మీ పిల్లలు మీ పిల్లలు కారు. వాళ్ళు జీవితేచ్చకు జన్మించిన వాళ్ళు . వాళ్ళు మీ ద్వారా వచ్చారు తప్ప మీ నుండి కాదు . వాళ్ళు మీతో ఉన్నా మీకు చెందరు .మీరు వాళ్ళతో ఉండాలని ప్రయత్నిస్తే ప్రయత్నించారు గాక, వాళ్ళు మీలా ఉండాలని మాత్రం అనుకోకండి. ఎందుకంటే జీవితం వెనక్కు మళ్ళదు గనకా, నిన్నటితో మళ్ళీ అతుక్కుపోదు గనకా ..ఖలీల్ జిబ్రాన్

21, ఏప్రిల్ 2011, గురువారం

ఆరెంజ్ ....!



అనుకోకుండా ఒక సారి ''నేను నువ్వంటూ'' పాట విన్నాను .చాలా ఉల్టా పాట ''నా ప్రేమ లోతులో మునిగాక నువ్ పైకి తేలవే సులభంగా ప్రాణాలైనా ఇస్తావేకంగా ..'' అట. వాడే చెప్పేస్తున్నాడు నువ్వు నాకోసం ప్రాణాలైనా ఇచ్చేస్తావని . ఇన్ని రోజులు మనసంతా నువ్వే అనడం విన్నాం కదా ..వీడేమో నీలో నేనున్నట్టుగా అంటాడు .ఇదేదో డిఫరెంట్ గా ఉందే అని సినిమా చూసా .,తెలుగు సినిమాలకి ఈ విషయం కొత్త ,కథ అంటూ ఏం లేదు. స్క్రీన్ ప్లే మీద సినిమా నడిచేసింది .పిల్లవాడు రాం ..వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ .ఈ ఫోటో గ్రాఫర్లు సినిమాల్లోనే ఉంటారు .మామూలుగా బయటైతే పత్రికా ఫోటో గ్రాఫరో ,ఫోటో స్టూడియో ఫోటో గ్రాఫర్లో ఉంటారు .ఈ వైల్డ్ లైఫోల్లు మనకు కనిపించనే కనిపించరు .అందరూ ఇలా సినిమాల్లో బిజీ గా ఉంటారు కదా అంచేతనన మాట .

[అప్పుడెప్పుడో పోకిరీ వచ్చింది కదా ..అందులో హీరో ఐ పీ ఎస్ ,ట్రైనింగ్లో ఉంటాడు .ఎక్కడా అంటే డెహ్రాడూన్ లో.
అసలేమో నేషనల్ పోలీస్ అకాడమి హైదరాబాద్లో కదా ఉంది ..దర్శకుడు ఎందుకట్లా చెప్పాడు అంటారా ?అట్లా చెప్తే స్టైల్ గా ఉంటుంది కదా. మహేష్ బాబుకి వేల్యు పెరుగుతుంది కూడా కదా ..అంచేతన మాట .అదీ కాకా దర్శకుడికి తెలుగు ప్రేక్షకుడి పట్ల ఘనమైన అవగాహన ఉన్టం కూడా కారణమన మాట .]సరే !ఆ పిల్లాడికి జాను అనే పిల్ల నచ్చుతుంది .ప్రపోస్ చేస్తాడు , కానీ పాపం ఈ అబ్బాయి చాలా నిజాయితీ పరుడు లెండి .అందుకని ముందే చెప్తాడు చాలా ఫ్రాంక్ గా "లైఫ్ లాంగ్ నిన్ను ప్రేమించటం నా వల్ల కాదు ,కొంత కాలమే నిన్ను ప్రేమించ గలను ''అని .

ఈ పిల్లాడి ఐడియాలజీ ఏదైనా అతని పాత్రని అలా నిజాయితీగా నడిపాడు దర్శకుడు .ఆ నిజాయితీ నాయికకు కూడా నచ్చుతుంది . అడుగుతుంది ''ఎందుకు అంత మందిని లవ్ చేసావ్ ''అని .వాడంటాడు... ''లవ్ లేకుండా ఉండలేను కాబట్టి ''అని .''ఎందుకు విడి పోయావ్ ''అంటే ''చాలా కాలం ప్రేమించా కాబట్టి''ఇంకా ..''లవ్ కొంత కాలమే బాగుంటుంది .తరువాత తరువాత ట్రాఫిక్లో జర్నీలా ఉంటుంది .'' అంటాడు ..ఇటువంటి కోటబుల్ కోట్స్ చాలా ఉంటాయ్ .''అమ్మాయిలు లవ్ చేయాలంటే నాలుగు అబద్దాలు ,మూడు కుళ్ళు జోకులు ,రెండు ఎస్ ఏం ఎస్ లు, ఒక ఫ్లవర్ ''చాలట ...ఎంత రీసెర్చ్ కదా .

ఆ అమ్మాయి చాలా కన్విన్స్ చేయాలని చూస్తుంది .వాడు నేను పట్టిన కుందేలుకి మూడే కాళ్ళు అంటాడు ,అంటే అనుకున్నాడు కానీ ఆ అమ్మాయి కూడా ఆ విషయాన్ని నమ్మాలని వత్తిడి చేస్తాడు .అసలు వీడు ఇంత కొత్త సిద్దాంతాన్ని ఎలా కని పెట్టాడూ అంటే... [సిద్దాంత కర్త ఈ పిల్లాడే అని ప్రూవ్ చేయాలని దర్శకుడి ఆశ]అతని వెనుక పాత ప్రేమ కథ ఒకటి ఉంటుంది .రూబా ఆ పిల్ల పేరు .ఊరూ పేరు తెలీదు .రోడ్డు మీద వెళ్తుంటే బలే ఉందని ప్రేమిస్తాడు [ప్రేమకు ఊరు, పేరు కావాలేంటి సిల్లీగా ]ఆ పిల్ల నువ్వు అలా ఉండు .ఇలా ఉండకు అని వీణ్ని సఫోకేట్ చేసి వదుల్తుంది .అందుకని ఆ పిల్లని వదిలేస్తాడు.కానీ ప్రేమంటే ఇతనికి బాగా ఇష్టం కదా , అలా తొమ్మిది ప్రేమలు ప్రేమించి పదో స్టొరీ తో మనకు సినిమా చూపించాడు .

పిల్లాడు సినిమాలో చెప్పేవన్నీ కన్విన్సింగ్ గా ఉన్నట్లు పక్కన పాత్రలు అప్పుడప్పుడూ ప్రభావితం ఐపోతూ ఉంటాయ్ .ఎలా విడి పోవాలో తెలియక కలిసి ఉండటం కన్నా ,సరైన సమయంలో విడి పోవడం బెటరు కదా అనడం ,ప్రేమ ఉన్నంత కాలమే కలిసి ఉండాలనడం.. అంతా నిజమే కదా అనిపించేస్తూ ఉంటుంది .కానీ కొన్ని ప్రాధమిక ప్రశ్నలు ఒక వైపు పీడిస్తూ ఉంటాయ్ ...అసలు ప్రేమంటే ఏంటి ?ఏంటో... ఈ సినిమా చెప్ప లేదు మరి .అతను విడి పోయిన తొమ్మిది ప్రేమల సందర్భంలో ఒక్క సారి కూడా సరైన కారణం కానీ , అమ్మాయిల వర్షన్ కానీ చెప్ప లేదు .ఎంత సేపటికి నాకు బోర్ కొట్టింది ..నాకు బోర్ కొట్టింది ..ఇదే ధోరణా?ఎందుకు బోర్ కొడ్తుంది .మనిషేమైన వస్తువా., కొన్ని రోజులు వాడగానే బోర్ కొట్టడానికి .అంతకన్నా నాకు ఇంకోరి పైన ఇష్టం వేసింది అనడం లాజిక్ కదా ఎట్ లీస్ట్ .


వీడు ప్రేమించిన అందరు ఆడ పిల్లలూ ...కాదు కాదు కనీసం ఒక్క పిల్ల కూడా వీడిని వదిలేయ్ లేదా ?ఎందుకని ?.అమ్మాయిలు కూడా వదిలేస్తారు ,కానీ దర్శకుడు ముందే పాడేసాడు కదా ..'' ఒక సారి నేను వలచానా ....నను వీడి పోదు ఏ మగువైనా ''అని . మేల్ చావనిసం అంటారు దీన్ని .ఆడ పిల్లల బుర్రల్లోకి ఎక్కించడం అన మాట సుబ్బరంగా ,ఇటువంటి అద్భుత ప్రేమల్ని .
చల్ మోహన రంగా గీతాలని ..జానపద గీతాలున్నాయ్ ''మన మనసులోక్కటైతే మాయ పెళ్ళి యేల మనకు ,మంగళ సూత్రమేటికి ప్రియుడా చల్ మోహన రంగా!మంగళ సూత్రమేటికి ప్రియుడా ''అని అందులో ఒక గీతం ఉంటుంది .ఈ భావం ఉన్నంత ఉదాత్తంగా వ్యక్తుల ప్రవర్తన ఉండి ఉంటే పెళ్ళి అనే తంతుకి ఇంత విలువ ఇవ్వాల్సి వచ్చేదా .మగ ప్రేమలు జారుకునే వేళల ఆడ వాళ్ళు చట్టాన్నో మనుషులనో వత్తాసు తీసుక రావాల్సి వచ్చేదా?


ఈ సినిమా ప్రస్తావించిన ఐడియాలజీ పేరు ''మగ ఆధునికోత్తర వాదం '' ఆధునికం కాదు.ఆధునికోత్తరం .చాలా సార్లు ప్రేమతో కలిసి ఉండటమనే భావజాలం తో మొదలయ్యే లివింగ్ టు గెదర్ రిలేషన్ షిప్స్ లో ,ముందుగ ప్రేమ పోయేది మగ వాడికే .రీసెర్చ్ లు చెప్తున్నాయ్ .అట్లా ఏ ఉత్తరం వచ్చినా దక్షిణం వచ్చినా చివరికి నష్ట పోయేది ఆడవాళ్లే .ఎందుకంటె ఆడవాళ్ళు నాగరికులు కదా .జంతు ప్రవృత్తిని జయించారు కదా .అదీ కాకా, ఆడ వాళ్లకి జీడి పాకాలకి తేడా లేదు కదా .పట్టుకు వేళ్ళాడే సిద్ధాంతం కదా .వద్దన్నా మౌన పోరాటాలైనా చేసేస్తారు కానీ వదలరు కదా . అదనమాట .మగ వాల్లదేమీ తప్పులేదు ,ఆ ప్రకారం చూస్తే .
ఈ సబ్జెక్ట్ పట్ల దర్శకుడు చాలా ప్రేమలో పడ్డట్టున్నాడు .ఇది ఒక ''అర్బన్ ప్రేమిక మేల్ ''కథ . నగరీకరణ చెందిన అందరి కథ కూడా కాదు !మగ నగర మేధావుల ప్రేమ కథ .అందరు మగ వాళ్ళు ఇంకా అంత మేధావులు కాలేదు కదా ! అంచేత ''ప్రేమించు ''తరహా... అమ్మాయి కోసం పిచ్చి వాడయిన ప్రేమ కథలనే హిట్ చేస్తున్నారు . దర్శకుడు నేర్పాలనుకున్న నేర్చుకోలేక సినిమా ఫ్లాప్ చేసారన్న మాట .

పాటలు బలే ఉన్నాయ్ .హలో రమ్మంటే వచ్చేసిందా చెలీ నీ పైన ఈ ప్రేమ ...పొ పొ పొమ్మంటు నువ్వంటే పోనే పోదమ్మా...బలే ఉంది.''ఏడు రంగులుగా సులువుగా విడివడి పోనీ తెల తెల్లని మనసిది ,ఎన్ని కళలుగా విరిసిన పువ్వుల రుతువై నీ కొరకే చూస్తున్నదీ ''అట ! బాగుంది కదా పువ్వుల రుతువు అనే మాట !హరీష్ జైరాజ్ మ్యూసిక్ బాగుంటుంది .వేగము ,సౌందర్యమూ... రెహ్మాన్ తో ఇంచుమించు తూగ గలడు. కానీ ...ఇతని పాటలు కొన్ని ఇండస్ట్రియల్ టౌన్స్ లో ఉంటారు కదా శ్రామిక కుర్రాళ్ళు, రేపటి చింత లేకుండా ఇవాల్టి ఫేషన్ పాంట్లు ,హెయిర్ స్టైల్ అనుసరిస్తూ ...అలా షోకిల్ల కుర్రాడిలా నిర్లక్ష్యంగా విరుపులతో ఉంటాయ్ .పొ పొ పొమ్మంటే.. అనడం ...ఘర్షణ మూవీ లో కూడా ఓ పాట ఉంది నన్నే నన్నే చూస్తూ అని అందులోనూ ఇంతే., ఓ యమ్మో..అమ్మో ప్రాణం తీయోద్దే...అని ఉంటుంది విరుపుతో .

పాట కోసం యు ట్యూబ్ వెతుకుతుంటే సగటు మగ వాడు ఒకరు సినిమాని కాదు ఈ పాటని కూడా చీత్కరించేసాడు.ముచ్చటేసింది.ఇస్తున్నా ....చూడండి .

Bad description about love, negative lines from my point of view . naa prema lothulo munigaka nuvu paiki telave sulabhangaa praanalaina isthavekangaa.. Prema ante, naa pranam anipinchelaa undaali kaani, pranaalu teesukune vidhamgaa undakudadu. ala ichela undalani avathali vallu alochincharante adi nijamaina preme kaadu..RamSyam10 3 months ago