మీ పిల్లలు మీ పిల్లలు కారు. వాళ్ళు జీవితేచ్చకు జన్మించిన వాళ్ళు . వాళ్ళు మీ ద్వారా వచ్చారు తప్ప మీ నుండి కాదు . వాళ్ళు మీతో ఉన్నా మీకు చెందరు .మీరు వాళ్ళతో ఉండాలని ప్రయత్నిస్తే ప్రయత్నించారు గాక, వాళ్ళు మీలా ఉండాలని మాత్రం అనుకోకండి. ఎందుకంటే జీవితం వెనక్కు మళ్ళదు గనకా, నిన్నటితో మళ్ళీ అతుక్కుపోదు గనకా ..ఖలీల్ జిబ్రాన్

17, ఏప్రిల్ 2011, ఆదివారం

ఎండా కాలపు మా ఊరు !

ఇవాళ బాగా వేడిగా ఉంది .వేడికి కాబోలు ఇంచుమించు మూడెకరాలు ఉన్న ఈ తోట ఇంట్లో ,పాములు స్వేచ్చా విహారం మొదలెట్టాయ్ .నిన్న దాదాపు నాలుగడుగుల నాగు పాము కనిపించింది .నాల్రోజుల క్రితం అవేదో పాములు రెండు కనిపించాయ్ .పాముల కళ్ళు ఎంత అందంగా ఉంటాయో.అన్ని పాములూ మనల్ని చూసి పారి పోవు .ధ్యానంలో ఉన్న యోగుల్లా ,తమ దారిన తాము పోతుంటాయి .బెంగాలీలు నాకు పాముల్ని కూడా ప్రేమించడం నేర్పించారు .సహ జీవనం అలవాటు చేసారు .

ఇవాళ ఎందుకో మా ఊరు బాగా జ్ఞాపకానికి వచ్చింది . ఎండల్లో వేప చెట్టు కింద మంచమేసుకుని పడుకొంటే ..కనిపించినంత మేరా ,వేప చెట్టు పచ్చగా పరుచుకుని ,యేవో గాలి పాటలు పాడుకుంటూ ఉన్నట్టు తల ఊపేది .అప్పుడప్పుడూ చెట్టు కొమ్మల్లో పాకుతూ , పసరిక పాములు కనిపించేవి .ఆ పాముల అందం అద్భుతం .అంత పచ్చదనం ఎక్కడిదో వాటికి . సన్నగా, నాజూకుగా ..పసరికలు కళ్ళు పొడుస్తాయ్ అనే వారు .ఒక్కో సారి చెట్టు పై నుంచి కింద పడవు కదా అనిపించేది .రంగుల రంగుల నీళ్ళ పాములు పంపు షెడ్లో హాయిగా విశ్రాంతి తీసుకునేవి .వాటిది అదో అందం .జెర్రి గొడ్లు ,తాటి బులుగులు ,రక్త పెంజెరిలు,చెట్టిరిగిలు ఎన్నెన్ని పాములో .రాష్ట్రం మారినా ,ఈ పాముల సాహచర్యం పోలేదు నాకు .ఏం అనుబంధమో ఇది .

నక్షత్రాల నీలి ఆకాశం క్రింద ,సమిష్టి కుటుంబపు జనాభా అంతా నిదురలయ్యే వాళ్ళం .ఉదయం కళ్ళు తెరిచే సరికి పెద్ద వాళ్ళ మంచాలన్నీ మాయమై ఉండేవి .పచ్చటి కళ్ళాపి వాకిలి కళ్ళ ముందట పరుచుకుని కని పించేది .ఎంత పెద్ద వాకిలో, ఎంత చాకిరో . యెర్రని సూర్యుడితో పాటు ఆకలి పాటలయ్యే పక్షుల్లా , మంచి నీళ్ళ కోసం బారులు తీరి వచ్చే మనుషులు కనిపించే వారు .ఇప్పుడు జీవ నది లాటి మా బావి ఎండి పోయింది .సంవత్సరాల తరబడి దాహపు గొంతులను ఊరడించిన మా ఇళ్ళు ,నీళ్ళ డబ్బా కోసం మోర ఎత్తిన లేగ దూడలా , పట్టణం దిక్కుకు చూస్తూ ఉంటుంది .రొయ్యలు వెళ్తూ వెళ్తూ మాకు ఇచ్చి వెళ్ళిన బహుమతి అది .

తంపటి గణుసు గడ్డలు ఎంత తియ్యగా ఉండేవో .ఇంటి దగ్గరి తోట, ఒక్కో సారి ఒక్కో పంటతో కళ కళ లాడేది ..మొక్కజోన్నలకి ఎన్ని గిచ్చుళ్లో .యెర్రటి మిరప తోటలో విరబూసిన బంతులది బలే సౌందర్యం .తోపు చిలుకల దా, తాటి చెట్లదా అనిపించే తోట పక్కని , చిలుకల గూళ్ళ తాటి తోపు .గుడి ఆవరణ అంతా పరుచుకుని ఎన్ని పక్షి కుటుంబాలకి ఇళ్ళు ఇస్తుందో మర్రి చెట్టు .ఊర్లో ఏమీ మారనిది భగవంతుని దయ చేతను ఇది ఒక్కటే .

సందేళ బర్రె వాహనం పై ఇంటికి వచ్చే స్నేహితుడు సురేంద్ర హసితపు మోము, మనసు మీద ముద్ర కొట్టినట్టు జ్ఞాపకం .ఎంత పొడవై పోయాడో .ఇప్పుడు ఆటో అయి, జనాలని పట్టణానికి, పల్లెకి మోస్తున్నాడు .చిన్నప్పుడే కూలి పనిగా మారి ,ఎంత జీవితాన్ని అనుభవించేసిందో..వెంకటేస్వరి ఉరఫ్.. అమీరు కోసం ,కట్టుకున్న బండ మొగుడ్ని చీత్కరించి ఎడమ కాలితో తన్నిన రాజేశ్వరి .బుజ్జమ్మా... నీ కూతురు మాటకారి మల్లెమొగ్గ అని ఎంత కవిత్వం నా మీద ఒలకబోస్తుందో ..ఈ ఫెమినిస్టు. నల నల్లటి మోము పై పూచే తెల తెల్లటి నవ్వుల పూదోట ఈ పిల్ల .ప్రియుడు అమీరు తరచూ యముడయినా ,ఈ పిల్ల ముఖంలో నవ్వెందుకు అతికే ఉంటుందో రీసెర్చ్ చేయాలి .


ఆస్పత్రి దగ్గరి పెంచలమ్మఇంటి ముంగటి నల్లటి కుండపై తెల్లటి కల్లు నురుగు ,ఎర్రెర్రని ఎండల్లో తాటి చెట్ల కింద జమై చల్లచల్లని కల్లు తాగే ఊరి మగవాళ్ళు ,గొంతు మొయ్య తాగి మా ఇంటి కొచ్చి ,గచ్చుపై కొంగు పరుచుకుని పడుకుని ఊరి కబుర్లు చెప్పే రవణమ్మ ..... ఆసక్తిగా ఆ కబుర్లు వినే మా ఇంటి ఆడోళ్ళు. ఏం కులాలో ,ఏం మతాలో మా తాత కొందరికి చిన్నాయనా ,కొందరికి మామ ,పెదనాయన .ఎంతెంత ప్రేమలో .తేలు కుట్టి కయ్యో మంటూ మా తాత మందుకోసం ఇంటికొచ్చే మనుషులు... , మా ఆటల మట్టి గోర్లు కత్తిరించి ,బీడీలో కూర్చి వాళ్ళ చేత తాగించే మా తాత బ్రమ్హాండమైన విచిత్ర వైద్యం ...

మళ్ళీ చిన్న పిల్లనైతే ఎంత బాగుండు .ఆగమ్మ కాకిలా తోటలెంట,దొడ్లెంటా తిరగ గలిగితే ఎంత బాగుండు ...కాలం వెనక్కి వెళి పోతే ,చిన్న చిన్న బుడ్లు పెట్టుకుని ,,బోలెడు ఆటలు ఆడేసుకో గలిగితే ,జైపాలోళ్ళ నాయన దగ్గర ''దొల్లు దొల్లు పుచ్చకాయ్ దోల్లితే రెండొక్కలు '' కథ విన గలిగితే ,బంక పళ్ళుని ,యాక్ ఛీ ఏం బాలేవ్ అనేయ గలిగితే ,యంపలి చెట్లు గిల్లి బుడగలు ఊదేస్తే ,తిండి తిప్ప లేకుండా ఇదేమి చదువు ,ఇట్ట చదివితే కళ్ళు సంక నాకి పోతాయి అంటూ తిడ్తా పెద్దమ్మ పెట్టే బువ్వ ముద్దలు మింగుతూ ,కథల లోకంలో ఉయ్యాలలూగ గలిగితే ,పండుగ నెల ప్రసాదం కోసం పాచి పళ్ళతో గుడి ముంగిట వరుసనవ గలిగితే ,వస్తూ వస్తూ రక్త పెంజరి గుడ్డు చేత పట్టుక రాగలిగితే ,కోతి కొమ్మచ్చినై కొంగ గూట్లో పిల్లలతో కబుర్లాడగలిగితే ,చిలుక పిల్ల కోసం హరినాదుని బ్రతిమిలాడ గలిగితే ,పిచుక పిల్ల కోసం ఉషతో మారు బేరాలు పెట్ట గలిగితే ....

ఎందుకో మనుషులం అనవసరంగా పెద్దవాళ్ళం అయి పోతాం .తలుచుకుంటే ఈ పెద్దతనం చిరాగ్గా అనిపించేస్తుంది .అందుకే పాపాయిని క్షణం ఇంట్లో ఉండనీ బుద్ది కాదు .ఇంట్లో కనిపించావంటే వీపు విమానం మోత మోగి పోద్ది అంటే ,పాపాయ అమ్మ తిట్టు కవిత్వపు అర్థాన్ని గ్రహించేసి, ఆటలై గంతులై , సాయంత్రానికి అలసి సొలసి నిదురవుతుంది.రేపు పొద్దటికి ఆనందంతో విరబూసిన బొండు మల్లె పువ్వై బడికెల్తుంది .మా అమ్మాయి t v ఎరుగని ఆట పాటల సన్నజాజి పూ తీగ .పట్టణపు వాడైన పాపాయి నాన్నకి కోపం .నీ కూతురు ఆడినట్టు ఈ కాలం లో ఎవరూ ఆడరు అని నిష్టూర పడతాడు .ఒక్కో సారి ఆడి ఆడి బలే పొడవైందే ..అనుకుని మురిసి పోతాడు .
*||*|*******
ఏ మాయల మరాటీ అయినా మళ్ళీ నన్ను చిన్న పిల్లని చేసేస్తే ఎంత బాగుండు .అందుకోసం నాకెంతో ఇష్టమైన పాపాయి వాళ్ళ నాన్నని మారకం పెట్టేస్తా ..ఆ తరువాత చాలా ......నిదానంగా పెరిగి పెద్దయి,మళ్ళీ తెచ్చేసుకుంటా .ఎందుకంటె పాపం చాలా మంచోడు కదా !ఈ అమ్మాయి ప్రేమించి దాపెట్టుకున్న సొంతాల చిట్టి బొమ్మ కదా !

4 కామెంట్‌లు:

jyothi చెప్పారు...

మీరు మీ పాపాయి జీవితాన్ని జీవిస్తున్నారు. చాలా సంతోషంగా ఉంది.

గోదారి సుధీర చెప్పారు...

thank you!

Unknown చెప్పారు...

మీ పోస్ట్ చాలా బాగుంది . చిన్నతనంలో మనం ఫీల్ అయిన విషయాల్ని మీరు అద్భుతంగా వ్రాసారు . మన చిన్నతనపు తీపి జ్ఞాపకాలు అలవాట్లు మనం చిన్నప్పుడు జీవించిన జీవితం వ్యక్తిగతంగా మీకు నాకు వ్యత్యాసం ఉన్న కూడా అదే పంధా లో సాగింది . నేను ప్రతి ఎండా కాలం లో అనుకుంటాను నేను మళ్ళీ చిన్న పిల్లాడిని అయితే బాగుండు ఎంచక్కా గోలీలు బొంగరాల ఆట ఆడుకోవచ్చని....ప్రతి ఎండాకాలంలో అనుకుంటాను నేను చిన్న పిల్లాడిని అయితే నా స్నేహితులతో ఎంచక్కా ఈత కొట్టచ్చు అని ... మీరు అన్నట్లు గా ఇప్పుడు మా ఊర్లో కూడా రకరకాల పంటలు లేవు కాని అదే స్థానం లో రకరకాల పేర్లతో రియల్ ఎస్టేట్ సంస్థలు ఉన్నాయి. కనిపించినంత దూరం బాగా చదును చేసి ఇక్కడ పూర్వం చెట్టు ఉండేది అనే ఊహ కూడా రాని విధంగా ఉన్నాయి . చిన్నతనం లో కనిపించిన చెట్టునల్లా గిచ్చి రుచితో సంబంధం లేకుండా దాని పండు తిని దాన్ని ఏడిపించి తిరిగేవాళ్ళం కాని ఇప్పుడు పండు సంగతి అటుంచి అసలు చెట్టే లేదు రా దేవుడా అని మనం ఏడవాల్సిన కర్మ. రకరకాల ఆటలు పాటలు కథలు వింతలు వినోదాలు ఇలా గడిచిన మన చిన్న తనపు రోజులు జ్ఞాపకాలు మాత్రమే అనే విషయం ఇప్పటికి ఎప్పటికి మింగుడు పడని విషయం.. కాని మీరు రాసిన ఈ పోస్ట్ నన్ను దాదాపుగా చిన్న పిల్లాడ్ని చేసింది... చాలా మంది చిన్నారులకు దొరకని భాగ్యం మీ పాపాయి కన్నా దొరికింది అని మిక్కిలి సంతోషం గా ఉంది .
మీ నుంచి ఇలాంటి పోస్ట్ లు మరిన్ని రావాలని కోరుకుంటున్నాను ..................

గోదారి సుధీర చెప్పారు...

yes ! you are right !thanks.