మీ పిల్లలు మీ పిల్లలు కారు. వాళ్ళు జీవితేచ్చకు జన్మించిన వాళ్ళు . వాళ్ళు మీ ద్వారా వచ్చారు తప్ప మీ నుండి కాదు . వాళ్ళు మీతో ఉన్నా మీకు చెందరు .మీరు వాళ్ళతో ఉండాలని ప్రయత్నిస్తే ప్రయత్నించారు గాక, వాళ్ళు మీలా ఉండాలని మాత్రం అనుకోకండి. ఎందుకంటే జీవితం వెనక్కు మళ్ళదు గనకా, నిన్నటితో మళ్ళీ అతుక్కుపోదు గనకా ..ఖలీల్ జిబ్రాన్

20, మార్చి 2011, ఆదివారం

రంగులు - రాగాలు !



"రంగులు - రాగాలు" ..ఈ మాట నాది కాదు ..బి . నర్సింగ్ రావు ది .అతని కవితల పుస్తకం పేరది.తిప్పుతుంటే ఒక కవిత తగిలింది "సుడి గాలిలో చిక్కుకున్న సన్న జీవిలా గిరికీలు కొడుతుంది గాలి పటం. ఈదురు గాలిలో ఇగంతో వణికి పోతుంది .వర్షమే పడిందా తడిసి ముద్దయి తనువు చాలిస్తుంది !".అని ఆశ్చర్యం కలిగింది .ఈ గాలి పటం కవిత్వం ఇలానే నేను రాసుకున్నానే అని డైరీ తీసి చూసుకున్నాను. "కన్నీటి చినుకులతో కలల గాలి పటం తడిసి పోయింది ,చెక్కిట చారికలతో చిన్న పిల్ల ".అని .అంత పొడుగు నరసింగ రావు గారి గాలి పటం ,ఈ అమ్మాయి గాలి పటం రెండూ ఎందుకో తడిసి పోవడం గురించే యోచించాయి .మనిషి భావాలు అంత పురాతనం .ఎవరో చెప్పినట్టు సైకిల్ చక్రంలా తిరుగుతూ ఉంటాయ్ మొదలూ తుదీ అక్కడే .కానీ మనం అన్నిటికి మనమే ఆద్యులమని చిన్ని చిన్ని విజయాలకి కూడా గర్వ పడుతుంటాం .

పాపాయి పరిక్షలు అయిపోయాయి .ఇంక వారం రోజుల్లో అది రెండో తరగతికి వెళిపోతుంది .ఆ పై మరో నెల బడి జరిగిన తరువాత సెలవలు .అప్పుడు మేం మా ఊరికి వెళ్తాం .కానీ ఇవాళ వెళ్ళాలనిపిస్తుంది.ఇవాళే కాదు చాలా రోజుల నుండే వెళ్ళాలని ఉంది .కానీ యెట్లా పాపాయికి బడి .పాపాయికి ఊరికి వెళ్లాలనిపించదు .ఎందుకంటె మా ఊరు ..పాపాయి వాళ్ళ ఊరు కాదు కదా !అసలు చెప్పాలంటే పాపాయికి ఊరే లేదు .నా భర్త అంటాడు మీ వాళ్ళనే ఇక్కడికి రమ్మను అని .ఊరికెళ్లడం అంటే వొట్టి అమ్మా వాళ్ళేనా ..మా ఇళ్ళు,,, ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళావని రెండు రోజులు నిదుర రానీయకుండా వేదించే నా బెడ్ బగ్స్ ,ఇంకా లేతగా మా ఇంట్లోకి తొంగి చూసే ఉదయ కాలపు ఎండ ,మా అమ్మ కాఫీ ,ఇంటి ముందర తత్వ వేత్తల్లా పూచి ఉండే కాగితం పూల చెట్లు .అటిటు వెళ్ళేప్పుడు కిటికీ లో నుండి వెనక్కి వెళ్ళే పరిచితపు రోడ్లు ,రోడ్ల పక్కని చెట్లు ,ఆ చెట్లు వీచే స్నేహపు గాలులు ఎన్ని ఉంటాయి.. ఊరికి వెళ్ళడమంటే !

ఇట్లా ఆడ పిల్లలకి ఎన్ని దిగుళ్ళు ఉంటాయో .పెళ్లై అన్నేళ్ళు పెరిగిన ఇంటిని వదిలి ఎక్కడికో రావాలి .వచ్చిన చోటు ఒక్కో సారి యుద్ద వేదిక అయి మన కోసం ఎన్ని న్నాళ్ళ నుంచో కాచి పెట్టుకు ఉన్నట్లు దాడి చేస్తుంది .ఇంకా ఎక్కడికో విసిరేసే ఉద్యోగాలు .హోం సిక్ నెస్.ఇంటి పేరు ఊరి పేరు మారి ఊరు పేరు లేని వాళ్ళం అయి పోతాం .అదొక్కటేనా ? శరీరంలో ఎన్ని మార్పులో .మాటి మాటికి హార్మోన్స్ తేడాలు .ఒక్కో దశలో ఒక్కో మార్పు .వొళ్ళు గుల్ల చేసి వదిలి వెళ్ళే దిగుళ్ళు ఎన్నెన్నో .ఖాళీలు ఎన్నెన్నో .

మనుషులం ఎందుకో ఖాళీలని పూరించుకోడానికి మనుషులనే ఎంచుకుంటాం .ఆ మనుషులు కొన్ని సార్లు ఎప్పటికి మానని గాయాలు కూడా చేసి వెళ్తారు .నరసింగ రావే అన్నట్టు నిన్న అనుభవాలలో గుచ్చుకున్న గాయం రేపు పెద్ద వ్రణమై బాధించ వచ్చు కూడా కదా
మిగిలిన ప్రాణి ప్రపంచం అలా కాదు .చెట్టు మీద వాలి పిట్ట ఒక్కటే పాడుకుంటూ ఉంటుంది .తోడు జోడు పిట్టలు చాలా సార్లు ఉండవు .ఏకాంతంలో తమని తామే సోధించుకుంటూ ఉంటాయి .అట్లా అనుకున్నానా త్రిపుర కవిత ఒకటి గుర్తొచ్చింది "సానుభూతి కోసం పరి తపిస్తున్నపుడు ఆ కొండల చుట్టూ వీచే గాలులు వీస్తూ వచ్చి నీతో మాటలూ ఆడవూ ,నీ దుక్కాన్ని ఓదార్చవూ ...నీ చితి చుట్టూ చేరిన మనుష్యుల జ్ఞాపకాల కళ్ళ నీళ్ళ లోనే కదులుతూ ఉంటావ్ "అని.. ఏది నిజమనే శోధన చేయ దలుచుకోలేదు .నాకు తనలోకి తాను చూసుకునే పిచుక తత్వమే బాగుంటుంది .అందుకని పాపాయికి యౌవనంలోను ,మధ్యమంలోను, వ్రుద్దాప్యంలోను దిగుళ్ళ నుండి ,హార్మోన్ల నుండి మనుషులతో ఖాళీ పూరించాల్సిన అవసరం పడనీయక చల్లగా ఆదుకునే కళ ఒకటి నేర్పుతే బాగుండని యోచించాను .
నాట్యం సంగీతం ఓ కే .కానీ రెండో వ్యక్తే అవసరం లేనిది గా నాకు చిత్ర లేఖనం తోచింది .కొన్ని రంగులను ముందు పెట్టుకుంటే ఎన్ని రాగాలను కాగితం పై అద్దుతూ పోవచ్చో గంటలు గంటలు ,ఇంకో ప్రపంచం అవసరమే ఉండదు కాలం మన ముందు నిలిచి చిత్రం చూస్తుంది .పాండిత్యం ఎవరికి కావాలి .బ్రతుకు ప్రయాణం మా అమ్మమ్మ చెప్పినట్టు ముత్యం మూడు నాళ్ళే .దాని కోసం పాకు లాటలేలా? నారు పోసిన వాడు నీరు ఎట్లాగూ పోస్తాడు అని నమ్మిన మరు క్షణం నుండే నీరు రాటం కనిపిస్తుంది కూడా .పలానా పలానా గురూజీలు నెత్తి నోరు కొట్టుకు చెప్పేది కూడా అదే .

పాపాయికి బొమ్మలు నేర్పడానికి వచ్చే అమ్మాయి పేరు పంప .పంప నాకూకొంత రంగులు రాసింది .పాపాయీ ,వాళ్ళ అమ్మ ఇద్దరూ అట్లా ఇప్పుడు రంగులలో తేలియాడుతున్నారు.చూసి మురిసే రాగం పేరు పాపాయి వాళ్ళ నాన్న !

5 కామెంట్‌లు:

తృష్ణ చెప్పారు...

sudheera gaaru i loved this post..

గోదారి సుధీర చెప్పారు...

thank you trushna gaaru

krishh చెప్పారు...

మీ painting చాల బాగుంది , రంగురంగుల పూలు తలలు వుపుతున్నట్టుగా వున్నై గర్వంగా...
fabric paintings కి well suited design ల colorful గ అనిపించిది.
పాప కు paintings
నేర్పించటం very good ఐడియా .its really wonderful art .
కవితలు, రచనలు తో కళ్ళకు కట్టినట్టు భావాలు పలికించవచ్చు కాని ,paintings తో చూపరుల కళ్ళనేకట్టి పడేయవచ్చు.
భాష, చదువు,మేధస్సు ల తో పని లేకుండా బొమ్మల అందం అందర్ని
ఆకట్టుకుంటుంది .
సొంత ప్రపంచంలో విహరించడమే కాకుండా కొత్త
ప్రపంచాలను కూడా మన ఉహా శక్తి తో ఆవిష్కరించవచ్చు మన .బొమ్మలతో.. ..
పాప ప్రయత్నం కూడా చాల ముచ్చటేసింది, తనకు ఈ ఆర్ట్ మీద మక్కువ పెరగాలని నా కోరిక.because personally I love painting .

గోదారి సుధీర చెప్పారు...

thank you krishh garu

Dr.Pen చెప్పారు...

మనుషులం ఎందుకో ఖాళీలని పూరించుకోడానికి మనుషులనే ఎంచుకుంటాం .ఆ మనుషులు కొన్ని సార్లు ఎప్పటికి మానని గాయాలు కూడా చేసి వెళ్తారు .... You truly are a Philosopher!