మీ పిల్లలు మీ పిల్లలు కారు. వాళ్ళు జీవితేచ్చకు జన్మించిన వాళ్ళు . వాళ్ళు మీ ద్వారా వచ్చారు తప్ప మీ నుండి కాదు . వాళ్ళు మీతో ఉన్నా మీకు చెందరు .మీరు వాళ్ళతో ఉండాలని ప్రయత్నిస్తే ప్రయత్నించారు గాక, వాళ్ళు మీలా ఉండాలని మాత్రం అనుకోకండి. ఎందుకంటే జీవితం వెనక్కు మళ్ళదు గనకా, నిన్నటితో మళ్ళీ అతుక్కుపోదు గనకా ..ఖలీల్ జిబ్రాన్

2, జులై 2011, శనివారం

రాలి పోయిన చందమామ !


ఇవాళ ఇక్కడ జోరు వర్షం .చిన్నప్పటి నుండి కోరిక ఎడ తెరిపి లేని వర్షాన్ని వింటూ ఉండగలగాలని.తీరి పోతూ ఉంది .స్నేహితురాలు అన్నది ఇద్దరం ఒకటే సారి ''విమెన్ ఇన్ లవ్'' స్టార్ట్ చేద్దామని .ఎందుకో ఆ పుస్తకమంటేనే భయం .అట్లాటిదే హిమజ్వాల .ఎందుకొచ్చిన కష్టం, సుఖంగా ఉన్న ప్రాణాన్ని చల్లగా ఉండనీయక .రాత్రి పది పేజీలైనా చదివి పడుకోమంది .మొరాయించేసి నిద్ర పోయాను .ఆక్క చెల్లెళ్ళ లోతైన తొలి తొలి మాటలే భయ పెట్టేస్తాయ్.మొదటి పేజీలోనే అక్క, చెల్లి అన్న ఏదో మాటకి అంటుంది ,''ఇన్ ది అబ్ స్ట్రాక్ట్ బట్ నాట్ ఇన్ ది కాంక్రీట్ ''అని ఆ మాట శీర్షిక చేసి కవిత ఒకటి రాసుకున్నా2005 లో .

ఇవాళ ఒరియా రచయిత ఉపేంద్ర కిషోర్ దాస్ రాసిన చిన్ని నవల ''రాలిపోయిన చందమామ '' తీసుకున్నా, విమెన్ ఇన్ లవ్ ని అవతల పారేసి .అమ్మాయి సత్తి మధ్య తరగతి బ్రాహ్మణ పిల్ల .ఆ పిల్ల కంటే చాలా పెద్ద వాడైన ఒక జమీందారుకి ఇచ్చి పెళ్ళి చేస్తారు తల్లి దండ్రులు .నాథం ఆ పిల్ల అత్త కొడుకు .వాళ్ళిద్దరి మధ్య ఏదో ఆకర్షణ ఉంటుంది .పెళ్లై భర్త ఇంటికి వెళ్ళినా అతనికి భార్య కాలేక పోతుంది .అతని ఉంపుడు గత్తె [ఈ మాట అసహ్యంగా ఉంది .పుస్తకంలో అదే వాడారు .ఇంకో మాట యోచించాలి ]దాష్టీకం భరించరానిదిగా ఉంటుంది .

ఒక సారి భర్త కొడుకు పుట్టు వెండ్రుకలు తీయించేందుకు ,పక్క ఊరి మందిరానికి వెళ్లి ,వారి నుండి తప్పి పోతుంది .అక్కడ నాధం తతస్తపడుతాడు .తుఫాను చేత రాత్రి అక్కడే తలదాచుకుని పక్క రోజు ఇంటికి వస్తారు .భర్త వెళ్ళ గొట్టేస్తాడు .నాధం కటక్ తీసికేల్తాడు. కొన్ని రోజులు అలా గడుస్తుంది .చివరికి ఒక రోజిక ఊరికి వెళ్లాల్సిందేనని పట్టు పడ్తుంది .అప్పుడు నాధం చెప్తాడు ఆపిల్ల తల్లి దండ్రులు కలరా తో చని పోయారని .చివరికి ఊరికి వెళ్తారు .

ఆ ఊరి వాడే అయిన స్కూల్ టీచర్ వీళ్ళని అనుకోని పరిస్థితుల్లో చూస్తాడు .అమ్మాయిని బెదిరిస్తాడు .ఆస్తినంతా తన పేర రాసియ్యమని లేదంటే ఊరంతా వీరి విషయం చాటింపు వేసేస్తానని .అది తెలిసి నాధం వాడిని బెదిరిస్తాడు .అనుకున్న విధంగానే గ్రామం నాథాన్ని బెదిరిస్తుంది ,ఏ సేవలూ అందనీయకుండా చేస్తుంది .ఇదంతా చూసి తన వల్ల అతనికి ఏ కష్టం కలగ కూడదని భావించి సత్తి, నాథానికి ఒక ఉత్తరం రాసి పెట్టి అర్థ రాత్రి ఇళ్ళు విడిచి పెట్టేస్తుంది .ఆమె ప్రయాణం లో నది ఎదురొస్తుంది ...సత్తి ముగింపుని సూచిస్తూ,,అంతటితో నవల అంతమై పోతుంది .

ఆ మధ్య గుర్రం కథ ఒకటి చదివాను, బ్లాక్ బ్యూటీ అనుకుంటా గుర్తు రాటం లేదు .ఎందుకో అందులో గుర్రం నిస్సహాయత అప్పుడు నాకో అమ్మాయి జీవితాన్ని గుర్తుకు తెచ్చింది .ఈ నవలలో సత్తి మళ్ళి ఆ నవలను జ్ఞాపకం చేసింది .చాలా సమర్దవంతంగా నా మనసు రెండిటినీ కలిపింది .రెండు అసహాయతల రూపం ఒకటే .

వాన బాగుంటుంది .పుస్తకం బాగుంటుంది .ముసురుపట్టిన ఆకాశమూ,దిగులు పెట్టించే పుస్తకమూ కలిస్తే ఆ పుస్తకం చదివిన జ్ఞాపకం జీవితంలో మళ్ళీ మళ్ళీ చాలా వానల్లో మనసులోకి తోసుకొస్తుంది .

నీతి ఏమిటంటే జీవితం ఎంతో చిన్నది కనుక బెంతాం చెప్పినట్టు, సంతోషమనే సుఖాన్ని ఇచ్చే మంచి పుస్తకాలే చదువుకోవలెను.ఇలాటి కష్టాల పుస్తకాలు చదివేసి మనసుని కష్ట పెట్టుకోరాదు .

కామెంట్‌లు లేవు: