మీ పిల్లలు మీ పిల్లలు కారు. వాళ్ళు జీవితేచ్చకు జన్మించిన వాళ్ళు . వాళ్ళు మీ ద్వారా వచ్చారు తప్ప మీ నుండి కాదు . వాళ్ళు మీతో ఉన్నా మీకు చెందరు .మీరు వాళ్ళతో ఉండాలని ప్రయత్నిస్తే ప్రయత్నించారు గాక, వాళ్ళు మీలా ఉండాలని మాత్రం అనుకోకండి. ఎందుకంటే జీవితం వెనక్కు మళ్ళదు గనకా, నిన్నటితో మళ్ళీ అతుక్కుపోదు గనకా ..ఖలీల్ జిబ్రాన్

29, జూన్ 2011, బుధవారం

మంచి వాన పాట ఒకటి ...!







మొన్న నా పీ హెచ్ డీ వైవా కోసం హైదరాబాద్ కి ప్రయాణిస్తుంటే చివరి వరకూ నాకు తోడు వచ్చిన పాట ఇది .వింటూ వింటూ వింటూ వెళ్లాను .విమల కంటమంటే నాకు ఇష్టం .మొదట అందుకోసం పాట వింటాను .ఆ తరువాత అందులో సాహిత్యం .

ఆవిడ కంటం''ప్రజల కోసం గజ్జె కట్టి ఆడే ''ఆవిడలానే సున్నితంగా ఉంటుంది .దృడంగా ,ధైర్యంగా ,వెరపు ,బెరకు లేక అతి స్పష్టం ఉంటుంది .వింటూ ఉంటే ..వింటూ, వింటూ ఉంటే విమలక్కా అని పిలుద్దామనే ఆప్యాయత వేస్తుంది .


పొద్దున్నే ఏదో విషయమై ఫోన్ చేస్తే స్నేహితుడు,ప్రయాణం చేస్తూ చేస్తూ ఉన్న వాడు , కదిలించ గానే ''ఆడుదాం డప్పుల్ల దరు వెయ్ ర''అని మురుసుకుంటూ పాడాడు .విన గానే ఎందుకనో చప్పున పెద్ద దిగులొకటి కమ్మేసింది ..ఇప్పటికీ ఉదయం కమ్మిన ఆ దిగులు మేఘం ఉండి ఉండి కురుస్తూనే ఉంది.



వానొచ్చేనమ్మ వరదొచ్చేనమ్మ

వానతోపాటుగా వణుకొచ్చేనమ్మ

కొట్టాముపై రాలి మట్టంత కడిగింది

కోడి పుంజు జుట్టు కొంటెగా తాకింది

చెట్ల కురులపై బొట్లు బొట్లుగా రాలి

గట్ల కుండల మీద గందమై పారింది

దున్న పోతులనేమో దుంకు లాడించింది

బర్ల మందలనేమో సెర్లలోముంచింది

గద్ద గూటి లోని గడ్డీని తడిపింది

గువ్వా గూటిలోని గులక రాళ్ళని జరిపింది

తీతువు గొంతును తియ్యగ జేసింది

పరికి పిట్ట ముక్కు పాసిని కడిగింది

ఎద్దు మూపురాన్ని ముద్దాడి మురిసింది

ముళ్ళు గర్ర వళ్ళు సల్లగ జేసింది

కొత్త నీటితో వచ్చి కోనేట్లో చేరింది

పచ్చని నాసుని పలగ జేరేసింది

చేపకేమో నీటి పులుపుని దాపింది

కొంగకేమో విందు కోరికని రేపింది

కప్పల పండగ కండ్లారా జూసింది

తాబేలు పెండ్లికి తల నీరు పోసింది

యెర్ర భూముల నెర్రెలన్నీ పూడ్సినాది

రేగడి నేలను మాగాణి జేసింది

తువ్వా గడ్డలల్ల కవ్వాతు జేసింది

సౌడు భూముల జూసి దౌడు తీసినాది

పొంగేటి కల్లుల పోసింది చన్నీళ్ళు

ఈత సెట్టు లొట్టి మూతి కడిగింది

తాను రాక ముందే తూనీగల లేపి

తన పాటకే తాను దరువేసి ఆడింది

తెల్ల మల్లెనింక తేటగా జేసింది

యెర్ర మల్లెనే కడిగి ఎరుపునే పెంచింది

తులసమ్మ దీపము చిప్పలో చేరింది

నీరెండ పులుపుకు నిగ నిగ లాడింది

పారాడి పారాడి గోదారిలో కలిసి

సీతమ్మ పాదాలు శిరసొంచి తాకింది

వంకలు డొంకలు వనములన్నీ తిరిగి

కృష్ణమ్మ వడిలోన ఇష్టంగా ఆడింది

దున్దుభీ తల పోసి దుమ్మంత కడిగింది

అందమైన ఇసుకను అద్దంలా జేసింది

ఇష్టమే లేకున్నా పట్నానికోచ్చింది

ముక్కు మూసుకొని మూసీలో మునిగింది

యములాల రాజన్న వేడుక జూసింది

ముందింటి కోయ్నాక మైల కడిగేసింది

సూఫీల దర్గాల సుట్టు దిరిగీ మొక్కి

ఎగిరే దక్కిల కేమో ఎండీ మెరుపద్దింది

రావి ఆకుల నుండి రాలి పడి రాలి పడి

సాధుల సామాది సన్నిధికి చేరింది

అమరూల స్థూపానికి అభిషేకమూ జేసి

సుత్తీ కొడవలి మీద ముత్తేమై మెరిసింది .

[రెండు మూడు పదాలు అర్థం కాలేదు .తప్పులు పడి ఉండచ్చు .]

కామెంట్‌లు లేవు: