మీ పిల్లలు మీ పిల్లలు కారు. వాళ్ళు జీవితేచ్చకు జన్మించిన వాళ్ళు . వాళ్ళు మీ ద్వారా వచ్చారు తప్ప మీ నుండి కాదు . వాళ్ళు మీతో ఉన్నా మీకు చెందరు .మీరు వాళ్ళతో ఉండాలని ప్రయత్నిస్తే ప్రయత్నించారు గాక, వాళ్ళు మీలా ఉండాలని మాత్రం అనుకోకండి. ఎందుకంటే జీవితం వెనక్కు మళ్ళదు గనకా, నిన్నటితో మళ్ళీ అతుక్కుపోదు గనకా ..ఖలీల్ జిబ్రాన్

30, జూన్ 2011, గురువారం

సుఖ వాదం ...!


ఇవాళ నీతి శాస్త్రం తీసుకున్నాను చదువుదామని .అందులో అత్యున్నత సుఖం గురించి ప్రతిపాదిస్తూ... సుఖమే అత్యున్నత జీవిత లక్ష్యం కాబట్టి , ఏవిధంగా సుఖాలను ఎంచుకోవాలన్నది చాలా ముఖ్యమని చెపుతాడు బెంతాం . అందు కోసమని ఆయన సుఖాల గణిక[caliculas of pleasures ] ఒకటి రూపొందించాడు ...

1. సుఖ తీవ్రత [pleasure intensity ]

2. సుఖ కాల పరిధి [pleasure duration]

3.సుఖ నిశ్చితత్వం[pleasure certainity]

4.సుఖ సామీప్యం [pleasure propinquity ]

5.సుఖ ఫలీకరణ [ pleasure fecundity ]

6. సుఖ స్వచ్చత [pleasure purity ]

7. సుఖ విశాలత లేక విస్తృతి [
pleasure extent]

తక్కువ తీవ్రత కలిగిన సుఖం కంటే ఎక్కువ తీవ్రత కలిగిన సుఖానికి ప్రాధాన్యం ఇవ్వాలి .క్షణిక సుఖాల కంటే దీర్గ కాలం సుఖం ఇచ్చేవి వాన్చించాలి .అనిత్యమైన వాటి కంటే నిత్యమైన సుఖాలు ,అగోచరమైన వాటికంటే సంభవమైన సుఖాలు అత్యున్నతమైనవి .కష్టాలతో కలిసి ఉండే సుఖం కంటే అత్యధిక సుఖాన్ని ఇచ్చేది ,తక్షణ సుఖం కంటే భవిష్యత్ జీవితంలో సుఖాన్ని ఇచ్చేవి మనిషి ఎన్నుకోవాలి అంటాడు .

మరి అనిత్యమైనది ,క్షణికమైనది అని తెలిసి కూడా ఎక్కువ తీవ్రత కలిగి ఉంటే ,ఆ సుఖం వాంచితమా ..కాదా..అని అనిపించేసింది .

ఇదొక సందేహం కూడానా ఏమిటి దాని పేరే కర్మ అని ఆలోచించుకున్నానా, తర్వాత పేజీల్లో దానికి మిల్ ఇలా సమాధానమిచ్చాడు .


అత్యున్నత సుఖాలు అధమ సుఖాల గురించి చెప్తూ j.s.mill ..''it is better to be a human being dissatisfied than a pig satisfied ;better to be a socrates dissatisfied than a fool satisfied .and if the fool or the pig is of a different opinion it is because they only know their own side of the question .the other party to the comparision knows both sides .'అంటాడు

జంతువులు ,మూర్ఖులు ఇంద్రియ సంబంధ సుఖాలు వాంచిస్తారు .అయితే అత్యున్నత అధమ సుఖాలు తెలిసిన వారు సుఖాల విలువను సరిగా అంచనా వేయగలరు .అటువంటి వారు అత్యున్నత సుఖాన్ని వాంచిస్తారు .గౌరవనీయ భావనలు గుర్తించ లేని వారు ,మానసిక బలహీనులు ,ఇంద్రియ లోలురు అధమ సుఖాలను కోరుకుంటారు అనే వాస్తవాన్ని అంగీకరిస్తాడు మిల్ .

29, జూన్ 2011, బుధవారం

మంచి వాన పాట ఒకటి ...!







మొన్న నా పీ హెచ్ డీ వైవా కోసం హైదరాబాద్ కి ప్రయాణిస్తుంటే చివరి వరకూ నాకు తోడు వచ్చిన పాట ఇది .వింటూ వింటూ వింటూ వెళ్లాను .విమల కంటమంటే నాకు ఇష్టం .మొదట అందుకోసం పాట వింటాను .ఆ తరువాత అందులో సాహిత్యం .

ఆవిడ కంటం''ప్రజల కోసం గజ్జె కట్టి ఆడే ''ఆవిడలానే సున్నితంగా ఉంటుంది .దృడంగా ,ధైర్యంగా ,వెరపు ,బెరకు లేక అతి స్పష్టం ఉంటుంది .వింటూ ఉంటే ..వింటూ, వింటూ ఉంటే విమలక్కా అని పిలుద్దామనే ఆప్యాయత వేస్తుంది .


పొద్దున్నే ఏదో విషయమై ఫోన్ చేస్తే స్నేహితుడు,ప్రయాణం చేస్తూ చేస్తూ ఉన్న వాడు , కదిలించ గానే ''ఆడుదాం డప్పుల్ల దరు వెయ్ ర''అని మురుసుకుంటూ పాడాడు .విన గానే ఎందుకనో చప్పున పెద్ద దిగులొకటి కమ్మేసింది ..ఇప్పటికీ ఉదయం కమ్మిన ఆ దిగులు మేఘం ఉండి ఉండి కురుస్తూనే ఉంది.



వానొచ్చేనమ్మ వరదొచ్చేనమ్మ

వానతోపాటుగా వణుకొచ్చేనమ్మ

కొట్టాముపై రాలి మట్టంత కడిగింది

కోడి పుంజు జుట్టు కొంటెగా తాకింది

చెట్ల కురులపై బొట్లు బొట్లుగా రాలి

గట్ల కుండల మీద గందమై పారింది

దున్న పోతులనేమో దుంకు లాడించింది

బర్ల మందలనేమో సెర్లలోముంచింది

గద్ద గూటి లోని గడ్డీని తడిపింది

గువ్వా గూటిలోని గులక రాళ్ళని జరిపింది

తీతువు గొంతును తియ్యగ జేసింది

పరికి పిట్ట ముక్కు పాసిని కడిగింది

ఎద్దు మూపురాన్ని ముద్దాడి మురిసింది

ముళ్ళు గర్ర వళ్ళు సల్లగ జేసింది

కొత్త నీటితో వచ్చి కోనేట్లో చేరింది

పచ్చని నాసుని పలగ జేరేసింది

చేపకేమో నీటి పులుపుని దాపింది

కొంగకేమో విందు కోరికని రేపింది

కప్పల పండగ కండ్లారా జూసింది

తాబేలు పెండ్లికి తల నీరు పోసింది

యెర్ర భూముల నెర్రెలన్నీ పూడ్సినాది

రేగడి నేలను మాగాణి జేసింది

తువ్వా గడ్డలల్ల కవ్వాతు జేసింది

సౌడు భూముల జూసి దౌడు తీసినాది

పొంగేటి కల్లుల పోసింది చన్నీళ్ళు

ఈత సెట్టు లొట్టి మూతి కడిగింది

తాను రాక ముందే తూనీగల లేపి

తన పాటకే తాను దరువేసి ఆడింది

తెల్ల మల్లెనింక తేటగా జేసింది

యెర్ర మల్లెనే కడిగి ఎరుపునే పెంచింది

తులసమ్మ దీపము చిప్పలో చేరింది

నీరెండ పులుపుకు నిగ నిగ లాడింది

పారాడి పారాడి గోదారిలో కలిసి

సీతమ్మ పాదాలు శిరసొంచి తాకింది

వంకలు డొంకలు వనములన్నీ తిరిగి

కృష్ణమ్మ వడిలోన ఇష్టంగా ఆడింది

దున్దుభీ తల పోసి దుమ్మంత కడిగింది

అందమైన ఇసుకను అద్దంలా జేసింది

ఇష్టమే లేకున్నా పట్నానికోచ్చింది

ముక్కు మూసుకొని మూసీలో మునిగింది

యములాల రాజన్న వేడుక జూసింది

ముందింటి కోయ్నాక మైల కడిగేసింది

సూఫీల దర్గాల సుట్టు దిరిగీ మొక్కి

ఎగిరే దక్కిల కేమో ఎండీ మెరుపద్దింది

రావి ఆకుల నుండి రాలి పడి రాలి పడి

సాధుల సామాది సన్నిధికి చేరింది

అమరూల స్థూపానికి అభిషేకమూ జేసి

సుత్తీ కొడవలి మీద ముత్తేమై మెరిసింది .

[రెండు మూడు పదాలు అర్థం కాలేదు .తప్పులు పడి ఉండచ్చు .]

28, జూన్ 2011, మంగళవారం

మళ్ళీ సుందర వనాలకు ...!


సెలవులు నాకో పాపాయికో ..అర్థం కాదు .ఏమయినా సెలవలు అయిపోయాయ్. మళ్లీ ఈ బెంగాల్ దేశపు సుందర వనాలలోకి వచ్చి పడ్డాం .




మేం వస్తుంటే మాకు పంపించేందుకు టిఫిన్ సర్దిస్తూ పాపాయి వాళ్ళ నాన్న మీనాక్షి కి ఇది పెట్టండి అది పెట్టండి అని చెప్తున్నాట్ట ,పాపాయి పేరు వినగానే మా రాజ మల్లిక లేచి హడావిడిగా వచ్చి ఏంటి పాపాయి వస్తుందా అని అడిగిందట .మళ్ళీ నాన ఇంకో రూం లోకి వెళ్తే అక్కడికి వచ్చి నిజమేనా పాపాయి వస్తుందా అని అడిగిందట .మద్యాన్నం నాన వెహికల్ దిగగానే వేహికలంతా చెక్ చేసిందట .మేం రాగానే కాంచన కాళ్ళెత్తి మీద పెట్టి పలకరిస్తుంటే రాజాలుకి కూడా చాలా ఉత్సాహం వచ్చేసింది .కాంచన లాగా పైకి లెయ్యాలని కానీ పాపం అది అరవై కేజీల పైనే భరువు ఉంటుంది కదా ఎగరలేక పోయింది .


మా హేమ తల్లికి మేం అటెళ్ళి ఇటోచ్చే లోపే బుజ్జి బుజ్జి కొమ్ములోచ్చాయి .కొమ్ములోచ్చాయా బుజ్జిలూ అంటే ..ఆ వచ్చాయిలే ,,, ఇంతకీ నువ్వెవరూ అని గట్టిగా కోప పడింది .

18, జూన్ 2011, శనివారం

మా ఊరి ఆడోళ్ళ లోక జ్ఞానం !


ఈ రోజు మా సుబ్బమ్మ వచ్చింది, నన్ను చూసి పోవడానికి .
బుజ్జమ్మా నువ్వుండే ఊరి పేరేన్దే..ఎన్ని సార్లు చెప్పినా గవనమే ఉండదూ.......
బెంగాల్ సుబ్బమ్మ, పశ్చిమ బెంగాల్ .
ఆ అదేలే దగ్గిర దగ్గిర అమిరిక కాడ అంతే కదా?
ఆ ..అంతే !అంతే !
*****
నేను హైదరాబాద్ లో చదువుకునేప్పుడు నా దగ్గరికి మా రవణమ్మ వొచ్చింది .
హై కోర్టు భవనాన్ని చూసి ,అందరూ తాజ్ మహల్ ,తాజ్ మహల్ అనుకుంటా ఉంటే ఏందో అనుకున్నా గానీ బలే ఉంది బుజ్జమ్మా .ఇదే గదా తాజ్ మహల ...?
ఆ ..ఇదే !ఇదే !
*****
మా తెల్ల నవ్వుల నల్ల ఎంకటేసిరమ్మ,ఎండ పడి నిగ నిగ మెరస్తా ఉంటే ......
ఎంకటేసిరా.... నీ వొయిసెంత ఇప్పుడూ అన్నా....
ఉండదా ఇరవయ్యారో ..ఇరవై ఏడో..
కాన్పుకొచ్చిన నీ కూతురి వొయిసెంతా ?
పంతొమ్మిది కదా ..గండారపోళ్ళ పట్టన్న కూతురితోపాటిది .......
అయితే నీకు ఎనిమిదేళ్ళకే కూతురు పుట్టేసిందా ?
నువ్వుండు బుజ్జమ్మా ...!ఎనిమిదేళ్ళకి పిలకాయలెట్ట పుడతారూ ...నేనప్పటికి సంసారానికి గూడా రాలా ..!
ఔనౌను... పుట్టరు! పుట్టరు !

17, జూన్ 2011, శుక్రవారం

మా నాన్న చెప్పిన దెయ్యం కథ !


ఇవాళ మధ్యాన్నం నేను ,మా నాన్న ,పాపాయి బోలెడు ముచ్చట్లు చెప్పుకున్నాం . కబుర్ల లోదే దెయ్యం కథ .మా నాన్న వాళ్ళ చిన్న తాత బోలెడు బలశాలంట .ఒక సారి ఏమయ్యిందీ...పొద్దున్నే లేసి ఆయన పక్కూరికి వెళ్ళాట్ట .తిరుగు ప్రయాణమప్పటికి బాగా చీకటి పడి పోయిందట .దారికి రెండు వైపులా అడవి .చిమ్మ చీకటి .

అప్పుడేమయ్యిందీ దగ్గరలోనే ఎక్కడనుండో గొర్రె పిల్ల ఏడుపు వినిపించింది . రాత్రప్పుడు గొర్రె పిల్ల అరుపు వినపడుతుందేమిటీ అనుకున్నాట్ట ఆయన .మళ్ళీ సరేలే ఎవరిదో తప్పి పోయి ఉంటుంది అనుకుని వెతికి భుజాన వేసుకున్నాట్ట .కొంత దూరం నడిచాడో లేదో ఇంత చిన్న గొర్రె పిల్ల ఏనుగంత భరువుగా అనిపించేయడం మొదలు పెట్టిందంట .తాతకి అర్థమై పోయిందట ,ఏమనీ.... ఇది గొర్రె పిల్ల కాదూ దెయ్యం అని .

అప్పుడేం చేశారూ భుజలకి అటేపు యిటేపూ ఉన్న గొర్రె పిల్ల కాళ్ళు పట్టేసుకుని గట్టిగా ధమేల్ మని నేలకేసి కొట్టాట్ట .అబ్బ ఎన్ని వినలేదు యిటువంటి దెయ్యాల కథలూ అనుకుంటున్నారా ... నేనూ అలానే అనుకున్నాను .కానీ కిందపడ్డ దెయ్యం బలే డైలాగ్ చెప్పి విసుక్కుని వెళ్లి పోయింది .అది విని నేను పాపాయి ఆహ్హ్హహ్హ ఒహ్హోహ్హో అని చాలా సేపు నవ్వేసుకున్నాం కిందపడ్డ దెయ్యం ఏమన్నదంటే ''గాజులు పగిలి పోయినాయి కదరా నా బట్టా ''అని