మీ పిల్లలు మీ పిల్లలు కారు. వాళ్ళు జీవితేచ్చకు జన్మించిన వాళ్ళు . వాళ్ళు మీ ద్వారా వచ్చారు తప్ప మీ నుండి కాదు . వాళ్ళు మీతో ఉన్నా మీకు చెందరు .మీరు వాళ్ళతో ఉండాలని ప్రయత్నిస్తే ప్రయత్నించారు గాక, వాళ్ళు మీలా ఉండాలని మాత్రం అనుకోకండి. ఎందుకంటే జీవితం వెనక్కు మళ్ళదు గనకా, నిన్నటితో మళ్ళీ అతుక్కుపోదు గనకా ..ఖలీల్ జిబ్రాన్

27, మే 2011, శుక్రవారం

జీవితమే సఫలమూ.....!


Get this widget | Track details | eSnips Social DNA


అప్పుడెట్టుండెనో చిత్తమయ్యో యెఱగనైతి
చెప్పుడుమాటలకే నే జేరనైతిగా

కొసరికొసరి నీపై కోపమున నుంటిగాని
అసమిచ్చి నీతో మాటలాడనైతిగా
పసలేని సిగ్గుతోడి పంతాననే వుంటిగాని
ముసిముసి నవ్వు మోవి మోపనైతిగా

విరహపు కాకల నావిసుపే చూపితిగాని
సరిబిల్చితే నూకొన జాలనైతిగా
వరుసవంతులకై నే వాదులాడితి గాని
మురిపేన మొక్కితే నే మొక్కనైతిగా

వేగమే నీవు గూడితే వెస భ్రమసితిగాని
చేగలనీమేను పచ్చిసేయనైతిగా
భోగపు శ్రీవేంకటేశ పోట్లదొరతిలోన
నీగతి చెన్నుడవైతే నెనసితిగా

రెండు వారాల క్రితం స్నేహితురాలు ఫోన్ చేసింది T T D వారి అన్నమాచార్య సంకీర్తనల సమ్మర్ కాంప్ జరుగుతుంది.రాకూడదా... మీరు ఇక్కడ ఉన్న నెలలో పాపాయికి నాలుగు పాటలన్నా వస్తాయి కదా అని .పొద్దుటే వెళ్లి ఒక గంట పాటు పాడుకుని వస్తుంటే ఎంత సంతోషంగా ఉందో.జీవితంలో ఆనందం తప్పించి మరేమీ లేని కాంతివంతమైన అనుబూతి .

వదులుగా అల్లుకున్నజడలో బొండు మల్లెలు తురుముకుని వచ్చే డాన్స్ టీచర్ ,చిన్ని కూతురికి తోడుగా వచ్చే అందమైన అమ్మ , కారణం ఏదయితేనేం బోలెడు కాలం తరువాత రోజూ ఒకరినొకరం చూసుకోగలుగుతున్న నేను నా స్నేహితురాలు ,ఇంటికొచ్చి'' జగడపు చనవుల జాజర''.. అనో ''అమ్మమ్మ ఏమమ్మ అలమేల్ మంగ నాంచారమ్మ '' అనో పాడేసుకుంటూ ఉంటే,,, దిగులూ వ్యసనమూ ఉండదమ్మ నీకు అని మురిసే మా నాన..

జీవితం ఎంత బాగుంది ....జీవితం ఎంత బాగుంది .హాయిగా తీయగా ఆలపించు పాటలా ,అనారు పూల తోటలా ...ప్రశాంత సాంధ్య వేళలా...జీవితం ఎంత బాగుందో ...ఈ ఎండల వేళల మా ఊరి వీధులను పసుపు వర్ణ భరితం చేసే తీయటి ఉలవ పాటి మామిడి పళ్ళలా ...జీవితం తీయ గా అనిపిస్తుంది.

''నీ వలన తప్పే లేదు మరి నీరు కొలది తామెరవు ;ఆవల బాగీరదీ దరి ఆ జలములే ఊరినయట్లు'' ...''ఎంత మాత్రము ఎవ్వరు తలచిన అంత మాత్రమే నీవు ''అట. ఎంత అద్భుతమైన భావన ,''అంతరాంతరములెంచీ చూడ పిండంతే నిప్పటి యన్నట్లు ..''ఎంత సరళమైన పదాలు ఎంత గాఢమైన తాత్వికతకదా .

వేంకటేశ్వరుని పైన కదా అని భక్తి భావం కాదు సంగీతానికి ఆ శక్తి ఏదో ఉంటుంది .ఆండాళ్ తిరుప్పావై వినండి అలాటిదే మరోదేదైనా వినండి .భక్తి కాదు. భాష తెలియకున్నా ఉదాత్త భావాలేవో మనలో ప్రవేసిస్తాయ్ .ప్చ్ అద్భతమైన వాటికి మనం మతాల కులాల రంగులు పులిమేస్తాం కదా ...

ఒక్కో వ్యక్తికి ఒక్కో మోహం ఉంటుంది కాబోలు నాకు అట్లా సంగీతం ఓ పిచ్చి .కానీ సంగీతానికే నా పై దయ లేదు . పాడుకుంటూ ఉంటే స్నేహితురాలు ముని పంటితో నవ్వుని అదిమేసి ఎంత ముద్దుగా పాడుతావో నీ పాటల్లో ఫీలింగ్ మాత్రమే ఉంటుంది, ఇంకేమీ ఉండదు...అని అంటుంది సరదాగా .

మనం కోరుకున్నది పొందలేక పోయినంత మాత్రాన దానిపై ఇష్టం పోదు కదా ! పోక పోగా ప్రేతంలా పట్టుకుని మనల్ని మరింత పీడిస్తుంది .దిగులు పెట్టేస్తుంది .యేడి పించేస్తుంది .ఎప్పుడో కంటమో, ఏ రాగమో, ఏ సాహిత్యమో ఎందుకో ఒక పాటై మన జీవితంలో ప్రవేసించేస్తుంది . ఇక అంతే ఇదీ అని వివరించలేని ఆరాటం .ఏం చెయ్యాలో తోచదు .ఘన సమయం అంతా ఆ ఒక్క పాట చుట్టే గిరికీలు కొడుతూ ఉంటుంది.

పాడుకుంటూ ఉంటే పాపాయో ,వాళ్ళ నానో మధ్యలో మాట్లాడిస్తారు .నేనింత తాదాత్మ్యం తో పాడుకుంటూ ఉంటే మాట్లాడిస్తారా ఎంత రస హీనులు అని గునుస్తే.. నీకు ఇరవై నాలుగు గంటలూ తాదాత్మ్యమే ...మరింక మేమెప్పుడు మాట్లాడాలి అని నసుగుతారు .కానీ ఎందుకిట్లా ఊపిరాడ నీయకుండా చేస్తుంది ఒక చిన్ని పాట అని దిగులు ...నాజీవితంపై ఇంత అదుపు ఏమిటి అని బెంగ !

ఇక్కడిచ్చిన పాట ఇంతకు మునుపు ఎప్పుడూ వినలేదు .పాడినావిడ ఎవరో తెలియదు ,పోసేసివ్ నెస్ తో కోపించి కలహించిన నాయిక పశ్చాత్తాపాన్ని హృదయంతరాలలో ని ఆర్తిని , ఎంత బాగా పలికించిందో ...

కామెంట్‌లు లేవు: