మీ పిల్లలు మీ పిల్లలు కారు. వాళ్ళు జీవితేచ్చకు జన్మించిన వాళ్ళు . వాళ్ళు మీ ద్వారా వచ్చారు తప్ప మీ నుండి కాదు . వాళ్ళు మీతో ఉన్నా మీకు చెందరు .మీరు వాళ్ళతో ఉండాలని ప్రయత్నిస్తే ప్రయత్నించారు గాక, వాళ్ళు మీలా ఉండాలని మాత్రం అనుకోకండి. ఎందుకంటే జీవితం వెనక్కు మళ్ళదు గనకా, నిన్నటితో మళ్ళీ అతుక్కుపోదు గనకా ..ఖలీల్ జిబ్రాన్

18, జూన్ 2011, శనివారం

మా ఊరి ఆడోళ్ళ లోక జ్ఞానం !


ఈ రోజు మా సుబ్బమ్మ వచ్చింది, నన్ను చూసి పోవడానికి .
బుజ్జమ్మా నువ్వుండే ఊరి పేరేన్దే..ఎన్ని సార్లు చెప్పినా గవనమే ఉండదూ.......
బెంగాల్ సుబ్బమ్మ, పశ్చిమ బెంగాల్ .
ఆ అదేలే దగ్గిర దగ్గిర అమిరిక కాడ అంతే కదా?
ఆ ..అంతే !అంతే !
*****
నేను హైదరాబాద్ లో చదువుకునేప్పుడు నా దగ్గరికి మా రవణమ్మ వొచ్చింది .
హై కోర్టు భవనాన్ని చూసి ,అందరూ తాజ్ మహల్ ,తాజ్ మహల్ అనుకుంటా ఉంటే ఏందో అనుకున్నా గానీ బలే ఉంది బుజ్జమ్మా .ఇదే గదా తాజ్ మహల ...?
ఆ ..ఇదే !ఇదే !
*****
మా తెల్ల నవ్వుల నల్ల ఎంకటేసిరమ్మ,ఎండ పడి నిగ నిగ మెరస్తా ఉంటే ......
ఎంకటేసిరా.... నీ వొయిసెంత ఇప్పుడూ అన్నా....
ఉండదా ఇరవయ్యారో ..ఇరవై ఏడో..
కాన్పుకొచ్చిన నీ కూతురి వొయిసెంతా ?
పంతొమ్మిది కదా ..గండారపోళ్ళ పట్టన్న కూతురితోపాటిది .......
అయితే నీకు ఎనిమిదేళ్ళకే కూతురు పుట్టేసిందా ?
నువ్వుండు బుజ్జమ్మా ...!ఎనిమిదేళ్ళకి పిలకాయలెట్ట పుడతారూ ...నేనప్పటికి సంసారానికి గూడా రాలా ..!
ఔనౌను... పుట్టరు! పుట్టరు !

కామెంట్‌లు లేవు: