మీ పిల్లలు మీ పిల్లలు కారు. వాళ్ళు జీవితేచ్చకు జన్మించిన వాళ్ళు . వాళ్ళు మీ ద్వారా వచ్చారు తప్ప మీ నుండి కాదు . వాళ్ళు మీతో ఉన్నా మీకు చెందరు .మీరు వాళ్ళతో ఉండాలని ప్రయత్నిస్తే ప్రయత్నించారు గాక, వాళ్ళు మీలా ఉండాలని మాత్రం అనుకోకండి. ఎందుకంటే జీవితం వెనక్కు మళ్ళదు గనకా, నిన్నటితో మళ్ళీ అతుక్కుపోదు గనకా ..ఖలీల్ జిబ్రాన్

8, జులై 2011, శుక్రవారం

వినవు కదా ..

అనాలోచితం
అర్థ రహితం
ప్రయాణం
తెగదు ,విడదు

దారి తీపిది
చెట్ల నిండా పాములు
ముళ్ళ గోరింటలు

బ్రతుకుని పట్టి లాగేసిన
సూర్యుడు
ఇది తూర్పే కాదంటున్నాడు
ఔనని ఏంచేసి చెప్పడం

7, జులై 2011, గురువారం

మళ్ళీ బడికి !


రెండు నెలల చుట్టీ తర్వాత,మరో వారం పర్సనల్ సెలవు తీసుకొని , పాపాయి ఇవాళ బడికి వెళ్ళింది .రాత్రంతా కలలు ,పాపాయిని ఎందుకో హాస్టల్ లో వేసినట్టు . హాస్టల్ బాగుంది పరిశుబ్రంగా , ,తెల్లటి పరుపులు ఉన్నాయ్ .పాపాయి ఇంకా చిన్న పిల్లగా ఉంది .ఏవేవో నిబంధనలు .అటెన్డెన్ట్ట్స్ ఎవెరెవరో వున్నారు .తండ్రులు మాత్రమే వచ్చి ఉన్నారు చూట్టానికి ,ఎందుకనో ...బడికి పంపడమనే రేపటి దిగుల్ని ఈ రాత్రి హాస్టల్ లో వేసినట్టుగా నా మైండ్ అన్వయించుకో వుంటుంది .

పాపాయి ని బడికి పంపించాలంటే పాపాయి కంటే నాకే ఎక్కువ దిగులు తోస్తుంది .ఇవాళ టంగుటూరి సూర్య కుమారి గుర్తొచ్చింది .ఆవిడ ఇంట్లోనే ఉండి ఇంగ్లీషు అవీ నేర్చుకుని ఆక్స్ఫర్డ్ ఎక్జాం ఏదో ప్రైవేటుగా ఇచ్చారట .ఎంత గొప్ప డాన్సర్ అయ్యారు ,దేశ దేశాలు తిరిగారు .వెధవ స్కూళ్ళు. జీవితమంతా స్కూళ్లలోనే సరిపోతుంది .హాయిగా ఆడుకునే బిడ్డ స్కూలుకి వెళ్ళాల్సి వచ్చిందే అని దిగులు వేసేస్తుంది .పీ హెచ్ డీ చేశా నేను .ఇవాళ ఎవర్ని ఉద్దరిస్తుంది నా చదువు .వేస్ట్.
ఎందుకనో చాలా రోజుల నుండి ఆకాశమంత సినిమా చూడాలని అనుకునే దాన్ని. కుదరలేదు ,మొన్న మా ఇంట్లో చూసా .కొంత చూడగానే ఆల్రెడీ ఇంగ్లీష్ లో చూశానని జ్ఞాపకం వచ్చేసి విడిచేసా.కానీ ఒక సీన్ బాగా అనిపించింది .కూతుర్ని స్కూల్ లో చేర్చేప్పుడు ప్రకాష్ రాజ్ బోరుమని ఏడుస్తాడు .ఓకే పర్లేదు, సినిమా అయితే మాత్రం జీవితం కాదా ఏంటి ,అంత అద్భుతమైన సీన్స్ ఎంత తక్కువగా చూడ గలుగుతాం అసలు .

2, జులై 2011, శనివారం

రాలి పోయిన చందమామ !


ఇవాళ ఇక్కడ జోరు వర్షం .చిన్నప్పటి నుండి కోరిక ఎడ తెరిపి లేని వర్షాన్ని వింటూ ఉండగలగాలని.తీరి పోతూ ఉంది .స్నేహితురాలు అన్నది ఇద్దరం ఒకటే సారి ''విమెన్ ఇన్ లవ్'' స్టార్ట్ చేద్దామని .ఎందుకో ఆ పుస్తకమంటేనే భయం .అట్లాటిదే హిమజ్వాల .ఎందుకొచ్చిన కష్టం, సుఖంగా ఉన్న ప్రాణాన్ని చల్లగా ఉండనీయక .రాత్రి పది పేజీలైనా చదివి పడుకోమంది .మొరాయించేసి నిద్ర పోయాను .ఆక్క చెల్లెళ్ళ లోతైన తొలి తొలి మాటలే భయ పెట్టేస్తాయ్.మొదటి పేజీలోనే అక్క, చెల్లి అన్న ఏదో మాటకి అంటుంది ,''ఇన్ ది అబ్ స్ట్రాక్ట్ బట్ నాట్ ఇన్ ది కాంక్రీట్ ''అని ఆ మాట శీర్షిక చేసి కవిత ఒకటి రాసుకున్నా2005 లో .

ఇవాళ ఒరియా రచయిత ఉపేంద్ర కిషోర్ దాస్ రాసిన చిన్ని నవల ''రాలిపోయిన చందమామ '' తీసుకున్నా, విమెన్ ఇన్ లవ్ ని అవతల పారేసి .అమ్మాయి సత్తి మధ్య తరగతి బ్రాహ్మణ పిల్ల .ఆ పిల్ల కంటే చాలా పెద్ద వాడైన ఒక జమీందారుకి ఇచ్చి పెళ్ళి చేస్తారు తల్లి దండ్రులు .నాథం ఆ పిల్ల అత్త కొడుకు .వాళ్ళిద్దరి మధ్య ఏదో ఆకర్షణ ఉంటుంది .పెళ్లై భర్త ఇంటికి వెళ్ళినా అతనికి భార్య కాలేక పోతుంది .అతని ఉంపుడు గత్తె [ఈ మాట అసహ్యంగా ఉంది .పుస్తకంలో అదే వాడారు .ఇంకో మాట యోచించాలి ]దాష్టీకం భరించరానిదిగా ఉంటుంది .

ఒక సారి భర్త కొడుకు పుట్టు వెండ్రుకలు తీయించేందుకు ,పక్క ఊరి మందిరానికి వెళ్లి ,వారి నుండి తప్పి పోతుంది .అక్కడ నాధం తతస్తపడుతాడు .తుఫాను చేత రాత్రి అక్కడే తలదాచుకుని పక్క రోజు ఇంటికి వస్తారు .భర్త వెళ్ళ గొట్టేస్తాడు .నాధం కటక్ తీసికేల్తాడు. కొన్ని రోజులు అలా గడుస్తుంది .చివరికి ఒక రోజిక ఊరికి వెళ్లాల్సిందేనని పట్టు పడ్తుంది .అప్పుడు నాధం చెప్తాడు ఆపిల్ల తల్లి దండ్రులు కలరా తో చని పోయారని .చివరికి ఊరికి వెళ్తారు .

ఆ ఊరి వాడే అయిన స్కూల్ టీచర్ వీళ్ళని అనుకోని పరిస్థితుల్లో చూస్తాడు .అమ్మాయిని బెదిరిస్తాడు .ఆస్తినంతా తన పేర రాసియ్యమని లేదంటే ఊరంతా వీరి విషయం చాటింపు వేసేస్తానని .అది తెలిసి నాధం వాడిని బెదిరిస్తాడు .అనుకున్న విధంగానే గ్రామం నాథాన్ని బెదిరిస్తుంది ,ఏ సేవలూ అందనీయకుండా చేస్తుంది .ఇదంతా చూసి తన వల్ల అతనికి ఏ కష్టం కలగ కూడదని భావించి సత్తి, నాథానికి ఒక ఉత్తరం రాసి పెట్టి అర్థ రాత్రి ఇళ్ళు విడిచి పెట్టేస్తుంది .ఆమె ప్రయాణం లో నది ఎదురొస్తుంది ...సత్తి ముగింపుని సూచిస్తూ,,అంతటితో నవల అంతమై పోతుంది .

ఆ మధ్య గుర్రం కథ ఒకటి చదివాను, బ్లాక్ బ్యూటీ అనుకుంటా గుర్తు రాటం లేదు .ఎందుకో అందులో గుర్రం నిస్సహాయత అప్పుడు నాకో అమ్మాయి జీవితాన్ని గుర్తుకు తెచ్చింది .ఈ నవలలో సత్తి మళ్ళి ఆ నవలను జ్ఞాపకం చేసింది .చాలా సమర్దవంతంగా నా మనసు రెండిటినీ కలిపింది .రెండు అసహాయతల రూపం ఒకటే .

వాన బాగుంటుంది .పుస్తకం బాగుంటుంది .ముసురుపట్టిన ఆకాశమూ,దిగులు పెట్టించే పుస్తకమూ కలిస్తే ఆ పుస్తకం చదివిన జ్ఞాపకం జీవితంలో మళ్ళీ మళ్ళీ చాలా వానల్లో మనసులోకి తోసుకొస్తుంది .

నీతి ఏమిటంటే జీవితం ఎంతో చిన్నది కనుక బెంతాం చెప్పినట్టు, సంతోషమనే సుఖాన్ని ఇచ్చే మంచి పుస్తకాలే చదువుకోవలెను.ఇలాటి కష్టాల పుస్తకాలు చదివేసి మనసుని కష్ట పెట్టుకోరాదు .

30, జూన్ 2011, గురువారం

సుఖ వాదం ...!


ఇవాళ నీతి శాస్త్రం తీసుకున్నాను చదువుదామని .అందులో అత్యున్నత సుఖం గురించి ప్రతిపాదిస్తూ... సుఖమే అత్యున్నత జీవిత లక్ష్యం కాబట్టి , ఏవిధంగా సుఖాలను ఎంచుకోవాలన్నది చాలా ముఖ్యమని చెపుతాడు బెంతాం . అందు కోసమని ఆయన సుఖాల గణిక[caliculas of pleasures ] ఒకటి రూపొందించాడు ...

1. సుఖ తీవ్రత [pleasure intensity ]

2. సుఖ కాల పరిధి [pleasure duration]

3.సుఖ నిశ్చితత్వం[pleasure certainity]

4.సుఖ సామీప్యం [pleasure propinquity ]

5.సుఖ ఫలీకరణ [ pleasure fecundity ]

6. సుఖ స్వచ్చత [pleasure purity ]

7. సుఖ విశాలత లేక విస్తృతి [
pleasure extent]

తక్కువ తీవ్రత కలిగిన సుఖం కంటే ఎక్కువ తీవ్రత కలిగిన సుఖానికి ప్రాధాన్యం ఇవ్వాలి .క్షణిక సుఖాల కంటే దీర్గ కాలం సుఖం ఇచ్చేవి వాన్చించాలి .అనిత్యమైన వాటి కంటే నిత్యమైన సుఖాలు ,అగోచరమైన వాటికంటే సంభవమైన సుఖాలు అత్యున్నతమైనవి .కష్టాలతో కలిసి ఉండే సుఖం కంటే అత్యధిక సుఖాన్ని ఇచ్చేది ,తక్షణ సుఖం కంటే భవిష్యత్ జీవితంలో సుఖాన్ని ఇచ్చేవి మనిషి ఎన్నుకోవాలి అంటాడు .

మరి అనిత్యమైనది ,క్షణికమైనది అని తెలిసి కూడా ఎక్కువ తీవ్రత కలిగి ఉంటే ,ఆ సుఖం వాంచితమా ..కాదా..అని అనిపించేసింది .

ఇదొక సందేహం కూడానా ఏమిటి దాని పేరే కర్మ అని ఆలోచించుకున్నానా, తర్వాత పేజీల్లో దానికి మిల్ ఇలా సమాధానమిచ్చాడు .


అత్యున్నత సుఖాలు అధమ సుఖాల గురించి చెప్తూ j.s.mill ..''it is better to be a human being dissatisfied than a pig satisfied ;better to be a socrates dissatisfied than a fool satisfied .and if the fool or the pig is of a different opinion it is because they only know their own side of the question .the other party to the comparision knows both sides .'అంటాడు

జంతువులు ,మూర్ఖులు ఇంద్రియ సంబంధ సుఖాలు వాంచిస్తారు .అయితే అత్యున్నత అధమ సుఖాలు తెలిసిన వారు సుఖాల విలువను సరిగా అంచనా వేయగలరు .అటువంటి వారు అత్యున్నత సుఖాన్ని వాంచిస్తారు .గౌరవనీయ భావనలు గుర్తించ లేని వారు ,మానసిక బలహీనులు ,ఇంద్రియ లోలురు అధమ సుఖాలను కోరుకుంటారు అనే వాస్తవాన్ని అంగీకరిస్తాడు మిల్ .

29, జూన్ 2011, బుధవారం

మంచి వాన పాట ఒకటి ...!







మొన్న నా పీ హెచ్ డీ వైవా కోసం హైదరాబాద్ కి ప్రయాణిస్తుంటే చివరి వరకూ నాకు తోడు వచ్చిన పాట ఇది .వింటూ వింటూ వింటూ వెళ్లాను .విమల కంటమంటే నాకు ఇష్టం .మొదట అందుకోసం పాట వింటాను .ఆ తరువాత అందులో సాహిత్యం .

ఆవిడ కంటం''ప్రజల కోసం గజ్జె కట్టి ఆడే ''ఆవిడలానే సున్నితంగా ఉంటుంది .దృడంగా ,ధైర్యంగా ,వెరపు ,బెరకు లేక అతి స్పష్టం ఉంటుంది .వింటూ ఉంటే ..వింటూ, వింటూ ఉంటే విమలక్కా అని పిలుద్దామనే ఆప్యాయత వేస్తుంది .


పొద్దున్నే ఏదో విషయమై ఫోన్ చేస్తే స్నేహితుడు,ప్రయాణం చేస్తూ చేస్తూ ఉన్న వాడు , కదిలించ గానే ''ఆడుదాం డప్పుల్ల దరు వెయ్ ర''అని మురుసుకుంటూ పాడాడు .విన గానే ఎందుకనో చప్పున పెద్ద దిగులొకటి కమ్మేసింది ..ఇప్పటికీ ఉదయం కమ్మిన ఆ దిగులు మేఘం ఉండి ఉండి కురుస్తూనే ఉంది.



వానొచ్చేనమ్మ వరదొచ్చేనమ్మ

వానతోపాటుగా వణుకొచ్చేనమ్మ

కొట్టాముపై రాలి మట్టంత కడిగింది

కోడి పుంజు జుట్టు కొంటెగా తాకింది

చెట్ల కురులపై బొట్లు బొట్లుగా రాలి

గట్ల కుండల మీద గందమై పారింది

దున్న పోతులనేమో దుంకు లాడించింది

బర్ల మందలనేమో సెర్లలోముంచింది

గద్ద గూటి లోని గడ్డీని తడిపింది

గువ్వా గూటిలోని గులక రాళ్ళని జరిపింది

తీతువు గొంతును తియ్యగ జేసింది

పరికి పిట్ట ముక్కు పాసిని కడిగింది

ఎద్దు మూపురాన్ని ముద్దాడి మురిసింది

ముళ్ళు గర్ర వళ్ళు సల్లగ జేసింది

కొత్త నీటితో వచ్చి కోనేట్లో చేరింది

పచ్చని నాసుని పలగ జేరేసింది

చేపకేమో నీటి పులుపుని దాపింది

కొంగకేమో విందు కోరికని రేపింది

కప్పల పండగ కండ్లారా జూసింది

తాబేలు పెండ్లికి తల నీరు పోసింది

యెర్ర భూముల నెర్రెలన్నీ పూడ్సినాది

రేగడి నేలను మాగాణి జేసింది

తువ్వా గడ్డలల్ల కవ్వాతు జేసింది

సౌడు భూముల జూసి దౌడు తీసినాది

పొంగేటి కల్లుల పోసింది చన్నీళ్ళు

ఈత సెట్టు లొట్టి మూతి కడిగింది

తాను రాక ముందే తూనీగల లేపి

తన పాటకే తాను దరువేసి ఆడింది

తెల్ల మల్లెనింక తేటగా జేసింది

యెర్ర మల్లెనే కడిగి ఎరుపునే పెంచింది

తులసమ్మ దీపము చిప్పలో చేరింది

నీరెండ పులుపుకు నిగ నిగ లాడింది

పారాడి పారాడి గోదారిలో కలిసి

సీతమ్మ పాదాలు శిరసొంచి తాకింది

వంకలు డొంకలు వనములన్నీ తిరిగి

కృష్ణమ్మ వడిలోన ఇష్టంగా ఆడింది

దున్దుభీ తల పోసి దుమ్మంత కడిగింది

అందమైన ఇసుకను అద్దంలా జేసింది

ఇష్టమే లేకున్నా పట్నానికోచ్చింది

ముక్కు మూసుకొని మూసీలో మునిగింది

యములాల రాజన్న వేడుక జూసింది

ముందింటి కోయ్నాక మైల కడిగేసింది

సూఫీల దర్గాల సుట్టు దిరిగీ మొక్కి

ఎగిరే దక్కిల కేమో ఎండీ మెరుపద్దింది

రావి ఆకుల నుండి రాలి పడి రాలి పడి

సాధుల సామాది సన్నిధికి చేరింది

అమరూల స్థూపానికి అభిషేకమూ జేసి

సుత్తీ కొడవలి మీద ముత్తేమై మెరిసింది .

[రెండు మూడు పదాలు అర్థం కాలేదు .తప్పులు పడి ఉండచ్చు .]