మీ పిల్లలు మీ పిల్లలు కారు. వాళ్ళు జీవితేచ్చకు జన్మించిన వాళ్ళు . వాళ్ళు మీ ద్వారా వచ్చారు తప్ప మీ నుండి కాదు . వాళ్ళు మీతో ఉన్నా మీకు చెందరు .మీరు వాళ్ళతో ఉండాలని ప్రయత్నిస్తే ప్రయత్నించారు గాక, వాళ్ళు మీలా ఉండాలని మాత్రం అనుకోకండి. ఎందుకంటే జీవితం వెనక్కు మళ్ళదు గనకా, నిన్నటితో మళ్ళీ అతుక్కుపోదు గనకా ..ఖలీల్ జిబ్రాన్

17, ఫిబ్రవరి 2015, మంగళవారం

అమ్మా... అమెజాన్ లో బిడ్డలు దొరకరా ?

ఈ పోస్ట్ సిలిగురిలో రాయాల్సిన పని .  రాయాలనుకుంటూనే ఇప్పటి వరకూ చేసేసాను .చాలా మరిచి పొయాను. అట్లాగే మనం పిల్లల అల్లరులన్నీ మరిచి పోతామనుకుంటా . 

పాపాయికి సిలిగురికోచ్చాక హటాత్ గా తమ్ముడో, చెల్లో   కావాలని కోరిక మొదలయింది . అదీ అప్పటికప్పుడు కావాలని . అప్పుడిక షీలాని ,అనితాని ఇన్వాల్వ్ చేసి ఆ విషయం మీద రీసెర్చ్ మొదలెట్టింది . మా అమ్మాయికి విపరీతమైన   మేనేజ్మెంట్ స్కిల్స్ వున్నాయి ,ఎటువంటి  మనుషుల్నైనా తనని ప్రేమించేట్టు చేసుకోగలదు . అలా తనేం చెప్తే అలా వినేట్టు షీలా ని మేనేజ్ చేసింది . షీలా ఏం చెప్పిందంటే బెంగాల్లో యాభై రూపాయలకి కూడా బిడ్డ దొరుకుతుందని . పాపాయి సేవింగ్స్ అప్పటికి ఎయిట్ తౌసండ్ . ఎయిట్ తౌసండ్ డివైడేడ్ బై  ఫిఫ్టీ అనుకోండి ... అదన మాట సంగతి .పాయికి చాలా ధైర్యమొచ్చి అమ్మని బైపాస్ చేసి బిడ్డని వెతక బట్టింది . పొద్దున్న లేసినదగ్గర నుండి వాళ్ళతో ఒకటే మంతనాలు . మధ్యలో షీలా ,''మేడం వాళ్ళింటికి రాబోయే బిడ్డ ఎవరో ... అదృష్టం''అని చేతులెత్తి టాకూర్ కి ప్రణామ్  చేసుకునేది .మా అమ్మాయి మాటల్ని ఖండించడమో ,సలహాలివ్వడ మో ,చదువుకో అని పదే పదే  వుపన్యసించడమో  వంటివి నాకు ఇష్టం లేని పనులు ,అందుకని నేను ఈ చోద్యమంతా కేవలం చూస్తూ వుండేదాన్ని .

కానీ పాపం, పాపాయి ఈ ప్రయత్నాలన్నీ విఫలం చెందాయి . అప్పుడిక హటాత్ గా ఓ రోజు దాని దగ్గర ట్యూషన్ చెప్పించుకోవడానికి వచ్చే అబ్బాయికి దాని తమ్ముడి పదవిని ఇచ్చేసింది . ఒక రోజు అమాయకంగా చదువుకని వచ్చిన వాడిని పటుకుని మొదట శుభ్రంగా తల స్నానం చేయించింది . భోగీందర్ ని బజార్ కి పంపి కొత్త బట్టలు తెప్పించింది . ఆ తర్వాత చదువు చెప్పడం మొదలు పెట్టింది . పాపాయి తమ్ముడు చాలా తెలివయిన వాడు . టీచర్ ''దీదీ '' కాగానే చదువు అటకెక్కించాడు . పాపాయి ఏమిటేమిటో తినబెడుతుంది కదా వాడికి ,అవంతా ఎక్కువై తింటే తినడం , లేదంటే పారేయడం మొదలు పెట్టాడు . అది చూసి అప్పుడు అక్కడే వున్న నా తమ్ముడు ''అట్లా వేస్ట్  చెయ్యడం ఎందుకురా పాపాయి'' అని ఖండించబోతే '' పేద వాళ్ళంటే నీకెందుకంత చులకన రా శ్రీకాంత్ '' అని కయ్యానికి కాలు దువ్వింది కమ్యునిస్ట్ సిద్దాంతంతో . అంత చేసినా పాపం ఆ తమ్ముడు రాత్రయ్యేసరికి ''అమ్మ కావాలో మొర్రో మొర్రో ''మని ఏడ్చాడు . ఆ రోదనకి దడుచుకుని పాపాయి ముఖం చిట్లించేసి తాత్కాలికంగా తమ్ముడు ప్రయత్నాన్ని విరమించేసింది .

ఇది జరిగిన మూడేళ్లకి ఇప్పుడు పాపాయి వాళ్ళ మామకి కొడుకు పుట్టాడు . ''బిడ్డ పుడితే నాకిచ్చేయ్యాలి ''  అని ముందే చెప్పి ఉంచింది కదా పాపాయి . అయినా ఇస్తారో ఇవ్వరోనని దానికి సందేహం . ఎందుకంటె అప్పుడు షీలాతో కలిసి చేసిన వేటలో అయిదుగురు బిడ్డల తల్లి , కడుపులో వున్న ఆరో...  బిడ్డని ఇమ్మని అడిగితే, చిరాకు పడటమే కాక ''కంటే తెలుస్తుంది నెప్పి ''అని షీలా మీద విరుచుక పడ్డదట . పాపాయికి ఆ మాట అలానే మనసులో వుంది . ఆ సందేహాన్ని నాతో చెప్తూ వచ్చింది ఇన్ని రోజులూ . ఇప్పుడిక ఇవాళ మామ కొడుకుని  పుట్టిన మూడో రోజునే  ''తమ్ముడ్ని ఇంక  మాకిచ్చేయమని చెప్పు మమ్మీ'' అని మా అమ్మకి రాయబారం బాధ్యతలు చెప్పింది . అది విని మా అమ్మ, తెలివి తక్కువ , నిజాయితీ ఎక్కువా అయ్యి ''వాళ్ళెందుకు ఇస్తార్రా మీనాలు ''అనేసింది  . అంతే పాపాయి బోర్ల పడుకుని రెండు  గంటలు ఆరున్నొక్క రాగం తీసి ,ఆ రాగం లోనే పక్కనే వున్న నారాయణమ్మని ఇప్పటికిప్పుడు బిడ్డలెక్కడ దొరుకుతారో  విచారించింది . విచారిస్తూ హటాత్ గా నా వైపు తిరిగీ.. ..
''అమ్మా... అమెజాన్ లో బిడ్డలు దొరకరా ? '' అని ప్రశ్నించింది.



19, జనవరి 2015, సోమవారం

సావిత్రి



పాపాయి  మంచి లీడరు !
మహానటి సావిత్రి గారి అభిమాని .

ఈరోజు మిద్దెపైన ఆడుకుంటూ వున్నారు పిల్లలందరూ.
నేనూ అక్కడే వున్నాను .

నా మొబైల్ లో ఏదో చూస్తూ పాపాయి  పక్కనున్న అంజూ ని అడిగింది

అంజూ నేనెలా వుంటాను ?
అంజు: సావిత్రి లాగా అక్క....

రేయ్  హనుమోష్ నువ్వు చెప్పురా నేనెలా వుంటాను ?
హనుమోష్ ముద్దుగా ,మందంగా మాట్లాడుతాడు .
వాడు కూడా సావిత్రి లాగా ... అన్నాడు

పాపాయి :ఊ ...

ఇదంతా విని నేను బహు ఆశ్చర్య పడి అసలు వాళ్ళు సావిత్రిని చూసారా పాపాయి అన్నాను .
పాపాయి :ఆ ... చూపించా

అదన మాట విషయం .

ఇప్పుడు చెప్పండి పాపాయి లీడరేనా ?

14, జనవరి 2015, బుధవారం

పాపాయి రాసిన తొలి గేయం !

పాపాయి తెలుగు నేర్చుకోవడం మొదలు పెట్టి దాదాపు ఆరు నెలలు అయింది . ఈ వారం రోజులుగా రోజుకు మూడు ఆటలు చొప్పున పాత సినిమాలు చూస్తూ వుంది . గోదారీ గట్టుందీ ,ఔనంటే కాదనిలే ,బొమ్మను చేసి ప్రాణము పోసి ,నీవు లేక వీణా ... వంటి పాటలు వింటూ వస్తూ వుంది . అందుకనేమో ఈ రోజు పాట  రాస్తానమ్మా అని చెప్పి ఈ పాట రాసింది .


ప్రకృతి 

 చల్ల చల్లని గాలి వీస్తుంటే 
నేను చెట్లు క్రిందట బానిసలా వుంటే 
భలే ఉందిలే 

ఆడవారు ముగ్గులేస్తూ వుంటే 
సంతోషంగా ఉందిలే 

బంతి పూలు 
అలా మెదలుతూ వుంటే 
భలే ఉందిలే 

ఆకాశంలో పక్షులు 
ఎగురుతూ వుంటే 
సంతోషంగా ఉందిలే 

నీటిలో చేపలు 
ఎగురుతూ వుంటే 
భలే ఉందిలే 

నేను ఇలా ఈ జగమును 
సృష్టించినది ఎవరు అని 
తెలుసుకోలేక బాధపడుతూ వుంటే 
నవ్వొస్తుందిలే 

8, డిసెంబర్ 2014, సోమవారం

పాపాయి రాలేదు

 ఈ సారి ప్రాతినిధ్యకు పాపాయి రాలేదు . అడుగుతే నేను రాలేను నాలుగు రోజులు స్కూల్ కి వెళ్లకుంటే ఇన్కంప్లీట్ పడతాయి అన్నది . నేను దాని శ్రద్దకి  చాలా ముచ్చట పడి సరే అన్నాను . కానీ చాలా మిస్సయ్యాను . లోలోపల చాలా గర్వంగా వుంటుంది దాని స్వంత నిర్ణయ శక్తికి .ఆవిష్కరణ ఫోటోలు ఇక్కడ చూడొచ్చు  prathinidhya.blogspot.in

7, డిసెంబర్ 2014, ఆదివారం

విన్నపం .. ..




 ఇది తప్పక చదవాల్సిన కథ . నిర్భయ న్యూస్ ఐటెం గానే మనకు తెలుసు . కానీ నిర్భయ లేదా అభయ మన ఇంటి అమ్మాయిలయితే ఆ బాధ ఎలా వుంటుందో తెలుసుకోవాలంటే ఈ కథని  చదివి తీరాలి. అత్యాచారానికి గురైన అమ్మాయిల అంతరంగ ఘర్షణ ని చిత్రిక పట్టిన కథ ఇది . రచయిత్రి కుప్పిలి పద్మ గారికి కృతజ్ఞతలు .


http://patrika.kinige.com/?p=4307