నా బెడ్ రూం కిటికీ తో బోల్డు స్నేహం చేస్తూ ఒక జామ చెట్టు,ఇంకో పూల చెట్టు వుంటాయి.ఆ చెట్టు పువ్వుల్ని నేను ఇది వరకే చూసాను మా ఊళ్ళో.నాకు అతి ప్రీతిగా అనిపించే పువ్వు మనోరంజని.మా ఊళ్ళో కాడ బుట్ట పైన అరిటాకు పరిచి అందులో పెట్టుకుని అమ్ముతుంటారు మనోరంజని పూలు.ఆ పూలతో పాటు అప్పుడప్పుడూ ,పైన చెప్పానే ఆ పూల చెట్టు పూలూ... అమ్ముతుంటారు.
నిన్న వెళ్ళక,వెళ్ళక మిద్ద పైకి వెళ్ళానా ,పిట్ట గోడ కి కొంత కింద నుంచుని నన్ను పలకరించింది ఆపువ్వు. లేత నారింజ వర్ణంలో .ఆ పలకరింపు వినగానే నేను బోల్డు ఆశ్చర్యపడ్డాను .క్రితం వేసవిలో మెట్లెక్కి తిరుమలకి వెళ్లాం .చివరి మెట్ల దగ్గర కనిపించిందా పువ్వు, చెట్టు పై పై కొమ్మల్లో .నా చిన్న తమ్ముడూ ,వాడి స్నేహితుడూ ఎగిరీ దూకీ ఒక కొమ్మని పట్టుకున్నారా ...అయినా పువ్వు వాళ్లకి దొరకనే లేదు. కానీ ,కింద నిలబడి ఆ..మని నోరు తెరుచుకుని ,ఆశగా చూస్తున్న నా పై ఝల్లుమని రాలింది .నన్ను వెక్కిరించి ఘొల్లుమని నవ్విందని నేను అభిప్రాయ పడ్డాను .
అట్లాంటి ఆ గర్వపు పువ్వు ,ఇట్లా ఇప్పుడు నన్ను పలకరించేసరికి ,చాలా ఆశ్చర్యం వేసేసింది .పలకరించడమేనా ...ఈ మధ్యంతా సున్నితమైన ఒక మత్తు వాసన తెగ కవుర్లు చెప్తూ ఉండింది .ఏ చెట్టు పరిమళమో అది అర్థం కాలేదు .నా తమ్ముడ్నీ,పాపాయి వాళ్ళ నాన్న ని అడిగాను ''ఏం చెట్టై ఉండొచ్చని''. పాపం వాళ్ళకీ తోచలేదు.
మా ఇంటిలోపల ఒక పెద్ద వృక్షం వుంది .'మహోగని 'అని చెప్పారు ఇక్కడి వాళ్ళు .వేకువన వాకింగ్ కి వెళ్లి వస్తుంటే నేలంతా పరచుకుని కనిపించాయ్ ఆ చెట్టు పూలు .వేప పువ్వుల్లా,నక్షత్రాల్లా ! .ఇంక అంతే పాపాయి వాళ్ళ నానకి ప్రకటించా ''చూసావా ఈ పువ్వల వాసనే నన్ను వేధించుకు తింటున్నది ''అని .పాపాయి వాళ్ళ నాన్న నా జ్ఞానం పై నమ్మకముంచి 'అవునవును' అనేసాడు.
తీరా చూద్దును కదా నిన్న ,, ఈ పూలది ఆ మధురిమ .అప్పుడేమో అంత గర్వపళ్ళా ??? ఇప్పుడేమో నన్ను పలకరించడానికి ఎంత ప్రయత్నమో !!!.నా కిటికీ దగ్గర కూడా రేపో మాపో విచ్చుకునేందుకు సిద్దమై బోల్డుమొగ్గలు.ఆనందం వికసించింది మనసులో అనిర్వచనీయంగా.
ఇంకో పలకరింపుని పొద్దుటే లేచి గుర్తు తెచ్చుకున్నాను చాలా ఇష్టంగా .
ఏం ఏ చదివేప్పుడు ,మా యునివర్సిటీ లో సాహిత్య వలయంలోని వారు నన్ను ,ఈ అమ్మాయి కుప్పిలి పద్మ లా వుంటుంది అనుకునే వార్ట.ఆ వార్తలు ఎవరి ద్వారానో నాకు చేరేవి .మా అమ్మ మటుకు ''కానే కాదంటే...' అనేసేది .నాకు వారి రచనలంటే ఎంత ఇష్టమో .ప్రత్యేకమైన శైలి కదా ...
రాత్రి ఏదో కథల సంచిక ఎందుకో గబగబా తిరగేస్తున్నానా ఒక పదమేదో పలకరించింది . అప్పటికే కొన్ని పేజీలు పరుగులెత్తేసాయి.అయినా మనసు అనుకునేసింది ఇది పద్మ కథలా ఉందే అని .ఇక తీరిగ్గా బాసింపట్టు వేసేసుకుని వెనక్కెళ్ళి ''వనమాల ''ని ఎప్పుడో చదివేసిందే అయినా మళ్ళీ చదివా.చదివి అనుకున్నాను ,ఏమంటే ''వీరితో నా పరిచయం చాలా ఏళ్లది ,పలకరీంపేమో అతి కొత్తది .ఇదో గమ్మత్తు''అని .అలా అనుకుని ఇటీవలపు పరిచయ చనువుతో వారికో మెసేజ్ పెట్టా ''మీరు నన్ను మెచ్చుకున్నారు అనే గర్వంతో శేష జీవితాన్ని సంతోషంగా గడిపెయబోతున్నా''అని .రిప్లయ్ ఏమొచ్చిందో చెప్పను .ఎందుకంటె ముగించలేని కథని మలుపుతిప్పి ఆపేయ్ మన్నాడు బహుసా ఓ .హెన్రీ!!