పాపాయికి చుట్టీ .పాపాయి వాళ్ళ నానకి కుంచెం సెలవు ,అతి కష్టం పైన దొరికింది .తప్పక హాజరు కావాల్సిన పెళ్ళి ఒకటి వచ్చింది .అంచేత మేం మా ఊరికి బయల్దేరాం.కూచ్ బిహార్ నుంచిపొద్దుట తొమ్మిదిన్నర కి బయల్దేరి , బాగ్ డోగ్రా వరకూ రోడ్డు ,ఆ పై ఫ్లైట్ కాన్సిల్ ఐ కలకత్తా లో మారాల్సిన ఫ్లైటు డిల్లీ లో మారి ,మద్రాసు మహా నగరం లో దిగేప్పటికి సమయం రాత్రి ఏడున్నర .
బయటికి వచ్చిన మమ్మల్ని చూసి నా చిన్న తమ్ముడి చిరు నవ్వుల ముఖారవిందం మరింత విర పూసింది .మద్రాసు మలయ మారుతం మామూలుగా స్ప్రుసించినా ,అమిత ప్రేమగా ఆలింగనం చేసుకునే అమ్మలా అనిపిస్తుంది ఎప్పుడూ . చిన్నప్పటి నుండీ తమిళనాడు సరిహద్దు ప్రాంతాల్లో పెరగడం వల్ల కామోసు ''అరవల్ని ''చూడగానే మహా ఆత్మీయంగా అనిపిస్తుంది . మన వాళ్ళ లోకి వచ్చేసానని అనిపిస్తుంది .అగ్రత్వానికి ,అహంకారానికి కారణం కావడం వల్లనేమో ,తెల్ల రంగు పట్ల ఏర్పడ్డ వ్యతిరేకత ,తమిళులకి వారి సంస్కృతి పట్ల ఉన్న గౌరవం ,వారి నిరహంకార ఆహార్యం నాలో ఏర్పడ్డ ఈ అభిమానానికి కారణం కావచ్చు .
ఏర్ పోర్ట్ నుండి వచ్చే దారిలో శరవణ భవన్ చేతులు చాచి అన్నపూర్ణలా ఆదరంగా పిలిచి రుచికరమైన బువ్వ పెడ్తుంది .పాపాయి వాళ్ళ నాన ఈ అమ్మ పెట్టే తక్కాళి సాధం కానీ ,సాంబార్ సాధం కానీ తినందే ఆడుగు ముందుకు వెయ్యనని మొరాయిస్తాడు .ఒక వేళ పాపాయి వాళ్ళ అమ్మ GRT తంగ మాళిగై లో షాపింగ్ చేస్తే అల్ప సంతోషపు నాన్న పక్కనే ఉన్న మురుగన్ ఇడ్లీ షాప్ లో ఇడ్లీ తిని అమ్మ చేసిన బిల్లు కూడా పట్టించుకోకుండా చట్నీల రుచి గురించిన ఉపన్యాసం లో పడతాడు . శరవణ భవన్ ముందు అర్థ రూపాయి బిళ్ళంత బొట్టు పెట్టుకున్న పెద్దావిడ ఒకరు పూలు అమ్ముతుండింది. మొల్లల పరిమళం కారు నిండుగా పరుచుకుని మదిని మైమరపించింది .ఉన్నత హృదయులైన బెంగాలీలు పూలని కోయడం అమానుషం గా భావిస్తారేమో వివాహ సందర్భంలో తప్పించి పూల వాడకం అసలు ఉండదు.
కొంత దూరం రాగానే గత మూడు నాలుగేళ్ల క్రితమేననుకుంటా ప్రారంభించబడిన ''నోస్టాల్జియా ''అని హోటల్ బోర్డ్ ఒకటి వెలుగుతూ కనిపిస్తుంది .అసలే నోస్టాల్జియా అనే జబ్బుతో బాధ పడ్తూ ఉంటానా ...ఆ బోర్డ్ ఏమిటేమిటో గుర్తు చేస్తుంది .కూచ్ బిహార్ కి సంవత్సరంలో కొన్ని నెలలు విదేశీ పక్షులు వస్తాయ్ .వచ్చి ఆ కొత్త ప్రదేశంలో గూడు కట్టి ,గుడ్లు పెట్టి, గూటిడు పిల్లల్ని చేసి ,వాటికి తిరిగి తిరిగి తెచ్చిన బువ్వ పెట్టి ,ఎగరటం నేర్పించి ..స్వంత ఊరికి తీసికెళతాయి .ఆడ పిల్లలకి ఆ వలస పక్షులకి పెద్ద తేడా మాత్రం ఏముంది కదా ?అదే అంటే, పాపాయి నాన అంటాడూ ..ఇవాళ ఊరు గాని ఊర్లలో ఉద్యోగాలు చేసే మగ వాళ్ళూ వలస పక్షులే అని .అవును !సత్యాన్ని ఎవరు మాత్రం అసత్యం అనగలరు ?
కాటుక చీకటి తొవ్వ ,చెట్టూ చేమ సొంత గూటికి వస్తున్న ఈ వలస పక్షులతో నిశ్సబ్దంగా సంభాషిస్తూ ఇంటికి చేర్చేసరికి అర్థ రాత్రి దాటి పోయింది .అందరూ ఆత్మీయంగా నిద్దర్లు లేచి పలకరిస్తారు కానీ మా వీధి మొగదలి నిదర గన్నేరుకి నేనంటే ప్రేమే లేదు కుంచెం కూడా .కన్ను తెరిచి ఒక చూపన్నాచూడ లేదు .
1 కామెంట్:
''అరవల్ని ''చూడగానే మహా ఆత్మీయంగా అనిపిస్తుంది . మన వాళ్ళ లోకి వచ్చేసానని అనిపిస్తుంది .అగ్రత్వానికి ,అహంకారానికి కారణం కావడం వల్లనేమో ,తెల్ల రంగు పట్ల ఏర్పడ్డ వ్యతిరేకత ,తమిళులకి వారి సంస్కృతి పట్ల ఉన్న గౌరవం ,వారి నిరహంకార ఆహార్యం నాలో ఏర్పడ్డ ఈ అభిమానానికి కారణం కావచ్చు ....same pinch:-)
I feel the same with Blacks here...I read Roots when I was 9...may be that influenced me I guess..
కామెంట్‌ను పోస్ట్ చేయండి