ఇవాళ పుస్తకాలు సర్దే పని చేసుకుంటూ ఉంటె రాయలసీమ రాగాలు అని తెలుగు అకాడమి వాళ్ళ మోనోగ్రాఫ్ ఒకటి దొరికింది .అటిటు తిప్పుతుంటే ఈ గేయం తగిలింది .మా నాన్న రాయలసీమ ప్రాంతం వాడు .మా అమ్మది కోస్తా ప్రాంతం .ఉద్యోగం తదితర కారణాల వల్ల కోస్తా ప్రాంతంలోనే మేం ప్రస్తుతం ఉంటున్నాం .ఇప్పుడు మేం ఉన్న ప్రాంతంలో నీటి కరువు లేదు .ఐనా పాతాళానికి పైపులు వేసినా నీటి చుక్క దొరకని ప్రాంతం నుండి ,రైతు కుటుంబం నుండి రావడం వల్ల మా నాన్న దాహార్తి తీరనే లేదు .చుక్క నీళ్ళు వృధా అయినా విరుచుక పడతారు ,విసుగు పడతారు.ఎండిన గొంతు కథలు బోలెడు చెబుతుంటారు.ఈ గేయం చూడగానే మా నాన్న గుర్తొచ్చారు .కొంచెం దిగులేసింది .అందుకే ఇవాళ బ్లాగింగ్ చేసే ఉద్దేశ్యం లేకున్నా షేర్ చేయాలనిపించి ఇది రాస్తున్నా.. .
ఈ గేయం లో మార్మికత ఉందని, తనకూ అర్థం కాలేదని సేకర్త ,వ్యాఖ్యాత ఐన కే.మునెయ్య గారు ముందే చెప్పేశారు.మనకూ ఆ మార్మికత అర్థం కాదు ..కాని మొత్తం చదివేసుకున్న తరువాత ఏదో అర్థం ఐనట్టు తోస్తూ ఒక దిగులు మనసును తొల్చటం మొదలు పెడ్తుంది.
హరి కాంభోజి రాగ స్వరాలూ -ఆది తాళం
ఎండీ నిండనీ సెరువు కాడ
మెండుగ ఒక్క వాన గురిసె
నిండా నంటుందే
ఎండా నంటుందే -రామా
నిండీ నిండని సెరువు కింద
వచ్చిరి ఇద్దరు సేద్యగాళ్ళు
ఎద్దులు లేవన్నా ఒకనికి
మడకా లేదన్నా-రామా
ఎద్దు మడకా లేని వాళ్ళూ
ఎకరా సేద్యం చేసినారన్నా
గడ్డీ లేదన్నా గడ్డికి
వడ్లె లేవన్నా-రామా
గడ్డీ వడ్లు లేని దానికి
వచ్చిరి ఇద్దరు బేరగాండ్లు
తెచ్చిరి రెండు రూకలన్నా
సెల్లానంటాదే ఒకటి
మిగలానంటాదే -రామా
సెల్లీ మిగలని రూకా తీసుకుని
సిత్తూర్ సంతకు సరుక్కుపోతే
సంతే ఉందన్నా సంతలో
సరుకే లేదన్నా-రామా
సంతాగింతా సూసూకోని
మేడికుర్తి ఊరికి బోతే
ఊరే గానన్నా ఊళ్ళో
మందే లేరన్నా-రామా
మంది గింది లేని ఊళ్ళో
ఉండిరి ఇద్దరు కుమ్మరోల్లు
ఒకరికి తలకాయ లేదన్నా
ఒకరికి మెడకాయ లేదన్నా -రామా
తలకాయ మెడకాయ లేని వాళ్ళూ
చేసిరి రెండూ కుండాలన్నా
ఒకటి అంచే లేదన్నా
కుండకు అడుగే లేదన్నా -రామా
అంచూ అడుగూ లేని బానకు
పోసిరి రెండూ సేర్లా బియ్యం
ఉడక నంటాయో
రెండూ మిడక నంటాయో-రామా
ఉడికీ మిడకని కూటికైనా
వచ్చిరి ఇద్దరు చుట్టాలన్నా
ఒకనికి గొంతే లేదన్నా
ఒకనికి కడుపే లేదన్నా -రామా
గొంతూ కడుపు లేని వాళ్ళూ
తినిరి రెండూ షేర్ల బియ్యపు కూడు
లేస్తానంటాడే ఒకడు
లెయ్ లేనంటాడే -రామా