మీ పిల్లలు మీ పిల్లలు కారు. వాళ్ళు జీవితేచ్చకు జన్మించిన వాళ్ళు . వాళ్ళు మీ ద్వారా వచ్చారు తప్ప మీ నుండి కాదు . వాళ్ళు మీతో ఉన్నా మీకు చెందరు .మీరు వాళ్ళతో ఉండాలని ప్రయత్నిస్తే ప్రయత్నించారు గాక, వాళ్ళు మీలా ఉండాలని మాత్రం అనుకోకండి. ఎందుకంటే జీవితం వెనక్కు మళ్ళదు గనకా, నిన్నటితో మళ్ళీ అతుక్కుపోదు గనకా ..ఖలీల్ జిబ్రాన్

13, జూన్ 2012, బుధవారం

పాపాయి చెప్తున్న ట్యూషన్ కథ !!


మొన్నో రాత్రి ఏమయిందంటే ...నానా ,పాపాయి ,నేను నిదర్లకి మంచమెక్కి ముచట్ల కి పడ్డాం .దాని ప్రతి ఆలోచనా నానకి చెప్పి నాన అభిప్రాయం తెలుసుకోవడం పాపాయికి అత్యవసరం .ఏమయిందంటే పాపాయి కి మొన్న రాత్రి ఒక గొప్ప ఆలోచన వచ్చింది .ఏమనీ ''నేను ట్యూషన్ పెడితే యెట్లా వుంటుందీ అని'' ఆందుకని పాపాయి .

'''నానా ..నానా ...నానోయ్ ''
''ఓయ్ ఏందిరా మీనాక్షూ''
''నానా నేను ట్యూషన్ పెడితే ఎట్టుంటది నానా ?''
''బాగుంటది రా ...చాలా బాగుంటది ''
''నానా అయితే రేపు నేను ,షీలా స్టూడెంట్స్ ని యెతికేమానానా ?''
''సరే బిడ్డా ''
''నానా ...నానా ... నానోయ్ ''
-----
''పాపాయీ నానని బజ్జోనియ్యమ్మ్మ ,రేపు చెప్దూలె ''
''అమ్మా నేనూ షీలా స్టూడెంట్స్ ని ఎతికేమా అమ్మా'' ?
''' ...ఎతుకుదుర్లె''
''నానా ...నానా ...''
ఏందమ్మా మీనాక్షులూ ''
''నానా నేను ట్యూషన్ కి ఫీజు తీసుకునేదా ?''
''షీలా పాడా వాళ్ళు కదరా పాపం ఫీసు వద్దులే ''
''కాదు నాన్నా మా ఎడ్వర్డ్ సారోల్లు నా దగ్గర సెవెన్ హండ్రడ్ తీసుకుంటున్నారు కదా ట్యూషన్ కి ,నేను హండ్రడ్ తీసుకుంటా నానా ''
''షీలా పాడా వాళ్ళు కదరా బిడ్డా వాళ్ల దగ్గర డబ్బులు ఎక్కడుంటాయి ?
''పోనీ ఫిఫ్టీ ...నానా !''
''సరేరా ''
*************************
అప్పుడేమయిందంటే రేప్పొద్దున పాపాయి ,షీలా వీధులన్నీ తిరిగి తిరిగి రోడ్డుపై ఆడుకుంటున్న ఒక పిల్లని పటుకోచ్చేసారు .ట్యూషన్ షురూ అయింది .పాపాయి చదివే ట్యూషన్ రెండు గంటలే కదా ...కానీ పాపాయి చెప్పే ట్యూషన్ కి మాత్రం టైం లేదు పాడు లేదు .ఈ మిస్ ఆమెకి బుద్ధి పుట్టినప్పుడే చుట్టీ మంజూరు చేస్తుంది.బుద్ధి పుట్టక పోతే చుట్టీ లేనే లేదు .స్టూడెంటు ....అని ఏడుపుకి ఎత్తుకుంటే మిస్సుకి కోపమోచ్చేస్తుంది .

రెండో రోజు స్టూడెంట్ పిల్ల తో పాటు పిల్ల పెదమ్మ కొడుకు ూడా వచ్చాడు .మూడో రోజు పిల్ల వాళ్ళ ఊరికి వెళిపోయింది .నాలుగో రోజు పాపాయి , స్టూడెంట్ రాటం లేదని వాళ్ళింటికి వెళ్లి స్వయంగా విచారించి పిలగాడ్ని పటు కొచ్చింది . పిలగాడు పాపం మస్తు మంచోడు .మిస్సు ఏమన్నా మెదలకుండా ఉంటాడు .అయినా మిస్సుకి వీడంటే చిర చిర పర పర .ఎందుకు రా అంటే ''మొద్దు'' అమ్మా రాయనే రాయడు అని విసుక్కుంది.

ఇది ఇట్లా ఉందా ....అప్పుడేమయింది మొన్నప్పుడు మా రాజ మల్లికా [మా కుక్క ]ఈ కథంతా చూసి చూసి, పాపాయి కాన్సంట్రేషన్ అంతా స్టూడెంటు మీదకేలిపోతుందని కుళ్ళుకొని హటాత్తు గా స్టూడెంట్ మీదకి దాడికేల్లింది.ఎల్లి వాడి ముందు నిలబడి ''సరే ...సరే ఇయాల్టికి వదిలేస్తున్నా మళ్ళీ రేపోచ్చినా వో చెప్తా తంబీ నీ కథ''అన్నది

అప్పుడేమయిందీ ... వాడు రేపు రాలా! పాపాయి క్రమశిక్షణ లేని స్టూడెంట్ పై కోపం తెచ్చుకుని షీలాని తీసుకుని వాళ్ల ఇంటికి వెళ్ళింది .అప్పుడు స్టూడెంట్,, మిస్సుని ఆల్లంత దూరానే చూసేసి ,జారి పోతున్న చడ్డీ చేత్తో పటుకుని పరుగో పరుగు ...పరుగో పరుగు .అట్లా పరిగెత్తి పరిగెత్తి పక్కింట్లో దాంకున్నాడు. మిస్సు ఏమన్నా పట్టుదల లేనిదా ఏంటి ?అందుకని ''వచ్చి చదవాల్సిందే లేకుంటే చదువువెట్ట వస్తది ''అని పట్టు పట్టింది .లేదంటే చదువులో వెనక పడి పోత్తాట్ట మరి .

వీధి వీధంతా చోద్యాన్ని చూట్టానికి ఎగబడింది.అరె అమ్మాయి ఎంత మంచిదీ ఇంత చిన్న వయసులోనే పిల్లలపై ఎంత శ్రద్దా ,అభిమానం అని కీర్తించింది .

అందరికంటే స్టూడెంట్ వాళ్ల నాన తెగ మురిసి, ఎట్టైనా మా అబ్బయ్యకి నాలుగు అక్షరం ముక్కలు నేర్పించమ్మా అని తెచ్చి మా ఇంట్లో వదిలాడు.స్టూడెంటు గావు కేకలూ, రోదనలూ విని నేను దడుచుకుని సీన్లో కొచ్చి విచారిస్తే పైన చెప్పినదంతానన మాట సంగతి .

అప్పుడు నేనేమన్నాను
,''అది కాదురా పాపాయి నేనెప్పుడూ నిన్ను స్కూల్ కి ఏడిపించి పంపలేదురా... ఇంకా కావాలంటే టీచర్లతో జగడం కూడా పడ్డా ''అని చెప్పా .పాపాయి వినలా .''నీకేం తెలీదమ్మా నువ్వు ఊరుకో .ఇట్టైతే చదువువెట్ట వస్తది ''అని ''చిన్న పక్కి చేపలంత ''కళ్ళతో ఉరిమి ఉరిమి చూసింది నన్ను .

ఒంద రూపాయల కాడ్నించి ఫీసు ,యాభై రూపాయలు చేసిందికదా ....అదేం అమాయకపు తండ్రో స్టూడెంటు నాయన ఫీసుకి కూడా ఒప్పుకున్నాడు..అట్టా ...నెలకి యాభై రూపాయల ఫీసు తీసుకుని స్టూడెంటుకి రోజుకి యాభై రూపాయల పైచిలుకు చొప్పున ఫ్రిజ్జులోని పదార్థాలు తినబెడతది మా అమ్మాయి .

అట్లా స్టూడెంటు ఈ రోజు కూడా చల్లగా అదేదో తాగి మళ్ళీ ట్యూషన్ లో మునిగాడు .

ఇంతకీ పాపాయి ట్యూషన్ ఎందుకు చెప్తుందంటారా...బాగా సంపాదించి షీలా కి ఆపరేషన్ చేయించాలంట .షీలాకి గొంతు దగ్గర ఉబ్బి వుండే థైరాయిడ్ .కానీ షీలా కి ఆపరేషన్ అంటే భయమట .సస్తాను కానీ ఆపరేషన్ మాత్రం చేయించుకొను అన్నది...మా అమ్మాయి మాటకు ఆ...అంతా ఆమె ఇష్టమేనా ఏంది నేను చేయిపిస్తా ఆపరేషన్ అన్నది.

ఇప్పుడు తుఫాను
వేగంతో డబ్బు జమ చేస్తుంది.తుఫాను వేగం అంటే ఎట్లాగంటే ... పనికో మనం డబ్బు టేబిల్ మీద పెట్టి వున్నాం అనుకోండి అటిటు చూసే లోపు పాపాయి వాటిని పటుకోచ్చేసి అమ్మా నాకీవా అని అడగ తది .కాదు కూడదని అనే లోపే అవి వుండీ లోకి వెళ్ళిపోతాయి .ఈ కాలం లో బయట కనిపిచ్చే డబ్బంతా దాని వుండీదే అనమాట.అదీ విషయం .

4 కామెంట్‌లు:

Krishna Palakollu చెప్పారు...

super :-)

గోదారి సుధీర చెప్పారు...

thank you

Kottapali చెప్పారు...

She is so precious

గోదారి సుధీర చెప్పారు...

అవును ముద్దుగారే నా ముంగిట ముత్యం మా అమ్మాయి .