి తేడా ఏముంటుంది .]

ప్రియత్వాన్ని అర్థ నారీశ్వరత్వంగా మలచిన ప్రేమౌన్నత్యం అతనికి ఏ దేవి వరం ?ఇంతలా స్త్రీని గౌరవించిన మరో భగవంతుడు ఏ చరిత్రలోనైనా ఉన్నాడా?యౌవనంలో ఉన్న భార్య పట్ల భాద్యతను విస్మరించి దొంగలా పారి పోయిన బుద్దుడిది స్వ సుఖ వాదం కాదా ?ప్రేమించే భార్య.. అడిగి ఉంటే అర్థం చేసుకుని అనుమతించక పోయేదా ?


అయినా మనం శివుడి ప్రేమ స్వరూపాన్ని చెప్పుకోవాల్సినంతగా చెప్పుకోం కదా .బహుశా శివుడు PR విషయంలో శ్రద్ద పెట్ట లేదేమో . ప్రచారం లోనే అన్నీ ఉన్నాయిష! ' గురు ' లు చెప్తున్నారు . అప్పుడు కూడా అదే సూత్రం మనుగడ సాగించి ఉంటుంది .శివుడి జీవితంలో ఏ గంగలు మంగలు ఉండి ఉండరు అవంతా ప్రక్షిప్తాలు. కావాలని వేసిన మచ్చ .నేను నమ్మడం లేదు .శివుడి గురించి ..రోమిలా థాపర్ నొ మరోకరిన వెదకాలి బద్దకాన్ని వదిలించుకుని .

ఎంత చిన్న వాక్యం కదా నీలోనే కొలువున్నోడు నిన్ను దాటి పోనే పోడు అనడం .కొలువై వున్నది మనలోనే అయితే మన అనుమతి లేకుండా దాటి ఎలా పోగలడు.దాటి పోయానని తను అనుకున్నా ఉన్నాడని మనం అనుకున్నంత సేపు అతను బంధీనే కదా ...కాదంటే మనం బంధీలం. రెండూ ఒకటే సూక్ష్మంగా చూస్తే .

మొన్నో రోజు స్నేహితురాలు ఏదో రాగం చెప్పింది .ఇప్పుడు జ్ఞాపకం రావటం లేదు .పాడుతుంటే చాలా సార్లు ఏడుపొస్తుంది అన్నది .పాడుతుంటే కాదు కానీ ..దుక్కపు తుఫాను గాలులు అల్ల కల్లోలం చేసేసిన ప్రతి సందర్భం లోను నేను ఆస్రయించేది త్యాగరాయ ''నగు మోము గనలేని '' కీర్తన . పాడుకుంటూ ''ఖగ రాజు నీ ఆనతి విని వేగ చన లేదో గఘనానికి ఇలకూ బహు దూరంబని నాడో '' అన్న వాక్యాల వద్దకు చేరితే చాలు మనసు మూల మూలలా ఊరుతున్న కన్నీటి చెలమలన్నీ కలుసుకుని పొంగి పొరలుతాయి. తడిసి అలసిన కాసేపటికి మనసులోకి ప్రశాంతత తోసుకొచ్చేస్తుంది.అదే తనతో చెప్పాను ,ఆశ్చర్య పడుతూ తనన్నదీ ..సరిగా వాక్యాల వద్దే నాకూ సేమ్ ఫీలింగ్ కలుగుతుంది ఎందుకలా అని .బహుశా త్యాగ రాయ స్వామి పదాలను ఒక రాగంలో పొదిగినప్పటి నుండీ ,అలా ఎంతో మందికి కీర్తన ఓదార్పునిచ్చి ఉంటుంది .

కీర్తనకి ఉన్న శక్తి అంతా అద్భుతమైన ప్రేమ భావన నుండి ఉద్భ విన్చిందే . ఎంత ప్రేమ ఉండాలి అలా అనుకోవాలంటే ...నగు మోము చూప రాని భగవంతుడ్ని ఒక్క మాటా అనకుండా ,ఖగ రాజు నీ ఆనతి విని కూడా త్వరగా ఎగర్లేదేమో..పైగా ఆకాశానికి, భూమికి చాలా దూరం కదా అనేసాడేమో ....లేక పోతే నువ్వు రాటం ఇంత ఆలస్యం ఎందుకవుతుంది అని నెపాలు ఇతర్లు మీద పెట్టేస్తున్నాడు .ఎంత ప్రేమ ఉండాలి అలా అనుకోవాలంటే .

మరుగేలరా రాఘవా కూడా అంతే ,,,అన్ని నీవనుచు అంతరంగమున తిన్నగా వెదకి తెలిసికొంటినయ్య ..అంటూ నన్ను బ్రోవమని ప్రాదేయ పడటంలో ఎంత నిరహంకారత ఉంది !బహుసా ప్రేమకి సర్వం సమర్పయామి భావం కావాలేమో .అన్నీ వదిలి,, నిన్నె గాని మదినీ ఎన్న జాలనొరులా అని ప్రకటించాలేమో.కానీ అలా ప్రకటించేసిన తరువాత భక్తుడంటే భగవంతుడికి బోర్ కొట్టదా?సర్లే వెల్లోచ్చులే నిదానంగా , ఏమనుకోడులే భక్తుడు ,ఒకవేళ అనుకున్నా ఖగ రాజుని అంటాడు కానీ నన్ను అనడులే అనేసుకోడా ?.

ఏమో నాకు భగవంతుడి పట్ల కూడా ,తమల పాకుతో నువ్వొకటంటే తలుపు చెక్కతో నేనొకటి అంటాననే భావమే ఉంటుంది .అలా అనుకుంటే భగవంతుడురాడా ?.ఎందుకు రాడు వస్తాడు !.నిర్లక్ష్యం చేయక రమ్మన్నప్పుడు చక్కగా క్రమశిక్షణతో సమయానికి వచ్చేస్తాడు .సర్వం సమర్పించామని చెప్పక్కర్లేదు .భగవంతుడు కదా పెంకి ప్రేమల్ని కూడా కనుక్కుంటాడు !.

24, ఏప్రిల్ 2011, ఆదివారం

రంగు రంగుల పాట !




ఒక పాట విన్నప్పుడో ,ఒక పుస్తకం చదివినపుడో ఎలా అనిపించాలి ?బహుశా ...నిర్లిప్తపు శ్వేత వర్ణం ఫటిల్లుమని చిట్లి ,పలు రంగుల ఇంద్ర చాపం మనని ఆవహించాలి .సుకుమారపు జిల్లేడు విత్తనం ,లక్ష్యం లేని గాలితో లేచి పోయినట్టు మనసుకి పిచ్చెక్కి పోవాలి .చూస్తూ చూస్తూ ఉండగానే హృదయం మసక బడి అలవి కానీ కుంభ వృష్టి కురిపించెయ్యాలి.బతుకు నీలిమ లో పున్నమి పూలు పూయాలి .నీకు నువ్వు దొరకక నువ్వెవరివో అయి పోవాలి .ఒక పుస్తకం చదివినప్పుడో ,ఒక పాట విన్నప్పుడో ఆ కాగితమో, ఆగొంతో ...దెయ్యంలా పట్టి పీడించాలి.వదిలించుకోలేక పొగిలి పొగిలి ఏడవాలి .ఓటమి పాలై ఆ పాద పద్మాలపై పడి లయమవ్వాలి .

జాన్ డెన్వర్ ఈ పాట ,అలాటిదేదో చేస్తుంది .ఆత్మని పీడిస్తుంది .వింటుంటే మీ ఊరి దారి మిమ్మల్ని పిలుస్తుంది ."థాంక్ గాడ్ అయామే కంట్రీ బాయ్ ''అని ఇంకో పాట ఉంది అదీ వినండి .మీరు పల్లెటూరి వారయితే తప్పక థాంక్ గాడ్ !అనుకుని తీరుతారు .whisper of the heart అని జపనీస్ మూవీ ఒకటుంది .యానిమేషన్ .ఆ సినిమా పొడుగూతా ఈ పాట వినిపిస్తూ ఉంటుంది .జపనీయుల భాషలో కూడా .సినిమా కూడా బాగుంటుంది .హాయో మియజాకి స్క్రీన్ ప్లే .
Take Me Home, Country Roads

Almost heaven, West Virginia, Blue Ridge Mountains, Shenandoah River.
Life is old there, older than the trees, younger than the mountains, blowing like a breeze.
Country roads, take me home to the place I belong.
West Virginia, mountain momma, take me home, country roads.

All my memories gather round her, miner’s lady, stranger to blue water.
Dark and dusty, painted on the sky, misty taste of moonshine, teardrop in my eye.
Country roads, take me home to the place I belong.
West Virginia, mountain momma, take me home, country roads.

I hear her voice in the morning hour she calls me, the radio reminds me of my home far away.
And driving down the road I get a feeling that I should have been home yesterday, yesterday.
Country roads, take me home to the place I belong.
West Virginia, mountain momma, take me home, country roads.
Country roads, take me home to the place I belong.
West Virginia, mountain momma, take me home, country roads.

11, ఏప్రిల్ 2011, సోమవారం

బెంగాల్ దేశపు సంత -గోరటి వెంకన్న పాట !

<

కిటికీలో నుండి కనిపిస్తున్న కటిక చీకటిని చూస్తూ నా భర్త ,నా జ్ఞాపక శక్తికి పరీక్షపెడ్తూ ''సక్కనైన చిక్కని రాత్రి ''పాటలోని చీకటి వర్ణనని గుర్తు చేయమని అడిగాడు ,యదావిధిగా నాకు జ్ఞాపకం రాలేదు .మొబైల్ తీసి ఆ పాట ఆన్ చేసాడు , పాట తరువాత ఈ ''సంత మా ఊరి సంత ''పాట మొదలైంది .చీకటిలో ఆత్మలు, శరీరాల ఉనికిని మరచి పోతాయి కాబోలు ,ఎన్నో సార్లు విని వున్నా ఈ సారి ఈ పాట కొత్తగా తోచింది .. బెంగాల్కి రావడానికి ముందు నాకు సంతని చూసిన అనుభవం ఎప్పుడూ లేదు. బెంగాలీలో సంతని'' హాట్ ''అంటారు .ఇక్కడ ప్రతి ప్రాంతం లోను సంతలు జరుగుతాయ్. శనివారం సంత ..బుధ వారం సంత అంటూ వారాల పేర్లతోనో,మధుర హాట్ అంటూ ఆయా ప్రాంతాల పేర్లతోనో .

మేమున్న ఈ కూచ్ బీహార్ ప్రాంతంలో తేయాకు తోటలు ఎక్కువ .తేయాకు తోటల కూలీలకి వారానికో సారి, కూలీ డబ్బులు చేతికొస్తాయి .వారి కోసమని ఆ రోజుల్లో సంత నడుస్తుంది . దీనిని ''బగానేర్హాట్ '', లేదా '' తోలపెర్ హాట్ ''అంటారు .వారపు కూలి డబ్బులతో ఇక్కడికి వచ్చిన వీరు కొని ,తిని ,తాగి ఇళ్ళకు వెళ్తారు .ఈ సంతలకి పట్టణ ప్రాంతపు సంతలకి ఉన్న ముఖ్యమైన తేడా.. మధువు దొరకడం ,దొరకక పోవడం .

బహుశ ఇవాల్టి షాపింగ్ మాల్ ల వెనుకనున్న మూల సూత్రం ఇదేనేమో .మొదటి సారి నాకు అడుగడుగునా జీవం తొణికిసలాడే సంతని చూడగానే, ఒక మినీఏచర్ జీవనదిని చూసిన అనుబూతి కలిగింది .ఇంకా మానవీయ ప్రపంచంలోనే జీవిస్తున్నాననే నమ్మకం కలిగింది .సంతోషం వేసింది .అంతలోనే ఆ నమ్మకాన్ని చెదరగొడుతూ జర్మనీ, మెట్రో కాష్ అండ్ క్యారీ కి బుద్ద దేబ్ బట్టాచార్య పలికిన ఆహ్వానం గుర్తు వచ్చి దిగులువేసింది .

మనమివాళ గ్లోబలులం కదా .అనంత హస్తాల మార్కెట్ ఈ సంత మానవీయతని మింగి వేయకుండా ఎన్నినాళ్ళు ఆగుతుంది ??.బహుసా అది ఎంతో దూరం లో లేదనుకుంటా !ఇవాళ కనిపించే ఈ సంత రేపు మనకు ఓ పురాతన జ్ఞాపకం కావచ్చు ! గోరటి వెంకన్న ఈ పాటని వింటున్నప్పుడు ఎన్ని సార్లుఅనిపించేదో , ఎంత జీవితాన్నచెప్తున్నాడో ఈ కవి అని .

పూర్తిగా కాకున్నా, ఈ పాటలోని జీవితం నాకు అపరిచితం .అయినా కవి ,నన్ను ఎన్నెన్ని సార్లు ఉద్వేగపరిచాడో .పుట్టినూరోల్లోస్తే పట్టుకుని ఏడ్చిన కొత్త కోడలి కన్నీటి చెమ్మ ,విన్న ప్రతి సారి హృదయాన్ని తడుపుతుంది .కందూరు జానమ్మ కోపం ,సంతలో సంసారమంతా బయటేసుకుని ,ఇంటికెళ్ళే ముందు ఒక్కటయ్యే మొగుడూ పెళ్ళాల వైనం ముచ్చట గొలుపుతుంది ..''

కల్లు దుకునంలో కలిసి, తాగి ,తిని,వరుస గలుపుకొని వియ్యమందానీకి తయ్యారయ్యే ''లౌక్య రాహిత్యపు సామాజికతముందు, ఆడంబర ప్రదర్శనల మన సోషలైట్ పార్టీలు వెల తెల బోయి తల వంచుకుని కనపడతాయి .రవీంద్రుడు సంత పైన ఒక పద్యం రాసాడు .అదీ ఇక్కడ ఇస్తున్నాను.నాకు అర్థమైనంత మేర ప్రతి లైన్ క్రింద దాని అర్థాన్ని ఇచ్చాను .

రవీంద్రుడి సంతలో రోమాన్టిసిసం మాత్రమే కనిపిస్తుంది .గోరటి పాటలో జీవితపు అన్ని పార్శ్వాలు కనిపిస్తాయి .పాటచివర వినబడే చెంచు బీసన్నని బలిగొన్న, మొండి కర పత్రపు వైనం ఆశ్చర్యపరుస్తుంది .ఎలా చెప్పగలిగాడీ కవి ఇంత బండ, నగ్న సత్యాలని ఇంత సరళసున్నితంగా అని అబ్బురమేస్తుంది .

పాట పూర్తయ్యేసరికి ''గొంతు పిసికేసిన గోసలా రాజ్యం '' మనల్ని భయ పెడ్తుంది. ''సితికిన బతుకుల సంత'' ఆపుకోనీయకుండా ఏడిపించి వదుల్తుంది.ఇంత అద్భుతాన్ని కనుల ముందు ఆవిష్కరించిన... ఈ రాపు గొంతు ,మేధో కవి గాయకుడ్ని ఎంత కీర్తిస్తే మాత్రం సరిపోతుంది !

సాహిత్యం చదవండి
సంత మా ఊరి సంత -వారానికోసారి జోరూగా సాగేటి
సంత -మా ఊరు సంత
సుట్టు ముప్పై ఊర్ల పెట్టు జనమందరూ
పుట్ట పగిలి సీమలోచ్చినట్లోస్తారు
సోర సోరోల్లంత కాలి దారిలోన
తరిమినట్టు గుంపు పరుగుతోనొస్తారు
సేతగానోల్లంత పాత జీపులల్ల
కుక్కినట్టు ఎక్కి కూలవడొస్తారు
పెండ్లికోయినట్టు బండ్లు కట్టుకొని
కాపుదానపోల్లు ఆప కుండోస్తారు
కాయగూరల తట్ట ఆకు కూరల కట్ట
తమలపాకుల బుట్ట తంబాకు పొడిమట్ట
మిరపకాయల ఘాటు వొట్టి చేపల
అల్లమెల్లిపాయ కుప్పుకగ్గువ రేటు
సంత ముందరి బాట సాలె బట్టల మూట
హర్రేకుమాలని అరిసె బతుకు పాట
ఎండ తాపం చేత ఎగ పోసు కుంటోచ్చి
గోలి సోడాను జూసి కాళ్లాగి పోతాయి
పట్టుమాని మూరడెత్తు కూడా లేని పోరడు
సిత్రంగా గోళి సోడా కొడతాడు
రూపాయికే మంది
బిస్లరమ్మేటోడు సేటు బిత్తరపోతాడు

ఒట్టి రోజూ పిండగిర్ని సుబ్బయ్య సేటు
తోవ్వంటి పోయేటొల్ల పిలిసి ముచ్చట పెట్టు
సంత రోజెవ్వడన్న ఊకే పలకరిస్తే
కరిసినట్టు జూసి కయ్యిన లేస్తాడు
పిండి పట్టి పట్టి తిండి ధ్యాస మరిసి
సుబ్బయ్య ఆ పూట సుద్ద గుండోలుండు
తీరిక లేకుండ జల్లెడ తిప్పేటి
కందూరు జానమ్మ కారం గిర్నికి
కాయలెక్కువ తెచ్చి తక్కువాని జెప్పి
పొడి తక్కువొచ్చేనని పోట్లాటకొస్తుంటే
కండ్లల్ల ముక్కుల్ల ముండ్లు మొలసినట్టు
కందూరు జానమ్మ కళ్ళెర్ర జేస్తది బజ్జీలు బోండాలు కాల్చిన సీకీలు
మద్యాహ్నమే కల్లు దుకునానికోస్తాయి
కలిసి తాగి తింటూ వరస కలుపుకొని
వియ్యమందానీకే తయ్యారుగయ్యేరు
సంత కల్లు తోనే పిల్ల పెళ్ళి ఖాయం జేసి
పేరు బలమడుగుటకు నేరుగా పొయ్యేరు
తాగి పెండ్లం తోని తగవు వడతాడొకడు
తాగమని పెళ్ళాన్ని బ్రతిమిలాడుతడొకడు
సీరా బేరం కాడ సిన్న గొడవ జరిగి
అలిగిన పెళ్ళాన్ని అడుక్కుంటాడొకడు
సంతలో సంసారమంత బయటేసుకొని
ఇంటికొయ్యేముందు ఇద్దరొకటవుతారు సంత నాడు ఊరి డొంకల్ల వంకల్ల
జంటలు కొన్నేమో జత కూడుకుంటాయి
హద్దులు అదుపులు అన్ని గాలికొదిలి
వలసిన మనస్సులు ఒక్కటయి పోతాయి
దూరమయ్యిన గాని ప్రేమ మిగిలినోల్లు
వారం వారం సంత పేరుతో కలిసేరు
అమ్మానాయిన మీద బెంగా వెట్టుకున్న
అత్తింటికొచ్చిన కొత్త కోడలు పిల్ల
సరుకుల నెపంతో సంత కంటని వొచ్చి
పుట్టినూరోల్లోస్తే పట్టుకొని ఏడ్సు
చెల్లెలు తమ్ముని సేమమడిగినాక అమ్మను,
రమ్మాని చెప్పి రాగాలు పెడతది ఎనుకటోలె మంది ఎగబడి కొనకున్న
కుంకుమ దాశెన్న సంత కెంతందం
ఎక్కబత్తి చిమ్ని లెవరడగ పోయిన
పూసల రాజవ్వ మోసుకోనోస్తాది
అద్దాలు కాటుక అగ్గువ పౌడరులు
పడుసు పిల్లల జూసి మెరిసి పోతుంటాయి
కాశీ మజిలీ కథలు ,దాశరథి శతకాలు
ఈపూరి కీర్తనలు, యాగంటి తత్వాలు
అరవైయేండ్ల కింద అచ్చు వేయించిన చిరుతోండ
ప్రహ్లాద భక్త రామ దాసు యక్ష గానాలన్ని
యాడ దొరుకునో గాని బుక్క
బాలయ్యకు బువ్వ పెడుతుంటాయి సంత బజారంత తన సొంతమైనట్టు
తైబంది సిట్టోడు కల తిరుగుతుంటాడు
సరకులమ్ముక ముందే రుసుం కట్టమాని
మారు బేరపోల్ల ప్రాణాలు తింటాడు
తరుగింత పోతుంది వొరుగింత పోతుంది
బుట్ట దంద బువ్వకేడ సరిపోతుంది
సందులో సందని సంగెం నాయకులు
సంతలో సభ పెట్టి పంచిండ్రు పత్రాలు
సెట్ల మందులమ్మే సెంచు భీసన్నేమో
కర పత్రంనిస్తే కండ్ల కద్దుకుండు
వాడు రాత రానోడాయే గీత రానోడాయే పత్రముల
మందు పొట్లమే కట్టిండు అమ్మకు దమ్మని
దగ్గుతోందని జెప్పి ఐదు రూపాయల
ఆ మందు కొనుక్కొని
మందు కల్లు సీస ముందుగ గుద్దిన్ డో
మర్సిపోయి సంత వీధిలో పడుకుండు
అర్థ రాత్రి ఏదో ఆపదొచ్చినట్టు
బందబస్తు పేరా బలగాలు దిగినాయి
పడుకున్న పోరని పట్టి లేపినారు
ఊరడిగి పేరడిగి జేబులన్నీ తడిమి
కరపత్రమును జూసి కండ్లెర్ర జేసిండ్రు
తాగిన మత్తులో వాడేమి వాగిండో
సంతలో పోరని బతుకంతా జూసిండ్రు సందెవాలి సంత మందెంత వోయినంక
సందడాగి సంత సావిడోలె అవ్వంగ
సంతవీధి చివరి రాగి వృక్షము కింద
వొంటిగా నున్నట్టి ఓ సాధు బైరాగి
బేరాలు సారాలు సరుకుల బారాలు
లాభాలు నష్టాలు ఇష్టాలయిష్టాలు
మువ్వలు పువ్వులు నవ్వులు
నటనలు వలపులు తలపులు
అరుపులు గెలుపులు వింతలెన్నో జూపే
సంతలో ఆ రేయి ఏ వింత ఎరుగని
పసి పోరని వట్టి ప్రాణాలు తీసేటి
పాపి ఘడియలు గాంచి
"బతుకే ఓ సంత "యని పసి పాపలా నవ్వే రవీంద్రుడి హాట్
కుమోర్ పాడార్ గరూర్ గాడీ
కుమ్మరిపల్లె ఎడ్ల బండి
బోజాయ్ కరా కొలశి హాడీ
బండి నిండా మట్టి కుండలు
గాడీ చోలాయ్ బంగ్షీ బొదన్
బండి తోలే వాడు వంశీ వదన్
సంగే జే జోయ్ బాగ్నే మదన్
వెంట ఉన్న వాడు మేనల్లుడు మదన్
హాట్ బోషేచ్చే సుక్రోబారే
సంత జరిగేది శుక్రవారం
బక్షీ గంజే పద్మా పారే
పద్మా నది ఒడ్డునున్న బక్షీ గంజ్ లో
జినిష్ పత్రో జుటియె ఏనే
వస్తువ్లు సమకూర్చుకుని వచ్చేరు
గ్రామెర్ మనుష్ బెచే కేనే
పల్లె ప్రజలు అమ్మేందుకు కొనేందుకు
ఉచ్చే బేగున్ పోటోల్ మూలో
కాకర కాయలు వంకాయలు పొట్ల కాయలు ముల్లంగి బేతేర్ బోనా ధామా కులో
పేము బుట్టలు చేటలు
సర్సే చొళా మైదా ఆటా
ఆవాలు సెనగలు మైదా గోధుమ
సీతేర్ ర్యాపార్ నక్షా కాటా
చలి కోసం అల్లిక ల శాలువాలు
ఝాన్జ్రి కొడ బేడి హాతా
అప్పచ్చుల మట్టి కుండ ,బాణలి ,పట్టకార ,చేయి గంటి
సెహర్ తేకే సస్తో చాతా
పట్టపట్టణం నుండి చవక గొడుగులు
కొలసి బొర ఎకో గుడే
కుండ నిండుగా బెల్లం
మాచీ ఎతో బెరాయ్ ఉడే
బెల్లం చుట్టూ ముసురుతున్న ఈగలు
కోడెర్ అంటీ నౌకా బేయే
పడవ నిండుగా ఎండుగడ్డి
ఆన్లో ఘాటే చాసీర్ మేయే తెచ్చిన రైతు అమ్మాయిలు అందో కానాయ్ పథేర్ పారే
రోడ్డు పక్కన గుడ్డి కన్నయ్య
గాన్ శునియే బిక్ఖే కోరే
పాట పాడి బిక్షమేట్టుతున్నాడు పాడార్ చేలే స్నానేర్ ఘాటే
స్నాన ఘాట్ దగ్గర పల్లె పిలగాళ్లు
జొల్ చిటియే సాతార్ కాటే
నీళ్ళు చిమ్ముతూ ఈత కొట్టే