మీ పిల్లలు మీ పిల్లలు కారు. వాళ్ళు జీవితేచ్చకు జన్మించిన వాళ్ళు . వాళ్ళు మీ ద్వారా వచ్చారు తప్ప మీ నుండి కాదు . వాళ్ళు మీతో ఉన్నా మీకు చెందరు .మీరు వాళ్ళతో ఉండాలని ప్రయత్నిస్తే ప్రయత్నించారు గాక, వాళ్ళు మీలా ఉండాలని మాత్రం అనుకోకండి. ఎందుకంటే జీవితం వెనక్కు మళ్ళదు గనకా, నిన్నటితో మళ్ళీ అతుక్కుపోదు గనకా ..ఖలీల్ జిబ్రాన్

7, అక్టోబర్ 2010, గురువారం

పాపాయి చెవులు


పాపాయికి ఇంత వరకు పాపం చెవులకు కమ్మలే లేవు .అంతగా ఐతే చూద్దాంలే అనుకున్నానా అంతలోనే పాపాయి ఇంకొంచెం పెద్దదయ్యింది .అమ్మకి ,ఇంకా చాలా మందికి చెవికి ఏమో ఉన్నాయని కనిపెట్టేసింది .

ఇవేంది ?అన్నదోరోజు ,కమ్మలూ అన్నాను .ఐతే కొమ్ములు నాకెందుకు లేవూ అంది .(కొమ్ములు కాదు కమ్మలు అని నేను సవరించలేదు )ఏమంటే మరి నీకు చెవులు లేవు అందుకు అన్నాను .పాపాయి చాలా చిన్నది కదా అవునేమో చెవులు లేవేమో అనుకుంది కొంచెం రోజులు .

మరి కాసిని రోజులుకి నాకు చెవులివిగో ,అని చూపించి కొమ్ములు కావాలి అనడం మొదలు పెట్టింది .అయితే మరి చెవులు కుట్టించుకోవాలి అన్నానో రోజు .చెవులు కుట్టించుకోవడం అంటే ఏంటమ్మా అంది . చెవులకి కొమ్ములు పెట్టటం కోసం కొంచెం బొక్కలు పెడతారు .గోడకి శీల కొడుతుంటే చూపించి ఇట్లాగ అని చెప్పాను .గోడ ఏడవదు కదా అంచేత పాపాయి మరి కాసిని రోజులు అమ్మ, చెవులు కుట్టించుకుంటా..కొమ్ములు పెట్టుకుంటా అని .. అడగ బట్టింది

ఒక రోజు ఇక సరే అనేసుకుని సాంప్రదాయ బద్దంగా ఒక వృద్ద కంసలాయనకి చేవులప్పగించాం.కను మూసి తెరిచే లోగా ఒక చెవ్వు కసుక్కున దిగిందా ..పాపాయికి అర్థమే కాలేదు. పెద్దాయన అమ్మాయ్ నీ కూతురు చాల ఓర్పు గల పిల్ల ఔతుందని మురుస్తూ రెండో చెవికి వచ్చాడు .రెండో చెవికి పట్టు దొరకలా .పాపాయి పాపం ఓర్పు గలదే .కళ్ళ నీళ్ళు పెట్టుకుందే కానీ అల్లరి చేయల . ఆ పెద్దాయన కాళ్ళకి కాస్త దణ్ణం పెట్టవే అంటే ససేమిరా అంది .అంతా సద్దు మనిగాక చెవులు కుట్టించు కోవడం అంటే ఇదా అమ్మ అన్నది.

సరేలేఅయిపొయింది కదా అనుకునే లోపలే ఆ రెండో చెవి తేడా చేసి ఇంత ఉబ్బింది .నా వైద్య స్నేహితుడు అన్నాడు, తీసేసేయ్ ఇన్ఫెక్షన్ ముదిరితే వినికిడికి ప్రమాదం నా కూతురికీ ఇలాగే జరిగిందీ అని .ఎలా తీయటం మరి చెవి ఇంత వాసిందే అంటే నేయ్ల్ కట్టర్ పెట్టి కత్తి రించేయ్ అన్నాడు .ఇప్పుడు పాపాయి ఇంకొంచెం పెద్దదయింది కదా .స్కూల్ కి వెళుతుంది రెండు నెలల్నించి .ఇంకానేమో ఇంటికొచ్చే వాళ్ళ టీచర్కి చెవి నిండుగా కమ్మలే .అంచేత పాపాయి అప్పుడప్పుడూ గునుస్తుంది అమ్మా కమ్మలూ.. అని .సరెలేవే చెవులు కుట్టించు కుందూలె అంటే, ఖతం ,కాసిని రోజులు ఆ కథే మాట్లాడదు .పాపం అట్లా దానికిప్పుడు ఆరేళ్ళు వచ్చేసాయ్...

కామెంట్‌లు లేవు: