పాపాయి ఇప్పుడు ప్లస్2 చదువుతోంది. మానవీయ శాస్త్రాలు తన గ్రూప్.ఈ రోజు నా తల దగ్గర కూర్చొని రేపటి పరీక్ష కోసం పడీ పడీ చదువుతోంది. వద్దన్నా నా మనోప్రాణాలన్నీ దాని చుట్టే తిరుగుతూ వుంటాయి కదా ,దాన్లో భాగంగా "నిజాలిన్ గప్పా" పేరు నా చెవిలో పడింది.ఇదేం పేరు అనుకుని సరేలే అని ఊరుకున్నాను. మళ్ళీ కాసేపటికి వల్లె వేయడం లో భాగంగా "నిజాలిన్ గప్పా"వచ్చాడు.ఈ సారి "నిజాలిన్ గప్పా ఫ్రమ్ మైసూర్" అని నా చెవిలో పడింది.ఈ సారి ఎవరబ్బా నాకు తెలీని ఈ మైసూర్ గప్పా అనుకుని పక్కనే పేపర్ చదువుకుంటున్న పాపాయి వాళ్ళ నాన్నని కేకేశాను.నాన నేను "నిజాలిన్ గప్పా" ఎవరు అని అడగగానే పేపర్లో నుండి తలెత్తకుండా ,"నిజాలిన్ గప్పా"ని సింపుల్ గా నిజలింగప్ప ఎవరో చెప్ప సాగాడు.నాన్న ఎప్పుడయితే నిజలింగప్ప అన్నాడో మిగిలినది వినకుండా నాకు "నిజాలిన్ ...గప్పా"ఎవరో అర్తమయిపోయింది .నేను పాపాయి వైపు చూస్తూ వుంటే పాపాయి ,నేనేం చేసేది అమ్మా, ఇంగ్లీష్ లో అలా వుంది అని ఆంగ్ల భాష పైకి నేరం తోసేసి , అప్పటికీ నీకు తెలియకుండా , వినిపించకుండా చదవాలనుకుని మరిచి పోయా అన్నది.