మీ పిల్లలు మీ పిల్లలు కారు. వాళ్ళు జీవితేచ్చకు జన్మించిన వాళ్ళు . వాళ్ళు మీ ద్వారా వచ్చారు తప్ప మీ నుండి కాదు . వాళ్ళు మీతో ఉన్నా మీకు చెందరు .మీరు వాళ్ళతో ఉండాలని ప్రయత్నిస్తే ప్రయత్నించారు గాక, వాళ్ళు మీలా ఉండాలని మాత్రం అనుకోకండి. ఎందుకంటే జీవితం వెనక్కు మళ్ళదు గనకా, నిన్నటితో మళ్ళీ అతుక్కుపోదు గనకా ..ఖలీల్ జిబ్రాన్

19, జులై 2019, శుక్రవారం

'' చూసావామ్మా ! మమ్మీ ఎంత ముదురో '' !

పాపాయి తొమ్మిదో క్లాస్ చదువుతుంది కదా .. కానీనేమో దానిదింకా ముద్దుగారే అమాయకపు బుర్రే . ఏమైందీ ,ఆ మధ్యన ఫిబ్రవరి 14 వచ్చింది కదా ఆరోజుకి ముందురోజు మధ్యాన్నం నేను దానికి ఫోన్ చేసాను . మమ్మీ దానికి పక్కనే కూర్చుని బువ్వ తినిపిస్తూ వుంది . పాపాయి ఫోను అందుకోగానే ''అమ్మా ఈ రోజు మా స్కూల్ లో అన్ని క్లాసులకి కిటికీలు మూసేస్తున్నారమ్మా '' అన్నది . నేను ఆశ్చర్యపడి ''ఎందుకమ్మా ?''అని ప్రశ్న వేసాను . అది '' నీకు తెలీదా..  వాలంటైన్స్ డే రోజు అబ్బాయిలందరూ అమ్మాయిలకి ఏమయినా లెటర్లు ,గిఫ్టులు ఇస్తారని అట్లా చేస్తారు '' అన్నది . నేను '' మరీ చోద్యంరా ఇది కిటికీలు మూసెయ్యడం ఏంటీ చిత్రంగా '' అని దీర్ఘం తీసాను . పాపాయి ''నీకు తెలీదులేమ్మా ! మా స్కూల్ వాళ్ళు ఏది చేసినా అది మంచిదే '' అన్నది . నేనేమో తారీఖులు గుర్తులేని గృహ జీవితంలో వున్నా కదా అందుకని , ''యెప్పుడురా ఇంతకీ ప్రేమికుల రోజు ?'' అన్నాను . పాపాయి ఏమనుకుందీ  చాలా చాలా కాలం నుండి ఫిబ్రవరి పద్నాలుగో తేదీన ప్రపంచం ప్రేమికుల రోజు అని ఒకటి జరుపుకుంటుందనీ ,అది తనలాటి చిన్నపిల్లలకి కూడా తెలుసుననీ , అమ్మకి తెలియకపోవడమేమిటనీ చాలా ఆశ్చర్యపడి ''నీకసలు వాలంటైన్స్ డే ఎప్పుడో నిజంగా తెలీదామ్మా '' అన్నది బిగ్గరగా . నేను దాని ఆశ్చర్యానికి ముచ్చటపడి ,దాన్నలాగే కొనసాగిద్దామనుకుని ''తెలీదురా '' అన్నాను . పాపాయి ఆశ్చర్యంతోనే అన్నం తినిపిస్తున్న అమ్మమ్మ ని '' నువ్వు చెప్పుమా వాలంటైన్స్ డే ఎప్పుడో '' అన్నది . మా అమ్మ చాలా గర్వంగా ,తనకున్న అపారమైన పత్రికా జ్ఞానాన్ని ప్రదర్శిస్తూ '' ఫిబ్రవరి 14 రా  ''అన్నది . మా అమ్మాయి వెంటనే '' చూసావామ్మా ! మమ్మీ ఎంత ముదురో '' అన్నది

.హమ్మయ్య ! ఎలాగయితేనేం ,ఇవాళ నేను ముదురు కాకుండా తప్పించేసుకున్నాను ! 

12, డిసెంబర్ 2018, బుధవారం

ఒక్క నిముషం కళ్ళు మూసుకుంటే పోలా !

ఈ మధ్య కొత్తగా పాపాయి వాళ్ల  తాత ,మమ్మీ అందరూ కలిసి నెట్ ఫ్లిక్స్ లో అవీ ఇవీ చూట్టం మొదలు పెట్టారు . పాపాయి కి అత్యంత ఫేవరేట్ ''వాంపైర్ డయరీస్ '' దుర్గాపూర్ లో మా ఇంటి ఎదురుగా కాపురముండే  వీధి కుక్కకి కూడా ''ఎలెనా గిల్బర్ట్ '' అని అందులోని హీరోయిన్ పేరు పెట్టింది . సరే అట్లా తాత ,మనవరాలు ,మమ్మీ అని పిలువబడే అమ్మమ్మ అందరూ ఇవి చూస్తూండగా ,ముద్దులు గట్రా వస్తే తాత '' చిట్టీ ! తీసేయ్ తీసేయ్ '' అంటాట్ట . ఆ విషయాన్ని నాకు కంప్లైంట్ చేస్తూ పాపాయి ''ఒక్క నిముషం వాళ్లిద్దరూ కళ్ళు మూసుకుంటే  పోలా అమ్మా  ! దానికి మార్చడం ఎందుకు చెప్పూ !'' అన్నది . నేను చాలా ముచ్చట పడి  , '' కళ్ళు మూసుకోవాల్సింది నువ్వు కదరా పాపాయీ  ''! అన్నాను . 

తాతకి నా పోలిక !

పాపాయి వాళ్ళ చిన్న మామ కి పాపాయి పుట్టింది , అక్టోబర్ లో ! పాపాయి వాళ్ళ తాత కూడా అక్టోబరే . బుజ్జి దాని పేరు మెలొడి . అది కూడా అచ్చం తాత లాగే సగం కళ్ళు తెరుచుకుని నిద్రపోతుంది . అందుకని నేను పాపాయితో ''మెలొడీకి అచ్చం తాత పోలిక రా '' ! అన్నాను ,పాపాయి క్షణం కూడా ఆలోచించకుండా '' ఆఁ ! తాతకన్నీ నా పోలికలమ్మా , తాత కూడా నా లాగే తలకింద చెయ్యి పెట్టుకుని నిద్ర పోతాడు '' అన్నది . అది విని తాత కూడా మనవరాలికి సపోర్ట్ వచ్చి '' అవునురా ! మెలొడీకి వాళ్ళ తాత పోలికలు , నాకంతా నీ పోలికలు '' అని వాక్రుచ్చాడు . 

29, జనవరి 2018, సోమవారం

అయ్యప్ప

పాపాయి అన్నదీ , తాత అయ్యప్పా అయ్యప్పా అని పూజ చేస్తాడు కానీ , అయ్యప్ప ఎలా పుట్టాడో మాత్రం తాత తెలుసుకోలేదు .

26, జనవరి 2018, శుక్రవారం

'రాముడు !

పాపాయి చెప్పింది .. '' ఎవరో ఏదో అన్నారని సీతని వదిలేసిన రాముడి ని పూజించడం చట్టరీత్యా  నేరం ''. చిన్న స్థాయినుండి వచ్చి ఎదిగిన ,ధర్మం కోసం నిలబడతానని చెప్పిన కృష్ణుడు పూజనీయుడు . 
 Image result for ramudu