మీ పిల్లలు మీ పిల్లలు కారు. వాళ్ళు జీవితేచ్చకు జన్మించిన వాళ్ళు . వాళ్ళు మీ ద్వారా వచ్చారు తప్ప మీ నుండి కాదు . వాళ్ళు మీతో ఉన్నా మీకు చెందరు .మీరు వాళ్ళతో ఉండాలని ప్రయత్నిస్తే ప్రయత్నించారు గాక, వాళ్ళు మీలా ఉండాలని మాత్రం అనుకోకండి. ఎందుకంటే జీవితం వెనక్కు మళ్ళదు గనకా, నిన్నటితో మళ్ళీ అతుక్కుపోదు గనకా ..ఖలీల్ జిబ్రాన్

10, జులై 2011, ఆదివారం

అర్థ మోహనరాగం


కవిత్వం అది పనిగా చదివిన అనుభవం ఎప్పుడూ లేదు నాకు ,ఆసక్తీ లేదు. అయినా సాహిత్య విద్యార్ధినిగా అనేకం చదవాల్సి వచ్చింది .చదివిన అంతలోనూ ఇస్మాయిల్ నాకెప్పుడూ తటస్థ పడలేదు .ఇస్మాయిల్ అద్భుత కవి . నేను కలవరించి chadivina కవిత్వం ఇస్మాయిల్ దే

'అర్థ మోహనరాగం' అనే
కవిత, ఇస్మాయిల్ ''కవిత '' అనే కవిత చదివిన తర్వాత రాసుకున్నది.

అనార్కిస్ట్ కవిలా
అతను
మహా దౌర్జన్యంగా
మానసోపరితలంపై
ఓ విత్తనాన్ని విసిరాడు

అనుమతి లేకనే
కాలాన్ని కత్తిరిస్తున్న
గడియారం ముళ్ళు
విత్తనాన్ని కాస్తా
గుచ్చి వెళ్ళింది

సందేహ స్వరాల మెట్లు
దాటుకుని
చిరు మొలక ముందు
మోకరిల్లి
గాఢ మోహన రాగాన్ని
మ్రోగించేలోగా,
అతను
కుదురు లేని
వలస పక్షిలా
వాలిన వయోలిన్ తీగలు
తెంచుకుని
యెగిరి పోయాడు

అఖండమై విస్తరించిన
ఆ విత్తనపు
వట వ్రుక్షంపై తిరుగుతూ
మెదడు నరాల నేతని
విప్పుకుంటూ ,నేను
అతని అడుగుజాడలకై
అన్వేషిస్తుంటాను .

నా చెట్టు
కొన్ని సార్లు
తేనె పూలు పూస్తుంది
అపుడపుడు
రాత్రి పక్షుల అరుపులకి
ఉలికి పడుతుంది
కురిసే మంచు
కాసే ఎండ
నా ముందు నుండే
నడిచి పొతాయ్.

చూసి చూసి
దారిన పోయే ఒకడు
ఇదంతా వ్యర్థమని
కలలనైనా అల్లాల్సిందేనని
మూర్తిమత్వం గురించి
వుపన్యసిస్తాడు

నేను ,ఇక ఇదే
చివరి కొమ్మనుకుంటూ
ఆ చెట్టులోని
మరో కొత్త కొమ్మ పైకి
నా అనవరత ప్రయాణాన్ని
ప్రారంభిస్తాను

3 కామెంట్‌లు:

తృష్ణ చెప్పారు...

ఎన్నాళ్ళకెన్నాళ్ళకు...వ్యాఖ్యా భాగ్యాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు. కవిత చాలా బాగుంది.

గోదారి సుధీర చెప్పారు...

అసలు ఎవరైనా చూశారంటే మీ వ్యాఖ్యని ....అబ్బ నిజమే కామోసు అనేసుకోగలరు మరి తృష్ణ గారూ ... toooooooooooooo much కదా !కవితకు thank you .

Dr.Pen చెప్పారు...

మొత్తానికి పాపాయి బ్లాగు దొరికింది. కొత్తపాళీ గారు కొన్ని టపాల గురించి ఆసక్తిగా మాట్లాడేరు. ఇక ఈ బ్లాగు అంతు చూడాల్సిందే...ఈ టపా విషయానికొస్తే నా పేరు ఇస్మాయిల్ అయినందుకు గర్వపడే కారణాల్లో ఈ చెట్టు కవి గారి పేరు నా పేరు ఒకటే కావడం:-)