మీ పిల్లలు మీ పిల్లలు కారు. వాళ్ళు జీవితేచ్చకు జన్మించిన వాళ్ళు . వాళ్ళు మీ ద్వారా వచ్చారు తప్ప మీ నుండి కాదు . వాళ్ళు మీతో ఉన్నా మీకు చెందరు .మీరు వాళ్ళతో ఉండాలని ప్రయత్నిస్తే ప్రయత్నించారు గాక, వాళ్ళు మీలా ఉండాలని మాత్రం అనుకోకండి. ఎందుకంటే జీవితం వెనక్కు మళ్ళదు గనకా, నిన్నటితో మళ్ళీ అతుక్కుపోదు గనకా ..ఖలీల్ జిబ్రాన్

10, జనవరి 2013, గురువారం

అమ్మకి ఉత్తరం !

బొమ్మలో వున్నది సంచి తగిలించుకున్న పోస్ట్ మాన్ .



మా అమ్మాయిని వదిలేసి తప్పనిసరిగా వేరే ఊరికి వెళ్ళాల్సి వచ్చిందా ...అప్పుడు పాపాయి రాసిన ఉత్తరం ఇది .

పాపాయి చాలా మంచిది .బాధ కలిగినా ఓర్చుకుంటుంది కానీ, లొల్లి చేయదు .తను మరీ అంత పెద్ద దాన్నేమీ  కాదని తెలిసినా ,చాలా పెద్ద దానిలా బాధను భరించి శాంతంగా ,తనకేం కావాలో మృదువైన మాటల్లో చెప్తుంది.దేనికైనా అమ్మ కొంచెం బుంగ మూతి పెట్టుకుంటే చాలు ''అమ్మా నా మీదేమైనా కోపం వచ్చిందా ''అని పిల్లి పిల్లలా అమ్మ చుట్టూ తిరిగి అడుగుతుంది .కాదు బంగారు ఈ పుస్తకం అట్లా వుందీ అనో, మరోటో  అన్నామంటే అప్పటి నా మూడ్ కి అనుగుణంగా జాగ్ర్త్హత్తగా నడుచుకుంటుంది .

చిన్నప్పుడు నేనేమో మా అమ్మ కొంగు పట్టుకుని  వదిలే దాన్నే కాదు.పీజీ కి హాస్టల్ లో చేరినపుడు రోజూ ఫోన్ చేసి రోజూ ఏడుపు.అటు వైపు అమ్మ, ఇటు వైపు నేను ఆరున్నొక్క రాగం....ఇప్పుడు పాపాయిని  చూసి చూసి మా అమ్మ అంటుంది ఎంత అదృష్టం నాకూ పుట్టావు జగ మొండివి అని.

.అమ్మ తో ఎగతాళిగా  నేనంటానూ  ''నిజమే కదా అదృష్టవంతులైన అమ్మలకి బంగారు తల్లులు పుడుతారు మరి ''అని .

7, డిసెంబర్ 2012, శుక్రవారం

బై ...బోయ్ !!!

ఎడ్వర్డ్ ,రోసీ జోసఫీన్ లు భార్యా భర్తలు.యాంగ్లో ఇండియన్స్.వారిది ప్రేమ వివాహం .ప్రపంచం లో అత్యంత విఫల మానవ సంబంధం బహుశా ఆడ మగల వివాహమేనేమో  .

పునరుత్పత్తి కార్యం వలన ఆడవాళ్ళని అణిచి పెట్టి,ఆ పనిని  ఆడ వాళ్లపైకి తోసి ఇంటికి పరిమితం చేసి మగ వాళ్ళు తప్పు చేసారేమో .పాపం అందుగ్గానూ మగ వాళ్లకి ,ఈ ఆడవాళ్ళ నసపోటు భరించక తప్పదేమో .

దురదృష్ట వశాత్తు ప్రతి స్త్రీ ఒక నస మేళమే. చిరాగ్గా .మా ఆయన తాగుతాడు,[నువ్వూ తాగు .లేదంటే చూస్తూఊరుకో ] మా ఆయన వాళ్ళింటి వాళ్లకి డబ్బులిస్తాడు.[వాళ్ళింట్లో వాల్లకి కాదు ,మా ఇంటి వాళ్లకి ఇవ్వాలని ఉద్దేశం ]మా ఆయన ఇంకో స్త్రీతో ముచ్చటిస్తాడు [అక్కడికి స్త్రీలందరూ ఏదో ఆవిడ గారి  హీరో కోసం బారులు తీరి వున్నారన్నట్లు ]చిరాగ్గా ఇవే మాటలు.ఏ వివాహిత స్త్రీని కదిలించినా ఇవే.

వీల్లెందుకు చదువుకోరు.కుట్టు పని చేయరు.మంచి పనులు  నేర్చుకోరు.చిరాగ్గా మగడు అనే ప్రాణిని పట్టుకుని వేధిస్తూ ఏడుస్తూ వుంటారు,అసహ్యంగా అని చీదర పుడుతుంది.ఆ చీదరనంతా అణుచుకుని సమాజమూ ,మానవ ,ఆర్ధిక సంబంధాలను గుర్తు తెచ్చుకుని ఈ ఆడవాళ్ళతో మాట్లాడాలి.వీళ్ళు ఫోన్లు చేస్తే లిఫ్ట్ చేసి సొద  వినాలి.

మొన్న కూడా పాపాయి వాళ్ళ టీచర్ చెప్పిన ఏడుపు కథనీ ,ఏడ్చిన ఏడుపునీ భరించి సహించ వలసి వచ్చింది.అసలు వీళ్ళందరికీ నన్ను చూస్తే బాధలు చెప్పుకోవాలనిపించే తనం నాలో ఏముందనే ప్రశ్న ప్రతి క్షణం వేధిస్తూ వుంటుంది .

రోసీ తన బాధ చెప్పడం కాక పాపాయిని కూడా అందులోకి లాగి ''నీ డౌరీ గా నన్ను తీసుకెళ్ళు మీనాక్షి.నిన్నేమైనా అంటే వాళ్ళని నేను కొట్టెస్తాను'' అని ఎమోషనల్ గా బోల్డు కన్నీళ్లు పెటుకుంది.పాపాయి వాళ్ళ టీచర్ కళ్ళ నీళ్ళు చూసి ఆశ్చర్య పడి ''డౌరీ అంటే ఏంటమ్మా ''అంది.బహుసా తెలుగులో చెప్పాలేమో అనుకుని ''కట్నం ''అన్నాను .పాపాయి ''కట్నం అంటే ఏంటీ'' అంది .నేను ''అదే రా పెళ్ళపుడు అమ్మాయికి అమ్మా వాళ్ళు ఇస్తారే ..''అని చెప్పబోతూ వుండగా''ఓ ..అదా 'బై  బోయ్' అని కదా ''అన్నది

అవును ''బై బోయే ...''మొన్న భానుమతితో ఇంటర్వ్యు చదువుతూ వున్నాను, ఆవిడ అంటారు ''ఎప్పుడో వరవిక్రయం లో వేశాం కట్నమూ ,ఆత్మ హత్యలూ   ...ఇన్నేళ్ళకి ఇప్పుడు కూడా  అవే సినిమాలు ''అని.

ఎన్నేళ్ళయినా బాయ్ లెప్పుడు అమ్ముడు పోతూనే వుంటారేమో చిరాగ్గా ...

అసలు నా ఈ చిరాకంతా రోసీ మీద కాదు,, రోసీనంత యేడిపిస్తున్న ఎడ్వర్డ్ మీద ..ఎడ్వర్డ్ మీద కానే కాదు ఎడ్వర్డ్ కి అంత విలువనిచ్చి ఏడుస్తున్న రోసీల మీద ,ఊహూ అదీ కాదు ,,,వివాహం మీద..అంతేనంటారా ?కాదేమో రోసీని అట్లా తయారు చేసిన ఈ సమాజం మీద !!!


14, అక్టోబర్ 2012, ఆదివారం

అనగనగా ఒకూర్లో ...





16/8/2012 న నేనూ ,పాపాయి  చెప్పుకున్న కథ ఇది .ఈ కథ నాకు చెప్పింది ''కమలా టీ  ఎస్టేట్ ''కి చెందిన కిస్నీ బడాయిక్ .బడాయిక్ లు భారత దేశ గిరిజన సముదాయాలలో  ఒకరు .వీళ్ళ గురించి విశదంగా మళ్ళీ రాస్తాను .కిస్నీ కి చాలా కథలు వచ్చు.అంటే కథల పుట్ట అనమాట .ఈ వాయిస్ మెమో అనుకోకుండా దొరికింది.పాపాయి వాళ్ళ చిన్న మామ శ్రీకాంత్, దీన్ని ఇట్లా చేసిచ్చాడు.ఇది మనుషులను మనుషులే తినే నాటికి,తినకూడదనే జ్ఞానానికి మధ్య కాలపు  కథ అయి ఉండొచ్చు.

కథని నేను పాపాయికి , మామూలుగా మనం చెప్పుకునేట్టు చెప్పేసాను  .కానీ కిస్నీ ఎంత బాగా చెప్పిందో  .మధ్యలో పాటలు కూడా ఎంత బాగా పాడిందో ...''మార్ మార్ భయ్యా కొయలో పాయెర్లుగా చీతీ చావర్ కేస్ భయ్యా చీతి చావర్ కేస్ ''అంటూ కథ మధ్యలో చాలా సార్లు పాట  వస్తుంది.ఈ భాష పేరు సాద్రీ .ఆ భాషని మళ్ళీ ఎప్పుడైనా వినిపిస్తాను.

17, ఆగస్టు 2012, శుక్రవారం

లెఫ్టిస్ట్ భారత మాత !!!

పాపాయి వాళ్ళ అత్త ది ఎడం చేతి వాటం .పాపాయికి పూర్తిగా అట్లా కాదు .రాతా గీతా కుడి చేతి తోనే చేస్తుంది కానీ ,హటాత్ గా నిద్దర లేపేసి కుడి చేతితో చేయాల్సిన పని ఏదైనా చెప్పామనుకోండి, చక్కగా ఎడమ చేత్తోటి చేస్తుందన మాట .మొన్న ఏమయిందీ ,పంద్రా ఆగస్ట్ వచ్చింది కదా ,అప్పుడు పాపాయికి భాగా పొడవు జుట్టని, స్కూల్ వాళ్ళు పాపాయిని భారత మాతని చేసేసారు .అయ్యాక ఫోటోస్ పంపిస్తే ,లోడ్ చేసి చూద్దును కదా ,పాపాయి ముద్దుగా ఎడమ చేత్తోటి అభయమిస్తూ వుంది ,బోల్డు ముచ్చట పడి, సిస్టం ముందు నుండే ''నీ కూతురు ఎడమ చేత్తో అభయమిస్తుందయ్యోయ్ ''అని పాపాయి వాళ్ళ నానని  గట్టిగా కేకేసి చెప్పానా ,వాళ్ళ నాన చాలా  బిజీగా'' గ్రేట్ ఇండియనో '' ...మరోటో ఏదో ప్రోగ్రాం సీరియస్ గా టీవీలో వాచ్ చేసేస్తూ ,అంతే గట్టిగా అక్కడి నుండే ''లెఫ్టిస్ట్ '' అనిలే  అంటూ  కేకేసాడు  .ఫోటోకి కేప్షన్ సూపరు సూటబుల్ అని షేర్ చేస్తున్నా !

15, ఆగస్టు 2012, బుధవారం

స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు


అవును ''మరో స్వాతంత్య్ర సంగ్రామంఅవసర''మే  మనకు . కదా ... !!!

 డార్జిలింగ్ తేయాకు తోటలలో పని చేసే ''టోపు'' తెగ అమ్మాయి .ఇరవై ఆరు కిలోల ఆకు గిల్లితే ,రోజు కూలీ తొంబై రూపాయలు .ఆ తొంబై వెనుకా చాలా మతలబులు .ఒందేళ్ల పై చిలుకు నుండీ వాళ్ళు ,అక్కడే తొక్కి పెట్టేసిన గొంగళ్ళు .అవును కదా ...నిజమే, ఇప్పుడు ,ఇన్నేళ్ళ తరువాత కూడా మనకు మరో స్వాతంత్ర్య పోరాటం అవసరమే...

 ...అని ఇన్నేళ్ళ స్వాతంత్ర్యాన్ని అనుభవించిన అనంతరం కూడా మనం వాక్రుచ్చితే భరత మాతకు ఇట్లా వస్తుంది మరి కోపం : )) :)) : ))