మీ పిల్లలు మీ పిల్లలు కారు. వాళ్ళు జీవితేచ్చకు జన్మించిన వాళ్ళు . వాళ్ళు మీ ద్వారా వచ్చారు తప్ప మీ నుండి కాదు . వాళ్ళు మీతో ఉన్నా మీకు చెందరు .మీరు వాళ్ళతో ఉండాలని ప్రయత్నిస్తే ప్రయత్నించారు గాక, వాళ్ళు మీలా ఉండాలని మాత్రం అనుకోకండి. ఎందుకంటే జీవితం వెనక్కు మళ్ళదు గనకా, నిన్నటితో మళ్ళీ అతుక్కుపోదు గనకా ..ఖలీల్ జిబ్రాన్

12, మార్చి 2011, శనివారం

జైలులో కాసేపు !


ఇవాళ జైలుకి వెళ్ళాను .ఈ ఊరి జైలులో ఖైదీలకు ఒక ప్రత్యేక సమస్య ఉంది .చాలా రోజుల నుండి వెళ్ళాలనుకుంటూ వెళ్ళలేక పోయాను .ఆ సమస్యను కొన్ని కారణాల రీత్యా ఇక్కడ ప్రస్తావించటం లేదు .పిల్లలు ,,మగ వాళ్ళు పర్లేదు. స్త్రీలు భోరు భోరుమని ఏడ్చారు .నా మొబైల్ నుండి ఇళ్ళకి ఫోన్ చేసి, నా ఫోన్ ని గంగా యమునల్లో ముంచి తీసారు .పని చేస్తుందో లేదో చూడాలి ..

ఒకావిడ ఒంటరిగా నిలబడి కళ్ళ నీళ్ళు పెట్టుకుంటూ కనిపించింది .పలకరిస్తే కోడల్ని చంపేసిన కేసులో వచ్చానని చెప్పింది ,ఎట్లా జరిగిందంటే ..ఆ అమ్మాయే ఎట్లాగో చచ్చి పోయింది ,అయినా కొడుకుకి పెళ్ళి చేసేది కోడల్ని చంపుకోడానికా ?ఇక్కడ ఉన్న వారెవరూ తప్పు చేసిన వారు కాదు,అందరూ నిర్దోష్హులే అంది .కావచ్చు కూడా ఇదో తరహా చర్చ.

కారణాలేవైనా చాలా స్పష్టంగా స్త్రీలు పురుషులు వేర్వేరు .వేర్వేరు అంటే సాదా సీదా వేర్వేరు కానే కాదు ,రెండు భిన్న జాతులు .ఫెమినిసాలు ,మేల్ చ్చావనిసాలు కేవలం జాతుల మధ్య కొట్లాటలే.

నా భర్త చాలా వ్యధ చెందాడు వారి యేడుపులతో .సరదాగా ,నేనన్నాను జనవరి 19 న పాపాయి సెలవలు అయిపోయి తిరిగి వచ్చిన తరువాత ఇదేకదా నేను మళ్ళీ గేటు బయటి ప్రపంచాన్ని చూట్టం... ఇది కూడా జైలే కదా అని .తనన్నాడు , ఒక వేళ ఇది జైలు అయితే కర్మా భట్టాచార్య అన్నట్టు [ఈ ఊరి ప్రముఖ చిత్రకారుడు ] ప్రపంచమే జైలు ,మొన్న ఇస్కాన్ వాళ్ళు , మనం బైట ఉన్నామని సంతోష పడతాం .కానీ మనం జైల్లో ఉన్నాం .ఈ బంధాలు మమతలు ఇవన్ని జైలే అని చెప్పారు ...మరి దానికేమంటావు అని .

మరి ఈ ఇస్కాన్ వాళ్ళని ,కర్మా భట్టాచార్యని నిజం జైల్లో ఉంచితే ఏం మాట్లాడతారో చూడాలి .అసలు ..రూసో స్వేచ్చగా పుట్టిన మానవుడు సర్వత్రా సంకెళ్ళ మయమయ్యాడు ఈ వైరుధ్యాన్ని భరించడమెట్ల అన్నాడు కానీ, మనిషి స్వేచ్చగా ఎక్కడ పుట్టాడు ,ఈ సిద్దాంతంలో లోపముందేమో.. తరచి చూస్తే అసలు కర్మ భట్టాచార్జీ ,ఇంకా ఇస్కాన్ వాళ్ళే కరక్టేమో అనిపిస్తుంది కూడాను .చర్చించుకుంటూ పోతే అదో చింత ఎందుకు కదా !

కామెంట్‌లు లేవు: