మీ పిల్లలు మీ పిల్లలు కారు. వాళ్ళు జీవితేచ్చకు జన్మించిన వాళ్ళు . వాళ్ళు మీ ద్వారా వచ్చారు తప్ప మీ నుండి కాదు . వాళ్ళు మీతో ఉన్నా మీకు చెందరు .మీరు వాళ్ళతో ఉండాలని ప్రయత్నిస్తే ప్రయత్నించారు గాక, వాళ్ళు మీలా ఉండాలని మాత్రం అనుకోకండి. ఎందుకంటే జీవితం వెనక్కు మళ్ళదు గనకా, నిన్నటితో మళ్ళీ అతుక్కుపోదు గనకా ..ఖలీల్ జిబ్రాన్

11, ఏప్రిల్ 2011, సోమవారం

బెంగాల్ దేశపు సంత -గోరటి వెంకన్న పాట !

<

కిటికీలో నుండి కనిపిస్తున్న కటిక చీకటిని చూస్తూ నా భర్త ,నా జ్ఞాపక శక్తికి పరీక్షపెడ్తూ ''సక్కనైన చిక్కని రాత్రి ''పాటలోని చీకటి వర్ణనని గుర్తు చేయమని అడిగాడు ,యదావిధిగా నాకు జ్ఞాపకం రాలేదు .మొబైల్ తీసి ఆ పాట ఆన్ చేసాడు , పాట తరువాత ఈ ''సంత మా ఊరి సంత ''పాట మొదలైంది .చీకటిలో ఆత్మలు, శరీరాల ఉనికిని మరచి పోతాయి కాబోలు ,ఎన్నో సార్లు విని వున్నా ఈ సారి ఈ పాట కొత్తగా తోచింది .. బెంగాల్కి రావడానికి ముందు నాకు సంతని చూసిన అనుభవం ఎప్పుడూ లేదు. బెంగాలీలో సంతని'' హాట్ ''అంటారు .ఇక్కడ ప్రతి ప్రాంతం లోను సంతలు జరుగుతాయ్. శనివారం సంత ..బుధ వారం సంత అంటూ వారాల పేర్లతోనో,మధుర హాట్ అంటూ ఆయా ప్రాంతాల పేర్లతోనో .

మేమున్న ఈ కూచ్ బీహార్ ప్రాంతంలో తేయాకు తోటలు ఎక్కువ .తేయాకు తోటల కూలీలకి వారానికో సారి, కూలీ డబ్బులు చేతికొస్తాయి .వారి కోసమని ఆ రోజుల్లో సంత నడుస్తుంది . దీనిని ''బగానేర్హాట్ '', లేదా '' తోలపెర్ హాట్ ''అంటారు .వారపు కూలి డబ్బులతో ఇక్కడికి వచ్చిన వీరు కొని ,తిని ,తాగి ఇళ్ళకు వెళ్తారు .ఈ సంతలకి పట్టణ ప్రాంతపు సంతలకి ఉన్న ముఖ్యమైన తేడా.. మధువు దొరకడం ,దొరకక పోవడం .

బహుశ ఇవాల్టి షాపింగ్ మాల్ ల వెనుకనున్న మూల సూత్రం ఇదేనేమో .మొదటి సారి నాకు అడుగడుగునా జీవం తొణికిసలాడే సంతని చూడగానే, ఒక మినీఏచర్ జీవనదిని చూసిన అనుబూతి కలిగింది .ఇంకా మానవీయ ప్రపంచంలోనే జీవిస్తున్నాననే నమ్మకం కలిగింది .సంతోషం వేసింది .అంతలోనే ఆ నమ్మకాన్ని చెదరగొడుతూ జర్మనీ, మెట్రో కాష్ అండ్ క్యారీ కి బుద్ద దేబ్ బట్టాచార్య పలికిన ఆహ్వానం గుర్తు వచ్చి దిగులువేసింది .

మనమివాళ గ్లోబలులం కదా .అనంత హస్తాల మార్కెట్ ఈ సంత మానవీయతని మింగి వేయకుండా ఎన్నినాళ్ళు ఆగుతుంది ??.బహుసా అది ఎంతో దూరం లో లేదనుకుంటా !ఇవాళ కనిపించే ఈ సంత రేపు మనకు ఓ పురాతన జ్ఞాపకం కావచ్చు ! గోరటి వెంకన్న ఈ పాటని వింటున్నప్పుడు ఎన్ని సార్లుఅనిపించేదో , ఎంత జీవితాన్నచెప్తున్నాడో ఈ కవి అని .

పూర్తిగా కాకున్నా, ఈ పాటలోని జీవితం నాకు అపరిచితం .అయినా కవి ,నన్ను ఎన్నెన్ని సార్లు ఉద్వేగపరిచాడో .పుట్టినూరోల్లోస్తే పట్టుకుని ఏడ్చిన కొత్త కోడలి కన్నీటి చెమ్మ ,విన్న ప్రతి సారి హృదయాన్ని తడుపుతుంది .కందూరు జానమ్మ కోపం ,సంతలో సంసారమంతా బయటేసుకుని ,ఇంటికెళ్ళే ముందు ఒక్కటయ్యే మొగుడూ పెళ్ళాల వైనం ముచ్చట గొలుపుతుంది ..''

కల్లు దుకునంలో కలిసి, తాగి ,తిని,వరుస గలుపుకొని వియ్యమందానీకి తయ్యారయ్యే ''లౌక్య రాహిత్యపు సామాజికతముందు, ఆడంబర ప్రదర్శనల మన సోషలైట్ పార్టీలు వెల తెల బోయి తల వంచుకుని కనపడతాయి .రవీంద్రుడు సంత పైన ఒక పద్యం రాసాడు .అదీ ఇక్కడ ఇస్తున్నాను.నాకు అర్థమైనంత మేర ప్రతి లైన్ క్రింద దాని అర్థాన్ని ఇచ్చాను .

రవీంద్రుడి సంతలో రోమాన్టిసిసం మాత్రమే కనిపిస్తుంది .గోరటి పాటలో జీవితపు అన్ని పార్శ్వాలు కనిపిస్తాయి .పాటచివర వినబడే చెంచు బీసన్నని బలిగొన్న, మొండి కర పత్రపు వైనం ఆశ్చర్యపరుస్తుంది .ఎలా చెప్పగలిగాడీ కవి ఇంత బండ, నగ్న సత్యాలని ఇంత సరళసున్నితంగా అని అబ్బురమేస్తుంది .

పాట పూర్తయ్యేసరికి ''గొంతు పిసికేసిన గోసలా రాజ్యం '' మనల్ని భయ పెడ్తుంది. ''సితికిన బతుకుల సంత'' ఆపుకోనీయకుండా ఏడిపించి వదుల్తుంది.ఇంత అద్భుతాన్ని కనుల ముందు ఆవిష్కరించిన... ఈ రాపు గొంతు ,మేధో కవి గాయకుడ్ని ఎంత కీర్తిస్తే మాత్రం సరిపోతుంది !

సాహిత్యం చదవండి
సంత మా ఊరి సంత -వారానికోసారి జోరూగా సాగేటి
సంత -మా ఊరు సంత
సుట్టు ముప్పై ఊర్ల పెట్టు జనమందరూ
పుట్ట పగిలి సీమలోచ్చినట్లోస్తారు
సోర సోరోల్లంత కాలి దారిలోన
తరిమినట్టు గుంపు పరుగుతోనొస్తారు
సేతగానోల్లంత పాత జీపులల్ల
కుక్కినట్టు ఎక్కి కూలవడొస్తారు
పెండ్లికోయినట్టు బండ్లు కట్టుకొని
కాపుదానపోల్లు ఆప కుండోస్తారు
కాయగూరల తట్ట ఆకు కూరల కట్ట
తమలపాకుల బుట్ట తంబాకు పొడిమట్ట
మిరపకాయల ఘాటు వొట్టి చేపల
అల్లమెల్లిపాయ కుప్పుకగ్గువ రేటు
సంత ముందరి బాట సాలె బట్టల మూట
హర్రేకుమాలని అరిసె బతుకు పాట
ఎండ తాపం చేత ఎగ పోసు కుంటోచ్చి
గోలి సోడాను జూసి కాళ్లాగి పోతాయి
పట్టుమాని మూరడెత్తు కూడా లేని పోరడు
సిత్రంగా గోళి సోడా కొడతాడు
రూపాయికే మంది
బిస్లరమ్మేటోడు సేటు బిత్తరపోతాడు

ఒట్టి రోజూ పిండగిర్ని సుబ్బయ్య సేటు
తోవ్వంటి పోయేటొల్ల పిలిసి ముచ్చట పెట్టు
సంత రోజెవ్వడన్న ఊకే పలకరిస్తే
కరిసినట్టు జూసి కయ్యిన లేస్తాడు
పిండి పట్టి పట్టి తిండి ధ్యాస మరిసి
సుబ్బయ్య ఆ పూట సుద్ద గుండోలుండు
తీరిక లేకుండ జల్లెడ తిప్పేటి
కందూరు జానమ్మ కారం గిర్నికి
కాయలెక్కువ తెచ్చి తక్కువాని జెప్పి
పొడి తక్కువొచ్చేనని పోట్లాటకొస్తుంటే
కండ్లల్ల ముక్కుల్ల ముండ్లు మొలసినట్టు
కందూరు జానమ్మ కళ్ళెర్ర జేస్తది బజ్జీలు బోండాలు కాల్చిన సీకీలు
మద్యాహ్నమే కల్లు దుకునానికోస్తాయి
కలిసి తాగి తింటూ వరస కలుపుకొని
వియ్యమందానీకే తయ్యారుగయ్యేరు
సంత కల్లు తోనే పిల్ల పెళ్ళి ఖాయం జేసి
పేరు బలమడుగుటకు నేరుగా పొయ్యేరు
తాగి పెండ్లం తోని తగవు వడతాడొకడు
తాగమని పెళ్ళాన్ని బ్రతిమిలాడుతడొకడు
సీరా బేరం కాడ సిన్న గొడవ జరిగి
అలిగిన పెళ్ళాన్ని అడుక్కుంటాడొకడు
సంతలో సంసారమంత బయటేసుకొని
ఇంటికొయ్యేముందు ఇద్దరొకటవుతారు సంత నాడు ఊరి డొంకల్ల వంకల్ల
జంటలు కొన్నేమో జత కూడుకుంటాయి
హద్దులు అదుపులు అన్ని గాలికొదిలి
వలసిన మనస్సులు ఒక్కటయి పోతాయి
దూరమయ్యిన గాని ప్రేమ మిగిలినోల్లు
వారం వారం సంత పేరుతో కలిసేరు
అమ్మానాయిన మీద బెంగా వెట్టుకున్న
అత్తింటికొచ్చిన కొత్త కోడలు పిల్ల
సరుకుల నెపంతో సంత కంటని వొచ్చి
పుట్టినూరోల్లోస్తే పట్టుకొని ఏడ్సు
చెల్లెలు తమ్ముని సేమమడిగినాక అమ్మను,
రమ్మాని చెప్పి రాగాలు పెడతది ఎనుకటోలె మంది ఎగబడి కొనకున్న
కుంకుమ దాశెన్న సంత కెంతందం
ఎక్కబత్తి చిమ్ని లెవరడగ పోయిన
పూసల రాజవ్వ మోసుకోనోస్తాది
అద్దాలు కాటుక అగ్గువ పౌడరులు
పడుసు పిల్లల జూసి మెరిసి పోతుంటాయి
కాశీ మజిలీ కథలు ,దాశరథి శతకాలు
ఈపూరి కీర్తనలు, యాగంటి తత్వాలు
అరవైయేండ్ల కింద అచ్చు వేయించిన చిరుతోండ
ప్రహ్లాద భక్త రామ దాసు యక్ష గానాలన్ని
యాడ దొరుకునో గాని బుక్క
బాలయ్యకు బువ్వ పెడుతుంటాయి సంత బజారంత తన సొంతమైనట్టు
తైబంది సిట్టోడు కల తిరుగుతుంటాడు
సరకులమ్ముక ముందే రుసుం కట్టమాని
మారు బేరపోల్ల ప్రాణాలు తింటాడు
తరుగింత పోతుంది వొరుగింత పోతుంది
బుట్ట దంద బువ్వకేడ సరిపోతుంది
సందులో సందని సంగెం నాయకులు
సంతలో సభ పెట్టి పంచిండ్రు పత్రాలు
సెట్ల మందులమ్మే సెంచు భీసన్నేమో
కర పత్రంనిస్తే కండ్ల కద్దుకుండు
వాడు రాత రానోడాయే గీత రానోడాయే పత్రముల
మందు పొట్లమే కట్టిండు అమ్మకు దమ్మని
దగ్గుతోందని జెప్పి ఐదు రూపాయల
ఆ మందు కొనుక్కొని
మందు కల్లు సీస ముందుగ గుద్దిన్ డో
మర్సిపోయి సంత వీధిలో పడుకుండు
అర్థ రాత్రి ఏదో ఆపదొచ్చినట్టు
బందబస్తు పేరా బలగాలు దిగినాయి
పడుకున్న పోరని పట్టి లేపినారు
ఊరడిగి పేరడిగి జేబులన్నీ తడిమి
కరపత్రమును జూసి కండ్లెర్ర జేసిండ్రు
తాగిన మత్తులో వాడేమి వాగిండో
సంతలో పోరని బతుకంతా జూసిండ్రు సందెవాలి సంత మందెంత వోయినంక
సందడాగి సంత సావిడోలె అవ్వంగ
సంతవీధి చివరి రాగి వృక్షము కింద
వొంటిగా నున్నట్టి ఓ సాధు బైరాగి
బేరాలు సారాలు సరుకుల బారాలు
లాభాలు నష్టాలు ఇష్టాలయిష్టాలు
మువ్వలు పువ్వులు నవ్వులు
నటనలు వలపులు తలపులు
అరుపులు గెలుపులు వింతలెన్నో జూపే
సంతలో ఆ రేయి ఏ వింత ఎరుగని
పసి పోరని వట్టి ప్రాణాలు తీసేటి
పాపి ఘడియలు గాంచి
"బతుకే ఓ సంత "యని పసి పాపలా నవ్వే రవీంద్రుడి హాట్
కుమోర్ పాడార్ గరూర్ గాడీ
కుమ్మరిపల్లె ఎడ్ల బండి
బోజాయ్ కరా కొలశి హాడీ
బండి నిండా మట్టి కుండలు
గాడీ చోలాయ్ బంగ్షీ బొదన్
బండి తోలే వాడు వంశీ వదన్
సంగే జే జోయ్ బాగ్నే మదన్
వెంట ఉన్న వాడు మేనల్లుడు మదన్
హాట్ బోషేచ్చే సుక్రోబారే
సంత జరిగేది శుక్రవారం
బక్షీ గంజే పద్మా పారే
పద్మా నది ఒడ్డునున్న బక్షీ గంజ్ లో
జినిష్ పత్రో జుటియె ఏనే
వస్తువ్లు సమకూర్చుకుని వచ్చేరు
గ్రామెర్ మనుష్ బెచే కేనే
పల్లె ప్రజలు అమ్మేందుకు కొనేందుకు
ఉచ్చే బేగున్ పోటోల్ మూలో
కాకర కాయలు వంకాయలు పొట్ల కాయలు ముల్లంగి బేతేర్ బోనా ధామా కులో
పేము బుట్టలు చేటలు
సర్సే చొళా మైదా ఆటా
ఆవాలు సెనగలు మైదా గోధుమ
సీతేర్ ర్యాపార్ నక్షా కాటా
చలి కోసం అల్లిక ల శాలువాలు
ఝాన్జ్రి కొడ బేడి హాతా
అప్పచ్చుల మట్టి కుండ ,బాణలి ,పట్టకార ,చేయి గంటి
సెహర్ తేకే సస్తో చాతా
పట్టపట్టణం నుండి చవక గొడుగులు
కొలసి బొర ఎకో గుడే
కుండ నిండుగా బెల్లం
మాచీ ఎతో బెరాయ్ ఉడే
బెల్లం చుట్టూ ముసురుతున్న ఈగలు
కోడెర్ అంటీ నౌకా బేయే
పడవ నిండుగా ఎండుగడ్డి
ఆన్లో ఘాటే చాసీర్ మేయే తెచ్చిన రైతు అమ్మాయిలు అందో కానాయ్ పథేర్ పారే
రోడ్డు పక్కన గుడ్డి కన్నయ్య
గాన్ శునియే బిక్ఖే కోరే
పాట పాడి బిక్షమేట్టుతున్నాడు పాడార్ చేలే స్నానేర్ ఘాటే
స్నాన ఘాట్ దగ్గర పల్లె పిలగాళ్లు
జొల్ చిటియే సాతార్ కాటే
నీళ్ళు చిమ్ముతూ ఈత కొట్టే



6 కామెంట్‌లు:

కొత్త పాళీ చెప్పారు...

Brilliant. Fantastic! Beautiful thoughts, and ..fuller pics!
I had the good fortune to listen him sing this live.

Seenu చెప్పారు...

అబ్బా!!
ఎంత బావుందో. గొరటి వెంకన్న గొంతు చాల బావుంటుంది. గ్రేట్

తృష్ణ చెప్పారు...

సుధీర గారూ, చాలా బాగా చెప్పారు. మా వీధిలో జరుగుతున్న సంత గురించి కూడా నేను గతంలో ఒక టపా పెట్టాను. ఆ టపాలో మీరు వ్యాఖ్య కూడా రాసారు..:) కాకపోతే నేను జనరల్ గా రాసాను. మీరు ఫోటోలు, భావుకత్వం, కవిత్వం, పాట అన్నీ కలిపి అద్భుతమైన టపా అందించారు.
keep posting..!

గోదారి సుధీర చెప్పారు...

తృష్ణ గారు !కృతజ్ఞతలు .అవును .నాకు జ్ఞాపకముంది .అప్పటి వ్యాఖ్యలు కూడా జ్ఞాపకమున్నాయ్ .థాంక్ యు తృష్ణ గారు .

గోదారి సుధీర చెప్పారు...

thank you కొత్త పాళీ gaaru !

గోదారి సుధీర చెప్పారు...

thank you seenu gaaru!