నిన్న రాత్రి పాపాయి మూడు కథలు విన్నది .1.నా బెలూన్లు 2.పశువుల సంత 3.సూర్యుని దస్తీ .నా బెలూన్లు కథకి పాపాయి కొంచెం పెద్దదై పోయింది .పశువుల సంత పెద్దేమి బాలేదు .ఇక మూడవది సూర్యుని దస్తీ .పాపాయికి ఈ కథ పర్లేదు నచ్చింది ..అంటే ఆ మొన్న రాత్రిటి కీలు గుర్రం అంత నచ్చ లేదు కానీ నచ్చింది .కానీ నాకు మాత్రం ఎంత నచ్చేసిందో .కథేమిటంటే ...
ఒక రోజు సూర్యుడికి జలుబు చేసింది ..యెట్లాగ అంటే.. మరేమో వానొస్తున్న రోజు చెప్పులేసుకోకుండా బయటకొచ్చి, కనిపించిన నీటి గుంటల్లో అంతా కాళ్ళు పెడుతూ ,బుడుంగ్ బుడుంగ్ మని తిరిగేసాడట.బట్టలన్నీ తడిసి పోయాయా.. అయినా సరే మంచి అబ్బాయిలా యింటికెళ్ళకుండా,ఇంకా వాగులు వంకలు చుట్ట బెట్టాడట .చెట్లపై నుంచి దుముకుతూ వెళ్ళాట్ట .మరి చేయదేమిటి జలుబు ..చేసిందాముందు ముక్కు కాస్తా దురద పుట్టి ,ఆపై వణుకు పుట్టి మరేమో" హా ఆ.. ఆ ఛి" మని తుమ్ములోచ్చాయి ,ఒక తుమ్మేమిటి ..బోలెడు వచ్చేశాయి .అంచేత ముఖమేమో బోలెడు కంది పోయిందట .
అప్పుడేమో భూమాత సూర్యుడికి వెచ్చగా పక్కలో వేన్నీళ్ళ సీసా పెట్టింది .అయినా సూర్యుడికి కలలో కూడా తుమ్ములే తుమ్ములట.. పాపం కదా ! కాస్తా ఆడుకునే సరికి ఎంత కష్టమొచ్చేసింది కదా !సరే అప్పుడేమో భూమాత పూమాతని పిలిచిందట ..పూ మాత.. ఎంత బాగుంది కదా ఈ మాట.{ టింకర్ బెల్ మూవీలో పూల ఫెయిరీలు ఉంటారు వాళ్ళు కూడా బలే ఉంటారు } .ఆ తరువాత పూ మాత సూర్యుడికి వెచ్చటి మందిచ్చిందట .ఏం మందో తెలుసా తేనెలో రంగరించిన కలలు -పొద్దు తిరుగుడు పూలు ,మల్లెలు ,మొల్లలు రోజాలు ,తులసి వంటి అనేక మెత్తని మొక్కల గురించిన కలలట.యెంత మంచి మందు కదా మనకొచ్చే రోగాలకి కూడా ఇలాటి మందు ఎవరైనా ఇస్తే ఎంత బాగుండు !
ఆ తరువాతేమో సూరీడు కోసం ఒక దస్తీని కూడా నేసి ఇచ్చిందట పూమాత .యెట్లా ...నేసిందంటే ,మరేమో గుడి ప్రాంగణంలో నిదురిస్తున్న నీలి పూలు ,ఆకాశంలో సంధ్యా నీలాలు ,సెలయేటి పక్కన మొలిచిన గడ్డి పచ్చ ,వెదురు మొక్క పసుపు ,తుమ్మెద మీసాల పసుపు ,సముద్రపు అలలపై సూర్యాస్తమయ కుంకుమ రంగు ,మన అడవుల్లో వేసం కాలంలో పండే పళ్ళ ఎరుపు రంగుల్ని ఎంచుకుందట.
.
అంతే సూర్యుడికి జలుబు పోయింది ,అయినా ఎందుకైనా మంచిదని ,సూర్యుడు ఏం చేసాడంటే పొద్దుటే బయటకి వెళ్ళేప్పుడు దస్తీ కూడా పట్టికేల్లాడట .ఆ దస్తీ ,మరేమో ,ఎండతగిలేసరికి రంగులతో తళతళ మన్నదట .అప్పటి వరకు వానలతో విసిగి పోయిన ఒక చిన్ని పాపాయి, ఆ హరివిల్లుని చూసి అనుకుందట, వర్షాన్ని ఈ రిబ్బను కట్టేసింది అని .కథ ఇలా ముగుస్తుంది "అవును మరి ,మీకు నాకు అది హరివిల్లు కాదు, సూర్యుని దస్తీ అని తెలుసు కదా !"అని .
కథ చదువుతుంటే, మొదటేమో బుడుంగుమని మునుగుతూ ఆడుకుంటున్న చిన్ని అబ్బాయి ముఖం మదిలో కొచ్చింది .ఇంకా పూ మాత మందు కళ్ళలో మెదిలింది ,చివరిగా రంగుల హరివిల్లు సూర్యుని దస్తీ అనే ఒక పోలిక మనసులోకి చేరి మరి కదలకుండా అతికి పోయింది .పాపాయి వాళ్ళ అమ్మకి బ్రతికినంత కాలం, హరివిల్లుని సూర్యని దస్తీ చేసి ఇచ్చేసాడు తరుణ్ చెరియన్ ..ఇతనెవరంటారా ఇంత మంచి రంగుల కథ చెప్పిన కథకుడు .బొమ్మలేమో అజంతా గుహ టాకూర్ దా,తెలుగులో చెప్పింది రాధా విశ్వ నాథ్ .
8 కామెంట్లు:
కష బాగుంది కానీ దస్తీ అంటే అర్ధం కాలేదు. దస్తీ అంటే గొడుగాండీ?
కథ బాగుంది...
ఇంద్రధనస్సు ను
అప్పుడెప్పుడో చిన్నప్పుడు మాపల్లెటూరిలో లో చూసినదే గుర్తు.superb గ wonder గ అనిపించేది.
తర్వాత ఎన్నిRAINS కురిసిన
మరి కొన్ని RAINBOWS వచ్చినా అంతగా గుర్తులేదు
.పసితనం లో చిరుజల్లులు, హరివిల్లులు అన్నిఅధ్బుతం అన్పిస్తాయ్ అసలు పసితనమే అధ్బుతం కదా.
bhalE baaguMdaMDi..very cute..
indian minerva గారు!
దస్తీ = రుమాలు ,చేతి గుడ్డ ,కర్చీఫు {handkerchief} అని,thank you
కృష్ణ గారు !చిన్నప్పటి చిరు ఝల్లులే కాదు పండుగలు కూడా ఎంత బాగుండేవో కదా .ఇప్పుడు రోజూ పండుగే ,రోజూ పండుగ లేదు .మనం పెద్ద వాళ్ళం అయిపోయాం ,లోకం పాత బడి పోయింది .కొత్తగా స్పందించడానికి ఏమున్నాయి కదా ?
@trishna మీ అమ్మాయికి కూడా హరివిల్లుని సూర్యుని దస్తీ చేసి ఇచ్చేయండి మరి ,ఇంకానేమో తరుణ్ చెరియన్ కి థాంక్స్ చెప్పేయండి.
మొత్తానికి నేను తెలుగులో మొదటిసారి రాస్తున్నాను. నీ బ్లాగ్ కోసం నేను ఒక కొత్త విషయం తెలుసుకున్నాను. చాలా బాగుంది నీ బ్లాగ్. ఇంక నా కామెంట్స్ తెలుగులో చూద్దువుగాని.
@lakshmi నా బ్లాగ్ ఎంత బాగుండినా, నీ కామెంట్స్ అంత అందంగా , నీ పొడుగు జడ అంత అందంగా ఉండబోదు భాస్కర వెంకట సుబ్బలక్ష్మి ..i'm sure this is my best bet.
కామెంట్‌ను పోస్ట్ చేయండి