పాపాయి తొమ్మిదో క్లాస్ చదువుతుంది కదా .. కానీనేమో దానిదింకా ముద్దుగారే అమాయకపు బుర్రే . ఏమైందీ ,ఆ మధ్యన ఫిబ్రవరి 14 వచ్చింది కదా ఆరోజుకి ముందురోజు మధ్యాన్నం నేను దానికి ఫోన్ చేసాను . మమ్మీ దానికి పక్కనే కూర్చుని బువ్వ తినిపిస్తూ వుంది . పాపాయి ఫోను అందుకోగానే ''అమ్మా ఈ రోజు మా స్కూల్ లో అన్ని క్లాసులకి కిటికీలు మూసేస్తున్నారమ్మా '' అన్నది . నేను ఆశ్చర్యపడి ''ఎందుకమ్మా ?''అని ప్రశ్న వేసాను . అది '' నీకు తెలీదా.. వాలంటైన్స్ డే రోజు అబ్బాయిలందరూ అమ్మాయిలకి ఏమయినా లెటర్లు ,గిఫ్టులు ఇస్తారని అట్లా చేస్తారు '' అన్నది . నేను '' మరీ చోద్యంరా ఇది కిటికీలు మూసెయ్యడం ఏంటీ చిత్రంగా '' అని దీర్ఘం తీసాను . పాపాయి ''నీకు తెలీదులేమ్మా ! మా స్కూల్ వాళ్ళు ఏది చేసినా అది మంచిదే '' అన్నది . నేనేమో తారీఖులు గుర్తులేని గృహ జీవితంలో వున్నా కదా అందుకని , ''యెప్పుడురా ఇంతకీ ప్రేమికుల రోజు ?'' అన్నాను . పాపాయి ఏమనుకుందీ చాలా చాలా కాలం నుండి ఫిబ్రవరి పద్నాలుగో తేదీన ప్రపంచం ప్రేమికుల రోజు అని ఒకటి జరుపుకుంటుందనీ ,అది తనలాటి చిన్నపిల్లలకి కూడా తెలుసుననీ , అమ్మకి తెలియకపోవడమేమిటనీ చాలా ఆశ్చర్యపడి ''నీకసలు వాలంటైన్స్ డే ఎప్పుడో నిజంగా తెలీదామ్మా '' అన్నది బిగ్గరగా . నేను దాని ఆశ్చర్యానికి ముచ్చటపడి ,దాన్నలాగే కొనసాగిద్దామనుకుని ''తెలీదురా '' అన్నాను . పాపాయి ఆశ్చర్యంతోనే అన్నం తినిపిస్తున్న అమ్మమ్మ ని '' నువ్వు చెప్పుమా వాలంటైన్స్ డే ఎప్పుడో '' అన్నది . మా అమ్మ చాలా గర్వంగా ,తనకున్న అపారమైన పత్రికా జ్ఞానాన్ని ప్రదర్శిస్తూ '' ఫిబ్రవరి 14 రా ''అన్నది . మా అమ్మాయి వెంటనే '' చూసావామ్మా ! మమ్మీ ఎంత ముదురో '' అన్నది
.హమ్మయ్య ! ఎలాగయితేనేం ,ఇవాళ నేను ముదురు కాకుండా తప్పించేసుకున్నాను !
.హమ్మయ్య ! ఎలాగయితేనేం ,ఇవాళ నేను ముదురు కాకుండా తప్పించేసుకున్నాను !
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి