మీ పిల్లలు మీ పిల్లలు కారు. వాళ్ళు జీవితేచ్చకు జన్మించిన వాళ్ళు . వాళ్ళు మీ ద్వారా వచ్చారు తప్ప మీ నుండి కాదు . వాళ్ళు మీతో ఉన్నా మీకు చెందరు .మీరు వాళ్ళతో ఉండాలని ప్రయత్నిస్తే ప్రయత్నించారు గాక, వాళ్ళు మీలా ఉండాలని మాత్రం అనుకోకండి. ఎందుకంటే జీవితం వెనక్కు మళ్ళదు గనకా, నిన్నటితో మళ్ళీ అతుక్కుపోదు గనకా ..ఖలీల్ జిబ్రాన్

24, మే 2011, మంగళవారం

మమత బెనర్జీ ప్రతిజ్ఞ !


బెంగాల్ ప్రజలు చాలా సున్నిత మనస్కులు .సంస్కారులు.త్వరగా స్పందిస్తారు.వారి ఈ స్పందించే స్వభావమే చరిత్ర పొడుగూత, మిగిలిన భారతీయులం , మనం వారిని స్మరించుకునేలా చేసింది .బెంగాల్ లో ఉంటూ ఆ ప్రజల ఆకాంక్షలను దగ్గరగా చూడగల అవకాశం ఉన్న వ్యక్తిగా ,నేను ఇవాళ ఊహించగలను. ఈ మార్పు తీసుక రావడం పై వారెంత యోచించారో ,కిందా పైన అయ్యారో ,దిగులు చెందారో .ఎంతగా రోసి పోయారో .బహుశా సమీప భవిష్యత్ లో వారి దుష్ట తరమైన కలల్లోకి కూడా బెంగాలులు CPM ని అనుమతించ లేరేమో .

నిజమే ...తల పగల కొట్టుకోడానికి ఏ రాయయినా ఒకటే అని మేథావులు చెప్తే చెప్పారుగాక ...తల పగల కొట్టుకునే రాయిని ఎంపిక చేసుకునే కనీస అవకాశం కలిగి ఉండటం కూడా గొప్ప విషయమే కదా. ఆ రాయి స్త్రీ కావడం ఆశా భరితమైన మార్పులకు నాంది కావొచ్చేమో కదా !

పాపాయి వాళ్ళ నాన్నచాలా సంతోష పడ్తూ ,మురిసి పోతూ బెంగాల్ పత్రికలలో పడ్డ ఒక వార్తా కధనాన్ని నాకు వినిపించాడు .సంభదిత ఫోటోలు మెయిల్ చేసాడు .1993 లో మమత అప్పటికింకా కాంగ్రెస్లోనే ఉన్న కాలంలో, పీవీ ప్రభుత్వంలో క్రీడా శాఖా సహాయ మంత్రిగా ఉన్నప్పటి సంగతి .నదియ జిల్లాలో ఒక మూగ చెవిటి అమ్మాయిని రేప్ చేసారట .బాధితురాలికి న్యాయం జరగలేదు .నిందితుడికి సిపిఎం పార్టీ సప్పోర్ట్ ఉండటమే అందుకు కారణం .[బెంగాల్ లో సిపిఎం కి ఇది నిత్య కృత్యం ].అదే ఆరోపిస్తూ మమత బాధితురాలిని తీసుకుని అప్పటి ముఖ్య మంత్రి జ్యోతి బసు ని కలవడానికి రైటర్స్ బిల్డింగ్ కి[సెక్రటేరిఎట్] వెళ్లారు .జ్యోతి బసు ,అప్పాయింట్ మెంట్ లేదన్న నెపంతో ఆమెను చూడటానికి నిరాకరించారట .అందుకు నిరసన వ్యక్తం చేస్తూ మమత ముఖ్య మంత్రి చాంబర్ ముందే బైటా యించారు .

ఆదేశించే వెళ్ళారో ఆదేసించకుండానే వెళ్ళారో కానీ జ్యోతి బసు మరో తోవ గుండా బయటకి వెళ్లి పోయారట .ఆయన వెళ్లి పోయిన తరువాత లోకల్ పోలీసులు మమతను జుట్టు పట్టుకుని బయటకు నెట్టారు .ఆ సందర్భంలో మమత ప్రతిజ్ఞ చేసారు ....ఇవాళ మీరు నన్ను అవమానించి బయటకు గెంటు తున్నారు... ఒక రోజు నేను తలెత్తుకుని ఇక్కడికొస్తాను అప్పటి వరకూ రైటర్స్ బిల్డింగ్ లో అడుగే పెట్టను అని .అంతే ఈ పద్దెనిమిదేళ్ళు , రాజకీయంగా ఎంత క్రియా శీలంగా ఉన్నప్పటికీ ,ఆవిడ రైటర్స్ బిల్డింగ్లో అడుగు పెట్టనేలేదుట .పద్దెనిమిదేళ్ళ తర్వాత విజయ శంఖాల్ని పూరిస్తున్న అశేష ప్రజానీకపు ఆశల తోవల వెంట నడుచుకుంటూ వచ్చి రైటర్స్ బిల్డింగ్లో కాలు మోపారు .

ఇదంతా వింటుంటే నాకు భారతం గుర్తొచ్చింది .అభిమాన ధనురాలైన ద్రౌపది గుర్తొచ్చింది.రెండు పద్యాలు గుర్తొచ్చాయి .

ద్రోపది బంధురంబైన క్రొమ్ముడి గ్రమ్మున విడ్చి వెండ్రుకల్
దావలచేత బూని ;యసితచ్చవి బొల్చు మహా భుజంగమో
నా విలసిల్ల వ్రేలగా ;మనంబున బొంగు విషాద రోషముల్
గావగ లేక భాష్పములు గ్రమ్మగా ;దిగ్గున లేచి యార్తయై

[ద్రౌపది చిక్కటి తన తల ముడిని విప్పి తాచు పాము వలె వేలాడుతున్న వెంట్రుకల్ని కుడి చేత్తో పట్టుకుని .మనసులో పొంగే విషాద రోషాల్నిఆపుకోలేక ,కంటి నీరు కళ్ళని కమ్మేస్తూ ఉండగా దిగ్గున లేచి ఆర్తయై ..]

నెట్టెన యిట్టి యల్క మది నిల్పితి రక్కెస తాల్మి జిచ్చొడిన్
గట్టినయట్లు పెద్దయును గాలము ;దీనికి నారుటెన్నడున్
బుట్టదు దుష్ట నిగ్రహము పూని జగంబు గాచునట్టి తో
బుట్టువు నీవు ,తేజము న బొల్చిన భర్తలు గల్గ నచ్యుత

[అచ్యుతా గతి లేక ఇంతటి కోపాన్ని రాక్షసమైన ఓర్పుతో నిప్పు ఒడిన కట్టుకున్నట్లు చాలా కాలం నుండి మోస్తున్నాను .దుష్ట శిక్షణ కోసం పుట్టిన నీవు ,పరాక్రమవంతులైన భర్తలు ఉండి కూడా ఇది చల్లారటం లేదే ...]

ఒందల ఏళ్ళు గడిచినా స్త్రీల పట్ల పురుషుల దృక్పధంలో మార్పులేమీ ఉండటం లేదు కదా .ఇదంతా నీచమూ ,అత్యంత హేయమూనూ ...ఆత్మాభిమానం లేకుండా ,స్త్రీ మగ వాడి వెనుక ఉన్నంత కాలమూ అంతా పదిలమే .కాదని నాకు నా స్వంత మెదడుంది, దానికి దాని ఆలోచనలున్నాయంటూ సమత్వాన్ని, దృడ వ్యక్తిత్వాన్ని ప్రదర్శించామా ఇక అంతే, జుట్టే పట్టుకుంటారో వలువలె ఊడ పీకుతారో ఈ దుశ్శాసనుని అన్నదమ్ములు ...నిరంతరమూ భయమే .
అంత టి ఆత్మాభిమానం కల ద్రౌపది ,అంత కంటే ఎక్కువ ఆత్మాభిమానం కల మమతా బెనర్జీ ఒడిలో కట్టుకున్న నిప్పు లాటి ,ఒక చోట నిలువనీయక నిరంతరం దహించి వేసే అవమానాన్ని ,మృగ క్రౌర్యాన్ని యెట్లా భరించారో. అంతటి రాక్షస ఓర్పు యెట్లా సంపాదించారో కదా ...

ఆనాటి ద్రౌపది అసహాయురాలు. ఆత్మాభిమానిని అయినా ..భర్తల చాటు భార్య ,అచ్యుతుని చాటు చెల్లెలు .అందుకే వారిని వేడుకుంది .విసిగించింది .ఏమయితేనేం పగ సాధించింది .

మమత వెనుక ఏ అండ దండా లేదు ఏక వ్యక్తి సైన్యం .ఆమె నిర్మించుకున్న సామ్రాజ్యం ఆమెదే .పునాది ఆమె దే , పునాది పైని కోటా ఆమెదే ..గెలుపోటముల లెక్క ఆమెదే .మరొకరి ప్రసక్తీ లేదు ప్రమేయమూ లేదు .ఆమె శిరసున అలంకృతమైన విజయ కిరీటం రాయి రాయీ పొదిగి ఆమె స్వయంగా చెక్కుకున్నది .

ఆడ వారు హృదయ వాదులు ., ఉద్రిక్త హృదయులు, ఉద్విగ్నులు.కోపించినా ,దూషించినా ,శపదం చేసినా,ఎ- దు - రు చూసినా నిబద్దతతోనూ హృదయ పూర్వకంగానూ అందంగా చేస్తారు . కదా !

సంతోషం వేస్తుంది .గర్వం వేస్తుంది .ఆశ పుట్టేస్తుంది భవిష్యత్ పైన ఆవిడని చూసుకుని ......లవ్ యు మమతా దీ

Mamata Banerjee's journey from a maverick to a messiah - Assembly Elections 2011: India Today - Photo

కామెంట్‌లు లేవు: