మీ పిల్లలు మీ పిల్లలు కారు. వాళ్ళు జీవితేచ్చకు జన్మించిన వాళ్ళు . వాళ్ళు మీ ద్వారా వచ్చారు తప్ప మీ నుండి కాదు . వాళ్ళు మీతో ఉన్నా మీకు చెందరు .మీరు వాళ్ళతో ఉండాలని ప్రయత్నిస్తే ప్రయత్నించారు గాక, వాళ్ళు మీలా ఉండాలని మాత్రం అనుకోకండి. ఎందుకంటే జీవితం వెనక్కు మళ్ళదు గనకా, నిన్నటితో మళ్ళీ అతుక్కుపోదు గనకా ..ఖలీల్ జిబ్రాన్

19, జులై 2019, శుక్రవారం

'' చూసావామ్మా ! మమ్మీ ఎంత ముదురో '' !

పాపాయి తొమ్మిదో క్లాస్ చదువుతుంది కదా .. కానీనేమో దానిదింకా ముద్దుగారే అమాయకపు బుర్రే . ఏమైందీ ,ఆ మధ్యన ఫిబ్రవరి 14 వచ్చింది కదా ఆరోజుకి ముందురోజు మధ్యాన్నం నేను దానికి ఫోన్ చేసాను . మమ్మీ దానికి పక్కనే కూర్చుని బువ్వ తినిపిస్తూ వుంది . పాపాయి ఫోను అందుకోగానే ''అమ్మా ఈ రోజు మా స్కూల్ లో అన్ని క్లాసులకి కిటికీలు మూసేస్తున్నారమ్మా '' అన్నది . నేను ఆశ్చర్యపడి ''ఎందుకమ్మా ?''అని ప్రశ్న వేసాను . అది '' నీకు తెలీదా..  వాలంటైన్స్ డే రోజు అబ్బాయిలందరూ అమ్మాయిలకి ఏమయినా లెటర్లు ,గిఫ్టులు ఇస్తారని అట్లా చేస్తారు '' అన్నది . నేను '' మరీ చోద్యంరా ఇది కిటికీలు మూసెయ్యడం ఏంటీ చిత్రంగా '' అని దీర్ఘం తీసాను . పాపాయి ''నీకు తెలీదులేమ్మా ! మా స్కూల్ వాళ్ళు ఏది చేసినా అది మంచిదే '' అన్నది . నేనేమో తారీఖులు గుర్తులేని గృహ జీవితంలో వున్నా కదా అందుకని , ''యెప్పుడురా ఇంతకీ ప్రేమికుల రోజు ?'' అన్నాను . పాపాయి ఏమనుకుందీ  చాలా చాలా కాలం నుండి ఫిబ్రవరి పద్నాలుగో తేదీన ప్రపంచం ప్రేమికుల రోజు అని ఒకటి జరుపుకుంటుందనీ ,అది తనలాటి చిన్నపిల్లలకి కూడా తెలుసుననీ , అమ్మకి తెలియకపోవడమేమిటనీ చాలా ఆశ్చర్యపడి ''నీకసలు వాలంటైన్స్ డే ఎప్పుడో నిజంగా తెలీదామ్మా '' అన్నది బిగ్గరగా . నేను దాని ఆశ్చర్యానికి ముచ్చటపడి ,దాన్నలాగే కొనసాగిద్దామనుకుని ''తెలీదురా '' అన్నాను . పాపాయి ఆశ్చర్యంతోనే అన్నం తినిపిస్తున్న అమ్మమ్మ ని '' నువ్వు చెప్పుమా వాలంటైన్స్ డే ఎప్పుడో '' అన్నది . మా అమ్మ చాలా గర్వంగా ,తనకున్న అపారమైన పత్రికా జ్ఞానాన్ని ప్రదర్శిస్తూ '' ఫిబ్రవరి 14 రా  ''అన్నది . మా అమ్మాయి వెంటనే '' చూసావామ్మా ! మమ్మీ ఎంత ముదురో '' అన్నది

.హమ్మయ్య ! ఎలాగయితేనేం ,ఇవాళ నేను ముదురు కాకుండా తప్పించేసుకున్నాను !