మీ పిల్లలు మీ పిల్లలు కారు. వాళ్ళు జీవితేచ్చకు జన్మించిన వాళ్ళు . వాళ్ళు మీ ద్వారా వచ్చారు తప్ప మీ నుండి కాదు . వాళ్ళు మీతో ఉన్నా మీకు చెందరు .మీరు వాళ్ళతో ఉండాలని ప్రయత్నిస్తే ప్రయత్నించారు గాక, వాళ్ళు మీలా ఉండాలని మాత్రం అనుకోకండి. ఎందుకంటే జీవితం వెనక్కు మళ్ళదు గనకా, నిన్నటితో మళ్ళీ అతుక్కుపోదు గనకా ..ఖలీల్ జిబ్రాన్

30, ఏప్రిల్ 2011, శనివారం

పెళ్ళి కబుర్లు !

నా మేన మామ కొడుకు పెళ్ళికి వెళ్ళాం .చెట్టు కొమ్మలన్నీ ఒకే సైజులో ఉండనట్టు మన బంధువులు కూడా స్థితిగతుల్లో అందరూ ఒకేలా ఉండరు కదా .కొందరేమో పెద్ద పెద్ద చదువులు చదివేసి అమెరికాలూ,ఆఫ్రికాలూ తిరుగుతూ ,మరి కొందరేమో మంచి మంచి పదవుల్లో ఉంటూ ఉంటే కొందరు, అతి నవతరం వారు చదువుల బకెట్ తన్నేసి వ్యవసాయం చేపడుతున్నారు .అత్యాదునికమూ ,ఆధునికమూ, పాతదనమూ కలగలిపిన భారత దేశపు సిసలైన చిత్ర పటం ఇది .

పెళ్ళికొడుకు కార్పోరేట్ కాలేజ్ లో చదివినా ఇంటర్ గట్టేక్క లేక పోయాడు .అందు నిమిత్తం వాడే కాదు వాళ్ళ నాన్న కూడా చింత పడ్డ దాఖలాలు లేవు . వయసు పాతికేళ్ళు కూడా దాట లేదు .వాడికి ఇరవై పెట్టినప్పటి నుండి సంబంధాలు చూట్టం మొదలెట్టారు .ఇప్పుడు అమ్మాయిలకి కరువొచ్చిందని అందరూ చెప్పుకుంటున్నారు ,నిజమెంతో కానీ అంచేత వాడికి ఇట్లా లేటు వయసులో పెళ్ళి చెసుకోవాల్సి న అగత్యం పట్టింది .

అమ్మాయి పదహారేళ్ళ పిల్ల . బాగా పొడవుందని మా మామతో అంటే ఇంకా కూడా ఎదగద్ది నాయనా మొన్నే పదిహేడు పెట్టింది అన్నాడు .మరీ అంత చిన్న పిల్ల ...అసహ్యంగా ఎందుకట్లా అని మా పెదమ్మ తో అంటే ఇచ్చినోల్లకి లేని అసయ్యం మనకేందుకో ...అంది .పిల్ల పదో తరగతి కూడా పూర్తి చేయలా .

మన పెళ్ళి వేడుక బాగానే ఉంటుంది కానీ సంపదని అట్లా నిర్లజ్జగా ప్రదర్శించే తీరు నాకు బాధ కలిగిస్తుంది .ఉన్న వాళ్ళ మెడలో చేతులో పచ్చగా మెరుస్తుంటే లేని వాళ్ళ ముఖాలు నల్ల బడటం ఎంత అమానవీయం .నా కూతురి పెళ్ళి కార్డులో అచ్చోత్తించాలి నగలు వేసుకోడం నిషిద్దం అని .

పిల్లోడితో కలిసి పెళ్ళి కూతురింటికి వెళ్ళాం .పచ్చటి కొబ్బరాకుల పందిరి కింద అందరూ కూర్చుని కబుర్లు మొదలెట్టారు .మా వదిన నేను మాట్లాడుకుంటూ ఉంటే మా పెదమ్మ అంది మీ వదినకి పొగులు పోద్దస్తం మాటలు కావాలి అని .మా పెదమ్మ కొడుకు చేసుకుంది మా మేన మామ కూతుర్నే ..అందుకనే అత్త, కోడలిపై అలా జోకులు వేయగలిగిందన్న మాట .

మా వదిన ....మీ అన్న అసలు ఒక్క మాటా మాట్లాడడు,ఏమన్నా అన్నామంటే చేలల్లో ఏం సంగతు లుంటాయి నీకు చెప్పేందుకు అంటాడు .సంతాప సభ పెట్టినట్టు ఎంత సేపు మౌనంగా ఉండగలం చెప్పు అంది . ఇది చాలా పెద్ద సమస్య .నాకో స్నేహితురాలు ఉండేది భర్త s p డ్యూటీ నుండి ఇంటికి రాగానే టీవీ చూస్తూ కూర్చున్టాట్ట.అతనూ ఇదే సమాధానం ఏముంటాయ్ మాట్లేడేందుకు ..అని .ఏమీ ఉండవా ..లేక మాట్లాడేందుకు ఇష్టం లేదా .కనీసం భార్య కంప్లైంట్ ని గుర్తించి పరిష్కరించాల్సిన బాధ్యత అయినా ఉండదా ?ఏం లేదు పడి ఉంటార్లే అని ధీమా అంతే .ఆ తరువాత ఆ పిల్ల అతనిలా వెహికల్ దిగటం తనలా వెహికల్ ఎక్కటం అనే పద్ధతి కని పెట్టింది .అప్పుడు వాళ్ళే మనకోసం ఎదురు చూస్తారు అని చెప్పి చక్కని నవ్వోటి నవ్వింది .

బహుసా ఈ భర్తలకి భార్యలతో భావ సారూప్యత ఉండదు కాబోలు , అది పెళ్ళికి ముందే ఆలోచించాలి కదా .మా వదిన ఇంకా చాలా విషయాలు మాట్లాడింది.95 %మగ వాళ్ళు నీట్ గా లేరని చెప్పింది .మంచి పుస్తకాలేమైన చదవగూడద అంటే సాయి బాబా పుస్తకాలు చదువుతున్నానని చెప్పింది.ఇతరేతర పుస్తకాలైతే లేని పొని ఆలోచనలు వస్తాయనీ ఇవయితే అన్ని ఆలోచనలని అణచి వేస్తాయని దిమ్మ తిరిగే స్త్రీ వాదం మాట్లాడింది .అట్లా నేను పడీ లేచి చదివి సంపాదించిన స్త్రీ వాద జ్ఞానాన్ని మా వదిన మొగుడు పుణ్యమా అని అనుభవం తో సంపాదించేసింది .

మా అన్న టెన్త్ క్లాస్ ఫెయిలయ్యాడు .అప్పుడు ,మా పెద నాయన కొంచెం చదివించమని మా ఇంటికి పంపాడు .పుస్తకం ముందు పెట్టుకొని మా అన్న మా కర్రావు ఈనిందో లేదో అనే వాడు .ఈ వూర్లో ముసురు పడ్తే ఆ ఊర్లో కోతలు కోసారో లేదో అని బాధ పడేవాడు .అట్లా చదివి తప్పిన లెక్కలు గట్టెక్కి చదువు చాలించి పెద్ద రైతయ్యాడు.ఇప్పుడు ఆయనకి బోలెడు ఆసక్తి ఇద్దరు కూతుర్లని బాగా చదివించాలని .

గోరటి వెంకన్న ''నారాయణ కోచింగుకు రాములయ్య నువ్వు వొడిపించుకున్నదెంత రాములయ్య ''అని అన్నట్టు పెద్ద కూతురి మెడిసన్ చదువుకి నారాయణ్ మెడికల్ కాలేజీకి లక్షల డొనేషన్ కట్టేశాడు .పీజీ సీటు ప్రస్తుతం ఎనబై లక్షలు పలుకుతుందని సమాచారం సేకరించుకుని పెట్టాడు . రెండో కూతుర్ని కలక్టర్ ని చేయాలని కంకణం కట్టుకున్నాడు .ఎంతుంటే ఏం లాభం ఎక్కడికన్నా పొయ్యి ఒక మాట మాట్లాడ గలిస్తిమా అని ఆయన ఫీలింగ్ .

అమెరికాలో ఉద్యోగం చేస్తున్నకూతురు ,అల్లుడూ ఉన్న మా అత్త ఆరో నెలలోనే ఎమ్బటి తెచ్చిన రెండేళ్ళ అమెరికా మనవరాలిని పెళ్ళికి తీసుకొచ్చింది.వెండి రేటు తగ్గిందని రెండు మూడు కేజీలన్నాకొని పారేయమని నాకు సలహా ఇచ్చింది .ఇంకో బంధువు వాళ్ళ కొడుకు ఫాబ్రికేషన్ ఇండస్ట్రీ పెట్టాడనీ నన్ను కూడా అటువంటిదేమైనా పెట్టి పారేయమనీ అన్నాడు .ఈ తరహా కోస్తా ఆంధ్రా సలహాలంటే తెలంగాణా వాడైన నా భర్తకి మంట .నువ్వు స్వతహాగా మంచి దానివి వీళ్ళ దగ్గర ఎక్కువ రోజులుంటే పాడై పోతావ్ మనం త్వరగా వెళ్లి పోదాం అని జోకులు మొదలెట్టాడు .

చక్కగా గాడి పొయ్యిలు పెట్టి వండి కొసరి కొసరి వడ్డించారు .ఈ తరహా ఆప్యా యపు పెళ్ళి భోజనం చేసి చాల రోజులయింది .నేను జీవ కారుణ్యత దృష్ట్యా ఏడెనిమిదేళ్ళ వయసులో మాంసాహారం మానివేసానా ..నాతో కూర్చున్న మిగిలిన ఆడ వాళ్ళందరూ శాఖా హారులే కాటం నన్ను ఆశ్చర్య పరచింది .ఒక సారి నా రీసెర్చ్ గైడు [పుట్టుకతో శాఖాహారీ ఆ పై జ్ఞానంతో మంసాహారీ గా మారిన వాడు ]ఇప్పుడు తినని వాళ్ళు తింటున్నారు తినే వాళ్ళు తినడం లేదు అని అన్న మాటలు గుర్తొచ్చాయి .

నా పక్కనే కూర్చున్నావిడని అడిగా ఎందుకని మీరు నాన్ వెజ్ తినటం లేదని ..ఆవిడందీ చిన్నప్పుడు చేప తిని బడి కెళ్లా, గొంతులో ముళ్ళు ఇరుక్కుని ఇబ్బంది గా అనిపిస్తుండింది .అది చూసి మా ఐవారు వాట్ని చంపి తింటే గుచ్చుకోవా ముళ్ళు అన్నాడు ,అది సరి మల్లెప్పుడూ తిన్లా అని. ఆవిడకి ఇప్పుడు అరవై అయిదేళ్ళు దాకా ఉంటాయ్ .పాపం ఆ పాపి ఐవారు ఎవరో !

భోజనాలు చేసి పెళ్ళి కొడుకు దగ్గర మా పెదమ్మని ఉంచి అందరం బయల్దేరాం.వెళ్లి పోతున్న మమ్మల్ని చూస్తూ నిల్చున్న పెళ్ళి కొడుకు దగ్గరికెళ్ళి అన్నాను ...ఒరేయ్! పాపం నిన్నోక్కడినే వదిలేసి వెళ్తున్నాం .ఒక వేళ ఇక్కడే ఇట్లా ఉంది పోవాల్సి వస్తే ఎలా ఉంటున్దోరేయ్ అంటే ...వాడు అబ్బ ఎట్టుంటాం ..అక్కా ! మనూరు కాకుండా , మనోళ్ళు లేకుండా ఉండలేం అన్నాడు .నేనన్నాను రేపు నీ భార్యకి కూడా అలాగే అనిపిస్తుంది ఎలా చూసుకుంటావో మరి అని .ఆ మాటతో ఆడ వాళ్ళందరూ ...మగ పెళ్ళి వారా ,ఆడ పెళ్ళి వారా అనే భేదం లేకుండా ఒక్క సారిగా హా ...హా కారాలు చేసారు .

29, ఏప్రిల్ 2011, శుక్రవారం

వలస పక్షులు !


పాపాయికి చుట్టీ .పాపాయి వాళ్ళ నానకి కుంచెం సెలవు ,అతి కష్టం పైన దొరికింది .తప్పక హాజరు కావాల్సిన పెళ్ళి ఒకటి వచ్చింది .అంచేత మేం మా ఊరికి బయల్దేరాం.కూచ్ బిహార్ నుంచిపొద్దుట తొమ్మిదిన్నర కి బయల్దేరి , బాగ్ డోగ్రా వరకూ రోడ్డు , పై ఫ్లైట్ కాన్సిల్ కలకత్తా లో మారాల్సిన ఫ్లైటు డిల్లీ లో మారి ,మద్రాసు మహా నగరం లో దిగేప్పటికి సమయం రాత్రి ఏడున్నర .

బయటికి వచ్చిన మమ్మల్ని చూసి నా చిన్న తమ్ముడి చిరు నవ్వుల ముఖారవిందం మరింత విర పూసింది .మద్రాసు మలయ మారుతం మామూలుగా స్ప్రుసించినా ,అమిత ప్రేమగా ఆలింగనం చేసుకునే అమ్మలా అనిపిస్తుంది ఎప్పుడూ . చిన్నప్పటి నుండీ తమిళనాడు సరిహద్దు ప్రాంతాల్లో పెరగడం వల్ల కామోసు ''అరవల్ని ''చూడగానే మహా ఆత్మీయంగా అనిపిస్తుంది . మన వాళ్ళ లోకి వచ్చేసానని అనిపిస్తుంది .అగ్రత్వానికి ,అహంకారానికి కారణం కావడం వల్లనేమో ,తెల్ల రంగు పట్ల ఏర్పడ్డ వ్యతిరేకత ,తమిళులకి వారి సంస్కృతి పట్ల ఉన్న గౌరవం ,వారి నిరహంకార ఆహార్యం నాలో ఏర్పడ్డ ఈ అభిమానానికి కారణం కావచ్చు .

ఏర్ పోర్ట్ నుండి వచ్చే దారిలో శరవణ భవన్ చేతులు చాచి అన్నపూర్ణలా ఆదరంగా పిలిచి రుచికరమైన బువ్వ పెడ్తుంది .పాపాయి వాళ్ళ నాన ఈ అమ్మ పెట్టే తక్కాళి సాధం కానీ ,సాంబార్ సాధం కానీ తినందే ఆడుగు ముందుకు వెయ్యనని మొరాయిస్తాడు .ఒక వేళ పాపాయి వాళ్ళ అమ్మ GRT తంగ మాళిగై లో షాపింగ్ చేస్తే అల్ప సంతోషపు నాన్న పక్కనే ఉన్న మురుగన్ ఇడ్లీ షాప్ లో ఇడ్లీ తిని అమ్మ చేసిన బిల్లు కూడా పట్టించుకోకుండా చట్నీల రుచి గురించిన ఉపన్యాసం లో పడతాడు . శరవణ భవన్ ముందు అర్థ రూపాయి బిళ్ళంత బొట్టు పెట్టుకున్న పెద్దావిడ ఒకరు పూలు అమ్ముతుండింది. మొల్లల పరిమళం కారు నిండుగా పరుచుకుని మదిని మైమరపించింది .ఉన్నత హృదయులైన బెంగాలీలు పూలని కోయడం అమానుషం గా భావిస్తారేమో వివాహ సందర్భంలో తప్పించి పూల వాడకం అసలు ఉండదు.

కొంత దూరం రాగానే గత మూడు నాలుగేళ్ల క్రితమేననుకుంటా ప్రారంభించబడిన ''నోస్టాల్జియా ''అని హోటల్ బోర్డ్ ఒకటి వెలుగుతూ కనిపిస్తుంది .అసలే నోస్టాల్జియా అనే జబ్బుతో బాధ పడ్తూ ఉంటానా ...ఆ బోర్డ్ ఏమిటేమిటో గుర్తు చేస్తుంది .కూచ్ బిహార్ కి సంవత్సరంలో కొన్ని నెలలు విదేశీ పక్షులు వస్తాయ్ .వచ్చి ఆ కొత్త ప్రదేశంలో గూడు కట్టి ,గుడ్లు పెట్టి, గూటిడు పిల్లల్ని చేసి ,వాటికి తిరిగి తిరిగి తెచ్చిన బువ్వ పెట్టి ,ఎగరటం నేర్పించి ..స్వంత ఊరికి తీసికెళతాయి .ఆడ పిల్లలకి ఆ వలస పక్షులకి పెద్ద తేడా మాత్రం ఏముంది కదా ?అదే అంటే, పాపాయి నాన అంటాడూ ..ఇవాళ ఊరు గాని ఊర్లలో ఉద్యోగాలు చేసే మగ వాళ్ళూ వలస పక్షులే అని .అవును !సత్యాన్ని ఎవరు మాత్రం అసత్యం అనగలరు ?

కాటుక చీకటి తొవ్వ ,చెట్టూ చేమ సొంత గూటికి వస్తున్న ఈ వలస పక్షులతో నిశ్సబ్దంగా సంభాషిస్తూ ఇంటికి చేర్చేసరికి అర్థ రాత్రి దాటి పోయింది .అందరూ ఆత్మీయంగా నిద్దర్లు లేచి పలకరిస్తారు కానీ మా వీధి మొగదలి నిదర గన్నేరుకి నేనంటే ప్రేమే లేదు కుంచెం కూడా .కన్ను తెరిచి ఒక చూపన్నాచూడ లేదు .

24, ఏప్రిల్ 2011, ఆదివారం

రంగు రంగుల పాట !




ఒక పాట విన్నప్పుడో ,ఒక పుస్తకం చదివినపుడో ఎలా అనిపించాలి ?బహుశా ...నిర్లిప్తపు శ్వేత వర్ణం ఫటిల్లుమని చిట్లి ,పలు రంగుల ఇంద్ర చాపం మనని ఆవహించాలి .సుకుమారపు జిల్లేడు విత్తనం ,లక్ష్యం లేని గాలితో లేచి పోయినట్టు మనసుకి పిచ్చెక్కి పోవాలి .చూస్తూ చూస్తూ ఉండగానే హృదయం మసక బడి అలవి కానీ కుంభ వృష్టి కురిపించెయ్యాలి.బతుకు నీలిమ లో పున్నమి పూలు పూయాలి .నీకు నువ్వు దొరకక నువ్వెవరివో అయి పోవాలి .ఒక పుస్తకం చదివినప్పుడో ,ఒక పాట విన్నప్పుడో ఆ కాగితమో, ఆగొంతో ...దెయ్యంలా పట్టి పీడించాలి.వదిలించుకోలేక పొగిలి పొగిలి ఏడవాలి .ఓటమి పాలై ఆ పాద పద్మాలపై పడి లయమవ్వాలి .

జాన్ డెన్వర్ ఈ పాట ,అలాటిదేదో చేస్తుంది .ఆత్మని పీడిస్తుంది .వింటుంటే మీ ఊరి దారి మిమ్మల్ని పిలుస్తుంది ."థాంక్ గాడ్ అయామే కంట్రీ బాయ్ ''అని ఇంకో పాట ఉంది అదీ వినండి .మీరు పల్లెటూరి వారయితే తప్పక థాంక్ గాడ్ !అనుకుని తీరుతారు .whisper of the heart అని జపనీస్ మూవీ ఒకటుంది .యానిమేషన్ .ఆ సినిమా పొడుగూతా ఈ పాట వినిపిస్తూ ఉంటుంది .జపనీయుల భాషలో కూడా .సినిమా కూడా బాగుంటుంది .హాయో మియజాకి స్క్రీన్ ప్లే .
Take Me Home, Country Roads

Almost heaven, West Virginia, Blue Ridge Mountains, Shenandoah River.
Life is old there, older than the trees, younger than the mountains, blowing like a breeze.
Country roads, take me home to the place I belong.
West Virginia, mountain momma, take me home, country roads.

All my memories gather round her, miner’s lady, stranger to blue water.
Dark and dusty, painted on the sky, misty taste of moonshine, teardrop in my eye.
Country roads, take me home to the place I belong.
West Virginia, mountain momma, take me home, country roads.

I hear her voice in the morning hour she calls me, the radio reminds me of my home far away.
And driving down the road I get a feeling that I should have been home yesterday, yesterday.
Country roads, take me home to the place I belong.
West Virginia, mountain momma, take me home, country roads.
Country roads, take me home to the place I belong.
West Virginia, mountain momma, take me home, country roads.

21, ఏప్రిల్ 2011, గురువారం

ఆరెంజ్ ....!



అనుకోకుండా ఒక సారి ''నేను నువ్వంటూ'' పాట విన్నాను .చాలా ఉల్టా పాట ''నా ప్రేమ లోతులో మునిగాక నువ్ పైకి తేలవే సులభంగా ప్రాణాలైనా ఇస్తావేకంగా ..'' అట. వాడే చెప్పేస్తున్నాడు నువ్వు నాకోసం ప్రాణాలైనా ఇచ్చేస్తావని . ఇన్ని రోజులు మనసంతా నువ్వే అనడం విన్నాం కదా ..వీడేమో నీలో నేనున్నట్టుగా అంటాడు .ఇదేదో డిఫరెంట్ గా ఉందే అని సినిమా చూసా .,తెలుగు సినిమాలకి ఈ విషయం కొత్త ,కథ అంటూ ఏం లేదు. స్క్రీన్ ప్లే మీద సినిమా నడిచేసింది .పిల్లవాడు రాం ..వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ .ఈ ఫోటో గ్రాఫర్లు సినిమాల్లోనే ఉంటారు .మామూలుగా బయటైతే పత్రికా ఫోటో గ్రాఫరో ,ఫోటో స్టూడియో ఫోటో గ్రాఫర్లో ఉంటారు .ఈ వైల్డ్ లైఫోల్లు మనకు కనిపించనే కనిపించరు .అందరూ ఇలా సినిమాల్లో బిజీ గా ఉంటారు కదా అంచేతనన మాట .

[అప్పుడెప్పుడో పోకిరీ వచ్చింది కదా ..అందులో హీరో ఐ పీ ఎస్ ,ట్రైనింగ్లో ఉంటాడు .ఎక్కడా అంటే డెహ్రాడూన్ లో.
అసలేమో నేషనల్ పోలీస్ అకాడమి హైదరాబాద్లో కదా ఉంది ..దర్శకుడు ఎందుకట్లా చెప్పాడు అంటారా ?అట్లా చెప్తే స్టైల్ గా ఉంటుంది కదా. మహేష్ బాబుకి వేల్యు పెరుగుతుంది కూడా కదా ..అంచేతన మాట .అదీ కాకా దర్శకుడికి తెలుగు ప్రేక్షకుడి పట్ల ఘనమైన అవగాహన ఉన్టం కూడా కారణమన మాట .]సరే !ఆ పిల్లాడికి జాను అనే పిల్ల నచ్చుతుంది .ప్రపోస్ చేస్తాడు , కానీ పాపం ఈ అబ్బాయి చాలా నిజాయితీ పరుడు లెండి .అందుకని ముందే చెప్తాడు చాలా ఫ్రాంక్ గా "లైఫ్ లాంగ్ నిన్ను ప్రేమించటం నా వల్ల కాదు ,కొంత కాలమే నిన్ను ప్రేమించ గలను ''అని .

ఈ పిల్లాడి ఐడియాలజీ ఏదైనా అతని పాత్రని అలా నిజాయితీగా నడిపాడు దర్శకుడు .ఆ నిజాయితీ నాయికకు కూడా నచ్చుతుంది . అడుగుతుంది ''ఎందుకు అంత మందిని లవ్ చేసావ్ ''అని .వాడంటాడు... ''లవ్ లేకుండా ఉండలేను కాబట్టి ''అని .''ఎందుకు విడి పోయావ్ ''అంటే ''చాలా కాలం ప్రేమించా కాబట్టి''ఇంకా ..''లవ్ కొంత కాలమే బాగుంటుంది .తరువాత తరువాత ట్రాఫిక్లో జర్నీలా ఉంటుంది .'' అంటాడు ..ఇటువంటి కోటబుల్ కోట్స్ చాలా ఉంటాయ్ .''అమ్మాయిలు లవ్ చేయాలంటే నాలుగు అబద్దాలు ,మూడు కుళ్ళు జోకులు ,రెండు ఎస్ ఏం ఎస్ లు, ఒక ఫ్లవర్ ''చాలట ...ఎంత రీసెర్చ్ కదా .

ఆ అమ్మాయి చాలా కన్విన్స్ చేయాలని చూస్తుంది .వాడు నేను పట్టిన కుందేలుకి మూడే కాళ్ళు అంటాడు ,అంటే అనుకున్నాడు కానీ ఆ అమ్మాయి కూడా ఆ విషయాన్ని నమ్మాలని వత్తిడి చేస్తాడు .అసలు వీడు ఇంత కొత్త సిద్దాంతాన్ని ఎలా కని పెట్టాడూ అంటే... [సిద్దాంత కర్త ఈ పిల్లాడే అని ప్రూవ్ చేయాలని దర్శకుడి ఆశ]అతని వెనుక పాత ప్రేమ కథ ఒకటి ఉంటుంది .రూబా ఆ పిల్ల పేరు .ఊరూ పేరు తెలీదు .రోడ్డు మీద వెళ్తుంటే బలే ఉందని ప్రేమిస్తాడు [ప్రేమకు ఊరు, పేరు కావాలేంటి సిల్లీగా ]ఆ పిల్ల నువ్వు అలా ఉండు .ఇలా ఉండకు అని వీణ్ని సఫోకేట్ చేసి వదుల్తుంది .అందుకని ఆ పిల్లని వదిలేస్తాడు.కానీ ప్రేమంటే ఇతనికి బాగా ఇష్టం కదా , అలా తొమ్మిది ప్రేమలు ప్రేమించి పదో స్టొరీ తో మనకు సినిమా చూపించాడు .

పిల్లాడు సినిమాలో చెప్పేవన్నీ కన్విన్సింగ్ గా ఉన్నట్లు పక్కన పాత్రలు అప్పుడప్పుడూ ప్రభావితం ఐపోతూ ఉంటాయ్ .ఎలా విడి పోవాలో తెలియక కలిసి ఉండటం కన్నా ,సరైన సమయంలో విడి పోవడం బెటరు కదా అనడం ,ప్రేమ ఉన్నంత కాలమే కలిసి ఉండాలనడం.. అంతా నిజమే కదా అనిపించేస్తూ ఉంటుంది .కానీ కొన్ని ప్రాధమిక ప్రశ్నలు ఒక వైపు పీడిస్తూ ఉంటాయ్ ...అసలు ప్రేమంటే ఏంటి ?ఏంటో... ఈ సినిమా చెప్ప లేదు మరి .అతను విడి పోయిన తొమ్మిది ప్రేమల సందర్భంలో ఒక్క సారి కూడా సరైన కారణం కానీ , అమ్మాయిల వర్షన్ కానీ చెప్ప లేదు .ఎంత సేపటికి నాకు బోర్ కొట్టింది ..నాకు బోర్ కొట్టింది ..ఇదే ధోరణా?ఎందుకు బోర్ కొడ్తుంది .మనిషేమైన వస్తువా., కొన్ని రోజులు వాడగానే బోర్ కొట్టడానికి .అంతకన్నా నాకు ఇంకోరి పైన ఇష్టం వేసింది అనడం లాజిక్ కదా ఎట్ లీస్ట్ .


వీడు ప్రేమించిన అందరు ఆడ పిల్లలూ ...కాదు కాదు కనీసం ఒక్క పిల్ల కూడా వీడిని వదిలేయ్ లేదా ?ఎందుకని ?.అమ్మాయిలు కూడా వదిలేస్తారు ,కానీ దర్శకుడు ముందే పాడేసాడు కదా ..'' ఒక సారి నేను వలచానా ....నను వీడి పోదు ఏ మగువైనా ''అని . మేల్ చావనిసం అంటారు దీన్ని .ఆడ పిల్లల బుర్రల్లోకి ఎక్కించడం అన మాట సుబ్బరంగా ,ఇటువంటి అద్భుత ప్రేమల్ని .
చల్ మోహన రంగా గీతాలని ..జానపద గీతాలున్నాయ్ ''మన మనసులోక్కటైతే మాయ పెళ్ళి యేల మనకు ,మంగళ సూత్రమేటికి ప్రియుడా చల్ మోహన రంగా!మంగళ సూత్రమేటికి ప్రియుడా ''అని అందులో ఒక గీతం ఉంటుంది .ఈ భావం ఉన్నంత ఉదాత్తంగా వ్యక్తుల ప్రవర్తన ఉండి ఉంటే పెళ్ళి అనే తంతుకి ఇంత విలువ ఇవ్వాల్సి వచ్చేదా .మగ ప్రేమలు జారుకునే వేళల ఆడ వాళ్ళు చట్టాన్నో మనుషులనో వత్తాసు తీసుక రావాల్సి వచ్చేదా?


ఈ సినిమా ప్రస్తావించిన ఐడియాలజీ పేరు ''మగ ఆధునికోత్తర వాదం '' ఆధునికం కాదు.ఆధునికోత్తరం .చాలా సార్లు ప్రేమతో కలిసి ఉండటమనే భావజాలం తో మొదలయ్యే లివింగ్ టు గెదర్ రిలేషన్ షిప్స్ లో ,ముందుగ ప్రేమ పోయేది మగ వాడికే .రీసెర్చ్ లు చెప్తున్నాయ్ .అట్లా ఏ ఉత్తరం వచ్చినా దక్షిణం వచ్చినా చివరికి నష్ట పోయేది ఆడవాళ్లే .ఎందుకంటె ఆడవాళ్ళు నాగరికులు కదా .జంతు ప్రవృత్తిని జయించారు కదా .అదీ కాకా, ఆడ వాళ్లకి జీడి పాకాలకి తేడా లేదు కదా .పట్టుకు వేళ్ళాడే సిద్ధాంతం కదా .వద్దన్నా మౌన పోరాటాలైనా చేసేస్తారు కానీ వదలరు కదా . అదనమాట .మగ వాల్లదేమీ తప్పులేదు ,ఆ ప్రకారం చూస్తే .
ఈ సబ్జెక్ట్ పట్ల దర్శకుడు చాలా ప్రేమలో పడ్డట్టున్నాడు .ఇది ఒక ''అర్బన్ ప్రేమిక మేల్ ''కథ . నగరీకరణ చెందిన అందరి కథ కూడా కాదు !మగ నగర మేధావుల ప్రేమ కథ .అందరు మగ వాళ్ళు ఇంకా అంత మేధావులు కాలేదు కదా ! అంచేత ''ప్రేమించు ''తరహా... అమ్మాయి కోసం పిచ్చి వాడయిన ప్రేమ కథలనే హిట్ చేస్తున్నారు . దర్శకుడు నేర్పాలనుకున్న నేర్చుకోలేక సినిమా ఫ్లాప్ చేసారన్న మాట .

పాటలు బలే ఉన్నాయ్ .హలో రమ్మంటే వచ్చేసిందా చెలీ నీ పైన ఈ ప్రేమ ...పొ పొ పొమ్మంటు నువ్వంటే పోనే పోదమ్మా...బలే ఉంది.''ఏడు రంగులుగా సులువుగా విడివడి పోనీ తెల తెల్లని మనసిది ,ఎన్ని కళలుగా విరిసిన పువ్వుల రుతువై నీ కొరకే చూస్తున్నదీ ''అట ! బాగుంది కదా పువ్వుల రుతువు అనే మాట !హరీష్ జైరాజ్ మ్యూసిక్ బాగుంటుంది .వేగము ,సౌందర్యమూ... రెహ్మాన్ తో ఇంచుమించు తూగ గలడు. కానీ ...ఇతని పాటలు కొన్ని ఇండస్ట్రియల్ టౌన్స్ లో ఉంటారు కదా శ్రామిక కుర్రాళ్ళు, రేపటి చింత లేకుండా ఇవాల్టి ఫేషన్ పాంట్లు ,హెయిర్ స్టైల్ అనుసరిస్తూ ...అలా షోకిల్ల కుర్రాడిలా నిర్లక్ష్యంగా విరుపులతో ఉంటాయ్ .పొ పొ పొమ్మంటే.. అనడం ...ఘర్షణ మూవీ లో కూడా ఓ పాట ఉంది నన్నే నన్నే చూస్తూ అని అందులోనూ ఇంతే., ఓ యమ్మో..అమ్మో ప్రాణం తీయోద్దే...అని ఉంటుంది విరుపుతో .

పాట కోసం యు ట్యూబ్ వెతుకుతుంటే సగటు మగ వాడు ఒకరు సినిమాని కాదు ఈ పాటని కూడా చీత్కరించేసాడు.ముచ్చటేసింది.ఇస్తున్నా ....చూడండి .

Bad description about love, negative lines from my point of view . naa prema lothulo munigaka nuvu paiki telave sulabhangaa praanalaina isthavekangaa.. Prema ante, naa pranam anipinchelaa undaali kaani, pranaalu teesukune vidhamgaa undakudadu. ala ichela undalani avathali vallu alochincharante adi nijamaina preme kaadu..RamSyam10 3 months ago


17, ఏప్రిల్ 2011, ఆదివారం

ఎండా కాలపు మా ఊరు !

ఇవాళ బాగా వేడిగా ఉంది .వేడికి కాబోలు ఇంచుమించు మూడెకరాలు ఉన్న ఈ తోట ఇంట్లో ,పాములు స్వేచ్చా విహారం మొదలెట్టాయ్ .నిన్న దాదాపు నాలుగడుగుల నాగు పాము కనిపించింది .నాల్రోజుల క్రితం అవేదో పాములు రెండు కనిపించాయ్ .పాముల కళ్ళు ఎంత అందంగా ఉంటాయో.అన్ని పాములూ మనల్ని చూసి పారి పోవు .ధ్యానంలో ఉన్న యోగుల్లా ,తమ దారిన తాము పోతుంటాయి .బెంగాలీలు నాకు పాముల్ని కూడా ప్రేమించడం నేర్పించారు .సహ జీవనం అలవాటు చేసారు .

ఇవాళ ఎందుకో మా ఊరు బాగా జ్ఞాపకానికి వచ్చింది . ఎండల్లో వేప చెట్టు కింద మంచమేసుకుని పడుకొంటే ..కనిపించినంత మేరా ,వేప చెట్టు పచ్చగా పరుచుకుని ,యేవో గాలి పాటలు పాడుకుంటూ ఉన్నట్టు తల ఊపేది .అప్పుడప్పుడూ చెట్టు కొమ్మల్లో పాకుతూ , పసరిక పాములు కనిపించేవి .ఆ పాముల అందం అద్భుతం .అంత పచ్చదనం ఎక్కడిదో వాటికి . సన్నగా, నాజూకుగా ..పసరికలు కళ్ళు పొడుస్తాయ్ అనే వారు .ఒక్కో సారి చెట్టు పై నుంచి కింద పడవు కదా అనిపించేది .రంగుల రంగుల నీళ్ళ పాములు పంపు షెడ్లో హాయిగా విశ్రాంతి తీసుకునేవి .వాటిది అదో అందం .జెర్రి గొడ్లు ,తాటి బులుగులు ,రక్త పెంజెరిలు,చెట్టిరిగిలు ఎన్నెన్ని పాములో .రాష్ట్రం మారినా ,ఈ పాముల సాహచర్యం పోలేదు నాకు .ఏం అనుబంధమో ఇది .

నక్షత్రాల నీలి ఆకాశం క్రింద ,సమిష్టి కుటుంబపు జనాభా అంతా నిదురలయ్యే వాళ్ళం .ఉదయం కళ్ళు తెరిచే సరికి పెద్ద వాళ్ళ మంచాలన్నీ మాయమై ఉండేవి .పచ్చటి కళ్ళాపి వాకిలి కళ్ళ ముందట పరుచుకుని కని పించేది .ఎంత పెద్ద వాకిలో, ఎంత చాకిరో . యెర్రని సూర్యుడితో పాటు ఆకలి పాటలయ్యే పక్షుల్లా , మంచి నీళ్ళ కోసం బారులు తీరి వచ్చే మనుషులు కనిపించే వారు .ఇప్పుడు జీవ నది లాటి మా బావి ఎండి పోయింది .సంవత్సరాల తరబడి దాహపు గొంతులను ఊరడించిన మా ఇళ్ళు ,నీళ్ళ డబ్బా కోసం మోర ఎత్తిన లేగ దూడలా , పట్టణం దిక్కుకు చూస్తూ ఉంటుంది .రొయ్యలు వెళ్తూ వెళ్తూ మాకు ఇచ్చి వెళ్ళిన బహుమతి అది .

తంపటి గణుసు గడ్డలు ఎంత తియ్యగా ఉండేవో .ఇంటి దగ్గరి తోట, ఒక్కో సారి ఒక్కో పంటతో కళ కళ లాడేది ..మొక్కజోన్నలకి ఎన్ని గిచ్చుళ్లో .యెర్రటి మిరప తోటలో విరబూసిన బంతులది బలే సౌందర్యం .తోపు చిలుకల దా, తాటి చెట్లదా అనిపించే తోట పక్కని , చిలుకల గూళ్ళ తాటి తోపు .గుడి ఆవరణ అంతా పరుచుకుని ఎన్ని పక్షి కుటుంబాలకి ఇళ్ళు ఇస్తుందో మర్రి చెట్టు .ఊర్లో ఏమీ మారనిది భగవంతుని దయ చేతను ఇది ఒక్కటే .

సందేళ బర్రె వాహనం పై ఇంటికి వచ్చే స్నేహితుడు సురేంద్ర హసితపు మోము, మనసు మీద ముద్ర కొట్టినట్టు జ్ఞాపకం .ఎంత పొడవై పోయాడో .ఇప్పుడు ఆటో అయి, జనాలని పట్టణానికి, పల్లెకి మోస్తున్నాడు .చిన్నప్పుడే కూలి పనిగా మారి ,ఎంత జీవితాన్ని అనుభవించేసిందో..వెంకటేస్వరి ఉరఫ్.. అమీరు కోసం ,కట్టుకున్న బండ మొగుడ్ని చీత్కరించి ఎడమ కాలితో తన్నిన రాజేశ్వరి .బుజ్జమ్మా... నీ కూతురు మాటకారి మల్లెమొగ్గ అని ఎంత కవిత్వం నా మీద ఒలకబోస్తుందో ..ఈ ఫెమినిస్టు. నల నల్లటి మోము పై పూచే తెల తెల్లటి నవ్వుల పూదోట ఈ పిల్ల .ప్రియుడు అమీరు తరచూ యముడయినా ,ఈ పిల్ల ముఖంలో నవ్వెందుకు అతికే ఉంటుందో రీసెర్చ్ చేయాలి .


ఆస్పత్రి దగ్గరి పెంచలమ్మఇంటి ముంగటి నల్లటి కుండపై తెల్లటి కల్లు నురుగు ,ఎర్రెర్రని ఎండల్లో తాటి చెట్ల కింద జమై చల్లచల్లని కల్లు తాగే ఊరి మగవాళ్ళు ,గొంతు మొయ్య తాగి మా ఇంటి కొచ్చి ,గచ్చుపై కొంగు పరుచుకుని పడుకుని ఊరి కబుర్లు చెప్పే రవణమ్మ ..... ఆసక్తిగా ఆ కబుర్లు వినే మా ఇంటి ఆడోళ్ళు. ఏం కులాలో ,ఏం మతాలో మా తాత కొందరికి చిన్నాయనా ,కొందరికి మామ ,పెదనాయన .ఎంతెంత ప్రేమలో .తేలు కుట్టి కయ్యో మంటూ మా తాత మందుకోసం ఇంటికొచ్చే మనుషులు... , మా ఆటల మట్టి గోర్లు కత్తిరించి ,బీడీలో కూర్చి వాళ్ళ చేత తాగించే మా తాత బ్రమ్హాండమైన విచిత్ర వైద్యం ...

మళ్ళీ చిన్న పిల్లనైతే ఎంత బాగుండు .ఆగమ్మ కాకిలా తోటలెంట,దొడ్లెంటా తిరగ గలిగితే ఎంత బాగుండు ...కాలం వెనక్కి వెళి పోతే ,చిన్న చిన్న బుడ్లు పెట్టుకుని ,,బోలెడు ఆటలు ఆడేసుకో గలిగితే ,జైపాలోళ్ళ నాయన దగ్గర ''దొల్లు దొల్లు పుచ్చకాయ్ దోల్లితే రెండొక్కలు '' కథ విన గలిగితే ,బంక పళ్ళుని ,యాక్ ఛీ ఏం బాలేవ్ అనేయ గలిగితే ,యంపలి చెట్లు గిల్లి బుడగలు ఊదేస్తే ,తిండి తిప్ప లేకుండా ఇదేమి చదువు ,ఇట్ట చదివితే కళ్ళు సంక నాకి పోతాయి అంటూ తిడ్తా పెద్దమ్మ పెట్టే బువ్వ ముద్దలు మింగుతూ ,కథల లోకంలో ఉయ్యాలలూగ గలిగితే ,పండుగ నెల ప్రసాదం కోసం పాచి పళ్ళతో గుడి ముంగిట వరుసనవ గలిగితే ,వస్తూ వస్తూ రక్త పెంజరి గుడ్డు చేత పట్టుక రాగలిగితే ,కోతి కొమ్మచ్చినై కొంగ గూట్లో పిల్లలతో కబుర్లాడగలిగితే ,చిలుక పిల్ల కోసం హరినాదుని బ్రతిమిలాడ గలిగితే ,పిచుక పిల్ల కోసం ఉషతో మారు బేరాలు పెట్ట గలిగితే ....

ఎందుకో మనుషులం అనవసరంగా పెద్దవాళ్ళం అయి పోతాం .తలుచుకుంటే ఈ పెద్దతనం చిరాగ్గా అనిపించేస్తుంది .అందుకే పాపాయిని క్షణం ఇంట్లో ఉండనీ బుద్ది కాదు .ఇంట్లో కనిపించావంటే వీపు విమానం మోత మోగి పోద్ది అంటే ,పాపాయ అమ్మ తిట్టు కవిత్వపు అర్థాన్ని గ్రహించేసి, ఆటలై గంతులై , సాయంత్రానికి అలసి సొలసి నిదురవుతుంది.రేపు పొద్దటికి ఆనందంతో విరబూసిన బొండు మల్లె పువ్వై బడికెల్తుంది .మా అమ్మాయి t v ఎరుగని ఆట పాటల సన్నజాజి పూ తీగ .పట్టణపు వాడైన పాపాయి నాన్నకి కోపం .నీ కూతురు ఆడినట్టు ఈ కాలం లో ఎవరూ ఆడరు అని నిష్టూర పడతాడు .ఒక్కో సారి ఆడి ఆడి బలే పొడవైందే ..అనుకుని మురిసి పోతాడు .
*||*|*******
ఏ మాయల మరాటీ అయినా మళ్ళీ నన్ను చిన్న పిల్లని చేసేస్తే ఎంత బాగుండు .అందుకోసం నాకెంతో ఇష్టమైన పాపాయి వాళ్ళ నాన్నని మారకం పెట్టేస్తా ..ఆ తరువాత చాలా ......నిదానంగా పెరిగి పెద్దయి,మళ్ళీ తెచ్చేసుకుంటా .ఎందుకంటె పాపం చాలా మంచోడు కదా !ఈ అమ్మాయి ప్రేమించి దాపెట్టుకున్న సొంతాల చిట్టి బొమ్మ కదా !

16, ఏప్రిల్ 2011, శనివారం

ఎలుక పులుసు !

నాకు ఈ కథంటే బోలెడు ఇష్టం .నా బిడ్డకీ ఇష్టమే ,కానీ నాకు ఇంకా బోలెడు... ఇష్టం .ఎందుకంటె ఒక్క కథల పుస్తకం లో నాలుగు కథలు .బోనస్ అన మాట . కథలన్నీ ఎంతో రుచిగా ఉంటాయ్ కూడా!

అనగనగా ఒక చిట్టి ఎలుకమ్మ ,చెట్టు కింద కూర్చుని కథల పుస్తకం చదువుకుంటూ ఉండిందంట .అప్పుడు ఏమయ్యిందీ .. ఒక ముంగిస వెనక మల్లుగా వచ్చి ఎలుకని పట్టేసుకుంది . పట్టేసుకుని సంతోషంగా ఇంటికి తీసికెళ్ళింది.తీసికెళ్ళి ఒక పాత్రలో ఉంచి అన్నదీ ..అబ్బ! నేనిప్పుడు ఎలుక పులుసు వండుకోబోతున్నాను కదా ..అని .అప్పడు పాత్రలో ఎలుక అంది ఓహ్ నేనిపుడు ఎలుక పులుసు కాబోతున్నా కదా అని ..అంతేనా ఇంకా చెప్పిందీ , ముంగిస గారు మీ పులుసు లో కాసిని కథలు వెయ్యాలి, లేకపోతే ఎలుక పులుసు రుచిగా ఉండదూ అని .అది విని ముంగిస బోలెడు ఆశ్చర్య పడి ,మరి నా దగ్గర కథలు లేవే అంది .అప్పుడు ఎలుక మరేం పర్లేదు నేను చెప్తా వినండి అంది ,ముంగిస సరే అని ఒప్పేసుకుని ,త్వరగా చెప్పాలి మరి నాకు బాగా ఆకలిగా ఉంది అన్నది .అప్పుడు ఎలుక కథలు చెప్పడం మొదలెట్టింది

మొదటి కథ ] తేనెటీగలు-బురద.

ఒక ఎలుక అడవిలో వెళ్తూ ఉండింది. హటాత్హుగా దాని నెత్తి పై ఒక తేనే పట్టు పడింది .ఎలుక అందీ.. వెళ్ళండి నా నెత్తి పైన తేనే పట్టు ఉన్టం నాకేం ఇష్టం లేదు అని .అందుకు ఆ తేనెటీగలు అన్నాయి ''we like your ears ,we like your nose ,we like your whiskers ,oh yes ,this is a fine place for our nest .we never fly away ''.ఎలుకకి దుక్కమొచ్చేసింది.తేనెటీగల రొద భరించరాకుండా ఉంది .ఎలా వీటిని వదిలించు కోడం .ఇంతలో దార్లో ఒక బురద గుంట వచ్చింది .ఎలుక తేనె టీగలతో అందీ ,ఓ bees మీకు లాగే నాకూ ఓ గూడు ఉంది .మీరు నాతో ఉండాలనుకుంటే నా ఇంటికి రావాలి అని .bees అన్నాయి ''oh yes ''అని .అప్పుడు ఎలుక మోకాళ్ళ వరకూ బురదలో దిగింది ''here is my front door ''...తేనె టీగలు ఓహ్ ఎస్ అన్నయ్.నడుము వరకూ దిగి అందీ ,ఇది నా లివింగ్ రూం .తేనెటీగలు ఓహ్ ఎస్ అన్నయ్ .ఎలుక గడ్డం వరకూ దిగి అందీ ,ఇది నా బెడ్ రూం తేనెటీగలు అన్నాయి ఓహ్ ఎస్ .అప్పుడు ఎలుక ''అండ్ నౌ ఐ విల్ గో టో స్లీప్'' తల బురదలో ముంచేసింది .అప్పుడు తేనెటీగలు అన్నాయీ ''oh no ! ''we like your front door .we like your living room.we like your bed room .but no,no,no,we dont like your bed !''అని పాడి ఎగిరెలిపొయాయ్.అప్పుడు ఎలుక స్నానం చేసేందుకు ఇంటికెల్లింది.

రెండో కథ] రెండు పెద్ద బండ రాళ్ళు !

ఒక పెద్ద కొండ పై పూలు, గడ్డి మెండుగా ఉన్న ఒక చోట రెండు రాళ్లున్నాయ్.అవి ఒక రోజు అనుకున్నాయి ,[ మొదటి రాయి ]ఈ వైపు కొండ బాగుంది.కానీ ఆ వైపు ఏముంటుందో .[రెండో రాయి ] ''we do not know .we never will,''.ఒక రోజు బుజ్జి పిట్ట ఒకటి అక్కడ వాలింది .ఆ రాళ్ళు అడిగాయి ..బుజ్జి పిట్టా! కొండకి అవతలి వైపు ఏముందో కాస్తా చెప్పవా అని .పిట్ట ఎగిరెళ్లి చూసి వచ్చి చెప్పిందీ అటు వైపు నగరాలు,పర్వతాలు ,లోయలూ ఉన్నాయి'' it is a wonderful sight. ''అని .అప్పుడు మొదటి రాయి అందీ, అందమైనయ్యన్నీ అవతలి వైపే ఉన్నాయ్ ..ఎంత విషాదం అని .రెండో రాయి అందీ ''we cannot see them .we never will.అలా ..ఒందేల్లు ఆ రెండు రాళ్ళూ దిగులుపడుతూ గడిపాయి .ఒక రోజు ఒక ఎలుక అటోచ్చింది .పిట్టని అడిగినట్టే ఎలుకనీ అడిగాయి రాళ్ళు .ఎలుక వెళ్లి చూసొచ్చి చెప్పిందీ ,అటువైపు రాళ్ళు ,మట్టి ,గడ్డీ ,పూలు ఉన్నాయ్ .చాలా బాగుంది అని .మొదటి రాయి అందీ ఆ పిట్ట మనకు అబద్దం చెప్పింది, ఇటు వైపూ ,అటు వైపూ ఒక్కలాగే ఉంది అని .రెండో రాయి అందీ ..''we feel happy now .we always will.''అని

మూడో కథ ] కీచు రాళ్ళు !

ఒక రోజు ఎలుక ఒకటి హటాతుగా నిద్దర మేల్కొంది ,కిటికీ దగ్గర ఒకటే రొద.ఏంటా గోల అంది ఎలుక .అక్కడే ఉన్న కీచు రాయి అందీ ''ఏం చెప్తున్నావ్ ?''పాడుతూ వినడం నా వల్ల కాదు ,అంది పాడుతూనే .నేను నిద్ర పోవాలి , మీ ఈ గోల పాట వినలేను అంది ఎలుక .కీచు రాయి అందీ ఏమన్నావ్ ''you want more music ?" సరే ఆగు నా స్నేహితుల్ని పిల్చు కోస్తా అని ..వెళ్లి స్నేహితుల్ని పిలుచుకొచ్చింది .ఎలుక ,బాప్రే! నాకు ఈ సంగీతం వద్దూ అని చెప్పాను అంది .కీచు రాయి ఏంటీ.. ఇంకా కావాలా? ఆగు ఇంకా స్నేహితుల్ని పిలుచుకోస్త అని పిలుచుకొచ్చింది .అట్లా బోల్డు కీచు రాళ్ళు వచ్చేసాయి .ఎలుక అరిచింది, స్టాప్ అని ''your music is too loud !''కీచు రాళ్ళు అన్నాయి ,ఏంటీ ..పెద్దగానా..? సరే అట్లాగే పెద్దగా పాడుతాం అని ,పెద్దగా పాట్టం మొదలు పెట్టాయి .ఎలుక మళ్ళీ అరచింది ''i want to sleep .i wish you would all ''go away?''అని .కీచు రాయి అన్నదీ వెళ్లి పోవాలా.. ఆ విషయం మొదటే ఎందుకు చెప్పలేదు ? సరే మేం వేరే దగ్గరకెళ్ళి పాడుకుంటాం ..అని వెళ్లి పొయాయ్ .ఎలుక నిద్ర పోవడానికి పోయింది .

నాలుగో కథ ] ముళ్ళ పొద !

ఒక ముసలావిడ ఇంటి బయటకొచ్చి ఏడవటం మొదలెట్టింది .ఒక పోలీసాయన పరిగెత్తుకొచ్చాడు ఎమయిందీ అంటూ .ముసలావిడ అతన్ని లొపలకి తీసికెళ్ళి చూపించింది ,ఇదిగి చూడు ఈ సోఫాలో ముళ్ళ పొద ఎలా మొలిచిందో అని .పోలీసు ఆశ్చర్య పడ్డాడు .ఎలా జరిగిందీ అని .ఆవిడ అందీ ఒక రోజు, నేను మామూలుగానే వచ్చి కూర్చున్నాను ఏదో గుచ్చుకున్నట్టు అనిపించింది .చూస్తే ఈ ముళ్ళ పొద .పోలీసాయనకి జాలి వేసింది .బాధ పడొద్దు ఇప్పుడే నేనీ ముళ్ళ పోదని తీసేస్తా ,అప్పుడు నువ్వు హాయిగా కూర్చోవచ్చు.. అంటూ ముళ్ళ పొద మీద చేయి వేయ బోయాడు,అంతే ముసలావిడ పెద్దగా అరిచింది ,noooo..don't do that ! i dont want to sit down .i have been sitting all my life .ఈ ముళ్ళ పొద అంటే నాకు ఇష్టం ,నేను ఏడ్చేది ఇది వాడి పోతుందని ,చూడు కొమ్మలు ఎలా తలలు వాల్చే శాయో అంది .అప్పుడు పోలీసాయన అన్నాడూ .. బహుశా దానికి దాహంగా ఉందేమో, నీళ్ళు పోసి చూడలేక పోయారా అని .ముసలావిడ అరరే !i never thought of that అని పొదకి నీళ్ళు పోసింది .అంతే ఏమయిందీ ముళ్ళ పొద ఒక్క సారి పులకరించి పోయింది .మొక్క లోంచి బోలెడు చిగురులు వచ్చాయి, మొగ్గలు వేసాయి ''the buds opened up .they became large roses.అంతే ముసలావిడ బోల్డు సంతోష పడి పోయింది .పోలీసాయాన్ని అభినందిన్చేసి పెద్ద గుత్తి రోజా పూలు ఇచ్చి పంపింది.

ఇప్పుడు అసలు కథ !

ఎలుక అన్నదీ ముంగిసతో చూశారా ...ఇప్పుడు నేను మీకు నాలుగు కథలు చెప్పాను కదా.. ఆ నాలిగింటిని చక్కగా పులుసులో వేసెయ్యండి .అప్పుడు చూడండీ మీ పులుసు ఎంత బాగుంటుందో మరి అని .ముంగిస బోల్డు ఆశ్చర్య పడి ,బానే ఉంది కానీ ఇప్పుడు ఈ నాలుగు కథలని పులుసులో వేయడం యెట్లా అంది .దానికి ఎలుక ఏమన్నదంటే ''that will be easy ,''ఏం చేయాలంటే బయటకెళ్ళి ఒక తేనె పట్టు ,కొంత బురద , రెండు పెద్ద రాళ్ళు ,పది కీచు రాళ్ళు ,ఒక ముళ్ళ పొద తీసుకొచ్చి పులుసులో వేసేయ్యడమే ...అని .ఇకనేముంది ముంగిస బయటకు పరుగులెత్తింది .పాపం దానికి బాగా ఆకలి వేస్తుంది కదా ..! ఆకలేస్తుంటే ఆలోచన మందగిస్తుంది కదా !అంచేత ఇంటి తలుపు వేయడం మరచి పోయిందీ ....తేనె పట్టు కోసం ఇంకా మిగిలిన వాటి కోసం ముంగిస చాలా కష్ట పడింది. చివరికెలా అయితేనేం వాటిని మోసుకుని ఇంటికి వచ్చింది .ఆహా ఇప్పుడు నా ఎలుక పులుసు మస్తు రుచిగా ఉంటుందిలే అనుకుని మురిసి పోయింది .తీరా వచ్చి చూస్తే he found a surprise .the cooking pot was empty .ఎలుక ఎప్పుడో పరిగెత్తుకొని ఇంటికి వెళి పోయింది ...వెళ్లి he lit the fire ,he ate his supper ,and he finished reading his book .అంతే కథ కంచికి మనం ఇంటికీ...........!

13, ఏప్రిల్ 2011, బుధవారం

గ్రేవ్ అఫ్ ది ఫైర్ ఫ్ఫ్లైస్ !




చాలా సార్లు ఈ మూవీ మొదలు పెట్టి, రెండు నిమిషాలకే ఆపేసే వాళ్ళం నేనూ, పాపాయి .మనసు కని పెట్టేసేది ,దీంట్లో యేదో దుఖం దాగుందని .అలా వాయిదా వేసి వేసి చివరికి ఒక రోజు ఒంటరిగా కూర్చుని చూసేసా.అప్పట్లో మొత్తం Hayao Miyazaki మూవీ సీజన్ నడుస్తూ ఉండింది నాకూ పాపాయికి .అందుకనేమో ఇది కూడా అతందే అనుకున్నాను .కానీ కాదు . IsaoTakahata దీని దర్శకుడు .

2 వ ప్రపంచ యుద్ద సందర్భం నుండి చెప్పిన,తల్లి తండ్రి మరణించిన చిన్ని అన్నా చెల్లెళ్ళ అగచాట్ల కధ ఇది . అమ్మకు జబ్బు .బాంబ్ షెల్టర్లో అబ్బాయి కళ్ళ ఎదుటే మరణిస్తుంది .తెలిసిన వాళ్ళింటికి వస్తారు .కొన్ని రోజులకు వాళ్ళు ఇక మేం చూడలేం అంటారు .ఇద్దరూ ఒక పాడు పడిన బాంబ్ షెల్టర్లో తల దాచుకుంటారు .రాత్రి వెల్తురు కోసం కాసిని మిణుగురులు తెచ్చి దోమ తెరలో వదుల్తారు .పోద్దునకి అవి చచ్చి పోతాయ్.అమ్మాయి వాటిని పూడ్చబోతూ ఉంటుంది .అన్న అంటాడు What are you doing? ....SETSUKO : I'm making a grave. Mommy's in a grave, too, right? I heard it from Aunty. Aunty said Mommy died, too, and she's in a grave. అమ్మ మరణించిన తరువాత, పాపకి తెలియకూడదని దాచుకున్న అన్న దుక్కమంతా అప్పుడు బయట పడ్తుంది .వాడు ఏడ్చి మనల్ని ఏడిపిస్తాడు .

తిండి కోసం ఎన్ని అగచాట్లో .పాపకి డయేరియా తగులుకుంటుంది .డాక్టర్ దగ్గరికి తీసుకెళతాడు అన్న .
SEITA :Anyhow, please give her treatment of some kind. Please.
DOCTOR medicine or anything... Well, I suggest that she get some nourishment. That's all that can be done.
SEITA You say nourishment, but...
DOCTOR (To the next patient,) What seems to be the matter?
SEITA Where can you find nourishment?!! ఎక్కడనుండి తేవాలి ...తేగలడు ...ఆ పిల్లవాడు నరిష్మెంట్ .సేత్సుకో కళ్ళు మూస్తుంది .మరెప్పటికీ ఈ యుద్దాల మారి ,మాయల మారి ప్రపంచాన్ని చూడాల్సిన అవసరం లేకుండా శాశ్వతంగా .కొన్ని రోజులే తేడా... అన్నా చనిపోతాడు .యుద్ధం ముగుస్తుంది .అంతా పదిలం .అందరం పదిలం .

యుద్దాల పై చాలానే సినిమాలు ఉన్నాయ్ కదా .అందులో ఇదీ ఒకటి .ఏ సిద్దాంత రాద్దాన్తాలు లేకుండా సామాన్యుల జీవితాలని చూపిస్తుంది .

ఇక్ మా ఇంటికి బోలెడు మిణుగురులు వస్తాయ్ .పెళ్ళిల్లప్పుడు సీరియల్ సెట్లు వేస్తారు కదా.. అట్లా చెట్లపై వాలి మిణుకుమంటూ ఉంటాయ్ .ఇప్పుడు నాకు వాటిల్ని చూడగానే ఈ అన్న, చెల్లెళ్ళు జ్ఞాపకం వచ్చి మనసు మసకేస్తుంది .మిణుగురులు చని పోయినప్పుడు సేత్సుకో అడుగుతుంది అన్నని ..Why do the fireflies die so quickly?అని. అవును కదా....ఎందుకు చనిపోవాలి ఆ మిణుగురులు అట్లా ...... ? ఏం సమాధానమిచ్చుకోగలం మనకైనా మనం ?

11, ఏప్రిల్ 2011, సోమవారం

బెంగాల్ దేశపు సంత -గోరటి వెంకన్న పాట !

<

కిటికీలో నుండి కనిపిస్తున్న కటిక చీకటిని చూస్తూ నా భర్త ,నా జ్ఞాపక శక్తికి పరీక్షపెడ్తూ ''సక్కనైన చిక్కని రాత్రి ''పాటలోని చీకటి వర్ణనని గుర్తు చేయమని అడిగాడు ,యదావిధిగా నాకు జ్ఞాపకం రాలేదు .మొబైల్ తీసి ఆ పాట ఆన్ చేసాడు , పాట తరువాత ఈ ''సంత మా ఊరి సంత ''పాట మొదలైంది .చీకటిలో ఆత్మలు, శరీరాల ఉనికిని మరచి పోతాయి కాబోలు ,ఎన్నో సార్లు విని వున్నా ఈ సారి ఈ పాట కొత్తగా తోచింది .. బెంగాల్కి రావడానికి ముందు నాకు సంతని చూసిన అనుభవం ఎప్పుడూ లేదు. బెంగాలీలో సంతని'' హాట్ ''అంటారు .ఇక్కడ ప్రతి ప్రాంతం లోను సంతలు జరుగుతాయ్. శనివారం సంత ..బుధ వారం సంత అంటూ వారాల పేర్లతోనో,మధుర హాట్ అంటూ ఆయా ప్రాంతాల పేర్లతోనో .

మేమున్న ఈ కూచ్ బీహార్ ప్రాంతంలో తేయాకు తోటలు ఎక్కువ .తేయాకు తోటల కూలీలకి వారానికో సారి, కూలీ డబ్బులు చేతికొస్తాయి .వారి కోసమని ఆ రోజుల్లో సంత నడుస్తుంది . దీనిని ''బగానేర్హాట్ '', లేదా '' తోలపెర్ హాట్ ''అంటారు .వారపు కూలి డబ్బులతో ఇక్కడికి వచ్చిన వీరు కొని ,తిని ,తాగి ఇళ్ళకు వెళ్తారు .ఈ సంతలకి పట్టణ ప్రాంతపు సంతలకి ఉన్న ముఖ్యమైన తేడా.. మధువు దొరకడం ,దొరకక పోవడం .

బహుశ ఇవాల్టి షాపింగ్ మాల్ ల వెనుకనున్న మూల సూత్రం ఇదేనేమో .మొదటి సారి నాకు అడుగడుగునా జీవం తొణికిసలాడే సంతని చూడగానే, ఒక మినీఏచర్ జీవనదిని చూసిన అనుబూతి కలిగింది .ఇంకా మానవీయ ప్రపంచంలోనే జీవిస్తున్నాననే నమ్మకం కలిగింది .సంతోషం వేసింది .అంతలోనే ఆ నమ్మకాన్ని చెదరగొడుతూ జర్మనీ, మెట్రో కాష్ అండ్ క్యారీ కి బుద్ద దేబ్ బట్టాచార్య పలికిన ఆహ్వానం గుర్తు వచ్చి దిగులువేసింది .

మనమివాళ గ్లోబలులం కదా .అనంత హస్తాల మార్కెట్ ఈ సంత మానవీయతని మింగి వేయకుండా ఎన్నినాళ్ళు ఆగుతుంది ??.బహుసా అది ఎంతో దూరం లో లేదనుకుంటా !ఇవాళ కనిపించే ఈ సంత రేపు మనకు ఓ పురాతన జ్ఞాపకం కావచ్చు ! గోరటి వెంకన్న ఈ పాటని వింటున్నప్పుడు ఎన్ని సార్లుఅనిపించేదో , ఎంత జీవితాన్నచెప్తున్నాడో ఈ కవి అని .

పూర్తిగా కాకున్నా, ఈ పాటలోని జీవితం నాకు అపరిచితం .అయినా కవి ,నన్ను ఎన్నెన్ని సార్లు ఉద్వేగపరిచాడో .పుట్టినూరోల్లోస్తే పట్టుకుని ఏడ్చిన కొత్త కోడలి కన్నీటి చెమ్మ ,విన్న ప్రతి సారి హృదయాన్ని తడుపుతుంది .కందూరు జానమ్మ కోపం ,సంతలో సంసారమంతా బయటేసుకుని ,ఇంటికెళ్ళే ముందు ఒక్కటయ్యే మొగుడూ పెళ్ళాల వైనం ముచ్చట గొలుపుతుంది ..''

కల్లు దుకునంలో కలిసి, తాగి ,తిని,వరుస గలుపుకొని వియ్యమందానీకి తయ్యారయ్యే ''లౌక్య రాహిత్యపు సామాజికతముందు, ఆడంబర ప్రదర్శనల మన సోషలైట్ పార్టీలు వెల తెల బోయి తల వంచుకుని కనపడతాయి .రవీంద్రుడు సంత పైన ఒక పద్యం రాసాడు .అదీ ఇక్కడ ఇస్తున్నాను.నాకు అర్థమైనంత మేర ప్రతి లైన్ క్రింద దాని అర్థాన్ని ఇచ్చాను .

రవీంద్రుడి సంతలో రోమాన్టిసిసం మాత్రమే కనిపిస్తుంది .గోరటి పాటలో జీవితపు అన్ని పార్శ్వాలు కనిపిస్తాయి .పాటచివర వినబడే చెంచు బీసన్నని బలిగొన్న, మొండి కర పత్రపు వైనం ఆశ్చర్యపరుస్తుంది .ఎలా చెప్పగలిగాడీ కవి ఇంత బండ, నగ్న సత్యాలని ఇంత సరళసున్నితంగా అని అబ్బురమేస్తుంది .

పాట పూర్తయ్యేసరికి ''గొంతు పిసికేసిన గోసలా రాజ్యం '' మనల్ని భయ పెడ్తుంది. ''సితికిన బతుకుల సంత'' ఆపుకోనీయకుండా ఏడిపించి వదుల్తుంది.ఇంత అద్భుతాన్ని కనుల ముందు ఆవిష్కరించిన... ఈ రాపు గొంతు ,మేధో కవి గాయకుడ్ని ఎంత కీర్తిస్తే మాత్రం సరిపోతుంది !

సాహిత్యం చదవండి
సంత మా ఊరి సంత -వారానికోసారి జోరూగా సాగేటి
సంత -మా ఊరు సంత
సుట్టు ముప్పై ఊర్ల పెట్టు జనమందరూ
పుట్ట పగిలి సీమలోచ్చినట్లోస్తారు
సోర సోరోల్లంత కాలి దారిలోన
తరిమినట్టు గుంపు పరుగుతోనొస్తారు
సేతగానోల్లంత పాత జీపులల్ల
కుక్కినట్టు ఎక్కి కూలవడొస్తారు
పెండ్లికోయినట్టు బండ్లు కట్టుకొని
కాపుదానపోల్లు ఆప కుండోస్తారు
కాయగూరల తట్ట ఆకు కూరల కట్ట
తమలపాకుల బుట్ట తంబాకు పొడిమట్ట
మిరపకాయల ఘాటు వొట్టి చేపల
అల్లమెల్లిపాయ కుప్పుకగ్గువ రేటు
సంత ముందరి బాట సాలె బట్టల మూట
హర్రేకుమాలని అరిసె బతుకు పాట
ఎండ తాపం చేత ఎగ పోసు కుంటోచ్చి
గోలి సోడాను జూసి కాళ్లాగి పోతాయి
పట్టుమాని మూరడెత్తు కూడా లేని పోరడు
సిత్రంగా గోళి సోడా కొడతాడు
రూపాయికే మంది
బిస్లరమ్మేటోడు సేటు బిత్తరపోతాడు

ఒట్టి రోజూ పిండగిర్ని సుబ్బయ్య సేటు
తోవ్వంటి పోయేటొల్ల పిలిసి ముచ్చట పెట్టు
సంత రోజెవ్వడన్న ఊకే పలకరిస్తే
కరిసినట్టు జూసి కయ్యిన లేస్తాడు
పిండి పట్టి పట్టి తిండి ధ్యాస మరిసి
సుబ్బయ్య ఆ పూట సుద్ద గుండోలుండు
తీరిక లేకుండ జల్లెడ తిప్పేటి
కందూరు జానమ్మ కారం గిర్నికి
కాయలెక్కువ తెచ్చి తక్కువాని జెప్పి
పొడి తక్కువొచ్చేనని పోట్లాటకొస్తుంటే
కండ్లల్ల ముక్కుల్ల ముండ్లు మొలసినట్టు
కందూరు జానమ్మ కళ్ళెర్ర జేస్తది బజ్జీలు బోండాలు కాల్చిన సీకీలు
మద్యాహ్నమే కల్లు దుకునానికోస్తాయి
కలిసి తాగి తింటూ వరస కలుపుకొని
వియ్యమందానీకే తయ్యారుగయ్యేరు
సంత కల్లు తోనే పిల్ల పెళ్ళి ఖాయం జేసి
పేరు బలమడుగుటకు నేరుగా పొయ్యేరు
తాగి పెండ్లం తోని తగవు వడతాడొకడు
తాగమని పెళ్ళాన్ని బ్రతిమిలాడుతడొకడు
సీరా బేరం కాడ సిన్న గొడవ జరిగి
అలిగిన పెళ్ళాన్ని అడుక్కుంటాడొకడు
సంతలో సంసారమంత బయటేసుకొని
ఇంటికొయ్యేముందు ఇద్దరొకటవుతారు సంత నాడు ఊరి డొంకల్ల వంకల్ల
జంటలు కొన్నేమో జత కూడుకుంటాయి
హద్దులు అదుపులు అన్ని గాలికొదిలి
వలసిన మనస్సులు ఒక్కటయి పోతాయి
దూరమయ్యిన గాని ప్రేమ మిగిలినోల్లు
వారం వారం సంత పేరుతో కలిసేరు
అమ్మానాయిన మీద బెంగా వెట్టుకున్న
అత్తింటికొచ్చిన కొత్త కోడలు పిల్ల
సరుకుల నెపంతో సంత కంటని వొచ్చి
పుట్టినూరోల్లోస్తే పట్టుకొని ఏడ్సు
చెల్లెలు తమ్ముని సేమమడిగినాక అమ్మను,
రమ్మాని చెప్పి రాగాలు పెడతది ఎనుకటోలె మంది ఎగబడి కొనకున్న
కుంకుమ దాశెన్న సంత కెంతందం
ఎక్కబత్తి చిమ్ని లెవరడగ పోయిన
పూసల రాజవ్వ మోసుకోనోస్తాది
అద్దాలు కాటుక అగ్గువ పౌడరులు
పడుసు పిల్లల జూసి మెరిసి పోతుంటాయి
కాశీ మజిలీ కథలు ,దాశరథి శతకాలు
ఈపూరి కీర్తనలు, యాగంటి తత్వాలు
అరవైయేండ్ల కింద అచ్చు వేయించిన చిరుతోండ
ప్రహ్లాద భక్త రామ దాసు యక్ష గానాలన్ని
యాడ దొరుకునో గాని బుక్క
బాలయ్యకు బువ్వ పెడుతుంటాయి సంత బజారంత తన సొంతమైనట్టు
తైబంది సిట్టోడు కల తిరుగుతుంటాడు
సరకులమ్ముక ముందే రుసుం కట్టమాని
మారు బేరపోల్ల ప్రాణాలు తింటాడు
తరుగింత పోతుంది వొరుగింత పోతుంది
బుట్ట దంద బువ్వకేడ సరిపోతుంది
సందులో సందని సంగెం నాయకులు
సంతలో సభ పెట్టి పంచిండ్రు పత్రాలు
సెట్ల మందులమ్మే సెంచు భీసన్నేమో
కర పత్రంనిస్తే కండ్ల కద్దుకుండు
వాడు రాత రానోడాయే గీత రానోడాయే పత్రముల
మందు పొట్లమే కట్టిండు అమ్మకు దమ్మని
దగ్గుతోందని జెప్పి ఐదు రూపాయల
ఆ మందు కొనుక్కొని
మందు కల్లు సీస ముందుగ గుద్దిన్ డో
మర్సిపోయి సంత వీధిలో పడుకుండు
అర్థ రాత్రి ఏదో ఆపదొచ్చినట్టు
బందబస్తు పేరా బలగాలు దిగినాయి
పడుకున్న పోరని పట్టి లేపినారు
ఊరడిగి పేరడిగి జేబులన్నీ తడిమి
కరపత్రమును జూసి కండ్లెర్ర జేసిండ్రు
తాగిన మత్తులో వాడేమి వాగిండో
సంతలో పోరని బతుకంతా జూసిండ్రు సందెవాలి సంత మందెంత వోయినంక
సందడాగి సంత సావిడోలె అవ్వంగ
సంతవీధి చివరి రాగి వృక్షము కింద
వొంటిగా నున్నట్టి ఓ సాధు బైరాగి
బేరాలు సారాలు సరుకుల బారాలు
లాభాలు నష్టాలు ఇష్టాలయిష్టాలు
మువ్వలు పువ్వులు నవ్వులు
నటనలు వలపులు తలపులు
అరుపులు గెలుపులు వింతలెన్నో జూపే
సంతలో ఆ రేయి ఏ వింత ఎరుగని
పసి పోరని వట్టి ప్రాణాలు తీసేటి
పాపి ఘడియలు గాంచి
"బతుకే ఓ సంత "యని పసి పాపలా నవ్వే రవీంద్రుడి హాట్
కుమోర్ పాడార్ గరూర్ గాడీ
కుమ్మరిపల్లె ఎడ్ల బండి
బోజాయ్ కరా కొలశి హాడీ
బండి నిండా మట్టి కుండలు
గాడీ చోలాయ్ బంగ్షీ బొదన్
బండి తోలే వాడు వంశీ వదన్
సంగే జే జోయ్ బాగ్నే మదన్
వెంట ఉన్న వాడు మేనల్లుడు మదన్
హాట్ బోషేచ్చే సుక్రోబారే
సంత జరిగేది శుక్రవారం
బక్షీ గంజే పద్మా పారే
పద్మా నది ఒడ్డునున్న బక్షీ గంజ్ లో
జినిష్ పత్రో జుటియె ఏనే
వస్తువ్లు సమకూర్చుకుని వచ్చేరు
గ్రామెర్ మనుష్ బెచే కేనే
పల్లె ప్రజలు అమ్మేందుకు కొనేందుకు
ఉచ్చే బేగున్ పోటోల్ మూలో
కాకర కాయలు వంకాయలు పొట్ల కాయలు ముల్లంగి బేతేర్ బోనా ధామా కులో
పేము బుట్టలు చేటలు
సర్సే చొళా మైదా ఆటా
ఆవాలు సెనగలు మైదా గోధుమ
సీతేర్ ర్యాపార్ నక్షా కాటా
చలి కోసం అల్లిక ల శాలువాలు
ఝాన్జ్రి కొడ బేడి హాతా
అప్పచ్చుల మట్టి కుండ ,బాణలి ,పట్టకార ,చేయి గంటి
సెహర్ తేకే సస్తో చాతా
పట్టపట్టణం నుండి చవక గొడుగులు
కొలసి బొర ఎకో గుడే
కుండ నిండుగా బెల్లం
మాచీ ఎతో బెరాయ్ ఉడే
బెల్లం చుట్టూ ముసురుతున్న ఈగలు
కోడెర్ అంటీ నౌకా బేయే
పడవ నిండుగా ఎండుగడ్డి
ఆన్లో ఘాటే చాసీర్ మేయే తెచ్చిన రైతు అమ్మాయిలు అందో కానాయ్ పథేర్ పారే
రోడ్డు పక్కన గుడ్డి కన్నయ్య
గాన్ శునియే బిక్ఖే కోరే
పాట పాడి బిక్షమేట్టుతున్నాడు పాడార్ చేలే స్నానేర్ ఘాటే
స్నాన ఘాట్ దగ్గర పల్లె పిలగాళ్లు
జొల్ చిటియే సాతార్ కాటే
నీళ్ళు చిమ్ముతూ ఈత కొట్టే



5, ఏప్రిల్ 2011, మంగళవారం

భట్రాజు మేళం !



కొంత కాలం క్రితం పాపాయికి, సంగీతం కి ఒక మాస్టారు,చదువుకి ఒక మాస్టారు వచ్చే వారు .చదువుల అయ్య వారు కొండ పైన ఉండే మా ఇంటికి నడిచి వచ్చే వాడు ,సంగీతం సర్ స్కూటర్లో వచ్చే వాడు .అందుకో మరెందుకో చదువుల అయ్య వారు బాగా చిరాకుగా ఉండే వాడు . ఒక రోజు పాపాయి ఇక ప్రకటించింది .అమ్మా నాకు ఈ సారు వాడు వద్దు అని .ఎందుకు రా బిడ్డా అంటే సంగీతం సారు నేను పాడినప్పుడల్లా అబ్బ అబ్బ అంటాడమ్మ .ఈన అనడమ్మాఅంది .


పొగడ్తలు అంత కిక్కుని ఇస్తాయి .కానీ మనం సాధారణంగా ఎవర్నీ పొగడం .అందులో చెడ్డ తనం కూడా ఏమీ లేదు బద్ధకం అంతే .

అందుకని ఈ పొగడ్తల కోసం మేధావులు పలు మార్గాలు కని పెట్టారు . అవి 1 . పరస్పర పొగడ్తలు :నన్ను నువ్వు పొగుడు ,నిన్ను నేను పోగుడుతా ఏం ! 2. కుల పొగడ్తలు : మన కులం వాళ్ళందరూ ఇంద్రులూ చంద్రులూ .ఎందుకంటె మన కులం వాళ్ళు కనుక .3. అవసర పొగడ్తలు : నువ్వు ఇంద్రుడివీ కాదు సూర్య పుత్రిక వీ కాదు నాకు తెలుసు, కానీ నీతో నాకు అవసరం అని ,తెలివిడి కలిగి పొగిడేవి .ఇట్లా ఇంకా ఉన్నాయి అవి గుర్తు తెచ్చుకోడం మీ జ్ఞానానికో పరీక్ష .

పొగడ్తల వెనుక ఇంత కుట్ర దాగి ఉంది కనుక మనం పొగిడే వాడిని అనుమానం గా చూస్తాం . ఈ మధ్య నేను ముత్యాల ముగ్గు మూవీ చూశా.ఈ సన్నివేశం నాకు ఎంత నచ్చిందంటే ...అప్పట్నుండి అడపాదడపా నేను ఎంజాయ్ చేసే పొగడ్తలకి కూడా ఈ భట్రాజులిద్దరు అడ్డం పడి పోతున్నారు .ఇంత అద్భతమైన కాన్సెప్ట్ ని అందించిన బాపు రమణ లని ఎంత పొగిడితే మాత్రం సరి పోతుంది .అన్నట్టు చెప్పడం మరిచాను హృదయ పూర్వకమైన పొగడ్తలు కూడా ఉంటాయ్ . కాక పోతే అరుదుగా తటస్థ పడతాయ్ .