మీ పిల్లలు మీ పిల్లలు కారు. వాళ్ళు జీవితేచ్చకు జన్మించిన వాళ్ళు . వాళ్ళు మీ ద్వారా వచ్చారు తప్ప మీ నుండి కాదు . వాళ్ళు మీతో ఉన్నా మీకు చెందరు .మీరు వాళ్ళతో ఉండాలని ప్రయత్నిస్తే ప్రయత్నించారు గాక, వాళ్ళు మీలా ఉండాలని మాత్రం అనుకోకండి. ఎందుకంటే జీవితం వెనక్కు మళ్ళదు గనకా, నిన్నటితో మళ్ళీ అతుక్కుపోదు గనకా ..ఖలీల్ జిబ్రాన్

27, మే 2011, శుక్రవారం

జీవితమే సఫలమూ.....!


Get this widget | Track details | eSnips Social DNA


అప్పుడెట్టుండెనో చిత్తమయ్యో యెఱగనైతి
చెప్పుడుమాటలకే నే జేరనైతిగా

కొసరికొసరి నీపై కోపమున నుంటిగాని
అసమిచ్చి నీతో మాటలాడనైతిగా
పసలేని సిగ్గుతోడి పంతాననే వుంటిగాని
ముసిముసి నవ్వు మోవి మోపనైతిగా

విరహపు కాకల నావిసుపే చూపితిగాని
సరిబిల్చితే నూకొన జాలనైతిగా
వరుసవంతులకై నే వాదులాడితి గాని
మురిపేన మొక్కితే నే మొక్కనైతిగా

వేగమే నీవు గూడితే వెస భ్రమసితిగాని
చేగలనీమేను పచ్చిసేయనైతిగా
భోగపు శ్రీవేంకటేశ పోట్లదొరతిలోన
నీగతి చెన్నుడవైతే నెనసితిగా

రెండు వారాల క్రితం స్నేహితురాలు ఫోన్ చేసింది T T D వారి అన్నమాచార్య సంకీర్తనల సమ్మర్ కాంప్ జరుగుతుంది.రాకూడదా... మీరు ఇక్కడ ఉన్న నెలలో పాపాయికి నాలుగు పాటలన్నా వస్తాయి కదా అని .పొద్దుటే వెళ్లి ఒక గంట పాటు పాడుకుని వస్తుంటే ఎంత సంతోషంగా ఉందో.జీవితంలో ఆనందం తప్పించి మరేమీ లేని కాంతివంతమైన అనుబూతి .

వదులుగా అల్లుకున్నజడలో బొండు మల్లెలు తురుముకుని వచ్చే డాన్స్ టీచర్ ,చిన్ని కూతురికి తోడుగా వచ్చే అందమైన అమ్మ , కారణం ఏదయితేనేం బోలెడు కాలం తరువాత రోజూ ఒకరినొకరం చూసుకోగలుగుతున్న నేను నా స్నేహితురాలు ,ఇంటికొచ్చి'' జగడపు చనవుల జాజర''.. అనో ''అమ్మమ్మ ఏమమ్మ అలమేల్ మంగ నాంచారమ్మ '' అనో పాడేసుకుంటూ ఉంటే,,, దిగులూ వ్యసనమూ ఉండదమ్మ నీకు అని మురిసే మా నాన..

జీవితం ఎంత బాగుంది ....జీవితం ఎంత బాగుంది .హాయిగా తీయగా ఆలపించు పాటలా ,అనారు పూల తోటలా ...ప్రశాంత సాంధ్య వేళలా...జీవితం ఎంత బాగుందో ...ఈ ఎండల వేళల మా ఊరి వీధులను పసుపు వర్ణ భరితం చేసే తీయటి ఉలవ పాటి మామిడి పళ్ళలా ...జీవితం తీయ గా అనిపిస్తుంది.

''నీ వలన తప్పే లేదు మరి నీరు కొలది తామెరవు ;ఆవల బాగీరదీ దరి ఆ జలములే ఊరినయట్లు'' ...''ఎంత మాత్రము ఎవ్వరు తలచిన అంత మాత్రమే నీవు ''అట. ఎంత అద్భుతమైన భావన ,''అంతరాంతరములెంచీ చూడ పిండంతే నిప్పటి యన్నట్లు ..''ఎంత సరళమైన పదాలు ఎంత గాఢమైన తాత్వికతకదా .

వేంకటేశ్వరుని పైన కదా అని భక్తి భావం కాదు సంగీతానికి ఆ శక్తి ఏదో ఉంటుంది .ఆండాళ్ తిరుప్పావై వినండి అలాటిదే మరోదేదైనా వినండి .భక్తి కాదు. భాష తెలియకున్నా ఉదాత్త భావాలేవో మనలో ప్రవేసిస్తాయ్ .ప్చ్ అద్భతమైన వాటికి మనం మతాల కులాల రంగులు పులిమేస్తాం కదా ...

ఒక్కో వ్యక్తికి ఒక్కో మోహం ఉంటుంది కాబోలు నాకు అట్లా సంగీతం ఓ పిచ్చి .కానీ సంగీతానికే నా పై దయ లేదు . పాడుకుంటూ ఉంటే స్నేహితురాలు ముని పంటితో నవ్వుని అదిమేసి ఎంత ముద్దుగా పాడుతావో నీ పాటల్లో ఫీలింగ్ మాత్రమే ఉంటుంది, ఇంకేమీ ఉండదు...అని అంటుంది సరదాగా .

మనం కోరుకున్నది పొందలేక పోయినంత మాత్రాన దానిపై ఇష్టం పోదు కదా ! పోక పోగా ప్రేతంలా పట్టుకుని మనల్ని మరింత పీడిస్తుంది .దిగులు పెట్టేస్తుంది .యేడి పించేస్తుంది .ఎప్పుడో కంటమో, ఏ రాగమో, ఏ సాహిత్యమో ఎందుకో ఒక పాటై మన జీవితంలో ప్రవేసించేస్తుంది . ఇక అంతే ఇదీ అని వివరించలేని ఆరాటం .ఏం చెయ్యాలో తోచదు .ఘన సమయం అంతా ఆ ఒక్క పాట చుట్టే గిరికీలు కొడుతూ ఉంటుంది.

పాడుకుంటూ ఉంటే పాపాయో ,వాళ్ళ నానో మధ్యలో మాట్లాడిస్తారు .నేనింత తాదాత్మ్యం తో పాడుకుంటూ ఉంటే మాట్లాడిస్తారా ఎంత రస హీనులు అని గునుస్తే.. నీకు ఇరవై నాలుగు గంటలూ తాదాత్మ్యమే ...మరింక మేమెప్పుడు మాట్లాడాలి అని నసుగుతారు .కానీ ఎందుకిట్లా ఊపిరాడ నీయకుండా చేస్తుంది ఒక చిన్ని పాట అని దిగులు ...నాజీవితంపై ఇంత అదుపు ఏమిటి అని బెంగ !

ఇక్కడిచ్చిన పాట ఇంతకు మునుపు ఎప్పుడూ వినలేదు .పాడినావిడ ఎవరో తెలియదు ,పోసేసివ్ నెస్ తో కోపించి కలహించిన నాయిక పశ్చాత్తాపాన్ని హృదయంతరాలలో ని ఆర్తిని , ఎంత బాగా పలికించిందో ...

24, మే 2011, మంగళవారం

మమత బెనర్జీ ప్రతిజ్ఞ !


బెంగాల్ ప్రజలు చాలా సున్నిత మనస్కులు .సంస్కారులు.త్వరగా స్పందిస్తారు.వారి ఈ స్పందించే స్వభావమే చరిత్ర పొడుగూత, మిగిలిన భారతీయులం , మనం వారిని స్మరించుకునేలా చేసింది .బెంగాల్ లో ఉంటూ ఆ ప్రజల ఆకాంక్షలను దగ్గరగా చూడగల అవకాశం ఉన్న వ్యక్తిగా ,నేను ఇవాళ ఊహించగలను. ఈ మార్పు తీసుక రావడం పై వారెంత యోచించారో ,కిందా పైన అయ్యారో ,దిగులు చెందారో .ఎంతగా రోసి పోయారో .బహుశా సమీప భవిష్యత్ లో వారి దుష్ట తరమైన కలల్లోకి కూడా బెంగాలులు CPM ని అనుమతించ లేరేమో .

నిజమే ...తల పగల కొట్టుకోడానికి ఏ రాయయినా ఒకటే అని మేథావులు చెప్తే చెప్పారుగాక ...తల పగల కొట్టుకునే రాయిని ఎంపిక చేసుకునే కనీస అవకాశం కలిగి ఉండటం కూడా గొప్ప విషయమే కదా. ఆ రాయి స్త్రీ కావడం ఆశా భరితమైన మార్పులకు నాంది కావొచ్చేమో కదా !

పాపాయి వాళ్ళ నాన్నచాలా సంతోష పడ్తూ ,మురిసి పోతూ బెంగాల్ పత్రికలలో పడ్డ ఒక వార్తా కధనాన్ని నాకు వినిపించాడు .సంభదిత ఫోటోలు మెయిల్ చేసాడు .1993 లో మమత అప్పటికింకా కాంగ్రెస్లోనే ఉన్న కాలంలో, పీవీ ప్రభుత్వంలో క్రీడా శాఖా సహాయ మంత్రిగా ఉన్నప్పటి సంగతి .నదియ జిల్లాలో ఒక మూగ చెవిటి అమ్మాయిని రేప్ చేసారట .బాధితురాలికి న్యాయం జరగలేదు .నిందితుడికి సిపిఎం పార్టీ సప్పోర్ట్ ఉండటమే అందుకు కారణం .[బెంగాల్ లో సిపిఎం కి ఇది నిత్య కృత్యం ].అదే ఆరోపిస్తూ మమత బాధితురాలిని తీసుకుని అప్పటి ముఖ్య మంత్రి జ్యోతి బసు ని కలవడానికి రైటర్స్ బిల్డింగ్ కి[సెక్రటేరిఎట్] వెళ్లారు .జ్యోతి బసు ,అప్పాయింట్ మెంట్ లేదన్న నెపంతో ఆమెను చూడటానికి నిరాకరించారట .అందుకు నిరసన వ్యక్తం చేస్తూ మమత ముఖ్య మంత్రి చాంబర్ ముందే బైటా యించారు .

ఆదేశించే వెళ్ళారో ఆదేసించకుండానే వెళ్ళారో కానీ జ్యోతి బసు మరో తోవ గుండా బయటకి వెళ్లి పోయారట .ఆయన వెళ్లి పోయిన తరువాత లోకల్ పోలీసులు మమతను జుట్టు పట్టుకుని బయటకు నెట్టారు .ఆ సందర్భంలో మమత ప్రతిజ్ఞ చేసారు ....ఇవాళ మీరు నన్ను అవమానించి బయటకు గెంటు తున్నారు... ఒక రోజు నేను తలెత్తుకుని ఇక్కడికొస్తాను అప్పటి వరకూ రైటర్స్ బిల్డింగ్ లో అడుగే పెట్టను అని .అంతే ఈ పద్దెనిమిదేళ్ళు , రాజకీయంగా ఎంత క్రియా శీలంగా ఉన్నప్పటికీ ,ఆవిడ రైటర్స్ బిల్డింగ్లో అడుగు పెట్టనేలేదుట .పద్దెనిమిదేళ్ళ తర్వాత విజయ శంఖాల్ని పూరిస్తున్న అశేష ప్రజానీకపు ఆశల తోవల వెంట నడుచుకుంటూ వచ్చి రైటర్స్ బిల్డింగ్లో కాలు మోపారు .

ఇదంతా వింటుంటే నాకు భారతం గుర్తొచ్చింది .అభిమాన ధనురాలైన ద్రౌపది గుర్తొచ్చింది.రెండు పద్యాలు గుర్తొచ్చాయి .

ద్రోపది బంధురంబైన క్రొమ్ముడి గ్రమ్మున విడ్చి వెండ్రుకల్
దావలచేత బూని ;యసితచ్చవి బొల్చు మహా భుజంగమో
నా విలసిల్ల వ్రేలగా ;మనంబున బొంగు విషాద రోషముల్
గావగ లేక భాష్పములు గ్రమ్మగా ;దిగ్గున లేచి యార్తయై

[ద్రౌపది చిక్కటి తన తల ముడిని విప్పి తాచు పాము వలె వేలాడుతున్న వెంట్రుకల్ని కుడి చేత్తో పట్టుకుని .మనసులో పొంగే విషాద రోషాల్నిఆపుకోలేక ,కంటి నీరు కళ్ళని కమ్మేస్తూ ఉండగా దిగ్గున లేచి ఆర్తయై ..]

నెట్టెన యిట్టి యల్క మది నిల్పితి రక్కెస తాల్మి జిచ్చొడిన్
గట్టినయట్లు పెద్దయును గాలము ;దీనికి నారుటెన్నడున్
బుట్టదు దుష్ట నిగ్రహము పూని జగంబు గాచునట్టి తో
బుట్టువు నీవు ,తేజము న బొల్చిన భర్తలు గల్గ నచ్యుత

[అచ్యుతా గతి లేక ఇంతటి కోపాన్ని రాక్షసమైన ఓర్పుతో నిప్పు ఒడిన కట్టుకున్నట్లు చాలా కాలం నుండి మోస్తున్నాను .దుష్ట శిక్షణ కోసం పుట్టిన నీవు ,పరాక్రమవంతులైన భర్తలు ఉండి కూడా ఇది చల్లారటం లేదే ...]

ఒందల ఏళ్ళు గడిచినా స్త్రీల పట్ల పురుషుల దృక్పధంలో మార్పులేమీ ఉండటం లేదు కదా .ఇదంతా నీచమూ ,అత్యంత హేయమూనూ ...ఆత్మాభిమానం లేకుండా ,స్త్రీ మగ వాడి వెనుక ఉన్నంత కాలమూ అంతా పదిలమే .కాదని నాకు నా స్వంత మెదడుంది, దానికి దాని ఆలోచనలున్నాయంటూ సమత్వాన్ని, దృడ వ్యక్తిత్వాన్ని ప్రదర్శించామా ఇక అంతే, జుట్టే పట్టుకుంటారో వలువలె ఊడ పీకుతారో ఈ దుశ్శాసనుని అన్నదమ్ములు ...నిరంతరమూ భయమే .
అంత టి ఆత్మాభిమానం కల ద్రౌపది ,అంత కంటే ఎక్కువ ఆత్మాభిమానం కల మమతా బెనర్జీ ఒడిలో కట్టుకున్న నిప్పు లాటి ,ఒక చోట నిలువనీయక నిరంతరం దహించి వేసే అవమానాన్ని ,మృగ క్రౌర్యాన్ని యెట్లా భరించారో. అంతటి రాక్షస ఓర్పు యెట్లా సంపాదించారో కదా ...

ఆనాటి ద్రౌపది అసహాయురాలు. ఆత్మాభిమానిని అయినా ..భర్తల చాటు భార్య ,అచ్యుతుని చాటు చెల్లెలు .అందుకే వారిని వేడుకుంది .విసిగించింది .ఏమయితేనేం పగ సాధించింది .

మమత వెనుక ఏ అండ దండా లేదు ఏక వ్యక్తి సైన్యం .ఆమె నిర్మించుకున్న సామ్రాజ్యం ఆమెదే .పునాది ఆమె దే , పునాది పైని కోటా ఆమెదే ..గెలుపోటముల లెక్క ఆమెదే .మరొకరి ప్రసక్తీ లేదు ప్రమేయమూ లేదు .ఆమె శిరసున అలంకృతమైన విజయ కిరీటం రాయి రాయీ పొదిగి ఆమె స్వయంగా చెక్కుకున్నది .

ఆడ వారు హృదయ వాదులు ., ఉద్రిక్త హృదయులు, ఉద్విగ్నులు.కోపించినా ,దూషించినా ,శపదం చేసినా,ఎ- దు - రు చూసినా నిబద్దతతోనూ హృదయ పూర్వకంగానూ అందంగా చేస్తారు . కదా !

సంతోషం వేస్తుంది .గర్వం వేస్తుంది .ఆశ పుట్టేస్తుంది భవిష్యత్ పైన ఆవిడని చూసుకుని ......లవ్ యు మమతా దీ

Mamata Banerjee's journey from a maverick to a messiah - Assembly Elections 2011: India Today - Photo

16, మే 2011, సోమవారం

ఇవాల్టి మధ్యాన్నం !


బుజ్జీ !
ఇవాల్టి మిట్ట మధ్యాన్నం
నీ చిన్నప్పటి ఫోటో చూసుకుంటుంటే
పదిహేను సార్లు
నీ బుగ్గ పూల బంతుల్ని
గిల్లెయ్యాలనిపించింది

పొత్తిళ్ళలో వేసేసుకుని
నా నామ మంత్రాన్ని
ఉపదేశించాలనిపించింది

చింత బరిక తీసుకుని
చెవి మెలేసి
''నువ్వంటే చా ...లా .. ఇష్టమని''
వల్లె వేయించాలనిపించింది

షీలా ...షీలాకి జవానీ
వాసన వేసే
నీ మగ మనసు కాయితాన్ని
నటరాజ్ రబ్బరు పెట్టి
బర బరా పర పరా శుబ్రం చేసేసి
గాట్టిగా అదిమి పెట్టి
మూల మూలలా
నా పేరు రాసేయ్యాలనిపించింది

ఇప్పటికిప్పుడు
ఇవాల్టి మిట్ట మధ్యాన్నం
నీకు
అమ్మనై పోదామని
మరీ మరీ అనిపించేసింది .

షీలా ,నేను,పాపాయి


పాపాయి ,షీలా మంచి స్నేహితులు .ఇద్దరూ ఏమిటేమిటో కబుర్లు చెప్పుకుంటూ వుంటారు .ఆ కబుర్లలో మరీ వింత విషయాలను పాపాయి నా దగ్గరికి పట్టుకోస్తుంది.అందులో ముఖ్యమైనది     షీలా తాగే సిగిరెట్టు.షీలా కి లేని అలవాటు లేనే లేదనీ,అప్పుడప్పుడూ ఇంటికి 
వెళ్తూ వెళ్తూ డ్రైవర్ తో కలిసి మందు తాగి 
వెళ్తుందని కావాలంటే రెడ్ హేన్దేడ్ గా పట్టి ఇస్తామని యేతర  వర్గాలు చెప్పేయి  .అట్లా నిన్న పాపాయి షీలాకి పుట్టిన నాలుగున్నర కేజీల బిడ్డ  గురించి చెప్పింది .అందులో భాగంగా షీలా నాకు తన కాన్పు కథ చెప్పింది.టెర్రర్ పుట్టించిన షీలా కాన్పుల  కథ చెప్పే ముందు పాపాయి యెట్లా పుట్టిందో చెప్తాను .

 నా కానుపు కథ :
 పాపాయి పొట్టలో వున్నప్పుడు నేను ప్రసవ పూర్వ,ప్రసవానంతర జ్ఞానం మీద
 బోల్డు పుస్తకాలు సేకరించి రీసెర్చ్ మొదలెట్టా ఆ సమయంలో అందరూ పడే అనవసరపు హైరానా మీదా ,ఆడంబరపు ఖర్చుల మీదా నాకు తీవ్రమైన వ్యతిరేఖత  వుండేది .మన నాజూకు తనం సరే దేశం లో దేనికీ గతి లేని వాళ్ళు పిల్లల్నేలా కంటున్నారు వాళ్లకి పుట్టటం లేదా పిల్లలూ అని !

అప్పుడు మా ఇంట్లో వుండే బుజ్జమ్మనలుగురు పిలకాయలు ఇంట్లోనే పుట్టారు...ఆమెకు అంత సులభంగా పుట్టగా నాకెందుకు పుట్టరూ ...?మంచి వైద్య సొకర్యం వద్దు అని కాదు.మనకు మాత్రమె  ఎందుకూ అని నా అంతిమ భావన.

అందుకని  నేను బాగా ఆలోచింఛి   పేరెన్నిక గన్న డాక్టర్లని పక్కన పెట్టాలని నిర్ణయించుకున్నా .సడన్ గా నా రెండో నెలలో నేను వెళ్తున్న అతి గొప్ప డాక్టర్ ని వదిలేసి మా ఇంటి దగ్గర ఒక చిన్న కొట్టులో క్లినిక్ నడుపుతున్న డాక్టరమ్మ దగ్గరికి వెళ్ళడం మొదలెట్టా .[అప్పుడు ప్రభుత్వాసుపత్రి గురించి నేను ఊహ చేయలేక పోవడం చేత , ఆ క్లినిక్ మా ఇంటి దగ్గరే వుండటం చేత  నేను ఆ క్లినిక్ కు వెళ్ళేదాన్ని.]  మా ఇంట్లో వాళ్ళు నేనేది చేసినా కాదనగల స్థితిలో వుండరు .ఎందుకంటె నేనంత జ్ఞానురాలనని [నేను పట్టిన కుందేటికి మూడే కాళ్ళు ] వారి నమ్మకం.

అట్లా ఆ కొట్టు క్లినిక్ కి నడుచుకుంటా వెళ్లి నడుచుకుంటా వచ్చేదాన్ని .అక్కడ నేను ఇంజెక్షన్ చేయున్చుకుంటే ఆ డిస్పోసబుల్ సిరంజిని దాచే వాళ్ళు 
వేరే పేద పేషంట్ లకి వాడటం కోసం.
ఆ కొట్లోనే పరదా ఎనకాల డెలివరీ చెయ్యమని చెప్పా .అయితే ఆ డాక్టరమ్మ కి  నాకున్నంత  ధైర్యం లేక కాన్పు నేను చెయ్యనూ అన్నది.

మళ్ళీ రీసెర్చ్ ...

డాక్టర్లు ఎలా నిర్దాక్షిణ్యం గా సిజేరియన్ లకి వెలి పోతారో.ఎన్ని కథలు చెప్తారో ఆ రీసెర్చ్ లో  తెలుసుకున్నా.మా ఊరి పూజారి ,భార్య కాన్పుకి పదిహేను వేలు కర్చు పెట్టాడని విని ఆశ్చర్య పడ్డాను .పాపం ఎన్ని చిల్లర నాణాలను పోగుచేసి వుంటే  అంత మొత్తం అవుతుంది.
అందుకని ఇక పట్టు పట్టుకున్నానార్మల్ డెలివరీ కావలసిందే అని.

జూన్ ఇరవై డెలివరీ డేట్ .డిల్లీలో ఫిజిక్స్  పీ హెచ్ డీ చేసి, సైంటిస్ట్ గా వున్న నా స్నేహితురాలు బోధించింది ...నొప్పులు వస్తే  కానీ డాక్టర్ దగ్గరికి ఎళ్ళక .  వెళ్లావంటే సిజేరియనే అని.అందుకని జూన్ ఇరవైని జులై మూడు వరకూ సాగతీశా . ఆ డాక్టరూ ఈ డాక్టరూ అని తిరిగాక ఈవిడ  మంచిదీ అనిపించి ఒకావిడ ని ఎంపిక చేసి పెట్టుకున్నా .తెలిసిన వాళ్ళ చేత బలంగా ''ఆ అమ్మాయికి నార్మల్ డెలివరీ కావాలంట ''అని రికమండ్ చేయించా .

.నా రీసెర్చ్ లో ఇంకో భాగమేమంటే ఇప్పుడు పట్టణ మధ్య తరగతి  వాళ్ళం పనులు అసలు చెయ్యడం లేదు .తినడం మాత్రం పాత తరం వాళ్ళకంటే ఆరోగ్యమైన తిండి తింటున్నాం .దాని వల్ల   కూడా బిడ్డ పొట్టలోనే భరువు పెరిగి పోతుందీ   అని.బిడ్డ బయటకొచ్చి పెరగాలని మా బుజ్జమ్మ చెప్పింది. .అందుకని కడుపుతో వున్నప్పుడు తినబెట్టే సున్నుండ లూ ,నేతి పదార్తాలూ వంటి ఆర్భాట పదార్థాలు  దూరంగా ఉంచా.కానీ నాకు మామిడి పల్లంటే ఘోర ప్రేమ, అందుకని విపరీతంగా మామిడి పళ్ళు తిన్నాను .

అప్పుడు మే  వరకూ రెండున్నర కేజీలు వున్న పాపాయి ,పుట్టేప్పటికి మూడున్నర కేజీలయింది .అందుకని డాక్టరు ఎపిసియాటమి  చేసింది .నేను ఎపిశాటమీనా  అని అడుగుతే డాక్టరు నువ్వు మెడికోవా అమ్మాయ్ అని అడిగింది. 

జులై మూడు రాత్రి తొమ్మిదికి వెళ్లి  నర్సింగ్ హోమ లో చేరా  . జులై నాలుగో తేదీ ఐదూ యాభైకి పాపాయి ఉదయించింది .పాపాయికి నాలాగే బల్బులు లేటుగా వెలుగుతాయేమో,పుట్టేసినా... అమ్మ బోజ్జలోనే వున్నఫీలింగ్లో నే ఉండింది.ఆ ఫీలింగ్ పోడానికి డాక్టరు 
పిర్ర మీద ఒక్కటి అంటిస్తే
 అప్పుడు కుయ్యో మర్రో  మని ,అమ్మోయ్ నన్ను కొట్టేసారమ్మోయ్  అని దాని మొదటి కంప్లైంట్ చేసింది .

డాక్టరు ''నీకు అమ్మాయి పుట్టింది అమ్మాయ్  ''అని చెప్పింది .ఆ విషయం నాకు ముందే తెలుసు అందుకని నేనేం ఆశ్చర్య పడలా .మా పెద్దమ్మోల్లకి చాలా పసువులున్నాయి.నేను పెదమ్మకి ముందే చేప్పా నాకు కొడుకు పుడితే మీ పసులకాడికి యిచ్చే స్తాను  అని .పాపం వాళ్లకి పసులకాడికి ఎవరూ దొరకటం లేదు .ఆ విషయంలో వాళ్ళ అదృష్టం బాలేదని నాకేట్లాగూ తెలుసు . .అందుకని నాకు పాపాయే అని ముందే తెలిసి పోయింది.

అప్పుడిక లెక్కలు వేస్తే పాపాయి పుట్టినప్పటికి కారు పెట్రోలు తో సహా తొలి నెల నుండీ డెలివరీ వరకూ నా కయిన ఖర్చు మూడు వేలా ఇరవై రెండు రూపాయలు.[ఎనిమిదేళ్ళ క్రితం]

ఇప్పుడు షీలా కాన్పు  కథ  :
షీలా బంగ్లా దేశీ.దొంగతనంగా ఇండియాకి వచ్చారు.బంగ్లా దేశ్ లో ఆడవాళ్ళు 
పని చేయడానికి వీలు కాదట .ఇక్కడైతే ఆడా మగాతో సహా అందరం పని చేసుకుని పొట్ట పోసుకోవచ్చు  కదా అని ,సరిహద్దు  దొంగతనంగా దాటి వచ్చేసారు.అప్పటి నుండీ ఇప్పటి వరకూ వాళ్ళ కిక్కడ  
నా అన్న వాళ్ళెవరూ  లేరు .సొంత అన్న ఇరవై ఏళ్ళ తరువాత మొన్న వచ్చి చూసి వెళ్ళాట్ట .

షీలా కి బిడ్డ యెట్లా పుట్టిందీ అంటే, ఒక సారి పని చేసుకుంటూ ఉండిందంట .సడన్ గా బిడ్డ తల బయటకి వచ్చేసిందంట అప్పుడు షీలా తనంతట తాను బిడ్డని బయటకి తీసి పేగు ఎనిమిది అంగుళాలు లెక్క వేసి 
వెదురు బద్దతో కత్తిరించి ముడి వేసిందట .ఎందుకు నువ్వే చేసావ్ అంటే ,ఇక్కడ నాకేవరున్నారు  .ఎవరూ లేరు అన్నది .తను భర్త ఇద్దరూ పనికి పోకపోతే గడిచేదేట్ల అందుకని భర్త రిక్షా తొక్కేందుకు వెళ్లి పోయే వాడట .అయితే నీకెట్లా తెలిసింది పేగు ఎనమిది అంగుళాలు కత్తిరించాలనీ అంటే వాళ్ళూ వీళ్ళూ చెప్పుకుంటూ వుంటే ఎప్పుడో విన్నదట .అంతే కాదు వాళ్ళ పాడా[కాలనీ లేదా స్లం] లో అందరూ ఇళ్ళలో కాన్పులేనట  .ఆ తరువాత మాయ లాటి దేదో వస్తుందట [ఇది నా రీసేర్చ్లో తగల్లేదో ...నాకు అర్థం కాలేదోనాకు దీని గురించి తెలీదు.]దాన్ని తీసికెళ్ళి మట్టిలో పూడ్చి ,వచ్చి బిడ్డకి స్నానం చేయించి అరిటాకు కోసి బిడ్డని అందులో పండబెట్టి పసుపు నీళ్ళు చల్లి ,బిడ్డని ఇంటిలో పెట్టి  తాళం వేసి చెరువుకు వెళ్లి తలారా స్నానం చేసి ,వచ్చి ''పేట్  భొరే  ఖేయే''[కడుపు నిం...డుగా తిని]బిడ్డ పక్కన పడుకుని నిదర పోయిందట .ఎవరినోకరిని సహాయం అడగలేక కాదు .ఏం నేను చేసుకోలేనా అని ఒక తప్పనిసరి  ధైర్యం షీలాది .

తనకు పుట్టిన ఐదుగురి పిల్లలకీ అలాగే చేసుకుందట .వింటూ వుంటే ఆ భయానక భీబత్స  దృశ్యం కళ్ళ ముందుకొచ్చి ఒకటే దిగులేసిపోయింది.ఒక చెంపన కార్పోరేట్ హాస్పిటళ్ళు ...అతి నాజూకులూ ,ఒక చెంపన ఇళ్ళలో జరిగే అనారోగ్యకర కాన్పులూ ...జంతువులలాగే బ్రతికేస్తున్న మనుషులూ 

అట్లా ఎందుకు ఉండాలనిపిస్తుంది.మనుషులమేం  చెడ్డ వాళ్ళం  కాదు.,ఒక కథో,సినిమానో చూసి కళ్ళ నీళ్ళు పెట్టేసుకునే మనం చెడ్డ  వాళ్ళం ఎందుకవుతాం?కానే కాం .మన సహృదయ సహజాతాన్ని మేల్కొలిపే ఒక ప్రేరణ ఏదో  ఇవాళ మనకు కావాలి .అవును కదా !.అందరం మెరిసిపోయే గచ్చు వున్న హాస్పిటల్ల లోనే మన బిడ్డలకి జన్మ నివ్వాలి .మనమెవరం గంటలు గంటలు నిలబడి జనరల్ కంపార్ట్ మెంట్లలో ఆశుబ్రత మధ్య ప్రయాణించ కూడదు.సౌకర్యమైన చల్లటి భోగీలలోనే ప్రయాణించాలి .అందుకోసం మనం కాదు మన ప్రభుత్వం  ప్రయత్నించాలి ,కదా? .కానీ ప్రభుత్వం ఎందుకు ప్రయత్నించడం లేదు ?.

డబ్బు వున్న వాడు తిరుమల లో వీ ఐపీ దర్శనమో మరేదో చేసేసుకుంటాడు కదా ,లేని వాడు ఆ కొట్టుల్లో గంటలు గంటలు నిరీక్షిస్తాడు.అట్లా ఎందుకు ?అది గుర్తొచ్చినప్పుడల్లా నాకు ఆ భగవంతుడనే  వాడిని చూడ బుద్దే కాదు .జ్ఞానులైన  వారి దృష్టిలో కుక్క ,కుక్క మాంసం  తినే వాడూ అందరూ ఒకటేనట .కృష్ణ పరమాత్ముడు చెప్పేడు. అయినప్పుడు ఇలా ఎందుకూ మరి?ఎక్కడో ఏదో లోపం అనిపించడం లేదా ?పక్క మనిషి  బాధ పడాలి ,మనం మాత్రమె సుఖం గా వుండాలి అని మనం ఎందుకు అనుకుంటాం ?అస్సలు అనుకోం కదా ?లోపం మనలో లేనే లేదు.ప్రభుత్వాలది.అవునా కాదా?కాకపోతే తిరిగి  తిరిగీ లోపం మనదే .నాకట్లా అనిపించింది మరి.

షీలా కథ విన్నాక నాకు మూడ్ మొత్తం పాడయింది.సమస్త దురన్యాయాలు గుర్తొచ్చి ,ఏవేవో ప్రశ్నలు మెదడుని తింటూ వుంటే పనిమాలా 
నా పెళ్లి రోజు ముసుగు పెట్టి పడుకున్నా.

15, మే 2011, ఆదివారం

టైలర్ పెంచలయ్య కూతురు మరియు మమత దీ!


ఇవాళ పాపాయి వాళ్ళ నాన్న నాకో అందమైన మెసేజ్ పంపించాడు .చదవగానే చాలా సంతోషం వేసింది .చెప్పాలంటే కొంత గర్వంగా కూడా అనిపించింది .ఆ మెసేజ్ ఇది .....

india now ruled by ...
amma in south ;
didi in east ;
bahenji in north;
aunty in d capital;
madam in center.
tai as president
&
wife at home
its a women's world

నాకు పై అందరిలో మమత దీ అంటే చాలా ఇష్టం .బెంగాల్ లో ఉంటున్నానని కాదు .బెంగాలీలు పూజించే కాళికాంశ ఆవిడలో ఉందనీ కాదు .ఆవిడ వ్యవహారం లో కనిపించే సిసలైన స్త్రీత్వమంటే నాకిష్టం .ఆవిడ mood swings అంటే నాకు ముచ్చట .ఆవిడ ధిక్కార శైలి అంటే నాకు ఆరాధన .ఆ తరువాత మాయావతి ,జయ లలితలంటే గౌరవం .

ఇక పోతే టైలర్ పెంచలయ్య కూతురు గురించి :ఈ అమ్మాయి పేరేమిటో నాకు తెలీదు .చూసింది కూడా లేదు .నేను బెంగాల్ లో ఉండగా బహుశా నెల క్రితం అనుకుంటా.. మా అమ్మ ఫోన్ చేసి చెప్పింది ,పెంచలయ్య కూతురు చచ్చి పోయింది అని .ఆ పిల్ల తనొక్కటే చని పోలేదు, తనకు పుట్టిన ఇద్దరు పిల్లల్ని మొదట బావిలో వేసేసి .తరువాత తను దూకింది .

ఆ పిల్ల చెల్లికి ఇటీవల పెళ్ళి జరిగింది .ఇప్పటి కట్నాల రేటు ప్రకారం అక్కకంటే చెల్లికి కట్నం ఎక్కువ ఇచ్చారట .తేడా మొతాన్ని ఇప్పుడు ఇవ్వాల్సిందే అని పేచీ పెట్టాట్ట భర్త .తల్లిదండ్రులు ఇవ్వలేక పోయారు .భరిస్తానని ప్రమాణాలు చేసిన భర్త ఆ పిల్లను యమ కూపం వైపు నడిపించాడు .

పెంచలయ్య ఇంటికి వచ్చినప్పుడు మా అమ్మ నాతో ఫోన్ లో మాట్లాడించింది .యెట్లా జరిగింది అన్న దానికి అతను పై వివరణ ఇచ్చాడు .నేను AP కి వచ్చిన తర్వాత పెంచలయ్య ఇంటికి వచ్చాడు .పిల్లల్ని కూడా చంపేయడం ఎందుకు అని మా అమ్మ బాధ పడుతుంటే .. ...ఎవరు చూస్తార్లే అమ్మ అన్నాడు నిరాసక్తంగా .

మరో సారి వచ్చినపుడు పెట్టిన నగలు ,డబ్బు ఇచ్చేసినారమ్మ అల్లుడోళ్ళు .మా వోళ్ళు డబ్బు తెచ్చుకున్నారు ,దాంట్లో నాకొక పది వేలు ఇచ్చుంటే ఏమమ్మ [పెంచలయ్య పరమ తాగుబోతు ]అని యాష్ట పడ్డాడు .

జీవితం కథలు కాకర కాయలకంటే భిన్నంగా ఉంటుంది .మమతా దీ కి అంత మొండి పట్టుదల ఎక్కడిది ?పెంచలయ్య కూతురు చావునే చివరి పరిష్కారంగా ఎందుకు ఎంచుకుంది ?పెంచలయ్యని ఏమనాలి ...కూతురు శవం మీద డబ్బులేరు కుంటున్నాడన ?ఎందుకో ఇవాళ చాలా ప్రశ్నలు, ఆలోచనలు కలిగేసాయి హటాత్ గా .

సాహిత్యంలో రచయితలు చెయ్ చేసుకుని జీవితపు ఒక డైమన్షన్ నే మనకి చూపిస్తారు .మన ముందు ,మనతో కలిసి నడుస్తున్న ఈ ప్రపంచానికి ముఖాలు అనేకం .మనం ఏ ముఖం చూస్తున్నామో ఆ ముఖం బహుశ మనదేనేమో .కాదంటారా !

14, మే 2011, శనివారం

బొటనేలంత రెడ్డి కథ !


అమ్మలు కథలు చెప్తారా ?చెప్తే అమ్మలు చెప్తారు ?నాకు తెలిసినంత వరకూ చాలా మంది అమ్మలు కథలు చెప్పరు.కథలు చెప్పేంత తీరిక ,సాదా అమ్మలకు ఉండదు .పట్టణీకరణ చెందిన ,నగరీకరణ చెందిన ,అలా చెందిన వారిలోనూ ,తీరిక ఉన్న అమ్మలు కథలు చెప్తారు .

ఇంట్లో పెద్ద వాళ్ళెవరూ లేని ...కవి ,ఉద్యమ కారుడూ , ఉపన్యాసకుడూ ఐన నా స్నేహితుడి మూడేళ్ళ కూతురికి నేను కొన్ని కథల పుస్తకాలు బహుకరించాను .తను వాట్లిని చాలా ఎంజాయ్ చేసిందనీ , చెప్పమని వేదిస్తుందనీ ఫీడ్ బాక్ ఇచ్చినపుడు , చాలా సంతోషించి మరో సారి కలిసినపుడు మరి కొన్ని పుస్తకాలు ఇచ్చాను . సారి పుస్తకాలు చూడగానే పాప బోలెడు సంతోష పడగా ,అమ్మ ,నాన్న చాలా అసహనం వ్యక్తం చేసారు .కథలు చెప్పందే వదలటం లేదనీ ,తమకేమో తీరిక లేదనీ ,[ కొత్త పుస్తకాల బాధను ఎలా డీల్ చేయాలనేది ] వారి ఆరోపణ .

మాకు మా అమ్మ కథలు చెప్పలేదు .కొత్త కోడలిగా ఇంట అడుగు పెట్టిన మా మేన మామ భార్య కథలు చెప్పింది . మా సావాసగాడు జైపాలోళ్ళ నాయన కథలు చెప్పాడు .మా నాయనకు చిన్నప్పుడు, అప్పటికింకా పెళ్ళి కాని వాళ్ళ మేనత్త కథలు చెప్పింది .మా అమ్మోళ్ళకి వాళ్ళ పసులకాడి సుబ్బ రాయుడు కథలు చెప్పాడు .గోపిని కరుణాకర్ కు వాళ్ళ గుడ్డవ్వ కథలు చెప్పింది .ఖదీర్ బాబుకూ అంతే .నా కూతురికి వాళ్ళ అమ్మమ్మ కథలు చెప్తుంది .తాత కథలు చెప్తాడు .పని పాటల ప్రధాన స్రవంతిలో లేని వారు మాత్రమే సాధారణంగా కథలు చెప్పడం జరుగుతూ వస్తుందని నా చిన్ని పరిశీలన . .

మా అమ్మాయికి కథ చెప్పాల్సి వస్తే మా అమ్మ దగ్గర సిద్దంగా ఉండేవి మూడు కథలు .1 .బొటనేలంత రెడ్డి కథ 2 .కొంగ బావ - నక్క బావ కథ 3 .పేను బావ కథ .[కథలకి చివర ఈ బావ అనే పదం ఎందుకు వాడుతారో కొంత తెలుసుకోవాల్సి ఉంది .]
బొటనేలంత రెడ్డి కథ !
అనగనగా ఒక ఊళ్ళో బొటనేలంత రెడ్డి ఉండే వాడట . బొటనేలంత రెడ్డికి చేటడంత కయ్యి , ఈగంత పెళ్ళాం ,దోమంత కూతురు ఉండే వాళ్లంట. చేటంత కయ్యిలో సెవా శేరు ఒడ్లు పండేవంట. వాటితో వాళ్ళు సుఖంగా బతికే వోల్లన్ . అయితే ఒక సారి ఏమయ్యిందీ.. చేటంత కయ్యి మీదికి వామన్దాడిగా పిచుకులు వొచ్చినాయంట . వొచ్చి గింజ మిగలకుండా తినేయడం మొదలు పెట్టేయి .అది చూసి గట్టు మీద కూర్చుని బొట్నేలంత రెడ్డి ఒకటే ఏడుపు ...

అంతలోకి దార్లోనే ఒక గాజుల శెట్టి పోతా... ఉన్నేడం. పోతా పోతా యాడస్తా ఉండ్న రెడ్డిని జూసి ,బొట్నేలంత రెడ్డా! బొట్నేలంత రెడ్డా ! ఎందుకట్టా యాడస్తా ఉండావు అని అడిగినాడు .అప్పుడు బొట్నేలంత రెడ్డి ..ఏం చెయమంటావు గాజుల సెట్టా ! నాకుండేది చేటడంత కయ్యి , దాంట్లో పండే శివు శేరు వోడ్లె కదా మాకు ఆదరవా ! పిచుకలు మడసానా తిని పారనూకతా ఉంటే మేమెట్టా బతకాల .అది తలుసుకునే యాడస్తా ఉండా అన్నాడు .అప్పుడు గాజుల శెట్టి ,అయితే ఒక పని చెయ్ రెడ్డా నేనొక మాట జెప్తా ...రేప్పోద్దన్నే వచ్చి పిచుకల నన్నిట్ని వాలనిచ్చి '' పిచుకలకి నాకు టుంగు బుర్ర'' అను ,పిచుకలన్నీ సచ్చి పడిపోతాయి అపట హాయిగా బతుకు అని చెప్పి సక్కా బొయినాన్టమ్మ .

అప్పుడే
మయిన్దీ.. పక్కన రోజు , పొద్దు బొడవకతలికే బొట్నేలంత రెడ్డి చేలోకొచ్చి పిచుకలనన్నిటినీ వాలనిచ్చి, పిచుకలకి నాకూ టుంగు బుర్ర అనేస్నాడంట .అంతే పిచుకలన్నీ సచ్చి పడ్డాయి .సచ్చి పడ్డ పిచుకలనన్నిటినీ మూట గట్టుకొని ఇంటికొచ్చి ,పెళ్ళాన్ని పిల్చి ..వొసేయ్ ! వొసేయ్ ! నేను నీళ్ళు బోసుకొచ్చేతలికి పిచుకలతో కూరొండి పెట్టు అని చెప్పి నీళ్ళు బోసుకోవడానికి సక్కా బొయినాడం .

అప్పుడేమయిందీ
.... ఈగంత పెళ్ళాం అటిక పొయ్ మీద పెట్టి , మసాలా గిసాలా నూరి పిచుకల కూర ఒండిన్దంట..., ఒండే పిచుకుల కూరని కుత కుత లాడే టప్పుడు ,ఉడికిందా లేదా అని ఒక పిచుకని ,బలే ఉందే అని ఒక పిచుకని ,ఉప్పు మడసంగా ఉందా లేదా అని ఒక పిచుకని ఇట్టా ఒక్కొక్క పిచుకనీ తిని పార నూకిన్దంట .అమా అమా ఏంది మా ! వాసన బలే ఘమాయించి కొడతా ఉందే ...అంటా వచ్చిన కూతురికి రొవన్ని పిచుకులు పెట్టిందంట. పెకారంగా బొటనేలంత రెడ్డి వొచ్చేతలికి తల్లీ కూతుళ్ళు అటిక మొత్తం నాకి పారనూకినారంట .

బొట్నేలంత
రెడ్డి ఒచ్చి పీట వాల్చుకొని , అమేయ్ అన్నం బెట్టు అన్నాడంట .ఈగంత పెళ్ళామ్ అన్నం పెట్టింది కానీ యెయ్ డానికి కూరేడుందే ..మొత్తం అయ్యే పాయ .అదే సంగతి పెనిమిటికి జెప్పింది .అప్పుడు జూసుకో నా సామి రంగా బొట్నేలంత రెడ్డికి సుర్రుమని కోపం వొచ్చేసి ''నా పెళ్ళానికి నాకు టుంగు బుర్ర ''అని పార నూకినాడం .ఇదంతా జూసిన కూతురు ఏంది నాయనా పనా అన్న దానికి నా కూతురికీ నాకూ టుంగు బుర్ర అనేసినాడం. కూతురూ సచ్చి పాయ .
అంతే తుండు గుడ్డ పైనేసుకుని పోతా ఉన్నే డంట .దార్లో ఒక దేవళం దగ్గిర బాపనోళ్ళ సంతర్పణ రగతా ఉన్నిన్దంట.ఆడికి బొయ్యి వరసలో కూర్చున్నాడం . వొ డ్డించే వోళ్ళు నలుసంత నలుసంత ఇదలస్తా ఉన్నేరంట .మారు పెట్టమన్నా రకంగానే చేస్తా ఉండేతలికి కోపమోచ్చేసి బొట్నేలంత రెడ్డి ,ఈ బాపనోల్లకీ నాకూ టుంగు బుర్ర అన్నాడంట అంతే అందరూ సచ్చి పోయినారంట .గంగాళాల్లో , దబరలలో ఉండేదంతా కడుపు నిండా తిన్నా డంట .అంతే పొట్ట పెరిగి పెరిగి బానంత అయి పోయిందంట .పొట్ట పెరిగిందని తలుపు పెరగద్దా .బయటకి పోదామంటే పొట్ట అడ్డం పడతా ఉండే . ఆకరాకి విసిగి పోయి బొట్నేలంత రెడ్డి నా పొట్టకీ నాకూ టుంగు బుర్ర అన్నాడంట .అంతే ఇంకేముందే ...పొట్ట డామ్మని పగిలి సచ్చి పోయినాడం . కథ కంచికి మనం ఇంటికీ .........

గూగుల్ లిప్యంతరీకరణ సహకరించక పోవడం వల్ల మా ఊరి మాండలికాన్ని చెప్పాల్సినంత బాగా చెప్పలేక పోయాను .[మా ఊరు ఏదో చెప్పాల్సిన పని లేదు కదా !]

3, మే 2011, మంగళవారం

నీలోనె కొలువున్నోడూ ...!



పాపాయి
వాళ్ళ నాన దేసాటనకి వెళ్ళాడు .మధ్యలో ఫోన్ చేసి పలకరించాడు ఏం చేస్తున్నావ్ అని ....ఏం చేసాను ,పలకరించే నాధుడు లేక , రోజంతా ఒక పాట వింటూ గడిపాను .ఏం చేస్తున్నా హెడ్ ఫోన్స్ తీయకుండా గడిపాను . పాటని కూడా కేవలం రెండు వాక్యాల కోసం విన్నాను .అందులోను రెండో వాక్యం కోసం మరీ విన్నాను .... రెండో వాక్యం ''నీలోనే కొలువున్నోడు ..నిన్ను దాటి పోనే పోడూ..!మొదటి వాక్యం ''లోకాలనేలేటోడు నీకు సాయం కాక పోడు ''.పాట సదా శివ సన్యాసి తాపసి కైలాస వాసీ.. .''


శివ పార్వతులు వివాహానంతరం అస్సాం ప్రాంతం లో విహరించారట అందుకే ఆ ప్రాంతాన్ని కామ రూప దేశమని అంటారట . కామాఖ్య మందిరం నుండి వస్తున్నపుడే అనుకుంటా మొదటి సారి ఈశ్వరుడు నా ప్రశ్నల పెద్ద పెట్టెలోకి చేరాడు .ఎలాంటి వాడై ఉండొచ్చు అతను ?ఒక రాజ పుత్రిక ,స్మశాన వాసిని ,సర్ప ధరుడిని ,బిక్షుకుడిని ,కట్టు బట్ట లేని వాడిని ఏం చూసి ప్రేమించి ఉండొచ్చు ?సహచరిని పాదాల పాల చేయని అతని సంస్కారపు మూలాలేవి ?భార్యే కదా ,ప్రియురాలు కూడా కాదు కదా ,అయినా సతి మృత శరీరాన్ని చూసి అతను ఎందుకలా విలయ తాండవం చేశాడు .

[నా స్నేహితురాలి తండ్రి అరవై ఏళ్ళ వయసులో ,భార్య మరణించిన ఐదు నెలలకే ,పునర్వివాహం చేసుకున్నాడు .ఇంటికొస్తే అన్ని ఉడుకు నీళ్ళు పెట్టించే వాళ్ళుంటే బాగుంటుంది కదా అన్నది ఆయన ఆలోచన . వేడి నీళ్ళకే ఐతే గీసర్ పెట్టించుకుంటే సరి పోదా అని జోక్ చేసాడు నా తమ్ముడు . ముగ్గురూ కూతుర్లే.ముగ్గరూ మాట్లాడటం మానేశారు .మా అమ్మని అంత త్వరగా మరచి పోయాడా మా నాన అని ...జ్ఞాపకాలు బ్రతికి ఉంటే మనిషి మరణించనట్టే .అవే లేనపుడు ఐదేళ్లకి ఐదు నెలలకి తేడా ఏముంటుంది .]

ప్రియత్వాన్ని అర్థ నారీశ్వరత్వంగా మలచిన ప్రేమౌన్నత్యం అతనికి ఏ దేవి వరం ?ఇంతలా స్త్రీని గౌరవించిన మరో భగవంతుడు ఏ చరిత్రలోనైనా ఉన్నాడా?యౌవనంలో ఉన్న భార్య పట్ల భాద్యతను విస్మరించి దొంగలా పారి పోయిన బుద్దుడిది స్వ సుఖ వాదం కాదా ?ప్రేమించే భార్య.. అడిగి ఉంటే అర్థం చేసుకుని అనుమతించక పోయేదా ?


అయినా మనం శివుడి ప్రేమ స్వరూపాన్ని చెప్పుకోవాల్సినంతగా చెప్పుకోం కదా .బహుశా శివుడు PR విషయంలో శ్రద్ద పెట్ట లేదేమో . ప్రచారం లోనే అన్నీ ఉన్నాయిష! ' గురు ' లు చెప్తున్నారు . అప్పుడు కూడా అదే సూత్రం మనుగడ సాగించి ఉంటుంది .శివుడి జీవితంలో ఏ గంగలు మంగలు ఉండి ఉండరు అవంతా ప్రక్షిప్తాలు. కావాలని వేసిన మచ్చ .నేను నమ్మడం లేదు .శివుడి గురించి ..రోమిలా థాపర్ నొ మరోకరిన వెదకాలి బద్దకాన్ని వదిలించుకుని .

ఎంత చిన్న వాక్యం కదా నీలోనే కొలువున్నోడు నిన్ను దాటి పోనే పోడు అనడం .కొలువై వున్నది మనలోనే అయితే మన అనుమతి లేకుండా దాటి ఎలా పోగలడు.దాటి పోయానని తను అనుకున్నా ఉన్నాడని మనం అనుకున్నంత సేపు అతను బంధీనే కదా ...కాదంటే మనం బంధీలం. రెండూ ఒకటే సూక్ష్మంగా చూస్తే .

మొన్నో రోజు స్నేహితురాలు ఏదో రాగం చెప్పింది .ఇప్పుడు జ్ఞాపకం రావటం లేదు .పాడుతుంటే చాలా సార్లు ఏడుపొస్తుంది అన్నది .పాడుతుంటే కాదు కానీ ..దుక్కపు తుఫాను గాలులు అల్ల కల్లోలం చేసేసిన ప్రతి సందర్భం లోను నేను ఆస్రయించేది త్యాగరాయ ''నగు మోము గనలేని '' కీర్తన . పాడుకుంటూ ''ఖగ రాజు నీ ఆనతి విని వేగ చన లేదో గఘనానికి ఇలకూ బహు దూరంబని నాడో '' అన్న వాక్యాల వద్దకు చేరితే చాలు మనసు మూల మూలలా ఊరుతున్న కన్నీటి చెలమలన్నీ కలుసుకుని పొంగి పొరలుతాయి. తడిసి అలసిన కాసేపటికి మనసులోకి ప్రశాంతత తోసుకొచ్చేస్తుంది.అదే తనతో చెప్పాను ,ఆశ్చర్య పడుతూ తనన్నదీ ..సరిగా వాక్యాల వద్దే నాకూ సేమ్ ఫీలింగ్ కలుగుతుంది ఎందుకలా అని .బహుశా త్యాగ రాయ స్వామి పదాలను ఒక రాగంలో పొదిగినప్పటి నుండీ ,అలా ఎంతో మందికి కీర్తన ఓదార్పునిచ్చి ఉంటుంది .

కీర్తనకి ఉన్న శక్తి అంతా అద్భుతమైన ప్రేమ భావన నుండి ఉద్భ విన్చిందే . ఎంత ప్రేమ ఉండాలి అలా అనుకోవాలంటే ...నగు మోము చూప రాని భగవంతుడ్ని ఒక్క మాటా అనకుండా ,ఖగ రాజు నీ ఆనతి విని కూడా త్వరగా ఎగర్లేదేమో..పైగా ఆకాశానికి, భూమికి చాలా దూరం కదా అనేసాడేమో ....లేక పోతే నువ్వు రాటం ఇంత ఆలస్యం ఎందుకవుతుంది అని నెపాలు ఇతర్లు మీద పెట్టేస్తున్నాడు .ఎంత ప్రేమ ఉండాలి అలా అనుకోవాలంటే .

మరుగేలరా రాఘవా కూడా అంతే ,,,అన్ని నీవనుచు అంతరంగమున తిన్నగా వెదకి తెలిసికొంటినయ్య ..అంటూ నన్ను బ్రోవమని ప్రాదేయ పడటంలో ఎంత నిరహంకారత ఉంది !బహుసా ప్రేమకి సర్వం సమర్పయామి భావం కావాలేమో .అన్నీ వదిలి,, నిన్నె గాని మదినీ ఎన్న జాలనొరులా అని ప్రకటించాలేమో.కానీ అలా ప్రకటించేసిన తరువాత భక్తుడంటే భగవంతుడికి బోర్ కొట్టదా?సర్లే వెల్లోచ్చులే నిదానంగా , ఏమనుకోడులే భక్తుడు ,ఒకవేళ అనుకున్నా ఖగ రాజుని అంటాడు కానీ నన్ను అనడులే అనేసుకోడా ?.

ఏమో నాకు భగవంతుడి పట్ల కూడా ,తమల పాకుతో నువ్వొకటంటే తలుపు చెక్కతో నేనొకటి అంటాననే భావమే ఉంటుంది .అలా అనుకుంటే భగవంతుడురాడా ?.ఎందుకు రాడు వస్తాడు !.నిర్లక్ష్యం చేయక రమ్మన్నప్పుడు చక్కగా క్రమశిక్షణతో సమయానికి వచ్చేస్తాడు .సర్వం సమర్పించామని చెప్పక్కర్లేదు .భగవంతుడు కదా పెంకి ప్రేమల్ని కూడా కనుక్కుంటాడు !.